‘భారత్-అమెరికా ట్రేడ్ డీల్’: ట్రంప్ చెప్పినవాటిలో నిజమయ్యేవి ఎన్ని, కొన్ని అంశాలపై ఇండియా ఎందుకు మౌనంగా ఉంది?

ఫొటో సోర్స్, Getty Images
రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేతకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించారని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సోమవారం చెప్పారు.
దీనితో భారత్‌పై సుంకాలను 18 శాతానికి తగ్గించనుంది అమెరికా. కొన్ని నెలలుగా భారత్-అమెరికా మధ్య సాగుతున్న ఉద్రిక్తతలకు ఈ ప్రకటన తెరదించుతుందని భావిస్తున్నారు.
"సోమవారం నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడాను. వివిధ అంశాలపై చర్చించాను. వాణిజ్యం, యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించడం, అమెరికాతోపాటు ముఖ్యంగా వెనెజ్వెలా నుంచి మరింత చమురు కొనడం వంటి అంశాలు ఉన్నాయి" అని ట్రూత్‌సోషల్‌లో చేసిన పోస్ట్‌లో ట్రంప్ పేర్కొన్నారు.
"ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఉన్న స్నేహం, గౌరవంతో ఆయన విజ్ఞప్తి మేరకు తక్షణమే అమల్లోకి వచ్చే భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి మేం అంగీకరించాం. ఈ ఒప్పందంలో భాగంగా టారిఫ్‌లను 18 శాతానికి అమెరికా తగ్గిస్తుంది" అని తెలిపారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే యుక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు భారత్ సాయం చేస్తోందని ట్రంప్ గతంలో ఆరోపించారు.


ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్, మోదీ భిన్న ప్రకటనలు..
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు నిరుడు ఆగస్టులో భారత్‌పై 25శాతం టారిఫ్‌లను అదనంగా విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అంతకుముందు భారత్‌పై 25శాతం సుంకాలు విధించారు.
అమెరికాపై విధించిన టారిఫ్‌లను భారత్ సున్నాకు తగ్గిస్తుందని ట్రంప్ చెప్పారు. "బై అమెరికన్" పాలసీ కింద ఇంధనం, సాంకేతికత, వ్యవసాయ ఉత్పత్తులు సహా 500 బిలియన్ డాలర్లకుపైగా అమెరికా వస్తువులను భారత్ కొంటుందని తెలిపారు.
" నా ప్రియమైన స్నేహితుడు, అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై సుంకం ఇప్పుడు 18శాతానికి తగ్గనుందని తెలిసి నాకు సంతోషంగా ఉంది. ఈ ప్రకటన చేసినందుకు 140 కోట్లమంది భారతీయుల తరఫున అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ధన్యవాదాలు" అని ట్రంప్ ప్రకటన వెలువడిన కాసేపటికే మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.
అయితే, ట్రంప్ ప్రకటనకు, మోదీ చెప్పిన దానికి మధ్య చాలా వైరుధ్యం ఉంది.
రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తుందని ట్రంప్ చెప్పారు. కానీ, ప్రధాని మోదీ ఆ మాటా చెప్పలేదు.
అమెరికా వస్తువులపై టారిఫ్‌లను భారత్ జీరోకు తగ్గిస్తుందని ట్రంప్ అన్నారు. కానీ మోదీ దాని గురించి ప్రస్తావించ లేదు. భారత్ 500 బిలియన్ డాలర్ల విలువైన అమెరికన్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని ట్రంప్ చెప్పారు. కానీ, భారత్ నుంచి బహిరంగంగా ఎలాంటి ప్రకటనా రాలేదు.
"రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేతకు మోదీ అంగీకరించారని ట్రంప్ చెప్పారు. నాకీ విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి" అని దక్షిణాసియా భౌగోళిక రాజకీయాలను పరిశీలించే మైఖేల్ కుగెల్‌మన్ చెప్పారు.
"అమెరికా కొత్త సంకాలు విధించడంతో రష్యా నుంచి చమురు కొనడాన్ని గతేడాది నవంబరు నుంచి భారత్ తగ్గించింది. ఈ విషయం పక్కనపెడితే భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో అనేక విషయాలు అస్పష్టంగా ఉన్నాయి. వ్యవసాయం వంటి సున్నితమైన మార్కెట్‌లను భారత్ తెరిచి ఉంచుతుందా? ఈ ఒప్పందం ముందుకుసాగకపోవడానికి గతంలో ఇదే ప్రధాన కారణం’’ అని ఆయన అన్నారు.
