ట్రంప్ టారిఫ్‌ల తగ్గింపు ప్రకటన-ఆంధ్రాలో ఆక్వా రంగం ఊపిరి పీల్చుకోవచ్చా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
వాణిజ్య ఒప్పందంలో భాగంగా భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో ఏపీలో ఆక్వారంగంపై సుంకాల ప్రభావం గురించి మళ్లీ చర్చ మొదలైంది.
"మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై అమెరికాలో విధించే సుంకాలు ఇకపై 18 శాతానికి తగ్గనున్నాయని తెలిసి నాకు సంతోషంగా ఉంది" అని ప్రధాని మోదీ కూడా అన్నారు.
రష్యా నుంచి చమురు కొనుగోళ్లను చేపడుతుందన్న కారణంతో భారత్‌పై అమెరికా 2025 ఆగస్టులో 25 శాతం ప్రతీకార సుంకాలను విధించింది.
ఇప్పుడు భారత్‌పై అమెరికా సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించనున్నట్టు, అలాగే గత ఆగస్టు నుంచి విధిస్తున్న 25 శాతం ప్రతీకార సుంకాన్ని మొత్తం ఎత్తివేస్తున్నట్టు వైట్‌హౌస్ అధికారి ఒకరు రాయిటర్స్‌కు తెలిపాయి.
గత ఆరు నెలలుగా, అమెరికా ప్రతీకార సుంకాలతో తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రంగానికి ఇప్పుడు ఈ ప్రకటనలు మళ్లీ ఊతమిచ్చినట్టేనని సీ ఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ వర్గాలు చెబుతున్నాయి.

గత ఆరునెలల్లో ఏం జరిగిందంటే..
అమెరికా ప్రతీకార సుంకాల ప్రభావం ఆక్వా రంగంపైనే ఎక్కువగా పడిందని ఏపీలో రొయ్యలు సాగు చేసే రైతుల నుంచి, అమెరికాకు రొయ్యలు ఎగుమతి చేసే బడా సంస్థల వరకు ఆందోళన వ్యక్తం చేశాయి.
అమెరికా సుంకం 25 శాతం, కౌంటర్‌వెయిలింగ్ డ్యూటీ 5.77 శాతం, యాంటీ డంపింగ్ డ్యూటీ 2.49 శాతం, ప్రతీకార సుంకం 25 శాతం.. ఇలా మొత్తం కలిపి 58.26 శాతం సుంకాలను రొయ్యల ఎగుమతులపై విధిస్తున్నారని భీమవరం నుంచి అమెరికాకి ఆక్వా ఉత్పత్తులను ఎగుమతి చేసే ఆనంద్ గ్రూప్ వైస్ చైర్మన్ జోగి వర్మ బీబీసీకి తెలిపారు.

‘గత ఆగస్టు నుంచి తగ్గిన ఎగుమతులు’
ఆరునెలలుగా ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావంతో ఒక్కసారిగా ఏపీ నుంచి రొయ్యల ఎగుమతులు తగ్గిపోయాయని జోగి వర్మ వెల్లడించారు.
దేశం నుంచి అమెరికాకి ఎగుమతయ్యే ఆక్వా ఉత్పత్తుల్లో 65 శాతం వాటా ఏపీదేనని ఆయన తెలిపారు.
2024లో రూ. 18 వేల 725 కోట్ల విలువైన రొయ్యలు దేశం నుంచి అమెరికాకి ఎగుమతి కాగా.. 2025లో ఆ ఎగుమతుల విలువ దాదాపు 20 శాతం తగ్గిపోయిందని జోగి వర్మ తెలిపారు.
అది కూడా క్రిస్మస్ పండుగ ఉండటంతో ముందుగానే ఆర్డర్లు బుక్ చేసుకోవడంతో ఆ మాత్రం ఎగుమతులు చేయగలిగామని ఆయన చెప్పారు.
డిసెంబర్ తర్వాత తమకు జీరో ఆర్డర్లని, ఒక్క ఆర్డర్ కూడా అమెరికాకి రాలేదని సీ ఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి దిలీప్ బీబీసీతో అన్నారు.
''నిజంగా ఈ ఐదారు నెలలు ఆక్వా ఇండస్ట్రీకి గందరగోళ పరిస్థితి'' అని దిలీప్ వ్యాఖ్యానించారు.

