‘‘నెలసరి సెలవులు మహిళల పురోగతికి ఆటంకం’’- సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, AFP via Getty Images
- రచయిత, గీతా పాండే, నికితా యాదవ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- చదివే సమయం: 4 నిమిషాలు
ఉద్యోగినులు, విద్యార్థినులకు నెలసరి సెలవులు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అలాంటి చట్టం చేస్తే ''మహిళలనెవరూ ఉద్యోగాల్లోకి తీసుకోరని'' ధర్మాసనం వ్యాఖ్యానించింది.
నెలసరి సెలవులను తప్పనిసరి చేస్తే యువతులు తాము ఇతర ఉద్యోగులతో ''సమానం'' కాదని భావించే అవకాశం ఉందని, ఇది వారి 'పురోగతికి ఆటంకమని' చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.
నెలసరి సెలవుపై భారతీయ సమాజంలో దీర్ఘకాలంగా భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు న్యాయమూర్తుల అభిప్రాయాలతో ఏకీభవిస్తుంటే, మరికొందరు ఒకటి, రెండురోజులపాటు ఇచ్చే సెలవులు మహిళల బాధాకరమైన నెలసరి రోజుల్లో ఉపశమనంగా ఉంటాయని చెబుతున్నారు.
గడిచిన కొన్నేళ్లుగా కొన్ని రాష్ట్రాలు, అనేక ప్రముఖ ప్రైవేటు కంపెనీలు తమ ఉద్యోగినులకు నెలసరి సెలవులను అమలు చేస్తున్నాయి.

'కెరీర్ పురోగతిపై ప్రభావం'
జాతీయ నెలసరి సెలవు విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసినట్టు లీగల్ వెబ్‌సైట్ లైవ్ లా తెలిపింది.
అనంతరం త్రిపాఠి ఐఏఎన్‌ఎస్ వార్తా సంస్థతో మాట్లాడుతూ పీరియడ్స్ సమయంలో వచ్చే ఇబ్బందుల దృష్ట్యా మహిళా ఉద్యోగులకు ''రెండు లేదా మూడు రోజుల సెలవులు'' ఇస్తారని భావించినట్టు చెప్పారు.
న్యాయమూర్తులు మాత్రం అలాంటి విధానం ప్రవేశపెట్టడం మహిళకు ప్రయోజనం కలగించదని అభిప్రాయపడ్డారు. పైగా అది లింగ సంబంధిత మూసధోరణులను మరింత బలపరిచి, మహిళల ఉద్యోగ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారు.
ఇలాంటి విధానం అమల్లోకి వస్తే ప్రైవేటు కంపెనీలు మహిళలను నియమించుకోవడంలో వెనుకంజ వేయవచ్చని, దీనివల్ల మహిళల నియామకాలు కూడా తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.
‘‘ప్రభుత్వం అన్నివర్గాలతో చర్చించి నెలసరి సెలవు విధానాన్ని రూపొందించవచ్చని’’ న్యాయమూర్తులు చెప్పారని లైవ్ లా పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
''మహిళల హక్కులను తిరస్కరించడమే''
సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు భారత్‌లో దీర్ఘకాలంగా భిన్నాభిప్రాయాలకు దారితీస్తున్న నెలసరి సెలవుల అంశాన్ని మళ్లీ చర్చలోకి తెచ్చింది. దీనిని పురోగామి చర్యగా భావించాలా? లేదంటే మహిళలు బలహీనులు, ఆఫీసు పనులకు తగినవారు కాదనే మూసధోరణులను ప్రోత్సహిస్తోందా? అనే చర్చలు మరోసారి మొదలయ్యాయి.
