చాయ్ నుంచి చార్మినార్ వరకు: ఇరాన్‌కు, హైదరాబాద్‌కు ఉన్న లింకేంటి?

ఇరాన్ , హైదరాబాద్

ఫొటో సోర్స్, BBC/GettyImages

    • రచయిత, బళ్ళ సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 4 నిమిషాలు

ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో భారత్-ఇరాన్ సంబంధాలపై ఆసక్తికర చర్చ జరగుతోంది. అసలు ఇరాన్ - భారత్ మధ్య సంబంధాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? ఇరాన్ ప్రభావం హైదరాబాద్ మీద ఎంత ఉంది?

ప్రాచీన భారత్‌కు, ప్రాచీన ఇరాన్‌కూ వేలయేళ్ల బంధం ఉంది. ఈ రెండూ ఒకప్పుడు సరిహద్దులు పంచుకునేవి. ఇరుగు పొరుగు రాజ్యాలు.

భారత్-పాకిస్తాన్ విభజన తరువాత ఆ భారత్-ఇరాన్ సరిహద్దు మొత్తం పాకిస్తాన్‌కు సరిహద్దు అయింది.

వేలయేళ్లపాటు సరిహద్దు కావడంతో భారత్-ఇరాన్ మధ్య సంబంధాలూ అంతే బలంగా ఏర్పడ్డాయి.

ఇరాన్‌ను ఒకప్పుడు పర్షియాగా పిలిచేవారు. ఇరానియన్ శైలి కట్టడాలు, దుస్తులు, మతం, భాష, సంగీతం, సాహిత్యం, ఆహారం.. ఒకటేమిటి.. ఎన్నో రంగాల్లో ఇండో-పర్షియన్ మేళవింపు కనిపిస్తుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  • భారత్‌లో ఉండే జొరాస్ట్రియన్ మతస్తులు పర్షియా నుంచే వచ్చారు. అందుకే వారికి పార్శీ అనే పేరు వచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు టాటాలు ఈ మతానికి చెందిన వారే.
  • మధ్యయుగ భారత్‌లో పర్షియన్ భాష చాలామంది రాజుల అధికారిక భాషగా ఉండేది. ప్రాచీన భారత్‌లో అనేక గ్రంథాలను పర్షియన్ భాషలో రచించారు.
  • చరిత్ర పరిశోధకులు, దక్కన్ హెరిటేజ్ ట్రస్ట్ గౌరవ మేనేజింగ్ ట్రస్టీ మొహమ్మద్ సఫీవుల్లా చెప్పిన వివరాల ప్రకారం, ఉర్దూ కంటే ముందు గోల్కొండ రాజుల రాజ భాష కూడా పర్షియనే. 1883-86 మధ్యలో ఉర్దూ వచ్చింది. అంతకుముందు హైదరాబాద్ రాజ్యపు రాజ భాష ఇదే.
ఇరాన్, హైదరాబాద్
ఫొటో క్యాప్షన్, ఇరానీ చాయ్
  • ఇండో పర్షియన్ శైలిలో ప్రముఖ కట్టడం తాజ్ మహల్. ఇక హైదరాబాద్ నగర ఆర్కిటెక్ట్ ఇరాన్ నుంచే వచ్చారు. అక్కడి ఇస్ఫహాన్ నగర శైలిలోనే చార్మినార్ సహా, మొత్తం హైదరాబాద్ డిజైన్ రూపొందించారు.
  • ఇక ఇరానీ చాయ్, ఇరానీ కేఫె మాత్రమే కాదు, ఇప్పుడు రంజాన్ సీజన్లో ఎక్కువగా తినే హలీం కూడా ఇరానీ వంటకాల నుంచి స్ఫూర్తి పొందినదే. ఇక నాన్ కూడా పర్షియన్ పదమే.
  • హైదరాబాద్ పునాదులు వేసిన కుతుబ్ షాహీలు ఇరాన్ నుంచి వచ్చిన షియాలు. షియాల మొదటి ఖలీఫా, సున్నీల నాల్గో ఖలీఫా అయిన అలీకి ఉన్న బిరుదు హైదర్ పేరిట ఈ నగరం హైదరాబాద్ అయిందని ఎక్కువ మంది చరిత్రకారుల వాదన.
  • సర్కార్, దర్బార్, గజం, సిపాయి.. ఇవన్నీ పర్షియన్ మూలాల నుంచి వచ్చిన పదాలే.
 ఖొమేనీ పేరిట రోడ్డు
ఫొటో క్యాప్షన్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7కి ఖొమేనీ పేరు, అదే రోడ్డులో ఇరాన్ కాన్సులేట్ ఉంది.

