ఎప్‌స్టీన్ ఫైల్స్‌: ప్రధాని మోదీ పేరు ప్రస్తావనపై విదేశాంగ శాఖ ఏం చెప్పింది, కాంగ్రెస్ వేసిన 3 ప్రశ్నలేంటి?

లైంగిక నేరాలు, అమెరికా, ట్రంప్, మస్క్

ఫొటో సోర్స్, Getty Images

చదివే సమయం: 4 నిమిషాలు

'ఎప్‌స్టీన్ ఫైల్స్' పేరుతో ఉన్న ఈ మెయిల్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, జెఫ్రీ ఎప్‌స్టీన్ మధ్య సమావేశం జరిగిందనే ఆరోపణలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తోసిపుచ్చారు.

అమెరికాకు చెందిన లైంగిక నేరస్థుడు, మానవ అక్రమ రవాణాదారు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఫైళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ పేరు ఉందని కాంగ్రెస్ శనివారం (జనవరి 31) ఆరోపించింది.

"ఇది దేశానికి సిగ్గుచేటు. ప్రధాని మోదీ ముందుకు వచ్చి మా మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి" అని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా 'ఎక్స్'లో డిమాండ్ చేశారు.

అయితే విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది, జూలై 2017లో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ అధికారిక పర్యటన తప్ప "ఈమెయిల్‌లోని మిగిలిన విషయాలు దోషిగా తేలిన నేరస్థుడి పనికిమాలిన మాటలు తప్ప మరేమీ కాదు. అవి అసలు పట్టించుకునే విషయాలు కాదు" అని పేర్కొంది.

"ఎప్‌స్టీన్ ఫైల్స్ నుంచి ఒక ఈ మెయిల్ నివేదిక అందింది. అందులో మోదీ ఇజ్రాయెల్ పర్యటన గురించి ఉంది'' అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది .

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
లైంగిక నేరాలు, అమెరికా, ట్రంప్, మస్క్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మూడు ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

కాంగ్రెస్ ఏమంటోంది?

"ఎప్‌స్టీన్ ఫైళ్లలో నరేంద్ర మోదీ పేరు కనిపించింది. అమెరికన్ సీరియల్ రేపిస్ట్, పెడోఫైల్ (పిల్లలపై లైంగిక ఆకర్షణ ఉండే వ్యక్తులు), మానవ అక్రమ రవాణాదారు జెఫ్రీ ఎప్‌స్టీన్ జూలై 9, 2017న ఒక ఈ మెయిల్‌లో రాశారు... " అని కాంగ్రెస్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' ద్వారా పేర్కొంది.

''అమెరికా అధ్యక్షుడి ప్రయోజనాల కోసం భారత ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌లో పాటలు పాడి డాన్స్ చేశారు. వారు కొన్ని వారాల క్రితం కలిశారు. అది పనిచేసింది"

"మోదీ నా సలహా తీసుకుని ఇజ్రాయెల్ వెళ్లి అమెరికా అధ్యక్షుడి ప్రయోజనం కోసం డాన్స్ చేసి, పాటలు పాడారని ఎప్‌స్టీన్ స్పష్టంగా చెబుతున్నారు. అది పనిచేసిందని కూడా ఆయన అన్నారు" అని కాంగ్రెస్ పోస్టుచేసింది.

"ప్రధాని మోదీ 2017లో జూలై 4 నుంచి 6 మధ్య ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఆ తర్వాత మూడు రోజులకు ఎప్‌స్టీన్ ఈ మెయిల్ రాశారు. ఇజ్రాయెల్ పర్యటనకు ముందు జూన్ 25-26న అధ్యక్షుడు ట్రంప్‌ను అమెరికాలో మోదీ కలిశారు. ఎప్‌స్టీన్ ఈ మెయిల్‌లోని లింక్‌లను కలిపి చూస్తే మోదీ జూన్ 2017లో అమెరికా వెళ్లి అక్కడ ఎప్‌స్టీన్ నుంచి సలహా తీసుకున్నారని స్పష్టమవుతోంది"

