Ind Vs Eng: సెమీస్‌లో ఇంగ్లండ్‌పై భారత్ విజయం, న్యూజీలాండ్‌తో ఫైనల్

ఫొటో సోర్స్, Getty Images
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 7 పరుగులతో భారత్ విజయం సాధించింది.
ఉత్కంఠభరితంగా సాగిన ఈ సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలుపొంది ఫైనల్‌కు చేరింది.
భారత్ నిర్దేశించిన 254 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.
సూపర్ ఇన్నింగ్స్ ఆడి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఫొటో సోర్స్, Getty Images
గట్టిపోటీ ఇచ్చిన ఇంగ్లండ్
ఈ రెండో సెమీఫైనల్‌లో 254 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ తడబడినప్పటకీ, తర్వాత క్రీజులోకి వచ్చిన ఆటగాళ్లు నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించారు. గట్టిపోటీ ఇస్తూ భారత బౌలర్లకు సవాల్ విసిరారు.
ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ వెంటవెంటనే ఔటవడంతో ఇంగ్లండ్ జట్టు కాస్త సందిగ్ధంలో పడినట్లు కనిపించింది.
అయితే.. జాకబ్ బెతెల్, టామ్ బెంటన్ స్కోరు బోర్డుకు పరుగులు జోడిస్తూ, రన్ రేట్ పెంచారు.
ఇంతలో, వరుణ్ చక్రవర్తి వేసిన ఓవర్‌లో రెండు సిక్సర్లు కొట్టిన బెంటన్.. ఆ తర్వాతి బంతికి ఔటయ్యాడు.
బెంటన్ స్థానంలో విల్ జాక్స్ క్రీజులోకి వచ్చాడు.
అనంతరం 14వ ఓవర్ చివరి బంతికి అక్షర్ పటేల్ పట్టిన అద్బుతమైన క్యాచ్‌తో విల్ జాక్స్ పెవిలియన్ చేరాడు.
జాక్స్ స్థానంలో సామ్ కరన్ క్రీజులోకి వచ్చాడు.
సామ్ కరన్‌తో కలిసి జేకబ్ బెతెల్ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు.
కేవలం 45 బంతుల్లో బెతెల్ సెంచరీ పూర్తి చేశాడు. భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ, అద్భుత శతకం సాధించాడు జేకబ్ బెతెల్.

ఫొటో సోర్స్, Getty Images
హార్దిక్ పాండ్యా వేసిన 19వ ఓవర్ మూడో బంతికి సామ్ కరన్ ఔటయ్యాడు. బౌండరీ వద్ద తిలక్ వర్మ పట్టిన అద్భుత క్యాచ్‌తో సామ్ కరన్ పెవిలియన్ చేరాడు.
అనంతరం ఓవర్టన్ క్రీజులోకి వచ్చాడు.
ఆ తర్వాత చివరి ఓవర్ కోసం బాల్‌ను శివమ్ దుబేకి ఇచ్చాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.
దుబే వేసిన తొలి బంతికే సెంచరీ వీరుడు బెతెల్ రనౌట్ అయ్యాడు.
చివరి ఓవర్లలో ఆర్చర్ మూడు సిక్స్‌లు కొట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. భారత్ చెమటోడ్చి ఫైనల్‌కు చేరింది.
మార్చి 8న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ న్యూజీలాండ్‌తో జరగనుంది.

ఫొటో సోర్స్, Getty Images
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు ఆది నుంచి ధాటిగా ఆడింది. ఓపెనర్ సంజూ శాంసన్ సూపర్ ఇన్నింగ్స్‌తో భారత జట్టు భారీ స్కోరు చేసింది.
సంజూ శాంసన్ 89, శివమ్ దుబే 43, ఇషాన్ కిషన్ 39 పరుగులు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
స్కోరు బోర్డును ముందుకు నడిపించిన సంజూ - ఇషాన్
ఆరంభంలోనే అభిషేక్ శర్మ ఔయ్యాడు. జట్టు స్కోరు 20 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 7 బంతుల్లో 9 పరుగులు చేసిన అభిషేక్.. 2వ ఓవర్ చివరి బంతికి ఔటయ్యాడు. విల్ జాక్స్ అతని వికెట్ తీశాడు.
డ్రింక్స్ బ్రేక్ సమయానికి ఒక వికెట్ నష్టపోయి 67 పరుగులు చేసింది భారత జట్టు.
అనంతరం, ఇషాన్ కిషన్‌తో కలిసి సంజూ శాంసన్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
భారత్ 10 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది.
ఓపెనర్ సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 26 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేశాడు.
18 బంతుల్లో 39 పరుగులు చేసిన ఇషాన్.. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో జాక్స్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు.
14వ ఓవర్ తొలి బంతికి, భారత్ స్కోర్ 160 పరుగుల వద్ద సంజూ ఔటయ్యాడు.
సంజూ 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. సంజూ వికెట్ విల్ జాక్స్‌కు దక్కింది.
టీం ఇండియా 15 ఓవర్లు పూర్తయ్యే సమయానికి, మూడు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది.
అనంతరం, 16వ ఓవర్ నాలుగో బంతికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.

ఫొటో సోర్స్, Getty Images
సిక్సర్లతో ఫామ్‌లో ఉన్న శివమ్ దుబే 43 పరుగులు చేశాడు. 18వ ఓవర్ మూడో బంతికి రనౌట్ అయ్యాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ వెంటవెంటనే 3 సిక్సర్లు కొట్టి రన్‌రేట్ పెంచాడు.
కేవలం 7 బంతుల్లో 21 పరుగులు చేసిన తిలక్ వర్మ ఆర్చర్ వేసిన యార్కర్‌తో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
హార్డిక్ పాండ్యా 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. 19వ ఓవర్ 5వ బంతికి రెండో రన్ కోసం ప్రయత్నిస్తూ రనౌట్‌గా వెనుదిరిగాడు.
మొత్తం 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారత జట్టు 253 పరుగులు చేసింది.

భారత్:
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దుబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లండ్:
ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జేకబ్ బెతెల్, టామ్ బెంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.
ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో ఎలాంటి మార్పులూ లేవు. అయితే, ఇంగ్లండ్ జట్టులో ఒక మార్పు జరిగింది.
ప్లేయింగ్ 11లో రెహాన్‌కు బదులు ఓవర్టన్‌కు చోటు కల్పించినట్లు ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తెలిపాడు.

ఫొటో సోర్స్, Getty Images
తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో న్యూజీలాండ్ విజయం సాధించింది.
రెండో సెమీఫైనల్‌లో గెలిచిన భారత జట్టు.. మార్చి 8న జరిగే ఫైనల్‌లో న్యూజీలాండ్‌తో తలపడనుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













