You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కారుణ్య మరణం: సుప్రీంకోర్టు అనుమతితో లైఫ్ సపోర్టు తొలగించిన వైద్యులు, తుదిశ్వాస విడిచిన హరీశ్ రాణా
- రచయిత, శర్లీన్ మోలన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 5 నిమిషాలు
సుప్రీంకోర్టు అనుమతి తర్వాత లైఫ్ సపోర్ట్ తొలగించడంతో 31 ఏళ్ల హరీశ్ రాణా మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు. భారత్‌లో కారుణ్య మరణాన్ని పొందిన మొదటి కేసుగా హరిశ్ రాణా మరణం నిలిచింది.
2013లో నాలుగో అంతస్తు నుంచి పడిపోవడంతో తీవ్రమైన మెదడు గాయాలకు గురై కోమాలోకి వెళ్లారు రాణా. అప్పటి నుంచి ఆయన స్పృహలోకి రాలేదు. ఆయన కుటుంబం ఎన్నో సంవత్సరాలు చికిత్స చేయించినప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదు.
రాణా ముందుగా "లివింగ్ విల్" (ఒక వ్యక్తి తనకు తీవ్రమైన అనారోగ్యం వచ్చినప్పుడు ఎలాంటి చికిత్స కావాలో ముందే నిర్ణయించే పత్రం) రాయలేదు. దీంతో ఆయన తరఫున నిర్ణయం తీసుకునే హక్కు కుటుంబానికే వచ్చింది.
2018లో సుప్రీంకోర్టు పాసివ్ యూథనేషియాను (లైఫ్ సపోర్ట్ నిలిపివేయడం) చట్టబద్ధం చేసింది. కానీ యాక్టివ్ యూథనేషియా (మరణించడానికి ఇంజెక్షన్ల వంటివి నేరుగా ఇవ్వడం) మాత్రం భారత్‌లో చట్టవిరుద్ధమే.
రాణా తల్లిదండ్రులు తమ కుమారుడి చికిత్స కోసం ఆర్థికంగా పూర్తిగా క్షీణించిపోయామని, తాము లేకపోతే ఆయన పరిస్థితి ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నామంటూ 2024 కోర్టును ఆశ్రయించారు. మొదట దిల్లీ హైకోర్టు, తరువాత సుప్రీంకోర్టు వారి అభ్యర్థనను తిరస్కరించాయి.
అయితే 2025లో మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు, తమ కుమారుడి పరిస్థితి మరింత విషమించిందని వారు కోర్టుకు తెలిపారు. రాణా కోలుకునే అవకాశం చాలా తక్కువగా ఉందని రెండు వైద్య బృందాలు కూడా నిర్ధరించాయి.
దీంతో వైద్యుల నిర్ణయాన్ని అనుసరించేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. అనంతరం లైఫ్ సపోర్ట్‌ను తొలగించారు. ఆయనను ఎయిమ్స్‌లో ప్యాలియేటివ్ కేర్‌కు మార్చగా, అక్కడ ఆయన తుదిశ్వాస విడిచారు.
భారతదేశంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న రోగుల, వారి బంధువులకు ఈ కేసు భవిష్యత్తులో మార్గదర్శకంగా నిలుస్తుందని రాణా తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
అసలేంటి ఈ కేసు?
63 ఏళ్ల అశోక్ రాణా, 60 ఏళ్ల నిర్మలల కుమారుడే హరీశ్ రాణా. ఆయన 11 ఏళ్లుగా మంచంపైనే కదల్లేని పరిస్థితుల్లో ఉన్నారు.
హరీశ్ కనీసం మాట్లాడలేరు. దేనికీ స్పందించలేరు. వైద్య పరిభాషలో దీన్ని ‘వెజిటేటివ్ స్టేట్’ అంటారు. ఈ సమస్యతో బాధపడేవారికి నిరంతరం వైద్య సంరక్షణ అవసరం.
ఏదో ఒక రోజు తన కొడుకు ఆరోగ్యం బాగవుతుందని నిర్మలా రాణా అనుకునేవారు. కానీ, రోజులు, నెలలు గడిచాయి. కానీ, ఆయనలో ఎలాంటి కదలిక లేదు. పదకొండు ఏళ్లు గడిచాయి. నిర్మలా కోరుకున్న రోజు మాత్రం రాలేదు. తన కొడుకు బాగవుతాడనే ఆశను నిర్మలా రాణా వదులుకున్నారు.
