పాకిస్తాన్ మధ్యవర్తిత్వం అమెరికా, ఇరాన్‌ల యుద్ధాన్ని ఆపగలదా?

    • రచయిత, రుహాన్ అహ్మద్
    • హోదా, బీబీసీ ఉర్దూ ప్రతినిధి
  • చదివే సమయం: 5 నిమిషాలు

ఇరాన్, అమెరికా మధ్య యుద్ధాన్ని ముగించేందుకు చర్చలకు ఆతిథ్యం ఇస్తామని పాకిస్తాన్ అధికారికంగా ప్రతిపాదించింది. ఈ చర్చలు ఇస్లామాబాద్‌లో జరిగే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.

అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయని డోనల్డ్ ట్రంప్ 'ట్రూత్ సోషల్' వేదికగా చెప్పడంతో ఈ వార్తలకు బీజం పడింది. ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులు చేసే నిర్ణయాన్ని 'వాయిదా వేసినట్లు' కూడా ట్రంప్ ప్రకటించారు.

ఈ చర్చల ప్రస్తావనను ఇరాన్ ఖండించినప్పటికీ, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతోనే ఈ ప్రక్రియ సాగుతోందనే వార్తలు వెలువడ్డాయి.

పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ మంగళవారం సాయంత్రం 'ఎక్స్' పోస్టులో.. "మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని ముగించి, శాంతి స్థాపన కోసం జరుగుతున్న చర్చల ప్రయత్నాలకు పాకిస్తాన్ పూర్తి మద్దతు ఇస్తుంది. అమెరికా, ఇరాన్ అంగీకరిస్తే, ఈ వివాద పరిష్కారానికి అర్థవంతమైన, తుది చర్చలు జరిపించడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉంది" అని రాశారు.

షరీఫ్ ప్రకటనను డోనల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో షేర్ చేశారు. దీనిని బట్టి పాకిస్తాన్ మధ్యవర్తిత్వానికి అమెరికా కూడా సిద్ధంగా ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

అమెరికా-ఇరాన్ మధ్య చర్చలకు అవకాశం ఉందని ఇరాన్ దౌత్యవేత్త ఒకరు బీబీసీ న్యూస్ ఉర్దూతో చెప్పారు. "ఒకవేళ చర్చలపై తుది నిర్ణయం తీసుకుంటే, ఇస్లామాబాద్ కూడా వేదిక కావచ్చు" అన్నారు.

పాకిస్తాన్ చేసిన ఈ అధికారిక ప్రతిపాదన తర్వాత పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికా, ఇరాన్‌లు పాకిస్తాన్‌ను మధ్యవర్తిగా అంగీకరిస్తాయా? ఈ ప్రయత్నాల ఫలితంగా ఒప్పందం కుదిరితే, పాకిస్తాన్ హామీ ఇస్తుందా?

అన్నింటికంటే ముఖ్యంగా, ఈ ప్రయత్నాల వల్ల పాకిస్తాన్‌కు కలిగే ప్రయోజనం ఏమిటి? అనేది ఆసక్తికరంగా మారింది.

పాకిస్తాన్ సంప్రదింపులు

గత 48 గంటల్లో పాకిస్తాన్‌ నాయకులు ఇరాన్, అమెరికా అధ్యక్షులతో ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, పాకిస్తాన్‌ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ మధ్య చర్చలు జరిగినట్లు వైట్ హౌస్ 'బీబీసీ న్యూస్ ఉర్దూ'తో ధృవీకరించింది. అయితే, ఈ చర్చలకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు.

మరోవైపు, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో పాకిస్తాన్‌ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఫోన్లో మాట్లాడారు. ఉద్రిక్తతలను "చర్చలు, దౌత్యం ద్వారా" తగ్గించాల్సిన అవసరం ఉందని సూచించారు. అమెరికా, ఇరాన్ రెండింటితోనూ పాకిస్తాన్‌కు ఉన్న సాన్నిహిత్యం దానిని ఒక 'బలమైన మధ్యవర్తి'గా నిలుపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

"పాకిస్తాన్ నాయకత్వానికి అమెరికా, ఇరాన్ దేశాలతో వ్యక్తిగత సంబంధాలున్నాయి. పాకిస్తాన్ నిష్పాక్షికత, శాంతి కోసం చేసే ప్రయత్నాలు, ఇరు దేశాలకు దానిపై ఉన్న నమ్మకం మధ్యవర్తి పాత్ర పోషించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి" అని పాకిస్తాన్‌లోని ఖాయిదే-అజం యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మొహమ్మద్ షోయబ్ బీబీసీ ఉర్దూతో అన్నారు.