నెలసరి సెలవులు మహిళ ఉద్యోగావకాశాలపై ప్రభావం చూపుతాయని న్యాయమూర్తులు చెప్పడం ద్వారా ‘‘నెలసరిపై ఉన్న సామాజిక నిషేధాన్ని, మహిళల హక్కుల అంశాన్ని మనం ఇప్పటికీ సరైన విధంగా చర్చించలేదని విషయాన్ని మరోసారి గుర్తుచేస్తున్నట్టుగా ఉందని’’ప్రజా ఆరోగ్య నిపుణురాలు, లాయర్ సుకృతి చౌహాన్ బీబీసీతో చెప్పారు.
మహిళల కోసం భారత్‌లో ‘‘పని ప్రదేశంలో గౌరవం, లింగసమానత్వం, సురక్షితమైన పరిస్థితులు’’ గురించి ప్రస్తావించే చట్టాలున్నాయని ఆమె అన్నారు. ‘‘నెలసరి సెలవులను నిరాకరించడం వల్ల మహిళలు అసౌకర్యమైన, అగౌరవమైన, ప్రమాదకరమైన పరిస్థితులలో పనిచేయాల్సి వచ్చి, ఆ చట్టాల ఉల్లంఘన జరుగుతుంది’’ అన్నారు.
‘‘నెలసరి సెలవు ఇవ్వడం వల్ల మహిళల ఆరోగ్యం, వారి మానసికస్థితి మెరుగుపడడమే కాకుండా పనిచేసేచోట ఉత్పాదకత, పనితీరు పెరుగుతుందని’’ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కొన్ని రాష్ట్రాలలో అమలు
మహిళలకు అదనపు సెలవులివ్వడం పురుషులపై వివక్ష చూపినట్టవుతుందని కొందరు వాదిస్తున్నారు. రుతుక్రమం సమయంలో మహిళలకు దేవాలయ ప్రవేశంపై నిషేధం, ‘అంటు’ పేరుతో ఇంట్లో దూరంగా కూర్చోపెట్టడం, నెలసరి వచ్చినట్టు చెప్పడానికి కూడా మహిాళలు సిగ్గుపడే పరిస్థితుల మధ్య దేశంలో నెలసరి ఇప్పటికీ ఓ నిషేధిత అంశంగానే ఉంది.
స్పెయిన్, జపాన్, దక్షిణకొరియా, ఇండోనేషియా వంటి దేశాలు ఇప్పటికే పీరియడ్స్ సెలవు ఇస్తున్నాయని, ఇది మహిళలకు ఉపయోగకరంగా ఉంటుందని అధ్యయనాల్లో తేలిందని ఈ విధానాన్ని సమర్థించేవారు అంటున్నారు.
పరిమిత పీరియడ్స్ సెలవు భారత్‌లో కూడా కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు బిహార్, ఒడిశా నెలకు రెండు రోజులు సెలవులు ఇస్తుండగా, కేరళ ప్రభుత్వం యూనివర్శిటీ, పారిశ్రామిక శిక్షణాసంస్థ ఉద్యోగులకు ఈ సెలవులు ఇస్తోంది.
నెలలో ఒకరోజు నెలసరి సెలవు ఇవ్వాలనే ప్రతిపాదనను ఆమోదిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఓ చట్టాన్ని ప్రవేశపెట్టింది.
కొన్నేళ్లనుంచి మహిళా సిబ్బంది కోసం అనేక కంపెనీలు పీరియడ్స్ సెలవు విధానాన్ని అమలుచేస్తున్నాయి.
పారిశ్రామిక,సేవల రంగానికి చెందిన ఆర్‌పీజీ గ్రూప్ తన అనుబంధ సంస్థ సీఈఏటీలో నెలకు రెండురోజుల నెలసరి సెలవు విధానం ప్రకటించింది. ఇంజినీరింగ్ దిగ్గజం ఎల్ అండ్ టీ కూడా నెలకు ఒకరోజు సెలవు విధానాన్ని ప్రవేశపెట్టింది. ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ఏడాదికి పదిరోజుల పీరియడ్స్ సెలవులను అమలుచేస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














