బంగ్లాదేశ్: 'ఈడ్చుకెళ్లి నిప్పంటించారు' - ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన దీపు చంద్ర దాస్ హత్య

ఫొటో సోర్స్, Anahita Sachdev/BBC
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 9 నిమిషాలు
హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని అంశాలు మిమ్మల్ని కలిచివేయచ్చు.
చనిపోయే ముందు రోజు ఉదయం దీపు చంద్ర దాస్ బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్ నగరంలోని తన రేకుల ఇంటి నుంచి తెల్లవారుజామున బయలుదేరారు. ఆ ఇల్లు ఢాకా నుంచి వెళ్లే హైవే పక్కన ఉన్న ఇరుకైన వీధుల మధ్య ఉంది.
దీపు వయసు 28 ఏళ్లు. ఆయన పనికి వెళ్లేముందు తండ్రిని నిద్రలేపారు. భార్యకు వీడ్కోలు చెప్పారు. తన 18 నెలల చిన్నారిని ఒడిలోకి తీసుకుని లాలించారు. తరువాత ఇంటి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బట్టల ఫ్యాక్టరీకి వెళ్లడానికి బస్సు ఎక్కారు. ఈ ఫ్యాక్టరీలో దీపు జూనియర్ క్వాలిటీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. హెచ్అండ్ ఎమ్, నెక్ట్స్ వంటి అంతర్జాతీయ దుస్తుల బ్రాండ్ల కోసం తయారయ్యే స్వెటర్ల నాణ్యతను ఆయన తనిఖీ చేసేవారు.
దీపును ఆయన కుటుంబం మళ్లీ చూడలేదు.
హిందువైన దీపుదాస్ 24 గంటల తరువాత డిసెంబర్ 18న చనిపోయారు.
దైవ నింద చేశారనే ఆరోపణలతో ఓ గుంపు ఆయనను కొట్టి చంపి, దహనం చేసింది.
ముహమ్మద్ ప్రవక్తను అవమానించాడనే ఆరోపణతో ,దీపు దాస్‌ను పనిచేస్తున్నఫ్యాక్టరీ నుంచి బయటకు లాక్కొచ్చారు. జనంతో నిండిన వీధుల గుండా ఆయనను కొట్టుకుంటూ ఒక కిలోమీటరుకు పైగా ఈడ్చుకెళ్లారు. రద్దీగా ఉన్న హైవేపై చెట్టుకు కట్టేసి, వందలాది మంది చూస్తుండగానే నిప్పంటించారు. ఈ హత్య ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది, ముఖ్యంగా పొరుగునే ఉన్న భారతదేశంలో.
2024లో విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన నిరసనలతో అప్పటి ప్రధాని షేక్ హసీనా గద్దె దిగినప్పటినుంచి మైనారిటీల భద్రతపై మళ్లీ భయాలు వ్యక్తమయ్యాయి. బంగ్లాదేశ్‌లోని 17.4 కోట్ల జనాభాలో సుమారు 9 శాతం మంది మతపరమైన అల్పసంఖ్యాకులు. వీరిలో ఎక్కువ మంది హిందువులు. ముస్లిం మెజారిటీతో వారి సంబంధాలు చాలా కాలంగా మధ్యమధ్యలో ఉద్రిక్తతలతో, అభద్రతా భావాలతో కొనసాగుతున్నాయి.


ఫొటో సోర్స్, Shahidul Alam/Drik/Majority World
యాభై రోజులు గడిచాక తొలుత ఉప్పొంగిన ఆగ్రహం తగ్గిపోయినా దాస్ వదిలి వెళ్లిన ఇంటిలో ఇంకా దుఃఖం అలుముకునే ఉంది. మట్టి నేలతో, రేకుల కప్పుతో ఉన్న చిన్న చీకటి గది అది. అందులోనే ఆ కుటుంబం దాదాపు 15 ఏళ్లుగా ఉంటోంది.
