అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం: వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాలకు సంబంధించి భారత్ ముందున్న సవాళ్లు ఏమిటి?

ఫొటో సోర్స్, AFP via Getty Images
భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇటీవల వెల్లడించారు. అలాగే భారత్‌పై విధించిన టారిఫ్‌లను 18 శాతానికి తగ్గిస్తున్నామని ప్రకటించారు.
అయితే, ఈ వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉన్నప్పటికీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు దీనిని ఒక 'గొప్ప విజయం'గా అభివర్ణించారు.
రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సహా పలువురు ప్రతిపక్ష నేతలు మాత్రం ఈ వాణిజ్య ఒప్పందంలో వ్యవసాయం, పాడి పరిశ్రమలకు సంబంధించిన ప్రయోజనాలను విస్మరించారని ఆరోపిస్తున్నారు.
ప్రతిపక్షాల విమర్శలపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పందిస్తూ, దేశంలోని వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాల ప్రయోజనాల విషయంలో రాజీపడలేదని స్పష్టం చేశారు.
వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన అంశాలను తుది దశ చర్చల్లో ఖరారు చేస్తున్నామని, దీనిపై భారతదేశం, అమెరికా సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేస్తాయని ఆయన తెలిపారు.

ట్రంప్, అమెరికా వ్యవసాయ మంత్రి ప్రకటనలతో ఆందోళన...
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం విషయంలో డోనల్డ్ ట్రంప్, అమెరికా వ్యవసాయ శాఖ మంత్రి బ్రూక్ రోలిన్స్ చేసిన ప్రకటనలు భారతదేశంలో ఆందోళనను పెంచాయి.
''అమెరికా వస్తువులపై భారత్ విధిస్తున్న టారిఫ్, నాన్-టారిఫ్ బారియర్లను సున్నా శాతం చేయనుంది. అమెరికా నుంచి మరిన్ని వస్తువులను కొనుగోలు చేసేందుకు భారత ప్రధానమంత్రి అంగీకరించారు. వాటిలో 500 బిలియన్ డాలర్లు (సుమారు రూ.45.22 లక్షల కోట్లు) కంటే ఎక్కువ విలువైన అమెరికా ఇంధనం, టెక్నాలజీ, బొగ్గు, వ్యవసాయం తదితర ఉత్పత్తులు ఉన్నాయి'' అని ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా 'ట్రూత్ సోషల్'లో పేర్కొన్నారు.
ఆ తర్వాత, బ్రూక్ రోలిన్స్ కూడా ఈ ఒప్పందం అమెరికా రైతులకు లాభదాయకమని అభివర్ణించారు.
''భారతదేశ విస్తృత మార్కెట్‌లోకి అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు ప్రవేశం పెరుగుతుందని, దీనివల్ల భారతదేశంతో ఉన్న 1.3 బిలియన్ డాలర్ల (సుమారు రూ.11,758 కోట్లు) అమెరికా వ్యవసాయ వాణిజ్య లోటును తగ్గించడానికి దోహదపడుతుంది'' అని పేర్కొన్నారు.
అమెరికాతో ఈ వాణిజ్య ఒప్పందం భారతదేశం వైపు నుంచి కొన్ని అభ్యంతరాల కారణంగానే ఆలస్యమైందని భావిస్తున్నారు.
ఈ విషయమై నిరుడు అక్టోబర్ నెలలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడుతూ.. భారతదేశ కనీస ప్రయోజనాలు, పరిమితులను గౌరవించాలని అన్నారు.
వాస్తవానికి, భారతదేశానికి ఉన్న కొన్ని ఆందోళనల వల్లే ఈ వాణిజ్య ఒప్పందం ఇంతకాలం ఆలస్యమైంది. ఆ ఆందోళనలు ఏమిటో ఒకసారి చూద్దాం.

ఫొటో సోర్స్, AFP via Getty Images
వ్యవసాయ రంగం...
నిరుడు ఏప్రిల్‌లో బీబీసీ ప్రచురించిన వివరాల ప్రకారం.. భారతదేశంలో సుమారు 70 కోట్ల మంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడుతున్నారు. అందుకే ఈ రంగం భారతదేశానికి వెన్నెముకగా నిలుస్తోంది.
దేశంలో దాదాపు సగం మంది కార్మికులకు వ్యవసాయ రంగమే ఉపాధి కల్పిస్తోంది. కానీ, స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో దీని వాటా 15 శాతం మాత్రమే ఉంది.
