బ్యాండ్‌ మేళం: ప్రేమ కథా? పాత కథా?

    • రచయిత, జీఆర్ మ‌హ‌ర్షి
    • హోదా, బీబీసీ కోసం
  • చదివే సమయం: 5 నిమిషాలు

కోర్ట్ సినిమాలో యువ జంట హ‌ర్ష్ రోష‌న్‌, శ్రీ‌దేవి మ‌ళ్లీ క‌లిసి న‌టించిన బ్యాండ్‌మేళం థియేట‌ర్‌లోకి వ‌చ్చింది.

మాట‌ల ర‌చ‌యిత కోన వెంక‌ట్ ఈ సినిమాకు నిర్మాత‌. మరి ‘కోర్ట్’ మ్యాజిక్‌ను బ్యాండ్‌మేళం రిపీట్ చేసిందా?

క‌థ ఏమంటే తెలంగాణ‌లోని బ్రాహ్మ‌ణ‌ప‌ల్లె. గిరి (హ‌ర్ష్ రోష‌న్‌) , రాజీ (శ్రీ‌దేవి) బావామ‌ర‌ద‌లు. చిన్న‌ప్ప‌టి నుంచి ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌.

గిరి తండ్రి సుంద‌రం (గోప‌రాజు విజ‌య్‌) దాన‌ధ‌ర్మాలు చేసి ఆస్తి పోగొట్టుకుంటాడు.

బావ సాయంతో సాయ‌న్న (సాయికుమార్‌) కోటీశ్వ‌రుడిగా ఎదుగుతాడు. చెల్లెలి కొడుకు గిరికి కూతురిని ఇవ్వ‌డం సాయ‌న్న‌కి ఇష్టంలేదు.

ట్రెండీగా ఉందా? పాత కథేనా?

గిరి స‌రిగా చ‌దువుకోకుండా మ్యూజిక్‌పై ఆస‌క్తి చూపుతుంటాడు. న‌లుగురు స్నేహితుల‌తో బ్యాండ్‌మేళం ఏర్పాటు చేసి పెళ్లిళ్ల‌లో పాడుతుంటాడు.

రాజీ చ‌దువులో టాప‌ర్‌. ఇంజ‌నీరింగ్ వ‌ర‌కు వెళుతుంది. గిరిని టెన్త్ పాస్ కావాల‌ని కోరుతుంది. అయినా చ‌ద‌వ‌డు. అతనితో దూరంగా వుంటుంది.

తండ్రి ఆమెకి పెళ్లి సంబంధం చూస్తాడు. చివ‌రికి ఏమైంది? ప్రేమ ఫ‌లించిందా, విఫలమైందా?

తెలుగు సినిమా పుట్టిన‌ప్ప‌టి నుంచి, బ్లాక్ అండ్ వైట్, క‌ల‌ర్ వ‌ర‌కు ఇలాంటి సినిమాలు చూసిచూసీ ప్రేక్ష‌కులు అల‌సిపోయారు. ప్రేమ క‌థ‌ని కొత్త‌గా, ట్రెండీగా చెబితే త‌ప్ప చూడ‌రు.

బ్యాండ్‌మేళం మిస్స‌య్యింది ఇదే. పాత క‌థ, క‌థ‌నం. ఎమోష‌న‌ల్ డెప్త్ లేదు. క్యారెక్ట‌రైజేష‌న్ వ‌ర్క‌వుట్ చేయ‌లేదు. రైటింగ్‌లోనూ గంద‌ర‌గోళం. ప్ర‌ముఖ ర‌చ‌యిత ప్రొడ‌క్ష‌న్ హౌస్ నుంచి ఇలాంటి అరిగిపోయిన క‌థ‌, క‌థ‌నం రావ‌డం ఆశ్చ‌ర్యకరం.

సెల్లింగ్ పాయింట్‌ను ఎలా డీల్ చేశారంటే...

నిజానికి ప్రేమ క‌థ‌లు మంచి సెల్లింగ్ పాయింట్‌. ప్ర‌పంచంలోని అన్ని ప్రేమ‌క‌థ‌లు ఒక‌టే. ఎక్క‌డైనా ప్రేమికుల‌కి అడ్డు త‌గిలేది కులం, మ‌తం, ప్రాంతం, భాష‌, డ‌బ్బు.

డ‌బ్బు అడ్డు త‌గిలితే దేవ‌దాసు, మ‌తం అడ్డ‌మొస్తే బొంబాయి, భాష‌, ప్రాంతాలు అడ్డు త‌గిలితే సీతాకోక‌చిలుక‌, కుటుంబాల మ‌ధ్య ద్వేష‌మంటే రోమియోజూలియ‌ట్‌. ఒక్కోటి ఒక్కో జాన‌ర్‌. అన్నింటిలో కామ‌న్ ఎలిమెంట్ ఎమోష‌న్‌.

