2000 రాణి చీమలను స్మగ్లింగ్ చేస్తూ చైనీయుడి అరెస్ట్, అసలు కథేంటి?

ఫొటో సోర్స్, KWS
రాణి చీమలను అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నించిన ఓ చైనీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. కెన్యాలోని ప్రధాన ఎయిర్‌పోర్టులో జరిగిన ఈ ఘటనలో, ఆయన వద్ద రెండువేలకుపైగా రాణి చీమలున్నట్టు గుర్తించారు.
కెన్యా రాజధాని నైరోబిలోని జోమో కెన్యాట్టా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(జేకేఐఏ)లో ఝాంగ్ కెక్వన్ అనే వ్యక్తిని భద్రతా తనిఖీల సమయంలో అదుపులోకి తీసుకున్నారు. పెద్దసంఖ్యలో రాణి చీమలను తన లగేజీలో పెట్టుకుని చైనాకు తీసుకెళ్తున్నట్టు గుర్తించారు.
ఈ ఆరోపణలపై ఆయన ఇంకా స్పందించలేదు. గత ఏడాది కెన్యాలో బయటపడిన చీమల అక్రమ రవాణా నెట్‌వర్క్‌తో ఆయనకు సంబంధం ఉందని దర్యాప్తు అధికారులు కోర్టులో చెప్పారు.
అంతర్జాతీయ జీవ వైవిధ్య ఒప్పందాల ప్రకారం రక్షిత జాబితాలో ఉన్న జీవుల్లో ఈ చీమలు కూడా ఉన్నాయి. వాటిని అక్రమంగా తరలించడంపై కఠిన నిబంధనలున్నాయి.


ఫొటో సోర్స్, Getty Images
యూరప్, ఆసియాలో చీమలకు పెరుగుతున్న డిమాండ్
శాస్త్రీయంగా మెస్సార్ సెఫలోట్స్‌గా పిలిచే ఈ రాణి చీమలకు యూరప్, ఆసియాలో డిమాండ్ పెరుగుతోందని గత ఏడాది కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్(కేడబ్ల్యుఎస్) హెచ్చరించింది. యూరప్, ఆసియాలో వాటిని పెంపుడు జంతువుల తరహాలో చూస్తున్నారు.
ఝాంగ్ కొన్ని చీమలను టెస్ట్‌ట్యూబ్‌లలో పెట్టారు. మరికొన్ని చీమలను టిష్యూ పేపర్ రోల్స్‌లో దాచిపెట్టి తన బ్యాగులో పెట్టుకున్నారు.
"ఆయన బ్యాగులో 1,948 చీమలు ప్రత్యేక ట్యూబ్‌లలో పెట్టి ఉన్నట్టు కనిపించింది. అవి అన్నీ బతికే ఉన్నాయి" అని ప్రాసిక్యూటర్ అలెన్ ములామా కోర్టులో చెప్పారు.
"మరో 300 చీమలు బ్యాగులో ఉన్న మూడు టిష్యూ పేపర్ రోల్స్‌లో కనిపించాయి" అని ఆయన తెలిపారు.
నిందితుడి ఫోన్, ల్యాప్‌టాప్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపేందుకు అనుమతి ఇవ్వాలని ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు.
మరింత లోతైన దర్యాప్తు జరుగుతోందని, ఇంకా అరెస్టులు జరిగే అవకాశం ఉందని కేడబ్ల్యూఎస్‌కు చెందిన సీనియర్ అధికారి డంకన్ జుమా బీబీసీతో చెప్పారు. కెన్యాలోని మరికొన్ని పట్టణాల్లో కూడా చీమలను సేకరిస్తున్నారన్న అనుమానం ఉందని తెలిపారు.
వేల సంఖ్యలో రాణీ చీమలను దేశం బయటకు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించినందుకు గత ఏడాది మేలో కెన్యా కోర్టు నలుగురికి ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా 7,700 డాలర్ల జరిమానా విధించింది. కెన్యాలో నమోదైన మొదటి కేసు ఇది.
ఆ నలుగురు నిందితుల్లో ఇద్దరు బెల్జియం వ్యక్తులు, ఒక వియత్నాం వ్యక్తి కాగా, మరొకరు కెన్యాకి చెందినవారు. తమపై వచ్చిన ఆరోపణలను వారు అంగీకరించారు. ఇది "నిఘా వర్గాల సమన్వయంతో చేసిన ఆపరేషన్" అని కేడబ్ల్యూఎస్ వివరించింది.
ఈ అరుదైన చీమలను తమ హాబీ కోసం సేకరిస్తున్నామని బెల్జియం వాసులు కోర్టులో చెప్పారు. ఇది చట్టవిరుద్ధమని తమకు తెలియదన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ చీమలు లేకపోతే జీవవైవిధ్యం దెబ్బతినే ప్రమాదం
ఈ అక్రమ రవాణా గ్యాంగ్ ప్రధాన నిర్వాహకుడు ఝాంగ్ అని, గత ఏడాది మరో పాస్‌పోర్ట్ ద్వారా ఆయన కెన్యా నుంచి తప్పించుకున్నట్టు దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.
ఝాంగ్‌ను ఐదు రోజులు కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దర్యాప్తు మరింత లోతుగా సాగనుంది.
సింహాలు, ఏనుగుల వంటి పెద్ద జంతువులను రక్షించే కేడబ్ల్యూఎస్ గత ఏడాది కోర్టు ఇచ్చిన తీర్పును "చరిత్రాత్మక కేసు"గా పేర్కొంది.
గత ఏడాది పట్టుకున్న చీమలు ఆఫ్రికాలో కనిపించే భారీ హార్వెస్టర్ గింజలు సేకరించే చీమలని కేడబ్ల్యూఎస్ తెలిపింది. పర్యావరణపరంగా ఇవి చాలా కీలకమని, ఇవి లేకపోతే మట్టికి, జీవ వైవిధ్యానికి నష్టం కలుగుతుందని పేర్కొంది.
ఈ చీమలను యూరప్, ఆసియాలోని అరుదైన పెంపుడు జంతువుల మార్కెట్లకు తరలించేందుకు ప్రయత్నించినట్లు భావిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