ఆ ఇంట్లో ఎక్కువ సామాన్లు లేవు. ఒక ప్లాస్టిక్ టేబుల్, కొన్ని కుర్చీలు, మంచాలు, బియ్యం సంచులు, ఒక టెడ్డి బేర్, దండానికి వేలాడుతున్న బట్టలు. వాయిదాలపై దీపు కొనుగోలు చేసిన ఫ్రిజ్, చిన్న టెలివిజన్ మాత్రం ఆయన నిర్మించాలనుకున్న భవిష్యత్తుకు నిశ్శబ్ద సాక్ష్యంగా కనిపిస్తున్నాయి.
పరామర్శించడానికి ఇంట్లోకి ఎవరైనా అడుగుపెట్టగానే దీపు తల్లి షెఫాలీ రాణి దాస్ కన్నీటితో కుప్పకూలిపోతారు.
"ఓ దీపూ, నా దీపూ ఎక్కడ?" అంటూ విలపిస్తారు.
దీపు తండ్రి రబీ దాస్ 54 ఏళ్ల కూలీ. సమీప మార్కెట్‌లో బియ్యం, గోధుమలు, కూరగాయల సంచులు మోస్తూ రోజుకు 400 నుంచి 500 టాకాలు (సుమారు225 నుంచి 320 రూపాయలు) సంపాదిస్తూ జీవితమంతా కష్టపడుతున్నారు రబీ దాస్.
ఏళ్ల తరబడి కష్టపడి పనిచేయడం వల్ల ఆయన శరీరం అలసిపోయింది, బలహీనమైంది. తండ్రి విశ్రాంతి తీసుకోవాలని దీపు కోరుకునేవారు.
‘‘ఇప్పుడు నేను పని చేస్తున్నాను,మీరు విశ్రాంతి తీసుకోండి’’ అని దీపు తన తండ్రికి చెప్పేవారు.
దీపు తన జీతాన్ని పూర్తిగా ఇంట్లోనే ఇచ్చేవారు. తమ కుటుంబాన్ని మట్టి నేల, రేకుల పైకప్పు జీవితం నుంచి బయటకు తీసుకురావాలని, ఒక ఇల్లు కట్టాలని ఎప్పుడూ మాట్లాడుతుండేవారు.
ఇంట్లోనే పుట్టి, కష్టాలు నిండిన హిందూ-ముస్లిం కుటుంబాలు కలిసి నివసించే ప్రాంతంలో పెరిగిన దీపు గురించి తెలిసినవారు ఆయన మితభాషి అని చెప్పారు. ఆయనకు స్నేహితులు కూడా చాలా తక్కువ. కరోనా లాక్‌డౌన్‌ల వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో దీపు కాలేజీ చదువును మధ్యలోనే ఆపేశారు.
2024 నాటికి స్వెటర్ తయారీ ఫ్యాక్టరీలో పనికికుదిరి, సంపాదనను ఇంటికి పంపించేవారు. హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు తన చిన్న కూతురికి చాక్లెట్లు తీసుకొచ్చి, సాయంత్రాలు టీవీలో కార్టూన్లు చూస్తూ గడిపేవారు.
ముగ్గురు కుమారుల్లో పెద్దవాడైన దీపు ఆశయం ఏమిటంటే, తన తమ్ముళ్లు ఆపు (22), రిథిక్ (16) జీవితంలో స్థిరపడేలా చూడటమేనని ఆయన తల్లి చెప్పారు.

ఫొటో సోర్స్, Anahita Sachdev/BBC
బంగ్లాదేశ్‌లోని వస్త్ర ఎగుమతి పరిశ్రమలో దీపు ఒక చిన్న ఉద్యోగి మాత్రమే. గత 14 నెలలుగా ఆయన పయోనీర్ నిట్‌వేర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఈ గ్రూపులో మొత్తం 47వేలమంది కార్మికులు ఉండగా, దీపు పనిచేస్తున్న యూనిట్‌లో దాదాపు 8,500 మంది కార్మికులు పనిచేస్తున్నారు.