ఈ పరిస్థితిని చూసిన నిర్మలా రాణా, అశోక్ రాణాలు తమ కొడుకు కారుణ్య మరణానికి (యూథనేషియా) అనుమతి ఇవ్వాలంటూ దిల్లీ హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.
ఏడాది కాలంగా సాగిన లీగల్ ప్రొసీడింగ్స్ అనంతరం, జులై 2న కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఏ మిషన్ సాయంతోనూ హరీష్ రాణా బతకడం లేదని, ఎలాంటి సాయం లేకుండానే ఆయన సొంతంగా గాలి పీల్చుకుంటున్నారని, ఏ లైఫ్ సపోర్టు సిస్టమ్‌పై కూడా ఆధారపడటం లేదని కోర్టు పేర్కొంది.
‘‘ఈ మరణ అభ్యర్థన బాధ నుంచి విముక్తి కలిగించే ఉద్దేశమైనా, ఇలాంటి కేసులో మెడిసిన్ ఇచ్చి వారిని చంపేందుకు ఫిజిషియన్‌కు అనుమతి ఉండదు’’ అని తెలిపింది.
హరీశ్ రాణా 2013లో చండీగఢ్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చదివేవారు. ఆ ఏడాది ఆగస్టు 3న సాయంత్రం 7 గంటలకు చండీగఢ్ నుంచి తండ్రి అశోక్ రాణాకు ఫోన్ వచ్చింది. హరీశ్ కింద పడిపోయి, గాయాలపాలయ్యారని చెప్పారు.
హరీశ్ తాను ఉంటున్న పేయింగ్ గెస్ట్ భవనంలోని నాలుగో అంతస్తు నుంచి పడిపోవడంతో ఆయనకు గాయాలయ్యాయి.
తొలుత హరీశ్‌కు చండీగఢ్‌లోని ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత దిల్లీలోని ఎయిమ్స్‌కు, వివిధ ప్రైవేట్ ఆస్పత్రులకు తిప్పారు. కానీ, హరీశ్ పరిస్థితిలో ఏం మార్పు కనిపించలేదు.
హరీశ్ రాణా సమస్య ఏంటి?
‘‘హరీశ్ బ్రెయిన్ నరాలు పూర్తిగా దెబ్బతిన్నాయని డాక్టర్ మాకు చెప్పారు. చాలా ఆస్పత్రులకు తిప్పాం. కానీ, మా కొడుకు కోలుకోలేదు. వార్తాపత్రికల్లో అద్భుతాల గురించి ఎన్నో చదివాం. విన్నాం. కానీ, ఎలాంటి ప్రార్థనలుగానీ, మందులుగానీ మా కొడుకుకు పనిచేయలేదు’’ అని తండ్రి అశోక్ రాణా గతంలో బీబీసీతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
కొడుకు చికిత్స కోసం దిల్లీలోని ద్వారకాలో ఉన్న తమ ఇంటిని కూడా అమ్మేశారు. 1988 నుంచి వారు ఆ ఇంట్లోనే ఉండేవారు. ప్రస్తుతం వారు ఘాజియాబాద్‌లోని రెండు గదుల ఇంట్లో ఉంటున్నారు.
కొడుకు చికిత్స కోసం అయ్యే ఖర్చులను భరించడం ఆ కుటుంబానికి కష్టంగా మారింది. తాజ్ కేటరింగ్‌లో అశోక్ రాణా పనిచేసే వారు. పదవీ విరమణ తర్వాత, ప్రతి నెలా ఆయనకు రూ.3,600 పెన్షన్ వస్తోంది.
కొడుకు చికిత్సకు, ఇంట్లో ఖర్చుల కోసం శని, ఆదివారాల్లో ఘాజియాబాద్‌లోని క్రికెట్ గ్రౌండ్‌లో బర్గర్లను, శాండ్‌విచ్‌లను ఆయన అమ్ముతున్నారు.
‘‘మా కొడుకును చూసుకునేందుకు రెండు నెలల పాటు నర్సును పెట్టాం. కానీ, నెలకు రూ.22 వేలు తీసుకునేవారు. ఆమెకు అంత డబ్బు చెల్లించలేకపోయాం’’ అని ఆయన అప్పట్లో తెలిపారు.
‘‘కొడుకు మరణం కోసం ఎవరు అడుగుతారు చెప్పండి? నేను దీని గురించి ఆలోచించినప్పుడు, రాత్రి నిద్రపట్టేది కాదు. కానీ, నేనిప్పుడు ఏం చేయాలి? ఎంత కాలం నేను ఇలా చేయగలను’’ అన్నారు.