వ్యవసాయ రంగంలోనూ వాణిజ్యానికి ద్వారాలు తెరవాలని అమెరికా కొన్నేళ్లుగా భారత్‌పై ఒత్తిడి తెస్తోంది.
భారతదేశాన్ని ఒక పెద్ద మార్కెట్‌గా అమెరికా భావిస్తోంది.
కానీ, కోట్లాది మంది రైతుల ప్రయోజనాలు, ఆహారభద్రత, జీవనోపాధిపై ఆందోళనలను కారణంగా చూపిస్తూ భారత్ అందుకు దూరంగా ఉంటోంది.
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి విషయమే అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చల్లో అతిపెద్ద అంశంగా మారింది.
భారతదేశం, అమెరికా మధ్య వ్యవసాయ వాణిజ్యం 8 బిలియన్ డాలర్లు (సుమారు 72,352 కోట్లు)గా ఉంది.
బియ్యం, రొయ్యలు, సుగంధ ద్రవ్యాలను భారతదేశం అమెరికాకు ఎగుమతి చేస్తోంది.
అమెరికా నట్స్ (జీడిపప్పు, బాదం వంటివి), యాపిల్స్, పప్పుధాన్యాలను భారతదేశానికి పంపుతోంది.
భారతదేశంతో ఉన్న తన 45 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4,06,980 కోట్లు) వాణిజ్య లోటును తగ్గించుకోవడానికి మొక్కజొన్న, సోయాబీన్, పత్తి వంటి భారీ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు మార్గం సుగమం చేయాలని అమెరికా డిమాండ్ చేస్తోంది.
దీనివల్ల భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), ప్రభుత్వ సేకరణను తగ్గించుకోవాలనే ఒత్తిళ్లు పెరగవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎంఎస్‌పీ, ప్రభుత్వ సేకరణే భారత రైతులకు ప్రధాన రక్షణ కవచాలు. ఇవి పంటలకు సరైన ధర లభించేలా హామీ ఇస్తూ, ధరల ఆకస్మిక పతనం నుంచి వారిని కాపాడతాయి. ధాన్యం కొనుగోలును ఖాయం చేస్తాయి.
గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్‌ఐ) ప్రతినిధి అజయ్ శ్రీవాస్తవ నిరుడు జూలైలో బీబీసీ ప్రతినిధి సౌతిక్ బిశ్వాస్‌తో మాట్లాడుతూ.. ''డెయిరీ ఉత్పత్తులు, బియ్యం, గోధుమలు వంటి ప్రధాన ఆహార ధాన్యాలపై టారిఫ్ తగ్గింపు ఉండకపోవచ్చు. ఎందుకంటే, వ్యవసాయాధారిత జీవనోపాధికి అవే కీలకం. ఆయా రంగాలు రాజకీయంగా, ఆర్థికంగా చాలా సున్నితమైనవి. భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోని దాదాపు 70 కోట్లకు పైగా ప్రజలపై వాటి ప్రభావం ఉంటుంది'' అని చెప్పారు.
ప్రతిపాదిత భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కింద బియ్యం, డెయిరీ ఉత్పత్తులు, పౌల్ట్రీ, మొక్కజొన్న, యాపిల్, బాదం, జీఎం సోయా సహా అమెరికా వ్యవసాయ దిగుమతులపై టారిఫ్ తగ్గించాలని నీతి ఆయోగ్ తన నివేదికలో సిఫారసు చేసింది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
పాడి పరిశ్రమ...
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో పాడి పరిశ్రమ రంగం కూడా ఒక ప్రధాన అంశంగా ఉంది. భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం ఎంతో ప్రధానమైంది.
కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) గణాంకాల ప్రకారం, 2023-24 సంవత్సరంలో 23.92 కోట్ల టన్నుల పాల ఉత్పత్తితో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది.
ఆ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.2,465 కోట్ల విలువైన డెయిరీ ఉత్పత్తులను యూఏఈ, సౌదీ అరేబియా, అమెరికా, భూటాన్, సింగపూర్ తదితర దేశాలకు ఎగుమతి చేసింది.
డెయిరీ ఉత్పత్తుల దిగుమతులపై మాత్రం భారతదేశంలో భారీ స్థాయిలోనే టారిఫ్ ఉంది. చీజ్‌పై 30 శాతం, వెన్నపై 40 శాతం, పాలపొడిపై 60 శాతం టారిఫ్ విధిస్తోంది భారత్.