‘రొయ్యల సాగు తగ్గించి, చేపల సాగు మొదలు పెట్టారు’
అమెరికా ప్రతీకార సుంకాల నేపథ్యంలో ఏపీలో రొయ్యల సాగు తగ్గిందని ఏపీ మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ మహమ్మద్ బీబీసీతో అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో చేపలు, రొయ్యల చెరువుల విస్తీర్ణం దాదాపు 5. 80 లక్షల ఎకరాలు కాగా ఇందులో ఒక్క రొయ్యల సాగే 2.80 లక్షల ఎకరాలు ఉంటుంది.
గత ఆగస్టులో ట్రంప్ సుంకాల దెబ్బకు చాలామంది రైతులు రొయ్యల సాగు తగ్గించి.. ఆ స్థానంలో చేపల సాగు మొదలుపెట్టారు.
‘‘మేం కూడా విదేశాలకు బాగా ఎగుమతయ్యే సీబాస్ చేపల పెంపకాన్ని ప్రోత్సహించాం'' అని మహమ్మద్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
తాజాగా ట్రంప్ ప్రకటనతో ఊతం
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటనతో ఏపీలోని ఆక్వా రంగానికి మళ్లీ ఊపిరి వచ్చినట్టే అయిందని సీ ఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి దిలీప్ అన్నారు.
''ప్రతీకార సుంకం సున్నా అవుతుంది. అమెరికా సుంకం కూడా 18 శాతం తగ్గించినట్టు ట్రంప్ ప్రకటించారు. ఇంకా తగ్గే అవకాశం ఉందని ట్రంప్ అన్నారు. ఆ మేరకు 18 నుంచి 15 శాతం వరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నాం. ఫైనల్ డాక్యుమెంట్ రావాలి. ఏదేమైనా నిజంగా ఇది చాలా మంచి పరిణామం'' అని దిలీప్ అన్నారు.
ట్రంప్ ప్రకటన చూసిన తర్వాత ఇంత కంటే ఆక్వా రంగానికి ఆనందం ఏముంటుందని అనిపించిందని ప్రముఖ ఎక్స్‌పోర్టర్ జోగి వర్మ బీబీసీతో చెప్పారు.
‘‘ఎగుమతిదారుల పరిస్థితి దారుణంగా ఉన్న సమయంలో ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా శుభ పరిణామం. ఏప్రిల్ నుంచి ఏపీలో ఆక్వా సీజన్ మొదలవుతుంది. అప్పటికింకా పరిస్థితులు సానుకూలంగా మారతాయని అనిపిస్తోంది’' అని జోగి వర్మ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘మళ్లీ సాగు పెరుగుతుంది’
సుంకాల తగ్గింపు ప్రకటనతో మళ్లీ అమెరికాకి ఎగుమతులు పెరుగుతాయి. ఆ మేరకు సాగు పెరుగుతుందని ఆక్వా రంగానికి చెందిన వ్యక్తులు అంటున్నారు.
నిజానికి ట్రంప్ నుంచి ప్రకటన రాకుంటే వచ్చే సీజన్‌లో సాగు బాగా తగ్గేదని చెబుతున్నారు.
‘‘సాగును ఆపేస్తే హేచరీస్, ప్రాసెసింగ్ యూనిట్లు దెబ్బతినేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారుతుంది’’ అని పశ్చిమ గోదావరి ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యారావు బీబీసీతో అన్నారు.
ప్రాన్స్ ఫార్మర్స్ ఫెడరేషన్ కార్యదర్శి సుబ్బరాజు బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘రైతులు ఆశాజీవులు, ఎగుమతులు పెరిగితే మళ్లీ కచ్చితంగా సాగు పెంచుతారు’’ అని చెప్పారు.
''అయితే, ప్రస్తుతం సాగుకు అయ్యే ఖర్చు గతంలో కంటే పెరిగింది. ఈ పరిస్థితుల్లో రొయ్య రేటు స్థానికంగా కూడా పెరగాల్సి ఉంది. రొయ్య రేటు ఇప్పుడు బాగా తక్కువ ఉంది’’ అని తెలిపారు.
60 కౌంట్ రొయ్య ధర గత ఏడాది రూ.350 నుంచి రూ.400 వరకూ ఉండేది. ఇప్పుడు ఆ రేటు రూ.280 నుంచి రూ.300కి పడిపోయింది.
అలాగే 80 కౌంట్ ధర రూ.300 నుంచి రూ.220కి తగ్గిపోయింది.
‘‘ఇది వరకు ఏడాదికి రొయ్య సాగును.. మూడు పంటలుగా వేసే వాళ్లం. అంటే, సరిగ్గా నాలుగు నెలలకోసారి పంట తీసే వాళ్లం. కొన్నాళ్లుగా ఏడాదికి రెండు సార్లే సాగు చేస్తున్నాం. రేటు పెరిగితేనే మళ్లీ సాగు పెంచుతాం’’ అని సుబ్బరాజు అన్నారు.