ఈ ఫ్యాక్టరీ స్వెటర్లు అమెరికా, యూరప్ దుకాణాల్లో అమ్ముడవుతాయి. నెలకు 13,500 టాకాలు (సుమారు 10వేల రూపాయలు) సంపాదించే దీపు అక్కడి వస్త్రాలను తనిఖీ చేసేవారు. ఫ్యాక్టరీలో పనిచేసే 868మంది హిందూ కార్మికులలో ఒకరు.
దీపుది ఓ సాధారణ జీవితం. తన కుటుంబాన్ని పేదరికం నుంచి బయట పడేయాలని ప్రయత్నిస్తున్న ఓ యువకుడు.
ఈ క్రమంలో డిసెంబర్‌లో ఓ సాయంత్రాన ఆ విషాదకరమైన రోజు వచ్చింది. ఆఫీస్‌లోనూ, బయటా ముహమ్మద్ ప్రవక్తను అవమానించేలా బెంగాలీలో "కతుక్తి" (బెంగాలీ లో ఒక అపమానకర వ్యాఖ్య) మాట్లాడారని పుకారు వ్యాపించింది.
ఈ ఆరోపణకు, ఆయన మరణానికి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆ సాయంత్రం, ముగ్గురు మహిళా సహోద్యోగుల మధ్య వీకెండ్ ప్లాన్ గురించి సంభాషణ జరుగుతుండగా దీపు కూడా వారితో కలిశారు. తరువాత ప్రవక్తను అవమానించేలా మాట్లాడినట్టు ముగ్గురు సాక్షుల నుంచి వచ్చిన కథనాలను ఉటంకిస్తూ మైమెన్‌సింగ్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ మహమ్మద్ అబ్దుల్లా మామున్ తెలిపారు.

ఫొటో సోర్స్, ANAHITA SACHDEV/BBC
ఈ సంభాషణ తర్వాత దాదాపు 30 నిమిషాలకి దీపు బయటకు వస్తున్నట్లు ఫ్యాక్టరీ సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. తరువాత ఆయన మళ్లీ ఫ్లోర్‌కు వెళ్ళారు. రెండు గంటల తర్వాత తీసిన ఫుటేజ్‌లో దీపు ఆ ప్రాంతంలో తిరుగుతున్నట్లు కనిపిస్తుందని ఫ్యాక్టరీ సీనియర్ మేనేజర్ ఉదయ్ హుస్సైన్ చెప్పారు.
చెక్ అవుట్ తర్వాత దీపు ఎందుకు తిరిగి వెళ్ళారన్నది తెలియలేదు.
ఒక ఫ్యాక్టరీ కార్మికుడు దైవదూషణకు పాల్పడ్డాడనే వార్త వ్యాపించడంతో బయట ఒక గుంపు గుమిగూడింది. (బంగ్లాదేశ్‌లో అధికారిక దైవదూషణ చట్టం లేదు, కానీ అది "మతపరమైన భావాలను రెచ్చగొట్టడానికి ఉద్దేశించిన" చర్యలను నేరంగా పరిగణిస్తుంది.)
సాయంత్రంపూట పనిపూర్తిచేసుకుని కార్మికులు బయటకు వచ్చే సమయం కావడంతో, రద్దీగా ఉండే పరిసరాల్లో ఈ పుకారు వేగంగా వ్యాపించింది. సాయంత్రం 6 గంటలకు ఫ్యాక్టరీ లోపల, వీధిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
"తర్వాత జరిగింది చట్టం పరిధిదాటి జరిగిపోయింది" అని అల్-మామున్ అన్నారు.
దీపును అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీ గేట్ల వద్ద వెయ్యిమందికిపైగా గుమికూడారు. సమీప ప్రాంతాల నుంచి కూడా జనం అక్కడికి చేరుకున్నారు. సీసీటీవీ దృశ్యాలలో కొంతమంది బలవంతంగా గేట్లను తెరవడానికి ప్రయత్నిస్తూ, వాటి మీదుగా ఎక్కేందుకు తాళ్లను విసురుతున్నట్టు కనిపించింది.