ఇరాన్‌లో పాకిస్తాన్ మాజీ రాయబారిగా పనిచేసిన ఆసిఫ్ దుర్రానీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇరాన్, అమెరికా రెండు దేశాలూ పాకిస్తాన్‌ను నమ్ముతాయని ఆయన భావిస్తున్నారు.

"ఈ ప్రాంతంలో ఇరాన్‌తో మెరుగైన సంబంధాలున్న దేశం మరొకటి ఏముంది? ఇరాన్‌కు గల్ఫ్ దేశాలతో ఉద్రిక్తతలు ఉన్నాయి. తుర్కియేతోనూ సంబంధాలు అంత బాగాలేవు. ఇటువంటి స్థితిలో పాకిస్తాన్ మాత్రమే ఉత్తమ మధ్యవర్తిగా నిలవగలదు" అన్నారు ఆసిఫ్ దుర్రానీ.

అమెరికా కూడా ఈ చర్చల విషయంలో పాకిస్తాన్‌నే నమ్ముతోందని ఆయన అన్నారు.

అలాగే, 'ఈ చర్చల్లో భారత్ నిష్పాక్షిక మధ్యవర్తిగా ఉండలేదు. ఎందుకంటే ఇరాన్‌పై దాడికి రెండు రోజుల ముందు నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌లో ఉన్నారు’’ అని ఆసిఫ్ దుర్రానీ అన్నారు.

పాకిస్తాన్ హామీదారుగా ఉంటుందా?

అమెరికాపై నమ్మకం లేనట్లు ఇరాన్ ప్రకటనలు చేస్తోంది. దీనికి కారణం గత ఏడాది జూన్, డిసెంబర్ నెలల్లో ఖతార్, ఒమన్‌ల మధ్యవర్తిత్వంలో ఇరాన్‌తో చర్చలు జరిగాయి. కానీ, రెండు సార్లు ఇరాన్‌పై దాడులు జరగడం వల్ల ఆ చర్చల ప్రక్రియ నిలిచిపోయింది.

ఇటువంటి పరిస్థితుల్లో, పాకిస్తాన్‌ ఈ చర్చలను ఏదైనా తుది నిర్ణయానికి చేర్చగలదా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

దీనిపై ప్రొఫెసర్ మొహమ్మద్ షోయబ్ మాట్లాడుతూ, "పాకిస్తాన్‌ ఏ ఒప్పందానికి హామీ ఇవ్వదు. కేవలం మధ్యవర్తిగా ఇరుపక్షాల మధ్య సంబంధాలను పెంచుతుంది. రెండు దేశాలు తమ వాగ్దానాలను పాటిస్తున్నాయో లేదో చూస్తుంది. అంటే, ఏవైనా నిబంధనల ఉల్లంఘన జరిగినప్పటికీ, మధ్యవర్తిగా తన పాత్రను పోషిస్తూనే ఉంటుంది" అని తెలిపారు.

మాజీ రాయబారి ఆసిఫ్ దుర్రానీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పాకిస్తాన్ దేనికీ హామీ ఇవ్వలేదని, కేవలం తన భూభాగంపై చర్చల ద్వారా ఇరాన్, అమెరికాల వివాద పరిష్కారానికి అవకాశం కల్పిస్తోందని అన్నారు.

"ప్రస్తుతానికి ఈ వ్యవహారాలు ప్రాథమిక దశలోనే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. చర్చల ప్రారంభంలోనే మధ్యవర్తిత్వం వహించే దేశం అధికార పరిధిని నిర్ణయిస్తారు" అని ఆసిఫ్ దుర్రానీ తెలిపారు.

పాకిస్తాన్‌ ఏం సాధిస్తుంది?

మధ్యవర్తిగా వ్యవహరించడం ద్వారా పాకిస్తాన్ ఏం సాధించాలనుకుంటోంది? అనే ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతోంది.

ఇరాన్ పొరుగు దేశం కావడంతో అక్కడ జరిగే యుద్ధ ప్రభావం పాకిస్తాన్ పైనా పడుతోందని, ఉద్రిక్తతలు తగ్గితే ఆ దేశానికి ఆర్థిక, రాజకీయ ఊరట లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

"ఉద్రిక్తతలు తగ్గడం వల్ల పాకిస్తాన్‌కు ఆర్థిక, రాజకీయ, సామాజిక ప్రయోజనాలు ఉంటాయి. స్థిరత్వం ఏర్పడితే వాణిజ్యంపై ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా ఇంధనం, చమురు మార్కెట్లలో ఉపశమనం లభిస్తుంది" అని ప్రొఫెసర్ మొహమ్మద్ షోయబ్ అన్నారు.

