You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లాక్‌డౌన్ ఉండదు.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం లీటర్‌కు రూ.10 తగ్గిస్తున్నాం - కేంద్రం
ఇరాన్ యుద్ధంతో పెట్రోల్, డీజిల్ ధరలపై ఆందోళనల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకాలను తగ్గించింది.
లీటర్ పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను కేంద్రప్రభుత్వం పది రూపాయలు తగ్గించిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
కేంద్రం నిర్ణయంతో పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం ఇప్పుడు 13 రూపాయల నుంచి మూడు రూపాయలకు తగ్గింది. లీటర్ డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పూర్తిగా తొలగించారు.
గతంలో డీజిల్‌పై రూ. 10 సుంకం ఉండేది. ఇప్పుడు దాన్ని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది.
దీనిపై ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీచేసింది. సుంకాల తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది.
‘పెట్రోల్, డీజిల్ ధరలు వినియోగదారులకు తగ్గే అవకాశం తక్కువ’
హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ వంటి చమురు కంపెనీలపై భారాన్ని తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం ఈ చర్య తీసుకుందని న్యూస్ ఏజెన్సీ పీటీఐ తెలిపింది.
మిడిల్ ఈస్ట్‌లో యుద్ధంతో అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరల భారం పడకుండా చమురు కంపెనీలకు అండగా ఉండడమే దీని లక్ష్యమని పేర్కొంది.
అయితే ఈ ధరల తగ్గింపు వినియోగదారుల వరకు చేరే అవకాశం తక్కువ అని, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం లేదని, తగ్గింపు వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నేరుగా లబ్ధి పొందుతాయని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయని ‘బీబీసీ హిందీ’ పేర్కొంది.
మరోవైపు.. భారత్‌లో లాక్‌డౌన్ విధిస్తారనే వదంతులు పూర్తిగా అసత్యమని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ ‘ఎక్స్’లో తెలిపారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో ఇంధనం, ఇతర నిత్యావసరాలు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పెరిగాయని, గత నెలలో బ్యారల్ ధర 70 డాలర్ల నుంచి 122 డాలర్లకు పెరిగిందని అన్నారు.
‘ధరలు పెరగడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు నష్టం’
అంతర్జాతీయంగా భారీ ధరలు ఉన్న సమయంలో ఆయిల్ కంపెనీలకు వచ్చే భారీ నష్టాలను తగ్గించేందకు ప్రభుత్వం తన పన్ను ఆదాయాన్ని భారీగా తగ్గించుకుంటోందని హర్దీప్ సింగ్ పురీ అన్నారు.
నెల రోజుల క్రితం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలయిన దగ్గరినుంచి ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయి. ఇరాన్ సహా గల్ఫ్ దేశాల్లోని ఇంధన స్థావరాలపై దాడులు జరగడం, చమురు, గ్యాస్ సరఫరాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో సంక్షోభం ముదిరింది.
కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించిందని, రాష్ట్రం వ్యాట్ తగ్గించాలని, అప్పుడు ధరలు అదుపులోకి వస్తాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు కోరారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినప్పుడు భారత్ ధరలు తగ్గించలేదని కాంగ్రెస్ ఎంపీ సుఖ్‌దేవ్ భగత్ ఆరోపించారు. ధరలు అంతర్జాతీయ మార్కెట్‌పై ఆధారపడి ఉంటే మోదీ ప్రభుత్వం వాటిని ఎలా నియంత్రిస్తోందని ప్రశ్నించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)