జార్జియా మెలోనీ: చర్చి గోడపై ఏంజెల్ బొమ్మ వేయమంటే ఇటలీ ప్రధాని ముఖాన్ని చిత్రించిన ఆర్టిస్ట్

ఫొటో సోర్స్, Reuters/Getty Images
- రచయిత, టిఫానీ వెర్తీమర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇటలీ రాజధాని రోమ్‌లోని ఓ చర్చి గోడపై వేసిన పెయింటింగ్ వివాదానికి దారి తీసింది.
అందులోని ఓ ఏంజెల్ ముఖం ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ముఖాన్ని పోలి ఉందన్న విమర్శలు రావడంతో దాన్ని గీసిన ఆర్టిస్ట్ ఆ పెయింటింగ్‌ను చెరిపేశారు.
లూసియానాలోని బసిలికా ఆఫ్ సెయింట్ లారెన్స్‌లో ఇటీవల వేసిన ఆ చిత్రం జార్జియా మెలోని ముఖాన్ని పోలి ఉండడంతో చర్చితో పాటు ప్రభుత్వ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
దాన్ని గీసిన చిత్రకారుడు బ్రూనో వలెంటినెట్టి మొదట ఈ ఆరోపణలను తిరస్కరించారు.
కానీ అది ప్రధానమంత్రి ముఖమేనని ఆయన బుధవారం అంగీకరించారు.
అయితే అది ఒరిజినల్ పెయింటింగ్ తరహాలోనే ఉందని ఆయన పేర్కొన్నారు.
వాటికన్ ఆదేశాలతో ఆ పెయింటింగ్‌ను కవర్ చేశానని లా రిపబ్లికాతో చెప్పారు 83 ఏళ్ల వలెంటినెట్టి.
దీనిపై రోమ్ కార్డినల్ బాల్డస్సారే రెయినా స్పందించిన తర్వాత.. ఒరిజినల్ ముఖ లక్షణాలను ఇప్పుడు తిరిగి పునరుద్ధరిస్తామని డయోసీస్ ఆఫ్ రోమ్ కార్యాలయం బుధవారం తెలిపింది.

జరిగిన దానిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, పవిత్రమైన చిత్రాలను, క్రైస్తవ సంప్రదాయాన్ని దుర్వినియోగం చేయకూడదని రోమ్ కార్డినల్ బాల్డస్సారే రెయినా అన్నారు.
ఈ చిత్రం గురించి విన్న తరువాత పెద్ద సంఖ్యలో సందర్శకులు.. ప్రధానమంత్రి మెలోనీ కార్యాలయం నుంచి ఐదు నిమిషాల నడక దూరంలో ఉండే బసిలికా ఆఫ్ సెయింట్ లారెన్స్‌కు తరలి వచ్చారు.
"ఆ చిత్రం చూడాలని, సెల్ఫీలు తీసుకోవాలని జనం భారీగా వచ్చారు" అని బసిలికాలోని మతాధికారి డానియెల్ మికెలెట్ అన్సా న్యూస్ ఏజెన్సీతో చెప్పారు.
ఈ పునరుద్ధరణ పనులను తాను తొలిసారి చూసినప్పుడు ప్రధానమంత్రి పోలికలను అందులో గమనించలేదని మికెలెట్ చెప్పారు.

ఫొటో సోర్స్, Riccardo De Luca/Anadolu via Getty Images
లూసియానాలోని బసిలికా ఆఫ్ శాన్ లోరెంజో… రోమ్‌లోని పురాతన చర్చిల్లో ఒకటి. బరోక్ కళలో నిపుణులైన జియాన్ లోరెంజో బెర్నినీ, గ్వీడో రేనీ రూపొందించిన కళాకృతులు ఇక్కడున్నాయి.
అయితే.. ఈ వివాదంలో ప్రధానంగా ఉన్న వాల్ పెయింటింగ్స్ చాలా పాతవేమీకావు. 2000లో వీటిని గీశారు. వీటికి వారసత్వ సంరక్షణ హోదా లేదు.
బ్రూనో వలెంటినెట్టినే ఈ చిత్రాలను అంతకుముందు గీశారు.
ఇవి పాడైపోవడంతో వీటిని పునరుద్ధరించాలని ఆయనను కోరినట్లు మికెలెట్టి చెప్పారు.
ఇకపై ఈ చర్చిలో ఏ పునరుద్ధరణ పనైనా అధికారుల ఆమోదం తర్వాత, అలాగే ప్రతిపాద చిత్రానికి సంబంధించిన స్కెచ్‌ను పరిశీలించాకే జరుగుతుందని రోమ్ సాంస్కృతిక ప్రదేశాలను సంరక్షించే బాధ్యతలు చూస్తున్న ప్రభుత్వ విభాగం తెలిపింది.
దీనిపై స్పందించాలని వాటికన్‌ను బీబీసీ సంప్రదించింది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