ట్రంప్ ఆశలు ఏంటి…
500 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తుందని కూడా ట్రంప్ చెప్పారు. దీనిపై కూడా సందేహాలు ఉన్నాయి.
2024లో ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 212 బిలియన్ డాలర్లు.
"గతేడాది అమెరికా నుంచి భారత్ 41.5 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేసింది, ఇది 500 బిలియన్ డాలర్లకు చేరడం అసాధ్యం" అని బ్రిటీష్ వార్తాపత్రిక ఫైనాన్షియల్ టైమ్స్‌తో బ్రిడ్జ్ ఇండియా థింక్-ట్యాంక్ వ్యవస్థాపకుడు ప్రతీక్ దత్తానీ చెప్పారు.
భారత్ ఇదివరకే రష్యా నుంచి చమురు కొనడాన్ని తగ్గించిందని, రష్యాతో ఉన్న సంబంధాల దృష్యా దీన్ని పూర్తిగా నిలిపివేయడం కష్టం అని ఆయన అన్నారు.
2022లో యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా నుంచి ముడి చమురును తక్కువ ధరకు భారత్ పెద్ద మొత్తంలో కొనుగోలు చేసింది.
సమీప భవిష్యత్తులో అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను భారత్ కొనుగోలు చేసే అవకాశాలు చాలా తక్కువని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ మాజీ సలహాదారు ఇవాన్ ఏ ఫీజెన్‌బౌమ్ ఎక్స్‌లో రాశారు.
"భారత్‌కు అమెరికా వస్తువుల ఎగుమతులు 2024లో 41.5 బిలియన్ డాలర్లు. అమెరికా సేవల ఎగుమతులు 41.8 బిలయన్ డాలర్లు. 83 బిలియన్ డాలర్ల నుంచి 500 బిలియన్ డాలర్లకు చేరడం అంటే దాదాపు 500శాతం పెంచడం అంచనాలకు అతీతం. నిజం చెప్పాలంటే.. ఇది కాస్త అతి అంచనా" అని ఇవన్ రాశారు.
"రష్యా చమురుకు సంబంధించి ఏదైనా హామీలకు భారత్ ఆమోదం తెలుపుతుందని నేను భావించడం లేదు" అని ఫైనాన్షియల్ టైమ్స్‌తో పారిస్‌కు చెందిన జాక్వెస్ డెలోర్స్ ఇన్‌స్టిట్యూట్‌లో వాణిజ్యం, ఆర్థిక భద్రతా సలహాదారు నికోలస్ కోహ్లర్ అన్నారు. ట్రంప్ చెబుతున్నట్లుగా అన్ని రకాల టారిఫ్‌లను సున్నాకు తగ్గించడానికి భారత్ అంగీకరించిందనే విషయం అసహజంగా అనిపిస్తోందని ఆయన అన్నారు.
"టారిఫ్‌లను పూర్తిగా సున్నాకు తగ్గించడంపై భారతదేశం అంగీకరిస్తుందా అన్నది సందేహంగా ఉంది. ఎందుకంటే.. ఇప్పటివరకు జరిగిన దోహా వాణిజ్య చర్చల్లో భారత్ జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చింది. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో అది మరింత అప్రమత్తంగా ఉంటుంది" అని ఆయన అన్నారు.
"నా అంచనా ఏంటంటే.. అమెరికా నుంచి కొన్ని వస్తువులపై టారిఫ్‌లను భారత్ సున్నాకు తగ్గిస్తుంది. దీనిని ట్రంప్ " అమెరికా వస్తువులపై సుంకాలను భారత్ సున్నాకు తగ్గించింది" అని తనకు నచ్చినట్లుగా అర్థం చేసుకుని, ప్రచారం చేసుకుంటారు" అని వాల్‌స్ట్రీట్ జర్నల్ కాలమిస్ట్ సదానంద్ ధూమే 'ఎక్స్'లో రాశారు.