పాకిస్తాన్‌కు గల్ఫ్ దేశాలతో కూడా మంచి సంబంధాలున్నాయి. సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం కూడా చేసుకుంది. అయితే, ఈ యుద్ధంలో గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది.

ఉద్రిక్తతలు తగ్గిన పక్షంలో, "గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై కూడా ఒత్తిడి తగ్గుతుంది. దీనివల్ల పాకిస్తాన్‌కు అత్యధికంగా వచ్చే విదేశీ మారక ద్రవ్యానికి (రెమిటెన్స్) ఆటంకం ఉండదు" అని ప్రొఫెసర్ షోయబ్ అన్నారు.

అంతేకాకుండా, గల్ఫ్ ప్రాంతంలో స్థిరత్వం ఏర్పడితే పాకిస్తాన్‌ తన వాయువ్య ప్రాంతం, అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న అశాంతిపై దృష్టి సారించవచ్చని చెప్పారు.

అయితే, పాకిస్తాన్‌ ఎటువంటి లాభం ఆశించి అమెరికా-ఇరాన్ మధ్యవర్తిత్వానికి ముందుకు రాలేదని మాజీ రాయబారి ఆసిఫ్ దుర్రానీ అభిప్రాయపడ్డారు.

"ఇరాన్ మా పొరుగు దేశం. అక్కడి యుద్ధ ప్రభావం పాకిస్తాన్‌ పైనా పడుతోంది. చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడి ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయి" అని తెలిపారు.

ఈ ఘర్షణ ప్రారంభమైన తర్వాత ఇరాన్ 'హార్మూజ్ జలసంధిని' మూసివేసిన సంగతి తెలిసిందే. ఇక్కడి నుంచే ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చమురు సరఫరా జరుగుతోంది.

సమస్యలేంటి?

అమెరికా, ఇరాన్ సహా మధ్యప్రాచ్యంలోని కీలక దేశాలతో సంబంధాలున్న అతికొద్ది దేశాలలో పాకిస్తాన్ ఒకటని అమెరికా మాజీ దౌత్యవేత్త, స్టిమ్సన్ సెంటర్‌లో దక్షిణాసియా వ్యవహారాల డైరెక్టర్ ఎలిజబెత్ ట్రెల్‌కెల్డ్ అన్నారు.

"ట్రంప్ గత పాలనా కాలంలో కూడా ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరపడంలో పాకిస్తాన్ నిశ్శబ్ధంగా కీలక పాత్ర పోషించింది. దీనివల్ల పాకిస్తాన్ ఇరు పక్షాల నమ్మకాన్ని చూరగొంది" అన్నారు.

అయితే, అమెరికా, ఇరాన్ మధ్య ఏదైనా ఒప్పందం కుదిరితే, పాకిస్తాన్ దానికి హామీదారుగా ఉంటుందా? అనే ప్రశ్నకు ఎలిజబెత్ స్పందిస్తూ.. "ప్రస్తుతం ఒప్పందం గురించి మాట్లాడటం తొందరపాటే అవుతుంది. జరుగుతాయనుకుంటున్న చర్చల ఫలితాల గురించి మరిన్ని వివరాలు తెలిసే వరకు వేచి చూడాలి" అన్నారు.

అయినప్పటికీ, ఇరు పక్షాల మధ్య ఒక కేంద్ర బిందువుగా తన పాత్రను కొనసాగించడానికే పాకిస్తాన్ ప్రయత్నిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

మరి ఈ ప్రయత్నాల వల్ల పాకిస్తాన్‌కు ఏం లభిస్తుంది? అనే ప్రశ్నకు ఎలిజబెత్ సమాధానమిస్తూ, "ఒకవేళ ఒప్పందాన్ని కుదర్చడంలో పాకిస్తాన్ విజయవంతమైతే, అది ఆ దేశానికి దౌత్యపరంగా లభించే పెద్ద విజయం అవుతుంది. దీనివల్ల ఒకవైపు అమెరికాతో సంబంధాలు మరింత బలపడతాయి. మరోవైపు సౌదీ అరేబియాతో ఉన్న రక్షణ ఒప్పందం, పొరుగున ఉన్న ఇరాన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితి నుంచి బయటపడటానికి మార్గం సుగమం అవుతుంది. ఇవే కాకుండా, హార్మూజ్ జలసంధి ద్వారా ఎటువంటి అడ్డంకులు లేకుండా సరుకులు, ఇంధన సరఫరా జరిగితే పాకిస్తాన్‌కు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది" అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)