You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ట్రంప్ సుంకాలు విధించినా భారీగా పెరిగిన చైనా ఎగుమతులు
- రచయిత, ఆజ్మండ్ చియా
- హోదా, బిజినెస్ రిపోర్టర్
- చదివే సమయం: 2 నిమిషాలు
అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, ఈ ఏడాది తొలి రెండు నెలల్లో చైనా ఎగుమతులు భారీగా పెరిగాయి.
జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎగుమతులు 20 శాతానికి పైగా పెరిగినట్లు అధికారిక గణాంకాలు చూపుతున్నాయి. ఇది ఆర్థిక నిపుణులు అంచనా వేసిన వృద్ధి కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. ఎగుమతుల్లో ఇదే వేగం కొనసాగితే 2025లో నమోదైన రికార్డు స్థాయి వార్షిక వాణిజ్య మిగులును ఈ ఏడాది అధిగమించే అవకాశముంది.
రానున్న ఏప్రిల్ ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చైనాలో పర్యటించనున్నారు. జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు. ఇదే సమయంలో ఈ ప్రకటన వెలువడింది.
ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడుతున్న ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా.. వినియోగదారుల వ్యయ సామర్థ్యం తగ్గిపోవడం, జనాభా తగ్గుదల, రియల్ ఎస్టేట్ సంక్షోభం వంటి సమస్యలను ఎదుర్కొంటోంది.
చైనా సాధారణంగా జనవరి, ఫిబ్రవరి నెలల వాణిజ్య గణాంకాలను కలిపి ప్రకటిస్తుంది. ప్రతి ఏటా వేర్వేరు తేదీల్లో వచ్చే చైనీస్ లూనార్ న్యూ ఇయర్ సెలవుల కారణంగా గణాంకాల్లో వచ్చే తేడాలను సరిచేసేందుకు ఇలా చేస్తుంది.
ఎలక్ట్రానిక్స్ వస్తువులకున్న భారీ డిమాండ్ కారణంగా చైనా ఎగుమతులు పెరిగాయి. వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర తయారీ వస్తువుల రవాణా కూడా పెరిగింది.
యూరప్ దేశాలతో వాణిజ్యం 27.8 శాతం పెరిగింది. థాయిలాండ్, సింగపూర్, ఫిలిప్పీన్స్ వంటి దక్షిణాసియా దేశాలకు ఎగుమతులు దాదాపు 30 శాతం పెరిగాయి.
అయితే, అమెరికాకు ఎగుమతులు 10 శాతానికి పైగా తగ్గాయి. రెండు దేశాల మధ్యనున్న వాణిజ్య తేడాలను తగ్గించేందుకు డోనల్డ్ ట్రంప్ టారిఫ్‌లతో పాటు ఇతర చర్యలు చేపట్టారు.
గతవారం, చైనా ఈ ఏడాది వార్షిక వృద్ధి రేటు లక్ష్యాన్ని 4.5 శాతం నుంచి 5 శాతంగా నిర్ణయించింది.ఇది గత ఏడాది లక్ష్యం 5 శాతంతో పోలిస్తే తక్కువ. ఎగుమతుల వల్లే గత ఏడాది లక్ష్యం సాధ్యమైంది.
దేశీయంగా వ్యయ సామర్థ్యం తగ్గినా, రియల్ ఎస్టేట్ రంగం మందగమనంలో ఉన్నా కూడా ఎగుమతులే చైనా ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపాయి.
ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో ఇంధన మార్కెట్‌పై ప్రభావం, ఆర్థికంగా ప్రభావితమైన ఆసియా దేశాలు ఈ వ్యవహారాన్ని డీల్ చేయడంలో తలమునకలై ఉన్న సమయంలో.. జిన్‌పింగ్, ట్రంప్ భేటీ జరగనుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)