"స్థానిక సమయం ప్రకారం రాత్రి 8గంటల 42 నిమిషాలకు జనం గునపాలతో సైడ్ గేటును తెరిచి, ఫ్యాక్టరీలోకి ప్రవేశించారు. ఓ పెద్ద పెద్ద అలలాగా వచ్చి దీపుని తీసుకెళ్లారు" అని హుస్సేన్ చెప్పారు.
ఫ్యాక్టరీ అధికారులు కనీసం 45 నిమిషాల ముందే పోలీసులకు సమాచారం అందించారని హుస్సేన్ అన్నారు. అయినప్పటికీ పారిశ్రామిక పోలీసులు, సాధారణ దుస్తులలో ఉన్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, వారు దీపును ఆ గుంపు నుంచి విడిపించలేకపోయారని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Shahidul Alam/Drik/Majority World
దీపు ఆ గుంపు చేతుల్లో ఎలా చిక్కుకున్నాడన్న అంశంపై పోలీసుల వాదన భిన్నంగా ఉంది.
దీపుని అప్పగించకపోతే గేట్లు పగలగొట్టి లోపలికి చొరబడతామని బెదిరించారని ఆ పరిస్థితిలో ఫ్యాక్టరీ సిబ్బంది గేటు తెరిచి దీపుని బయటకు పంపించారని అదనపు పోలీస్ సూపరింటెండెంట్ అల్-మమూన్ తెలిపారు.
ఫ్యాక్టరీ బయటే దీపును కొట్టి చంపారని, ఆ తర్వాత ఆయన మృతదేహాన్ని సమీపంలోని హైవేపైకి ఈడ్చుకెళ్లి, చెట్టుకుకట్టేసి నిప్పంటించారని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
"నేను అక్కడికి చేరుకునే సమయానికే, అతను చనిపోయాడు" అని అల్-మామున్ అన్నారు.
ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించి 22 మందిని అరెస్టు చేశారు. వీరిలో సగం మంది దీపు సహచరులే. ఇందులో అతను పనిచేసిన విభాగానికి చెందిన ఇద్దరు మేనేజర్లు కూడా ఉన్నారు. సమీప మసీదు ఇమామ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనుమానితులలో ఎక్కువ మంది 22 , 30 సంవత్సరాల మధ్యవారే. ఈ దాడిలో దాదాపు 150 మంది ప్రత్యక్షంగా పాల్గొన్నారని పోలీసులు అంచనా వేస్తున్నారు, మిగిలినవారికోసం పోలీసులు వెతుకుతున్నారు.
అరెస్టయిన వారిలో కొద్దిమంది మాత్రమే "మత భక్తి’ ఉన్నవారుగా కనిపించారని అల్-మామున్ అన్నారు.
"కొందరు విద్యార్థులు, ఇంకొందరు బాటసారులు, మరికొందరు స్థానికులు. అందరూ దీపును కొడుతున్నారు, కాబట్టి వారు కూడా కొట్టారు. మేం దీనిని ద్వేషపూరిత నేరంగా పరిగణిస్తున్నాం" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, ANAHITA SACHDEV/BBC
2024 విద్యార్థి తిరుగుబాటు తర్వాత, బంగ్లాదేశ్‌లో ముఖ్యంగా హిందువుల వంటి మైనారిటీలపై దాడుల పరిమాణం, స్వభావంపై తీవ్ర వాదోపవాదాలు కొనసాగుతున్నాయి.
పోలీసు రికార్డుల్లో 2025 జనవరి, డిసెంబర్ మధ్య మైనారిటీలకు సంబంధించిన 645 సంఘటనలను నమోదయ్యాయని బాధ్యతల నుంచి తప్పుకోనున్న తాత్కాలిక ప్రభుత్వం చెబుతోంది. అయితే వీటిలో దాదాపు 90 శాతం మతపరమైనవిగా కావని ప్రభుత్వం అంటోంది.
