బొడ్డు తాడులో ప్లాస్టిక్ కణాలు.. అవి ఎలా చేరాయి? వాటివల్ల బిడ్డకు ప్రమాదమా?

 మైక్రోప్లాస్టిక్, తల్లి గర్భం, వ్యాధులు, ప్లాస్టిక్‌తో ప్రమాదాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, విజయానంద్ అర్ముగమ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 8 నిమిషాలు

పాలిథిన్ కవర్లలో అమ్మే ఉప్పు,పంచదారతోపాటు మంచినీటి బాటిళ్లలో సూక్ష్మ ప్లాస్టిక్ కణాలున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మద్రాస్ హైకోర్టుకు తెలియజేసింది.

ఇది భవిష్యత్ తరాలపై చూపే ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ, వాటిపై హెచ్చరిక లేబుళ్లు ముద్రించేలా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేయాలని న్యాయమూర్తులు శుక్రవారం (ఫిబ్రవరి 6) ఉత్తర్వులిచ్చారు.

తల్లి బొడ్డు తాడులో మైక్రోప్లాస్టిక్ కణాలు కనిపించడంపై ఒక ప్రైవేట్ కళాశాల చేసిన పరిశోధనా నివేదికను న్యాయమూర్తులు గతంలో సుమోటోగా తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఈ కేసులో కౌంటర్-పిటిషనర్లుగా చేర్చారు.

మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు సతీష్ కుమార్,భరత చక్రవర్తిలతో కూడిన ధర్మాసనం పర్యావరణ సంబంధిత కేసులను విచారిస్తోంది.

కోయంబత్తూరు పీఎస్‌జీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసర్చ్ పరిశోధనా నివేదికను ధర్మాసనం స్వయంగా విచారించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
 మైక్రోప్లాస్టిక్, తల్లి గర్భం, వ్యాధులు, ప్లాస్టిక్‌తో ప్రమాదాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మైక్రోప్లాస్టిక్స్(ఫైల్ ఫోటో)

'చాలా ఎక్కువగా ఉన్నాయి'

ప్లాస్టిక్ ఉత్పత్తిలో ఉపయోగించే బిస్‌ఫెనాల్-ఏ (బీపీఏ) అనే రసాయనం నవజాత శిశువుల బొడ్డు తాడులో గుర్తించినట్టు అధ్యయనంలో తేలింది.

హార్మోన్ల వ్యవస్థ (ఎండోక్రైన్)కు అంతరాయం కలిగించే రసాయనం బిస్‌ఫెనాల్-ఏ అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని పేర్కొంది.

అధ్యయనంలో పాల్గొన్న గర్భిణుల బొడ్డు తాడు నుంచి వారి అంగీకారంతో వైద్య బృందం రక్త నమూనాలను సేకరించింది.

"బీపీఏ(బిస్‌ఫెనాల్-ఏ) పరిమాణం కిలోగ్రాము శరీర బరువుకు 0.43 మైక్రోగ్రాముల నుంచి 1.1578 మైక్రోగ్రాముల వరకు ఉన్నట్టు గుర్తించారు. ఇవి నిర్ణీత స్థాయినిమించి చాలా ఎక్కువగా ఉన్నాయి" అని అధ్యయనం చెబుతోంది.

 మైక్రోప్లాస్టిక్, తల్లి గర్భం, వ్యాధులు, ప్లాస్టిక్‌తో ప్రమాదాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

తమిళనాడు ప్రభుత్వం ఏమంటోంది?

పీఎస్‌జీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ నివేదికను ప్రస్తావించిన జస్టిస్ సతీశ్ కుమార్, జస్టిస్ భరత్ చక్రవర్తిలతో కూడిన ధర్మాసనం, "తల్లి బొడ్డుతాడే ప్లాస్టిక్ కణాలతో కలుషితమైందంటే, ఇది అత్యంత ఆందోళన కలిగించే అంశం, దీనికి పరిష్కారాన్ని కనుక్కోవాలి'' అని పేర్కొంది.

తమిళనాడు ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ రవీంద్రన్ హాజరై, ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఐఐటీ మద్రాస్‌ వారిని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కోరారని చెప్పారు.

