You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC Indian Sportswoman of the Year 2019: విజేత ఎవరో మార్చి 8న ప్రకటిస్తాం
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ 2019 ఓటింగ్ సోమవారం (ఫిబ్రవరి 24)తో ముగిసింది.
ఐదుగురు నామినీలలో తమకు నచ్చిన భారతీయ క్రీడాకారిణికి దేశ విదేశాలకు చెందిన అభిమానులు ఫిబ్రవరి 3 నుంచి ఓట్లు వేశారు.
స్ప్రింటర్ ద్యుతి చంద్, బాక్సర్ మేరీ కోమ్, రెజ్లర్ వినేష్ ఫోగట్, పారా అథ్లెట్ మానసి జోషి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఈ అవార్డు పోటీలో నిలిచారు.
మార్చి 8 ఆదివారం నాడు దిల్లీలోని తాజ్ ప్యాలస్ హోటల్‌లో జరిగే కార్యక్రమంలో విజేతను ప్రకటిస్తాం. ఆ వివరాలను అన్ని బీబీసీ భారతీయ భాషల వెబ్‌సైట్లలో, బీబీసీ స్పోర్ట్ వెబ్‌సైట్‌లోనూ ప్రకటిస్తాం.
ఈ ఐదుగురు నామినీలను ప్రముఖ క్రీడా జర్నలిస్టులు, రచయితలు, నిపుణులతో కూడిన జ్యూరీ ఎంపిక చేసింది.
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ 2019 అవార్డు కోసం పోటీపడిన వారి విశేషాలు చూద్దాం.
1- ద్యుతీ చంద్
వయసు: 23 ఏళ్లు, క్రీడ: అథ్లెటిక్స్
మహిళల 100 మీటర్ల విభాగంలో ద్యుతీ చంద్ ప్రస్తుతం భారత జాతీయ ఛాంపియన్. 2016లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్‌లో మహిళల 100 మీటర్ల పరుగులో పాల్గొనేందుకు ఎంపికైన భారతీయులలో ద్యుతి మూడో వ్యక్తి. 2018లో జకార్తా వేదికగా జరిగిన ఆసియాన్ క్రీడల్లో మహిళల 100 మీటర్ల పరుగులో రజతం గెలుచుకుంది. ఇది 1998 తర్వాత భారత్‌కు వచ్చిన తొలి అవార్డు. తనకు ఎదురైన ఎన్నో సవాళ్ళను అధిగమిస్తూ ద్యుతి... దేశంలో సమర్ధమైన మహిళా క్రీడాకారిణిగా నిలిచారు.
2- మానసి జోషి
వయసు: 30 ఏళ్లు, క్రీడ: పారా బ్యాడ్మింటన్
మానసి జోషి 2019లో స్విట్జర్లాండ్‌లోని బాజెల్‌లో జరిగిన పారా బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలుచుకున్నారు. ప్రపంచంలోనే టాప్ ర్యాంక్ కలిగిన పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లో మానసి ఒకరు.
2018లో జకార్తాలో జరిగిన ఆసియాన్ పారా గేమ్స్‌లో కాంస్యం సాధించారు. 2011లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆమె ఎడమ కాలును కోల్పోయారు. అయితే, ప్రపంచంలోనే ఉత్తమ పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయ్యేందుకు ఆమెకు ఆ వైకల్యం అడ్డురాలేదు.
3 -మేరీ కోమ్
వయసు: 36 ఏళ్లు, క్రీడ: బాక్సింగ్ (ఫ్లైవెయిట్ విభాగం)
ఎనిమిది ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలు సాధించిన ఏకైక బాక్సర్‌గా మేరీ కోమ్ సుపరిచితమైన వ్యక్తే. ఆమె పాల్గొన్న ఏడు ఛాంపియన్‌షిప్స్‌లోనూ వరసగా పతకాలను కైవసం చేసుకుంది. ఆరుసార్లు ప్రపంచ అమెచూర్ బాక్సింగ్ ఛాంపియన్, బాక్సింగ్‌లో ఒలింపిక్ పతకం గెలుచుకున్న ఏకైక మహిళ కూడా ఈమే.
మేరీ కోమ్ రాజ్యసభకు నామినేటెడ్ సభ్యురాలు. ప్రపంచ ఒలింపిక్స్ అసోసియేషన్ ఆమెను 'ఓలి' అనే బిరుదుతో సత్కరించింది.
4- పీవీ సింధు
వయసు 24 ఏళ్లు, క్రీడ: బ్యాడ్మింటన్
స్విట్జర్లాండ్‌లోని బాజెల్‌లో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెల్చుకున్న తొలి భారతీయురాలు పీవీ సింధు. ఆమె ఐదు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలను గెలుచుకుంది. రియో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో రజతం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది.
పదిహేడేళ్ల వయసుకే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (2012) టాప్ 20 ర్యాంకింగ్స్‌లో స్థానం సంపాదించుకుంది. గత నాలుగేళ్లలో టాప్ 10లో నిలిచింది. ఈ ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌లోనూ ఆమె పతకం తెస్తారని భారత్ ఆశలు పెట్టుకుంది.
5- వినేష్ ఫోగట్
వయసు: 25 ఏళ్లు, క్రీడ: ఫ్రీస్టైల్ రెస్లింగ్ (కుస్తీ)
వినేష్ ఫోగట్ 2018లో జకార్తాలో జరిగిన ఆసియాన్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్. వినేష్ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మహిళా రెజ్లర్ల కుటుంబం నుంచి వచ్చింది. కామన్వెల్త్ క్రీడల్లోనూ రెండు బంగారు పతకాలు గెలుచుకుంది. 2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తొలిసారి కాంస్యం సాధించింది.
ఇవి కూడా చదవండి.
- వినేశ్ ఫోగట్: BBC Indian Sportswoman of the Year నామినీ
- పీవీ సింధు విజయాల వెనుక పీబీఎల్ పాత్ర కూడా ఉందా
- భర్త వైద్యం కోసం.. 65 ఏళ్ల వయసులో ఆమె పరుగు పందేల్లో పోటీ పడుతున్నారు
- ఒక్కొక్కరిదీ ఒక్కో కథ: భారత మహిళల క్రికెట్ జట్టులోని ఈ ప్లేయర్స్ మీకు తెలుసా...
- అంతర్జాతీయ పోటీల్లో భారత్ పెట్టుకున్న ఆశల భారాన్ని మహిళా క్రీడాకారులు ఎలా మోస్తున్నారు?
- కుస్తీలో సాక్షీ మలిక్‌నే ఓడించిన ఒక అమ్మాయి కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)