నిర్మల తన కొడుకును కంటికి రెప్పలా చూసుకునేవారు. రోజులో సగం కొడుకు బట్టలు ఉతకడానికి, బెడ్డు మార్చడానికి, శుభ్రం చేసేందుకే సరిపోతుందని ఆమె చెప్పారు.
అంతేకాక ఎన్నో ఏళ్లుగా మంచంపైనే నిర్జీవ స్థితిలో ఉండటంతో హరీశ్ వీపు మీద పుండ్లు ఏర్పడ్డాయి. వాటికి ఎప్పటికప్పుడు డ్రెస్సింగ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఆమే చేస్తూ వచ్చారు.
‘‘మాకు జరిగింది మరెవరికీ జరగకుండా దేవుడు చూసుకోవాలి. నేను అలసిపోయాను. నాకేమైనా అయితే, హరీశ్‌ను ఎవరు చూసుకుంటారు? వాడి అవయవాలు దానం చేయాలనుకున్నాడు. ఉపయోగపడని అవయవాలను వేరే వాళ్లకు ఇస్తే, కనీసం వారిల్లో అయినా మా కొడుకును చూసుకుంటాం. ఆయనకు మోక్షం కావాలి’’ అని గతంలో బీబీసీతో అన్నారు నిర్మలా.
హరీశ్‌కు పైప్ ద్వారానే ఆహారం అందిస్తూ వచ్చారు. ఎండోస్కోపీ ద్వారా కడుపులోకి ఈ పైప్‌ను పంపుతారు. దీని ధర రూ.15 వేల దాకా ఉంటుంది. హరీశ్ వైద్య ఖర్చులు నెలకు రూ.25 నుంచి రూ.30 వేలు అయ్యేవని తల్లిదండ్రులు అప్పట్లో చెప్పారు.
కారుణ్య మరణం అంటే ఏంటి?
కారుణ్య మరణాలపై ఒక ఎన్‌జీఓ వేసిన పిటిషన్‌పై వాదనలు విన్న తర్వాత 2018లో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది. గౌరవంతో చనిపోవడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని, పాసివ్ యూథనేషియా(కారుణ్య మరణం) దేశంలో చట్టబద్ధమైనదిగా చేస్తున్నట్టు తెలిపింది.
పాసివ్ యూథనేషియా అనుమతికి కారణాలు ఇలా ఉండాలి.
- ఎన్నో ఏళ్లుగా రోగి మంచం పాలై, కోమాలో ఉండటం.
- కోలుకునేందుకు ఎలాంటి అవకాశం లేకపోవడం.
- కేవలం లైఫ్ సపోర్టు సిస్టమ్‌పైనే బతకడం.
ఈ కారణాలు నిరూపించగలిగితే లైఫ్ సపోర్టు సిస్టమ్‌ను తొలగించి ‘గౌరవప్రదమైన మరణం’కు అనుమతించవచ్చు.
అయితే, రోగి తల్లిదండ్రుల, భాగస్వామి లేదా ఇతర సమీప బంధువుల అనుమతితోనే ఇలా చేయాల్సి ఉంటుంది. అంతేకాక, హైకోర్టు అనుమతి అవసరం. తల్లిదండ్రులు లేదా భాగస్వామి లేదా సమీప బంధువులు లేకపోతే, రోగి స్నేహితుల సమ్మతి అయినా దీనికి తీసుకోవాలి.
కానీ, యాక్టివ్ యూథనేషియా విధానంలో రోగిని చంపేసేందుకు తల్లిదండ్రులే మెడికేషన్ ఇస్తారు. ఇది దేశంలో చట్టవిరుద్ధం.
స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, బెల్జియం, నెదర్లాండ్స్, స్పెయిన్, కెనడా, కొలంబియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, అమెరికాలోని 11 రాష్ట్రాల్లో యూథనేషియాకు అమనుతి ఉంది.
చాలా దేశాలలో ఇది చట్టవిరుద్ధం. బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో యూథనేషియా చట్టవిరుద్ధం.
ముంబయిలోని కింగ్ ఎడ్వర్డ్స్ మెమోరియల్ హాస్పిటల్‌లోని నర్సు అరుణా షాన్‌బాగ్ కేసు సమయంలో సుప్రీంకోర్టు మెడికల్ ప్యానల్‌ను ఏర్పాటు చేసినప్పుడు 2011లో కారుణ్య మరణం వ్యవహారం చర్చల్లోకి వచ్చింది.
( బీబీసీ ప్రతినిధి కీర్తీ దూబే అదనపు ఇన్‌పుట్స్‌తో )
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)