అందుకే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి కొన్ని దేశాలలో డెయిరీ ఉత్పత్తులు చౌకగా ఉన్నప్పటికీ వాటిని దిగుమతి చేసుకోవడం లాభదాయం కాదు.
ఇప్పుడీ భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఒకవేళ అమెరికా డెయిరీ ఉత్పత్తులకు భారతదేశ మార్కెట్లలోకి ద్వారాలు తెరిస్తే, అది భారీ నష్టానికి దారితీయవచ్చు.
అలా అమెరికా డెయిరీ ఉత్పత్తులకు అనుమతిస్తే స్వదేశీ పాల ఉత్పత్తుల ధరలు కనీసం 15 శాతం వరకూ పడిపోతాయని, దీనివల్ల రైతులకు ఏటా రూ 1.03 లక్షల కోట్లు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) ఇటీవల విడుదల చేసిన ఒక నివేదికలో స్పష్టం చేసింది.
'పాల ఉత్పత్తి దేశం' కాస్తా 'పాల వినియోగదారు' దేశంగా మారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
నాన్-వెజ్ మిల్క్‌పై ఆందోళన
డెయిరీ రంగానికి సంబంధించి 'నాన్-వెజ్ మిల్క్' అనేది మరో ప్రధానమైన ఆందోళన.
''సాంస్కృతికపరమైన ఆందోళనల దృష్ట్యా అమెరికా డెయిరీ ఉత్పత్తుల దిగుమతికి అనుమతి ఇవ్వకూడదని భారత ప్రభుత్వం నిర్ణయించింది'' అని బీబీసీ నిరుడు జూలై నెలలో రిపోర్టు చేసింది.
భారతదేశంలో కొందరు శాకాహారులు. జంతు మాంసంతో కూడిన దాణా తినే ఆవుల పాలను 'నాన్-వెజ్ మిల్క్'గా పిలుస్తారు. ఆ పాలను వినియోగించడాన్ని వారు తమ మతపరమైన విశ్వాసాలకు విరుద్ధంగా భావిస్తారు.
అమెరికా పాడి పరిశ్రమలో ఆవుల బరువు పెంచడానికి జంతువుల మాంసం లేదా రక్తం కలిపిన మేతను అందిస్తారు. ఈ కారణంగానే దీన్ని 'బ్లడ్ మీల్' అని కూడా అంటారు.
''పందులు, చేపలు, చికెన్, గుర్రాలు, పిల్లులు, కుక్కల మాంసం కలిపి తయారుచేసిన మేతను అమెరికాలో ఆవులకు అందిస్తారు. ప్రోటీన్ కోసం పందులు, గుర్రాల రక్తాన్ని తాగిస్తారు. అంతేగాకుండా, ఆవులు బలిష్టం కావడానికి ఈ జంతువుల కొవ్వును దాణాలో కలుపుతారు'' అని సియాటెల్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది.
బీబీసీ న్యూస్ హిందీలో వచ్చిన మరో కథనం ప్రకారం, బ్లడ్ మీల్ అనేది మాంసం ప్యాకింగ్ పరిశ్రమలో వచ్చే ఒక బై-ప్రొడక్ట్. దీన్ని ఇతర జంతువులకు ఆహారంగా పెట్టడానికి ఉపయోగిస్తారు.
జంతువులను వధించిన తర్వాత, వాటి నుంచి సేకరించిన రక్తాన్ని గడ్డకట్టించి, ఆపై ఎండబెట్టి ఒక ప్రత్యేకమైన దాణాను తయారు చేస్తారు. అదే 'బ్లడ్ మీల్'.

ఫొటో సోర్స్, AFP via Getty Images
భారతదేశంపై 25 శాతం రెసిప్రోకల్ టారిఫ్‌తో పాటు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు అంటూ మరో 25 శాతం అదనంగా డోనల్డ్ ట్రంప్ టారిఫ్ విధించారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపేయాలని, అమెరికా నుంచి రక్షణ పరికరాలను కొనుగోలు చేయాలని డోనల్డ్ ట్రంప్ పదేపదే భారతదేశాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, టారిఫ్ తగ్గిస్తామని ట్రంప్ గత మంగళవారం ప్రకటించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు పూర్తిగా నిలిపేయడానికి భారతదేశం అంగీకరించిందని, ప్రత్యామ్నాయంగా అమెరికా నుంచి వెనెజ్వెలా చమురును కొనుగోలు చేస్తుందని ఆ సందర్భంగా చెప్పారు.