ఎక్కువ కేసులు సాధారణ నేరాలే అని, భూ వివాదాలు, దొంగతనం, దోపిడీ లేదా వ్యక్తిగత గొడవలకు సంబంధించినవి ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వీటిని తరువాత మతపరమైన హింసగా చిత్రీకరించారని అన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం, కేవలం 71 ఘటనలకే స్పష్టమైన మతపరమైన కోణం ఉంది. వాటిలో 38 దేవాలయాల ధ్వంసం, 8 దేవాలయాలపై దాడులు, ఒక హత్య ఉన్నాయి.
అయితే మానవహక్కుల సంస్థలు మరింత ఆందోళనకరమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి.
ఐన్ ఓ సలీష్ కేంద్రం (ఏఎస్‌కే) చెబుతున్నదానిని బట్టి 2025లో హిందువులపై 42 హింసాత్మక ఘటనలను నమోదు అయ్యాయి. వాటిలో పదులసంఖ్యలో ఇళ్లపై దాడులు, గృహదహనాలు ఉన్నాయి. ఈ ఘటనల్లో ఒకరు మరణించగా, 15 మంది గాయపడ్డారు. ఈ సంఖ్యలు ప్రభుత్వ లెక్కలతో కొంతవరకు సరిపోతున్నప్పటికీ, తక్కువగానే ఉన్నాయి.
ఇందులో భారీ వ్యత్యాసం బంగ్లాదేశ్ హిందూ బుద్దిస్ట్ క్రిస్టియన్ యూనిటి కౌన్సిల్ గణాంకాల్లో కనిపిస్తోంది. 2024 ఆగస్ట్ తర్వాత హింస నాటకీయంగా పెరిగిందని ఆ సంస్థ చెబుతోంది.
ప్రధానంగా మీడియా నివేదికలను ఆధారంగా చేసుకుని, 2024 ఆగస్ట్ నుంచి మైనారిటీలపై 2,711 దాడులను నమోదు చేసినట్లు ఆ సంస్థ చెబుతోంది. వీటిలో 92 హత్యలు, దేవాలయాలపై 133 దాడులు , 47 భూకబ్జా కేసులు ఉన్నాయి. ఇవి అధికారిక అంచనాల కంటే చాలా ఎక్కువ.
"బంగ్లాదేశ్‌లోని మైనారిటీలు అర్థశతాబ్దానికి పైగా మతపరమైన అతివాదుల దాడులను ఎదుర్కొంటున్నారు. అన్ని ప్రభుత్వాలకూ ఇందులో బాధ్యత ఉంది. చాలా మంది పారిపోవడం లేదా వలస వెళ్లడం వల్ల మా సంఖ్య క్రమంగా తగ్గుతోంది" అని యూనిటీ కౌన్సిల్‌కు చెందిన మణీంద్ర కుమార్ నాథ్ బీబీసీకి చెప్పారు.
మరోవైపు, తాత్కాలిక ప్రభుత్వ పదవీకాలంలో హత్యలు, దహనం , భూ కబ్జాలతో సహా మైనారిటీలపై 2,900 కంటే ఎక్కువ హింసాత్మక సంఘటనలను ఇండిపెండెంట్ సోర్సులు నమోదు చేశాయని భారత్ చెబుతోంది.

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images
నోబెల్ బహుమతి గ్రహీత, అధికారం నుంచి తప్పుకోనున్న తాత్కాలిక ప్రభుత్వ అధినేత ముహమ్మద్ యూనుస్ "హిందువులపై ఎలాంటి హింస లేదు" అని పేర్కొంటూ, అలాంటి నివేదికలను భారతీయ మీడియా సృష్టించిన "నకిలీ వార్తలు"గా కొట్టిపారేశారు. మరో సందర్భంలో, ఈ దాడులు "మతపరమైనవి కాదు, రాజకీయ కారణాలతో జరిగినవి" అని కూడా అన్నారు.