గత నెలలో యురోపియన్ యూనియన్, భారత్ వాణిజ్య ఒప్పందంపై అంగీకారానికి రావడం, అంతకుముందు బ్రిటన్‌తోనూ భారత్ ఎఫ్‌టీఏ కుదుర్చుకోవడం వంటివి భారత్‌తో ఒప్పందానికి వచ్చేలా ట్రంప్‌పై ఒత్తిడి పెంచినట్టు భావిస్తున్నారు.
ట్రంప్ అనేక ప్రకటనలు చేసినప్పటికీ… లిఖిత పూర్వక ఒప్పందం లేకుండా దీనిపై ఓ నిర్ధరణకు రావడం కష్టం.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ ప్రకటనతో భారత్‌పై పడే ప్రభావం ఏంటి?
ఈ తగ్గింపుతో చైనాకు ప్రత్యామ్నాయంగా ఓ ఆకర్షణీయమైన తయారీ హబ్‌గా భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తుందని బ్లూమ్‌బర్గ్‌తో డిప్యూటీ చీఫ్ ఆఫ్ క్యాపిటల్ ఎకానమిక్స్ షాలిన్ షా చెప్పారు.
"ఇది భారత జీడీపీ వృద్ధి రేటును 2026లో 0.2 నుంచి 0.3శాతానికి పెంచుతుంది. ఇది 2026, 2027 సంవత్సరాలకు క్యాపిటల్ ఎకానమిక్స్ అంచనా వేసిన 7శాతం వృద్ధికి దగ్గరగా ఉంటుంది" అని షా అన్నారు.
ఇది భౌగోళిక రాజకీయాలపై ప్రభావం చూపెడుతుందని షా అన్నారు. "భారత్‌లోని చాలా మంది వ్యూహాత్మకంగా అలీనంగా(నాన్-అలైన్డ్) ఉండటానికి ఇష్టపడతారు. కానీ ప్రస్తుతానికి అలా కాదు. అమెరికా కూటమి వైపు భారత్ మొగ్గు చూపే అవకాశం ఉంది" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌కు అమెరికా అతిపెద్ద ఎగుమతి మార్కెట్. ఈ కొత్త టారిఫ్‌లు శ్రామిక శక్తి అధికంగా ఉండే టెక్స్‌టైల్స్, తోలు, చెప్పులు, ఆభరణాల వంటి పరిశ్రమలపై ప్రభావం చూపింది. తాజా వాణిజ్య డేటా ప్రకారం అక్టోబర్‌లో వార్షిక ఎగుమతులు 12శాతానికి పడిపోయి, వాణిజ్య లోటు రికార్డు స్థాయి గరిష్ఠానికి చేరాయి.
ఈ తాజా ప్రకటనతో భారత్ అప్పుడే సెలబ్రేట్ చేసుకోవద్దని దిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్‌కు చెందిన అజయ్ శ్రీవాస్తవ అన్నారు.
‘‘ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్.. అనేక ప్రశ్నలకు సమాధానాలు లేకుండానే ఉంది. అందులో ఏ వస్తువులు ఉంటాయి, ఇది ఎంతకాలం ఉంటుంది, …భారత్ నిజంగా జీరో టారిఫ్‌లకు అంగీకరించిందా, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల వంటి రంగాల విషయంలో ఏం చేసింది?" అని శ్రీవాస్తవ రాశారు.
"అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల కొనుగోళ్ల సంఖ్య అస్పష్టంగా ఉంది. అమెరికా నుంచి భారత్ ప్రస్తుతం 50 బిలియన్ డాలర్ల కంటే తక్కువ దిగుమతులే చేస్తోంది. ఇది నిర్దిష్టమైన హామీ కంటే చేరడానికి కష్టమైన లక్ష్యం. ఉమ్మడి ప్రకటన జారీ అయ్యేవరకు దీన్ని తుది అంగీకారంకంటే ఓ రాజకీయ సూచికగానే భావించాలి. ఇది అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఉత్సవాలకు కాదు" అని ఆయన అన్నారు.
"రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపేస్తారు.
అమెరికా ఎగుమతులపై టారిఫ్‌లు లేవు.
భారత ఎగుమతులపై 18శాతం టారిఫ్‌లు ఉంటాయి.
500 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు వంటివి భారత్‌కు అమెరికా ఎగుమతి చేస్తుంది. అసలేం జరుగుతోంది, భారత వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి ఏమైపోయింది" అని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ ఎక్స్‌లో ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్‌ను షేర్ చేస్తూ రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














