You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అనూహ్యంగా పెరిగిన వైర్డ్ హెడ్‌ఫోన్స్ సేల్స్.. అసలు బ్లూటూత్‌పై వ్యతిరేకతకు కారణమేంటి?
- రచయిత, థామస్ జర్మైన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 5 నిమిషాలు
ఫోన్లలో హెడ్‌ఫోన్ జాక్ తొలగింపుతో, వైర్లతో నడిచే హెడ్‌ఫోన్ల శకం ముగిసిందని అందరూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు మెరుగైన ధ్వని నాణ్యత కోసం వినియోగదారులు మళ్లీ ఆ పాత వైర్ల వైపే మొగ్గు చూపుతున్నారు.
2016లో యాపిల్ తన ఐఫోన్‌లలో హెడ్‌ఫోన్ జాక్‌లను తొలగించినప్పుడు నేను ఆ నిర్ణయాన్ని అంగీకరించలేకపోయాను. వినడం అనే నా అలవాట్లను ఒక పెద్ద కంపెనీ శాసించకూడదని భావించి, అప్పట్లో హెడ్‌ఫోన్ జాక్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్‌ను కొనుగోలు చేశాను.
కానీ, కాలక్రమేణా గూగుల్ కూడా తన ఫోన్‌ల నుంచి హెడ్‌ఫోన్ జాక్‌లను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అది నా ఓటమికి సంకేతంగా అనిపించింది.
చివరకు చేసేదేమీ లేక నేను మళ్లీ ఐఫోన్‌కే మారి, నా వైర్డ్ ఇయర్‌బడ్స్‌ను పక్కన పడేసి బ్లూటూత్ ప్రపంచంలో కలిసిపోయాను.
అయితే, నేను చాలా త్వరగా ఓటమిని ఒప్పుకున్నానని ఇప్పుడు అనిపిస్తోంది. ఇటీవల వైర్డ్ హెడ్‌ఫోన్‌లకు ఆదరణ విపరీతంగా పెరిగింది. ఇది కేవలం ఆడియో ప్రియులకు మాత్రమే పరిమితం కాలేదు. ఇదొక పూర్తి స్థాయి కల్చరల్ ట్రెండ్‌గా మారింది.
అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీపై వస్తున్న వ్యతిరేకత కూడా దీనికి ఒక కారణం కావచ్చు. కారణం ఏదైనా ఒకటి మాత్రం నిజం-వైర్డ్ హెడ్‌ఫోన్‌లు మళ్లీ వచ్చేశాయి.
"నేను వైర్డ్ హెడ్‌ఫోన్‌ల వైపు మారిపోయాను" అని అమెరికాలోని ఒరెగాన్‌కు చెందిన అరిన్ గ్రూసిన్ అనే సోషల్ వర్కర్ చెప్పారు.
కొద్దినెలల కిందట తన కాబోయే భర్త పాత వైర్డ్ ఇయర్‌బడ్స్‌ను తీసుకున్న ఆమె, ఆ తర్వాత మళ్లీ వెనక్కి చూడలేదు.
"ఇది నాకు చాలా ఓదార్పునిస్తుంది. నేను ఏదో ఒకటి వింటున్నానని ప్రపంచానికి తెలియజేయడం ఇష్టం" అని ఆమె అన్నారు.
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
అనలిటిక్స్ సంస్థ 'సర్కానా' ప్రకారం, గత ఐదేళ్ల పాటు క్షీణించిన వైర్డ్ హెడ్‌ఫోన్ అమ్మకాలు 2025 ద్వితీయార్థంలో అకస్మాత్తుగా పెరిగాయి.
2026 మొదటి ఆరు వారాల్లోనే వీటి ద్వారా వచ్చే ఆదాయం 20 శాతం పెరిగింది.
టెక్నాలజీ మరీ ఎక్కువగా అభివృద్ధి చెందడం వల్ల ప్రజలు దానిపై విరక్తి పెంచుకుంటున్నారని, అందుకే మళ్లీ పాత సౌకర్యవంతమైన పద్ధతులకే మళ్లుతున్నారని గ్రూసిన్ అభిప్రాయపడ్డారు.
నాణ్యతే ప్రధాన బలం
'వైర్డ్ హెడ్‌ఫోన్‌ల ప్రధాన బలం వాటి సౌండ్ క్వాలిటీ' అని హెడ్‌ఫోన్ రివ్యూ సైట్ సౌండ్‌గైస్ ఎడిటర్ క్రిస్ థామస్ అంటున్నారు.
వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లు అభివృద్ధి చెందినప్పటికీ, సాధారణ బడ్జెట్‌లో లభించే వైర్డ్ హెడ్‌ఫోన్‌లు ఇచ్చే నాణ్యతను బ్లూటూత్ హెడ్‌ఫోన్‌లు ఇవ్వలేవని ఆయన చెప్పారు.
పైగా బ్లూటూత్‌లో కనెక్షన్ సమస్యల వంటి చికాకులు ఉంటాయని, వైర్డ్ హెడ్‌ఫోన్‌లను మాత్రం నేరుగా ప్లగ్ చేసి వాడుకోవచ్చన్నారు థామస్.
వైర్డ్ హెడ్‌ఫోన్స్: కొత్త ఫ్యాషన్ స్టేట్‌మెంట్
సౌండ్ క్వాలిటీ మాత్రమే కాదు, ప్రస్తుతం బ్లూటూత్ వాడటం ఒక ఫ్యాషన్ డిజాస్టర్‌గా కొందరు భావిస్తున్నారు. బ్లూటూత్ కనెక్షన్లు సరిగ్గా పనిచేయవని, డేటింగ్ వంటి ముఖ్యమైన సమయాల్లో ఇవి మూడ్ పాడుచేస్తాయని ప్రముఖ నటి జో క్రావిట్జ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
మరోవైపు, ఇన్‌స్టాగ్రామ్‌లో 'వైర్డ్ ఇట్ గర్ల్స్' వంటి అకౌంట్లు వైర్డ్ హెడ్‌ఫోన్‌లను ఒక ఫ్యాషన్ యాక్సెసరీగా చిత్రీకరిస్తున్నాయి. అరియానా గ్రాండే, చార్లీ ఎక్స్‌సీఎక్స్ వంటి సెలబ్రిటీలు వైర్డ్ ఇయర్‌బడ్స్‌తో కనిపిస్తూ వీటిని ఒక సాంస్కృతిక చిహ్నంగా మార్చేశారు.
నటులు రాబర్ట్ ప్యాటిన్సన్, లిల్లీ-రోజ్ డెప్ వైర్డ్ ఇయర్‌బడ్స్ పెట్టుకున్న ఫోటోలతో ఒక సోషల్ మీడియా యూజర్ చేసిన ట్వీట్ వైరలైంది.
"ఇది ఇప్పుడు ఒక హోదా విషయంగా మారుతోంది. 24 గంటలూ వైర్‌లెస్ హెడ్‌ఫోన్లు వాడుతున్నారంటే, మీకు సొంతంగా ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని అర్థమవుతోంది" అని ఆ యూజర్ రాశారు.
వైర్‌లెస్ వినడంలో స్వేచ్ఛ ఉంటుంది. కానీ, బ్యాటరీలు సరిగ్గా అవసరమైన సమయంలో అయిపోవడం, ఇయర్‌బడ్స్ పోగొట్టుకోవడం వంటి ఇబ్బందులు ఉన్నాయి.
"వైర్‌లెస్ వాడటం చాలా సులభమని ప్రజలు అంటుంటారు. కానీ నాకు మాత్రం ఎప్పుడూ అలా అనిపించదు" అని లాస్ ఏంజిల్స్‌కు చెందిన డైలాగ్ ఎడిటర్ ఐలీన్ డోలోబాఫ్ చెప్పారు. బ్లూటూత్‌తో ఎప్పుడూ ఒక అదనపు స్టెప్ ఉంటుందని ఆమె అన్నారు.
పాత రోజుల వైపు అడుగులు
చిన్న పెద్దా తేడా లేకుండా అందరూ ఇప్పుడు పాత కాలపు వస్తువుల వైపు మొగ్గు చూపుతున్నారు. డీవీడీలు, క్యాసెట్లు, పాత కాలపు ట్యూబ్ టీవీలు, చివరికి టైప్‌రైటర్లను కూడా మళ్లీ వాడుతున్నారు.
ఈ మధ్య జరిగిన ఒక సంగీత కచేరీలో, ఒక వ్యక్తి ఆ ప్రోగ్రామ్‌ను తన ఫోన్‌తో కాకుండా, 1970ల నాటి 16 ఎంఎం ఫిల్మ్ కెమెరాతో రికార్డ్ చేయడం చూశాను.
"ఎందుకో తెలీదు కానీ, మనందరిలో ఒక్కసారిగా ఈ మార్పు వచ్చింది. బహుశా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరగడం వల్ల ప్రజల్లో ఒక రకమైన ఆందోళన మొదలైందని అనుకుంటున్నా" అని గ్రూసిన్ చెప్పారు.