"ఒక వారం తర్వాత (జూలై 4-6, 2017), మోదీ ఇజ్రాయెల్‌ వెళ్లారు. తనకిచ్చిన సూచన మేరకు అక్కడ పాటలు పాడి, నృత్యం చేశారు. ఆ పని పూర్తయింది. ప్రధాన మంత్రి మోదీకి జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో దీర్ఘకాలిక సంబంధం ఉందని ఇప్పుడు స్పష్టమైంది. ఇది దేశానికి సిగ్గుచేటు. ఇది జాతీయ గౌరవం, అంతర్జాతీయ ప్రతిష్ఠకు సంబంధించిన విషయం, దీనికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి'' అని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

"జెఫ్రీ ఎప్‌స్టీన్ నుంచి ప్రధాని మోదీ ఎలాంటి సలహా తీసుకున్నారు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఏ ప్రయోజనం కలిగించేందుకు మోదీ ఇజ్రాయెల్‌లో డ్యాన్స్ చేసి పాట పాడారు? - 'ఇది పనిచేసింది'...అని ఎప్‌స్టీన్ రాశారు. దాని అర్థం ఏంటి?" అనే మూడు ప్రశ్నలను కాంగ్రెస్ వేసింది.

"నరేంద్ర మోదీజీ, దేశం సమాధానాలు కోరుతోంది. సీరియల్ రేపిస్ట్ ఎప్‌స్టీన్‌తో మీకు సంబంధం ఏంటి?" అని కాంగ్రెస్ ప్రశ్నించింది.

లైంగిక నేరాలు, అమెరికా, ట్రంప్, మస్క్

ఫొటో సోర్స్, US Department of Justice

ఫొటో క్యాప్షన్, జెఫ్రీ ఎప్‌స్టీన్ 2019లో చనిపోయాడు.

లక్షల సంఖ్యలో కొత్త ఫైళ్లు విడుదల

లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన కొత్త ఫైళ్లను లక్షల సంఖ్యలో అమెరికా న్యాయ శాఖ విడుదల చేసింది. 30లక్షల పేజీలు, లక్షాఎనభైవేల ఫోటోలు, రెండు వేల వీడియోలు బహిరంగంగా పోస్ట్ అయ్యాయి.

ఎప్‌స్టీన్ సంబంధిత అన్ని పత్రాలను ప్రజల ముందుంచాలని ఆదేశించే చట్టంపై డోనల్డ్‌ట్రంప్ సంతకం చేయాల్సిన గడువు దాటిన ఆరు వారాల తర్వాత పెద్ద సంఖ్యలో ఫైళ్లు విడుదలయ్యాయి.

ఈ ఫైళ్లలో జెఫ్రీ ఎప్‌స్టీన్ జైలులో గడిపిన సమయం, మానసిక స్థితిపై నివేదిక, జైలులో ఆయన మరణం గురించి వివరాలు ఉన్నాయి.

ఎప్‌స్టీన్ ఉన్నత స్థాయి వ్యక్తుల మధ్య జరిగిన ఈమెయిల్స్ కూడా వీటిలో ఉన్నాయి.

చాలా ఈమెయిల్స్, పత్రాలు దశాబ్ద కాలం నాటివి. చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న ఎప్‌స్టీన్‌కు, ఉన్నతస్థాయి వ్యక్తులకు ఉన్న సంబంధాన్ని ఇవి వెల్లడిస్తున్నాయి.

కొత్తగా విడుదలైన ఫైళ్లలో అమెరికా అధ్యక్షుడి ప్రస్తావన వందల సార్లు ఉంది. ట్రంప్, ఎప్‌స్టీన్ మధ్య స్నేహం ఉంది. కానీ ఏళ్ల క్రితమే తమ స్నేహబంధం ముగిసిపోయిందని, ఎప్‌స్టీన్ లైంగిక నేరాల గురించి తనకేమీ తెలియదని ట్రంప్ చెబుతున్నారు.

ఎప్‌స్టీన్ డాక్యుమెంట్ల విడుదల కథ ఇక్కడితో ముగుస్తుందో లేదో స్పష్టంగా తెలియదు.

"ఇది చాలా విస్తృతమైన డాక్యుమెంట్ గుర్తింపు, సమీక్ష ప్రక్రియ ముగింపు. అమెరికా న్యాయశాఖ విషయానికొస్తే వారి పని ముగిసిందని తెలుపుతోంది" అని డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్ అన్నారు.

అయితే ఎలాంటి కారణం లేకుండా ఆ శాఖ దాదాపు 25లక్షల డాక్యుమెంట్లను నిలిపివేసిందని డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)