అయితే పరిస్థితి పూర్తిగా నిరాశాజనకంగా లేదని కొందరు భావిస్తున్నారు. దీపు హత్య ఢాకాలో నిరసనలకు దారితీసింది. యజమానులు ఆయనకు రావాల్సిన బకాయిలను చెల్లించి, తాను కలగన్న ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తాత్కాలిక ప్రభుత్వం కొత్త ఇంటి నిర్మాణానికి 35,000 డాలర్లు(సుమారు రూ. 30.5 లక్షలు), కుటుంబానికి అదనపు పరిహారం ఇస్తామని ప్రకటించింది.
"జరిగినది అనాగరికమైంది, దురదృష్టకరం, సిగ్గుచేటు. బాధ్యులకు కఠినమైన శిక్ష విధించాలని మేం కోరుకుంటున్నాం. ఒక ఫ్యాక్టరీ బయట ఇలా జరిగితే, మనలో ఎవరూ సురక్షితంగా లేమని అర్థం" అని పయనీర్ నిట్‌వేర్ మేనేజింగ్ డైరెక్టర్ బాద్షా మియాన్ అన్నారు.
అయితే ఉద్రిక్తతల మధ్య కూడా ఈ ఐక్యత భావన కొనసాగుతోంది.
2024లో హసీనా దేశం విడిచి పారిపోయిన తర్వాత, ఆమె సెక్యులర్ అవామీ లీగ్‌కు అనుబంధమంగా ఉన్నారని భావించే హిందూ మైనారిటీలపై ప్రత్యర్థులు దాడులు చేశారు. అయితే కొంతమంది యువ ముస్లిం గ్రూపులు హిందువుల ఇళ్లు, పుణ్యక్షేత్రాలను రక్షించడానికి ముందుకు వచ్చాయి.
ఇటీవల ముగిసిన ఎన్నికలకు ముందు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ)కి చెందిన తారిక్ రెహమాన్ "మనమందరం కలిసి బంగ్లాదేశ్‌ను నిర్మించాలనుకుంటున్నాం, ఆ బంగ్లాదేశ్ ఒక తల్లి తన కలలో చూడగలిగినదిగా" అంటూ అన్ని మతాల ప్రజలకు పిలుపునిచ్చారు.

ఫొటో సోర్స్, Reuters
దీపు ఇంటి గురించి చెప్పాలంటే, ఆయన హత్య జరిగిన రాత్రి జ్ఞాపకాలు ముక్కలుగా ముక్కలుగా మాత్రమే గుర్తుకు వస్తాయి.
సాయంత్రం ఎనిమిది గంటల ప్రాంతంలో ఒక ఫోన్ కాల్. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సందర్భం. ఇంటిని ఛిన్నాభిన్నం చేసిన వార్తను చెప్పడానికి ఇంటికి వస్తున్న తండ్రి.
ఆ వార్త వినగానే తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. గంటల తరబడి వారు స్పృహ కోల్పోయారని పొరుగువారు చెప్పారు. నీళ్లు చల్లి, సెలైన్ ఇంజెక్షన్ ఇచ్చాక వారికి స్పృహ వచ్చిందని, ఆ ఇల్లు జనంతో, ఏడుపులతో నిండిపోయిందని చెప్పారు.
దాదాపు రెండు నెలలు గడిచినా దీపు తల్లి ప్రతిరోజూ కన్నీళ్లు పెడుతూనే ఉన్నారు. తండ్రి ఇంకా పనికి వెళ్లలేదు. నిద్ర లేదు. ఆకలి, దినచర్య, మనశ్శాంతి కూడా మాయమయ్యాయి.
"మా జీవితం స్తంభించిపోయింది. ఇక ఏదీ ముందుకు కదలడం లేదు" అని రబీ దాస్ అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