అమెరికాకే 65 శాతం ఎగుమతులు
‘‘ఏపీలో ఏడాదికి చేపల, రొయ్యల ఉత్పత్తి 51.58 లక్షల టన్నులు కాగా సముద్ర, మంచి నీటి రొయ్యల ఉత్పత్తి సుమారు 18 లక్షల టన్నుల వరకు ఉందని అంచనా" అని ఏపీ మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ మహమ్మద్ బీబీసీకి వివరించారు.
భారత్‌లో రొయ్యల ఉత్పత్తిలో ఏపీనే అగ్రస్థానంలో ఉందని మహమ్మద్ తెలిపారు.
మొత్తం ఉత్పత్తిలో ఏపీ నుంచి అమెరికాకు సుమారు 60 నుంచి 65 శాతం ఎగుమతి అవుతుండగా.. మిగిలింది చైనా, జపాన్, గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుందని ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల నుంచే సింహభాగం ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయని ఆయన తెలిపారు.
''2023–24 లెక్కల ప్రకారం దేశం నుంచి రూ.60,524 కోట్ల విలువైన 17.81 లక్షల టన్నుల సముద్ర ఉత్పత్తులు 130 దేశాలకు ఎగుమతి కాగా.. అందులో రొయ్యల వాటా రూ.40వేల కోట్లు. ఇందులో ప్రధానంగా అమెరికా, చైనా, యూరోపియన్ దేశాలకు , జపాన్‌కు ఎగుమతి అవుతుంటాయి. 2024లో అమెరికాకు భారత్ నుంచి ఎగుమతి అయిన సముద్ర ఉత్పత్తుల మొత్తం విలువలో రొయ్యల విలువే రూ.18,725 కోట్లు'' అని మహమ్మద్ బీబీసీకి తెలిపారు.

రొయ్యల ధర ఎక్కడ నిర్ణయిస్తారు?
రొయ్యల ధర స్థానికంగానో, రాష్ట్రంలోనో, దేశంలోనో నిర్ణయించే పరిస్థితి లేదని ఏపీ సీఫుడ్ సప్లయిర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి. శ్రీరామమూర్తి బీబీసీతో అన్నారు.
''కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ధరను నిర్ణయించలేవనే చెప్పాలి. రొయ్యలు దిగుమతి చేసుకుంటున్న విదేశాలు నిర్ణయించే రేటుపైనే ఇక్కడి ఆక్వా పరిశ్రమ ఆధారపడి ఉంటుంది'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, @narendramodi
భారత్–ఈయూ డీల్.. రొయ్యల ఎగుమతులు పెరిగే అవకాశం
మరోవైపు భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో భాగంగా రొయ్యలపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా తీసివేయాలన్న ఈయూ నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రైతులకు ఆనందాన్ని కలిగిస్తోంది.
భారత్-ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు.
''ఈ ఒప్పందంతో భారత్‌లోని ఆక్వా రంగానికి, ముఖ్యంగా, దేశం నుంచి ఎక్కువగా రొయ్యలు ఎగుమతి చేసే ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగానికి చాలా మేలు చేకూరుతుంది'' పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ప్రముఖ ఎగుమతిదారు ఆనంద్ గ్రూప్ చైర్మన్ విశ్వనాథరాజు బీబీసీతో అన్నారు.
ఆ నిర్ణయం వల్ల భారత్ నుంచి ఎగుమతయ్యే రొయ్యలకు యూరప్‌లోని 27 దేశాల్లో సుంకం ఉండదని ఆయన తెలిపారు. ఆక్వా ఎగుమతులకు ఊతం ఇచ్చేలా ఈ నిర్ణయం ఉందన్నారు.
యూరప్ దేశాలకు రాష్ట్రం ఉత్పత్తి చేసే దాంట్లో కేవలం పదిశాతం లోపే ఎగుమతి అవుతున్నాయని, ఇప్పుడు ఈ నిర్ణయంతో దాదాపు 30 శాతం వరకు ఎగుమతులు పెరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.
అయితే, ఎగుమతి చేసే రొయ్యలు ఎటువంటి రసాయనాలు లేకుండా ఉండాలని, యూరప్ దేశాల్లో ఆ నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా చూస్తారని విశ్వనాథరాజు అన్నారు.
ఎగుమతి చేసే ఉత్పత్తుల్లో పురుగు మందుల అవశేషాలు కనిపిస్తే అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
రొయ్యల రైతులకు సానుకూల సంకేతం
మరోవైపు ఇదే అంశంపై భీమవరానికి చెందిన ప్రముఖ ఆక్వా ఎగుమతిదారుడు, జగదీశ్ మెరైన్స్ అధినేత జగదీశ్ మాట్లాడుతూ.. ‘‘భారత్-ఈయూ ఒప్పందాల్లో భాగంగా రొయ్యల దిగుమతులపై జీరో సుంకం అమల్లోకి రావడానికి ఇంకా సమయం పడుతుంది. కనీసంగా ఆరు నెలలు టైం పట్టొచ్చు’’ అని అభిప్రాయపడ్డారు.
కొన్నేళ్లుగా నిరాశలో ఉన్న రొయ్యల రైతులకు ఇది సానుకూల సంకేతమని ఫిష్ ఫార్మర్స్ అసోసియేషన్ కార్యదర్శి బోస్ రాజు అన్నారు.
చాలా రోజులుగా రొయ్యల రైతులు నష్టాల్లో సాగు చేస్తున్నారని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో పాటు భారత్-ఈయూ ఒప్పందంతో ఎగుమతులు పెరుగుతాయని, ఫలితంగా రాష్ట్రంలో రొయ్యల సాగు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














