You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఫ్రూటేరియనిజం: ఏమిటీ డైట్? ఇది నిజంగానే బరువు తగ్గిస్తుందా?
- రచయిత, షణ్ముకప్రియ సెల్వరాజ్
- హోదా, బీబీసీ కోసం
- చదివే సమయం: 4 నిమిషాలు
ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్యూహెచ్ఓ) నివేదిక ఒకటి పేర్కొంది.
2025లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచురించిన నివేదిక ప్రకారం.. 1990 నుంచి ప్రపంచవ్యాప్తంగా పెద్దలలో ఊబకాయం రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది.
ఈ పెరుగుదల యువతలో నాలుగు రెట్లు ఉంది.
ఆహారం, శారీరక శ్రమ మధ్య అసమతుల్యత వల్ల అధిక బరువు, ఊబకాయం సమస్య ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే.. ఊబకాయం, అధిక బరువుతో బాధపడుతున్నవారు.. ఈ సమస్య బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకునేవారు ఆహారం విషయంలో కొన్ని పద్ధతులు పాటిస్తుంటారు.
ఇందులో ఫ్రూటేరియనిజం ఒకటి. ఇలాంటి డైట్ తీసుకునేవారు పండ్లు, గింజలు, విత్తనాలను మాత్రమే తింటారు.
పండ్లు మాత్రమే తినడం శరీరానికి మంచిదా?
అయితే.. ఫ్రూటేరియన్ డైట్ బరువు తగ్గడంలో కీలకపాత్ర పోషిస్తుందని చాలామంది భావించినప్పటికీ, ఇది నిజంగా ఆరోగ్యకరమైనదేనా అన్న ప్రశ్న తలెత్తుతుంది.
ఈ డైట్ పాటించడంవల్ల బరువు తగ్గుతారనేది నిజమే అయినప్పటికీ, ఇది అనారోగ్యకరమని తమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన డాక్టర్ అరుణ్ కుమార్ అంటున్నారు.
"ఫ్రూటేరియన్ డైట్ పాటించే వారు రోజుకు 80 నుంచి 90 శాతం కేలరీలను పండ్ల నుంచి పొందుతారు. సాధారణంగా పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి వారు రోజుకు మొత్తం 1500 కేలరీలు మాత్రమే తినగలరు" అని ఆయన అన్నారు.
"ఇది కేలరీ లోటుకు, బరువు తగ్గడానికి దారితీస్తుంది. కానీ పండ్లు మాత్రమే తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందకుండా పోతుంది. దీనివల్ల మజిల్ కోల్పోయే ప్రమాదం పెరుగుతుంది" అని ఆయన హెచ్చరించారు.
"ఈ డైట్ పాటించడంవల్ల శరీరానికి అవసరమైన పోషకాలు, ఐరన్, జింక్, ఒమేగా 3 వంటివి అందకపోవచ్చు. అంతేకాకుండా కేవలం పండ్లు మాత్రమే తినడం వల్ల శరీరంలో ఫ్రక్టోజ్ స్థాయిలు పెరుగుతాయి. ఇది ట్రైగ్లిజరైడ్, కాలేయ కొవ్వును పెంచుతుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి" అని ఆయన వివరించారు.
బరువు తగ్గడానికి ఇది ఆరోగ్యకరమైన విధానం కాదని, బరువు తగ్గడానికి తగినంత పరిమాణంలో పండ్లను ఆహారంలో చేర్చుకోవచ్చు కానీ.. పూర్తిగా వాటిపైనే ఆధారపడడం ప్రమాదకరమని ఆయన హెచ్చరిస్తున్నారు.
ప్రధానంగా పండ్లు, గింజలు, విత్తనాలతో కూడిన ఈ డైట్ పాటించడంవల్ల పోషక లోపాలు కలగవచ్చని వివిధ అధ్యయనాలు సూచించాయి.
పండ్ల ఆహారాలలో ప్రోటీన్, ముఖ్యమైన కొవ్వులు, కాల్షియం, ఐరన్, విటమిన్ బీ12 తక్కువగా ఉంటాయి. ఇవి కండరాలు, రోగనిరోధక వ్యవస్థలను బలహీనపర్చడంతో పాటు రక్తహీనత ప్రమాదాన్ని పెంచుతాయని అమెరికాకు చెందిన నాన్ ప్రాఫిట్ మెడికల్ ఆర్గనైజేషన్ మయో క్లినిక్ పేర్కొంది.
'తక్కువ ప్రోటీన్ తీసుకోవడం జీవక్రియ పనితీరును ప్రభావితం చేస్తుంది' అని ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన పేర్కొంది.
చికెన్, మటన్ తింటే..
చికెన్, మటన్ తింటే ఊబకాయం వస్తుందని కొందరు అపోహ పడుతుంటారని.. కానీ.. చికెన్, మటన్ సరైన మొత్తంలో తీసుకుంటే బరువు తగ్గడానికి సహాయపడతాయి అని డాక్టర్ అరుణ్ కుమార్ చెబుతున్నారు.
"అధిక కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఇన్సులిన్ పెరిగేలా చేస్తాయి. దీనివల్ల అవి శరీరంలో కొవ్వుగా పేరుకుపోతాయి. మీరు అధికంగా కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని తినేటప్పుడు, అవి కడుపు చుట్టూ కొవ్వుగా పేరుకుపోతాయి. అందువల్ల, బెల్లీ ఫ్యాట్‌కు కారణం కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న, కేలరీలు ఎక్కువగా ఉన్న, ఇన్సులిన్-స్టిమ్యులేటింగ్ ఆహారం తీసుకోవడం" అని ఆయన వివరించారు.
"మటన్, చికెన్ వంటి మాంసాహారాలను సరైన నిష్పత్తిలో తీసుకుంటే బరువు తగ్గడానికి అది సరైన ఆహారం అవుతుందని, అలాగే వాటితోపాటు మిగతా ఆహారంలో జాగ్రత్త పాటించాలి, మాంసాహార వంటకాలతో పాటు కేలరీలు ఎక్కువగా లేని ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం మంచి ఎంపిక" అని డాక్టర్ అరుణ్ సూచించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)