"ఇందులో ఒక విచిత్రమైన విషయం ఉంది. ప్రస్తుత టెక్నాలజీతో నేను అసౌకర్యంగా ఫీల్ అవుతున్నాను. అందుకే మరో రకమైన టెక్నాలజీని వాడాలని అనుకుంటున్నాను. బహుశా, ప్లగ్-ఇన్ హెడ్‌ఫోన్‌లను వాడటం అంటే మనం పాతకాలపు 'అనలాగ్' ప్రపంచానికి వీలైనంత దగ్గరగా వెళ్లడమే కావచ్చు" అన్నారు.
డాంగిల్ సమస్య- యాపిల్ వ్యూహం
ఒకవేళ మీరు వైర్డ్ హెడ్‌ఫోన్‌ల వైపు మొగ్గు చూపితే, వాటిని ఫోన్‌కు ఎలా కనెక్ట్ చేయాలన్నదే ప్రధాన ప్రశ్న. అయితే, ఇప్పుడు నేరుగా యూఎస్‌బీ లేదా లైట్నింగ్ కేబుల్ కనెక్షన్‌తో వచ్చే వైర్డ్ హెడ్‌ఫోన్‌లు మార్కెట్లో దొరుకుతున్నాయి. లేదా 3.5 ఎంఎం జాక్ ఉన్న హెడ్‌ఫోన్‌లను చార్జింగ్ పోర్ట్ ద్వారా కనెక్ట్ చేయడానికి ఒక అడాప్టర్‌ను వాడాల్సి ఉంటుంది. దీనినే సాధారణంగా 'డాంగిల్' అని పిలుస్తారు. ఆ పేరు వినడానికే గౌరవప్రదంగా లేకపోవడంతో, దానిని వాడటానికి నేను ఏళ్ల తరబడి నిరాకరించాను.
2016లో ఐఫోన్ 7లో యాపిల్ సంస్థ హెడ్‌ఫోన్ జాక్‌ను తొలగించింది. వైర్డ్ హెడ్‌ఫోన్ల యుగం ఇక ముగిసిందని చాలామంది భావించడానికి ఇది కారణమైంది. కానీ, ఆశ్చర్యకరంగా, యాపిల్ కూడా ఇప్పటికీ వైర్డ్ హెడ్‌ఫోన్లను వదలలేదు.
ఫోన్లలో హెడ్‌ఫోన్ జాక్‌ను తొలగించిన వ్యక్తిగా పేరున్న ఆ కంపెనీ సీఈఓ టిమ్ కుక్, కొన్నేళ్ల కిందట మా బీబీసీ ఉద్యోగి జో క్లీన్‌మన్‌తో మాట్లాడుతూ.. "ఓ, మేం వాటిని ఇప్పటికీ అమ్ముతున్నాం. ప్రజలు కూడా ఇప్పటికీ వాటిని కొంటున్నారు" అని చెప్పారు.
నేను కూడా ఒక ఆపిల్ స్టోర్‌కు వెళ్లినప్పుడు, అక్కడ ఉద్యోగి గతంలో కంటే ఇప్పుడు వైర్డ్ ఇయర్‌బడ్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయని చెప్పారు.
కొన్ని రోజులు వైర్డ్ ఇయర్‌బడ్స్ వాడిన తర్వాత నాకు అవి చాలా నచ్చాయి. నా చెవుల్లో సౌకర్యవంతంగా ఉన్నాయి. నేను వింటున్న సంగీతానికి మరింత కనెక్ట్ అయినట్లు అనిపించింది. అయితే, నా వైర్డ్ ఇయర్‌బడ్స్ నా జేబులో నుంచి ఎక్కడో పడిపోయాయి. బ్లూటూత్ కేసు లాగా బరువుగా ఉండవు కాబట్టి అవి పోయినట్లు కూడా నాకు తెలియలేదు. అవి ఏదైనా మంచి చోటుకు చేరుకున్నాయని ఆశిస్తున్నాను.
ఇక నేను న్యూయార్క్‌లోని ఒక స్పెషాలిటీ ఆడియో స్టోర్‌కు వెళ్లి, దాదాపు 130 డాలర్ల ధర గల నాణ్యమైన వైర్డ్ ఇయర్‌బడ్స్‌ను కొన్నాను. వాటి సౌండ్ అద్భుతంగా ఉంది. బ్లూటూత్ ఇచ్చే సౌలభ్యం కంటే, వైర్ ద్వారా లభించే స్పష్టత, భద్రత ఇప్పుడు వినియోగదారులను ఎక్కువగా ఆకర్షిస్తోంది.
మొత్తంమీద, వైర్డ్ హెడ్‌ఫోన్‌లు కేవలం పాత జ్ఞాపకం మాత్రమే కాదు, అవి డిజిటల్ యుగంలో ఒక బలమైన పునరాగమనం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)