ఖమేనీ పేరిట హైదరాబాద్‌లో రోడ్డు ఉందా?

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ పేరిట హైదరాబాద్‌లో రోడ్డు ఉందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ, అది వాస్తవం కాదు. ఆ రోడ్డు ఉన్నది ఖమేనీ పేరిట కాదు.. ఖొమేనీ పేరిట.

ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం తరువాత ఇద్దరు షియా మతపెద్దలు అక్కడ సుప్రీం లీడర్లుగా పనిచేశారు.

మొదటి సుప్రీం లీడర్ రుహొల్లా ఖొమేనీ. ఆయన 1979 నుంచి 1989 వరకూ సుప్రీం లీడర్‌గా ఉన్నారు.

ఇరాన్ – హైదరాబాద్ మధ్య ఉన్న సాంస్కృతిక బంధానికి గుర్తుగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7కి ఖొమేనీ పేరు పెట్టారు. అదే రోడ్డులో ఇరాన్ కాన్సులేట్ ఉంది.

1989లో ఆయన మరణం తరువాత అలీ ఖమేనీ ఆ పదవిలోకి వచ్చారు. ఇప్పుడు మరణించింది ఈ అలీ ఖమేనీయే.

రుహొల్లా ఖొమేనీ, అలీ ఖమేనీ రెండు పేర్లూ దగ్గరగా ఉండడంతో చాలా మంది ఇప్పుడు చనిపోయిన ఖమేనీ పేరిట రోడ్డు ఉంది అనుకుంటున్నారు.

 ఖొమేనీ పేరిట రోడ్డు

ఇక అయతొల్లా అనేది షియా ఇస్లాంలో మతాధికారుల హోదా. హిందువుల్లో పీఠాధిపతులు, క్రైస్తవంలో కార్డినల్స్ లాంటి పదవులున్నట్టు షియా ఇస్లాంలో అయతొల్లా వంటి హోదాలు ఉన్నాయి.

ఇరాన్ సుప్రీం లీడర్ మరణంపై భారత ముస్లింలు, ప్రపంచవ్యాప్త ముస్లింలు ఎందుకు ఆందోళన చేస్తున్నారని మరో చర్చ జరుగుతోంది.

అయితే ఇక్కడ ఖమేనీ కేవలం ఇరాన్ నాయకుడు మాత్రమే కాదు, మతాధికారి కూడా కావడం ముస్లింల స్పందనకు గల కారణాల్లో ఒకటి.

ఇరాన్‌లో రాచరికం అంతమయ్యాక, ఇరాన్‌కు అధ్యక్షులు ఉన్నప్పటికీ, షియా మతాధికారే సుప్రీం లీడర్‌గా ఉంటూ వచ్చారు. షియా ఇస్లాంలో వారికి చాలా ప్రాధాన్యం ఉంటుంది.

ఈ ఖొమేనీ, ఖమేనీ ఇద్దరూ షియా ఇస్లాంలో ప్రముఖమైన అయతొల్లా అనే హోదాతో ఉండేవారు. వారిని పరమ పవిత్రంగా చూస్తారు ముస్లింలు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)