రోల్స్ రాయిస్, బెంజ్ కార్లపై 'ఎలుగుబంటి' దాడి చేసిందంటూ మోసం, ముగ్గురికి జైలు శిక్ష

ఎలుగుబంటి, జంతువులు

ఫొటో సోర్స్, California Department of Insurance

    • రచయిత, సరీన్ హబెషియాన్
  • చదివే సమయం: 2 నిమిషాలు

ఖరీదైన కార్లపై ఎలుగుబంటి వేషధారణలో ఉన్న వ్యక్తితో దాడులు చేయించి బీమా సొమ్ము కొట్టేసేందుకు ప్రయత్నించిన కేసులో కాలిఫోర్నియాకు చెందిన ముగ్గురికి జైలుశిక్ష పడింది.

లేక్ ఆరోహెడ్‌లో, 2024 జనవరి 28న 2010 రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారులో ఎలుగుబంటి ఉన్నట్లు చూపిస్తున్న ఒక వైరల్ వీడియోను బీమా కంపెనీకి సాక్ష్యంగా అందజేశారు. అదే ప్రాంతం నుంచి, అదే రోజున మరో రెండు ఖరీదైన మెర్సిడెస్ కార్లు కూడా దాడికి గురయ్యాయంటూ బీమా సొమ్ము కోసం దరఖాస్తులు వచ్చాయి.

అయితే, కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్‌కు చెందిన జీవశాస్త్రవేత్తలు ఆ ఫుటేజీని పరిశీలించి అది ఎలుగుబంటి కాదని, ఎలుగుబంటి దుస్తుల్లో ఉన్న మనిషిగా నిర్ధరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రాష్ట్ర బీమా విభాగ అధికారులు "ఆపరేషన్ బేర్ క్లా"ను ప్రారంభించి, సెర్చ్ వారెంట్‌తో అనుమానితుల ఇళ్లలో సోదాలు చేసి ఎలుగుబంటి డ్రెస్‌ను గుర్తించారు. మొత్తం 1,41,839 అమెరికన్ డాలర్ల(దాదాపు కోటి 30 లక్షల రూపాయలు) బీమా సొమ్ము కోసం ఈ మోసానికి పాల్పడినట్లు తేలింది.

బీమా మోసానికి పాల్పడినట్లు 39 ఏళ్ల అల్ఫియా జుకర్‌మాన్, 26 ఏళ్ల రూబెన్ తమ్రాజియన్, 32 ఏళ్ల వాహే మురాద్‌ఖన్యన్ అంగీకరించడంతో గురువారం కోర్టు 6 నెలల జైలుశిక్షతో పాటు మరో రెండేళ్ల ప్రొబేషన్ విధించింది.

"అది నమ్మశక్యంగా అనిపించలేదు, అదే తేలింది. బాధ్యులకు శిక్ష పడింది," అని రాష్ట్ర భీమా కమిషనర్ రికార్డో లారా అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)