బ్యాండ్‌మేళం చూస్తుంటే పాత సినిమాలు చూసిన‌ట్ట‌నిపిస్తుంది. బావామ‌ర‌ద‌ళ్ల త‌గాదాలు ఉయ్యాల జంపాల గుర్తుకి తెస్తే , క్లైమాక్స్ సీన్ మ‌న‌సంతా నువ్వే గుర్తుకొస్తుంది. స‌న్నివేశాల్లో బ‌లం లేక‌పోవ‌డంతో రిపీటెడ్‌గా అనిపిస్తుంటాయి.

హ‌ర్ష్‌రోష‌న్ మంచి న‌టుడు. స్క్రిప్ట్ స‌పోర్ట్ చేస్తే సినిమాని మోయ‌గ‌ల‌డు. కామెడీనే కాదు, ఎమోష‌న‌ల్ సీన్స్‌లో కూడా బాగా న‌టించాడు.

శ్రీ‌దేవి క్లైమాక్స్‌లో బాగా న‌టించినా , చాలాచోట్ల డ‌ల్‌గా ఉంది. ఆ పాత్ర‌లోని గంద‌ర‌గోళ‌మే దీనికి కార‌ణం. ఆమె బావ‌ని మార్చాల‌నుకుంది. అత‌ను మార‌డ‌ని తెలిసిపోయింది.

గిరి ఎలాంటివాడైనా ప్రేమ కోసం ఆమోదించాలి లేదా వేరే పెళ్లి చేసుకోవాలి. ఈ రెండే ఆప్ష‌న్లు. కానీ క్లైమాక్స్ వ‌ర‌కూ నాట‌కం ఆడ‌డం మ‌రీ సినిమాటిక్‌.

కోన వెంక‌ట్‌, ద‌ర్శ‌కుడు స‌తీశ్ ఇంకా అవుట్‌డేటెడ్‌గా వున్నారేమో అనిపిస్తుంది.

ప్రేమ కథా, కామెడీ సినిమానా?

హీరో ఫ్రెండ్స్‌గా న‌టించిన వాళ్లు కొన్ని చోట్ల న‌వ్వించారు. డైలాగులు కొన్ని చోట్ల పేలాయి. కొన్నిచోట్ల డైలాగులు బాగున్నా న‌టుల టైమింగ్ మిస్ కావ‌డంతో తుస్సుమ‌న్నాయి. హీరో ఫ్రెండ్‌గా దేవి అనే అమ్మాయి చాలా బాగా న‌టించింది. క్యారెక్ట‌ర్‌ని పండించింది.

మ్యూజిక్ క‌థాంశంగా వున్న సినిమాల్లో పాట‌లు సూప‌ర్‌హిట్ కావాలి. ఒక‌టిరెండు త‌ప్ప మిగ‌తావి క‌థ‌కి అడ్డం త‌గిలిన‌ట్టు అనిపిస్తాయి. బీజీఎం అంతంత మాత్ర‌మే.

తెలంగాణ యాస కూడా ఫోర్స్‌డ్‌గా వుంది. హీరోయిన్ ఒక్కో సీన్‌లో ఒక్కో ర‌కంగా మాట్లాడుతుంది.

యూట్యూబ్ వీడియోలు చేయ‌డానికి ప‌ది ల‌క్ష‌ల‌తో స్టూడియో నిర్మాణం ఎందుకో అర్థం కాదు. ఆ డ‌బ్బు కోసం హీరో ఊరంతా దొంగ‌త‌నాలు చేస్తుంటే ఒక్క‌రు కూడా పోలీస్ కంప్ల‌యింట్ ఇవ్వ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం.

హీరోయిన్ 50 వేలు తెచ్చి అత్త‌కి ఇవ్వ‌డం, బ్యాంక్ వేలం ఎపిసోడ్ ఇలా క‌థ‌కి సంబంధం లేని సీన్స్ వ‌స్తూ ఉంటాయి. ఎడిట‌ర్‌కి 20 నిముషాల క‌త్తెర‌ప‌ని ఉన్నా వ‌దిలేసినట్లు అనిపించింది.

హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ బావుంది. ఎమోష‌న్ వ‌ర్క‌వుట్ కాలేదు. సాయికుమార్ లాంటి మంచి న‌టుడు వున్నా ఉప‌యోగించుకోలేదు.

ప్లస్ పాయింట్స్

1.క్లైమాక్స్‌లో హీరోహీరోయిన్ల న‌ట‌న‌

2.అక్క‌డ‌క్క‌డ న‌వ్వులు

3.రెండు పాట‌లు

మైన‌స్ పాయింట్స్:

1.పాత క‌థ‌, క‌థ‌నాలు

2.ఎమోష‌న్ లేక‌పోవ‌డం

ప్ర‌ముఖ ర‌చ‌యిత కోన వెంక‌ట్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ నుంచి బ‌ల‌హీన‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో అవుట్‌డేటెడ్ సినిమా రావ‌డం విచిత్రం.

(గమనిక: అభిప్రాయాలు సమీక్షకుడి వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)