ఇలాంటి ప్రకటనలు ట్రంప్ గతంలో కూడా చేశారు. కానీ భారత ప్రభుత్వం నుంచి దీనిపై ఎప్పుడూ స్పష్టమైన సమాచారం రాలేదు. అయినప్పటికీ, రష్యా నుంచి చమురు కొనుగోలు క్రమేపీ తగ్గుతూ వస్తోంది.
గత నెలాఖరులో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పూరి మాట్లాడుతూ, రష్యా నుంచి చమురు సరఫరా ఇప్పటికే రోజుకు 13 లక్షల బ్యారెళ్లకు తగ్గిందని, ఇది నిరుడు సగటున ఉన్న 18 లక్షల బ్యారెళ్ల కంటే తక్కువని చెప్పారు.
ఇవన్నీ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని ఆయన అన్నారు.
రష్యాతో సంబంధాలు తగ్గించుకోవాలని అమెరికా నిరంతరం భారత్‌పై ఒత్తిడి తెస్తోంది. అందులో చమురు కొనుగోలు ఒకటి.
అయితే, భారత్ తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని వదులుకోవడానికి సిద్ధంగా లేదు.
భారతదేశం తన ఎల్‌పీజీ దిగుమతుల్లో 10 శాతం వాటాను అమెరికా నుంచి కొనుగోలు చేయడానికి నిరుడు నవంబర్‌లోనే ఒప్పందం చేసుకుంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గత డిసెంబర్‌లో భారతదేశ పర్యటన సందర్భంగా, 'భారతదేశంపై అమెరికా ఒత్తిడి'ని తీవ్రంగా విమర్శించారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
రక్షణ కొనుగోళ్లు...
చమురు, ఎల్‌ఎన్‌జీతో పాటు బోయింగ్ విమానాలు, హెలికాప్టర్లు, అణు రియాక్టర్లు వంటి భారీస్థాయి వాణిజ్య కొనుగోళ్ల కోసం భారతదేశంపై అమెరికా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
500 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులను భారతదేశం కొనుగోలు చేస్తుందని ట్రంప్ స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో, ఆయా ఉత్పత్తుల్లో సింహభాగం రక్షణ రంగానికి సంబంధించినవే ఉండవచ్చని వారు భావిస్తున్నారు.
ఇంధన రంగమే కాకుండా భారత్-రష్యా రక్షణ భాగస్వామ్యం కూడా ఎంతో కీలకమైనది. కానీ ఇక్కడ కూడా రష్యా పాత్ర తగ్గుతూ వస్తోంది.
స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వివరాల ప్రకారం, 2020 నుంచి 2024 మధ్యకాలంలో భారతదేశం కొనుగోలు చేసిన రక్షణ రంగ పరికరాల్లో 36 శాతం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నవే. అదే 2006-10 మధ్యకాలంలో రష్యా వాటా 82 శాతం ఉండేది.
డోనల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత, ఆయన్ను కలవడానికి నిరుడు ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాషింగ్టన్‌కు వెళ్లారు. ఆ సమయంలోనే ట్రంప్, భారతదేశానికి ఎఫ్-35 ఫైటర్ జెట్‌లను అందించడానికి అమెరికా సిద్దంగా ఉందని ప్రకటించారు.
ఒక్కో ఎఫ్-35 ధర దాదాపు రూ. 670 కోట్లు అని, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానాలలో ఇదొకటని నిరుడు మార్చిలో బీబీసీ ప్రచురించిన కథనంలో సౌతిక్ బిస్వాస్ పేర్కొన్నారు.
అత్యంత ఆధునికమైనవే కాకుండా చాలా ఖరీదైన ఎఫ్-35 జెట్‌లను అమెరికా నుంచి కొనుగోలు చేయాలా లేదా రష్యాతోనే రక్షణ సహకారాన్ని కొనసాగిస్తూ, ఆ దేశానికి చెందిన అత్యంత ఆధునిక స్టెల్త్ ఫైటర్ జెట్ 'సుఖోయ్ ఎస్‌యూ-57'ను స్వదేశంలోనే ఉత్పత్తి చేయాలా? అనే ఒక పెద్ద ప్రశ్న భారత ప్రభుత్వం ముందు ఉండేది.
ఎఫ్-35 జెట్ విషయంలో భారతదేశం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి.
దీని ధర చాలా ఎక్కువ. దీని నిర్వహణ కూడా చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. దీని నిర్వహణలోనూ అనేక ఇబ్బందులు ఉన్నాయి.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