ప్రభుత్వ ప్రజారోగ్య కార్యదర్శి సెంథిల్ కుమార్ లేఖ ద్వారా ఈ సమాచారాన్ని తనకు తెలియజేశారని ఆయన కోర్టుకు తెలిపారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తరపున హాజరైన న్యాయవాది వి.చంద్రశేఖరన్, భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నివేదికను కోర్టులో సమర్పించారు.

ప్లాస్టిక్ సీసాలు, పాలిథిన్ సంచుల్లో మైక్రోప్లాస్టిక్‌ల ఉనికి, వాటి ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి తీసుకుంటున్న చర్యల గురించి నివేదిక వివరించింది.

ఇది సమగ్ర దర్యాప్తు చేయాల్సిన విషయమని వ్యాఖ్యానించిన న్యాయమూర్తులు కేసును వాయిదా వేశారు.

మనిషి శరీరంలో కిలోగ్రాము బరువుకు 0.2 నానోగ్రాముల (ఎన్‌జీ) బిస్‌ఫెనాల్ -ఏ కలిగి ఉండొచ్చని యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ఈఎఫ్‌సీఏ) చెప్పినట్టు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్‌లో సీనియర్ శాస్త్రవేత్త పార్థిబన్ వివరించారు.

 మైక్రోప్లాస్టిక్, తల్లి గర్భం, వ్యాధులు, ప్లాస్టిక్‌తో ప్రమాదాలు

ఫొటో సోర్స్, Getty Images

కాలుష్య కారకాలను గుర్తించడానికి ఓ ప్రాజెక్టు

ఆహార ఉత్పత్తుల్లో సూక్ష్మ ప్లాస్టిక్‌లను కాలుష్య కారకాలను గుర్తించడానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక ప్రాజెక్టును ప్రారంభించిందని న్యాయవాది వి. చంద్రశేఖరన్ చెప్పారు.

లఖ్‌నవ్‌లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసర్చ్ (సీఎస్ఐఆర్), కొచ్చిలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసర్చ్ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (ఐసీఏఆర్-సీఐఎఫ్‌టీ), పిలానీలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్ పిలానీ) సహకారంతో ఈ ప్రాజెక్టులను అమలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

ఆహార ఉత్పత్తులలో మైక్రో, నానో ప్లాస్టిక్‌లను గుర్తించడం, వాటి పరిమాణాన్ని నిర్ధరించడానికి విశ్లేషణాత్మక పద్ధతులను అభివృద్ధి చేసి ధృవీకరించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది.

 మైక్రోప్లాస్టిక్, తల్లి గర్భం, వ్యాధులు, ప్లాస్టిక్‌తో ప్రమాదాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆహారపు అలవాట్లతో తల్లి శరీరంలో చేరే ప్లాస్టిక్ బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెప్పారు.

ఉప్పులో భారీగా మైక్రోప్లాస్టిక్‌లు

ప్లాస్టిక్ సీసాల్లోని నీళ్లు, ప్యాకేజ్డ్ పానీయాలు, ఎండు చేపలలోని నీటి నమూనాలను సేకరించి పరీక్షిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

"అయోడైజ్జ్ ఉప్పు, నల్ల ఉప్పు, రాతి ఉప్పులో మైక్రోప్లాస్టిక్‌లు అధికంగా ఉన్నట్టు ప్రాథమిక అధ్యయనాల్లో తేలింది" అని నివేదిక పేర్కొంది.

"హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, చండీగఢ్, హరియాణా, కర్ణాటక, మహారాష్ట్రలో తాగునీటి బాటిళ్లను పరీక్షించగా మైక్రోప్లాస్టిక్ ఉందని తేలింది'' అని నివేదిక పేర్కొంది.

దీనిపై చర్చించడానికి సంయుక్త సమావేశం నిర్వహించినట్టు భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది.

'మంచినీళ్లబాటిళ్లపై హెచ్చరిక లేబుళ్లు తప్పనిసరిగా ముద్రించేలా తయారీ సంస్థలకు ఆదేశాలివ్వాలి' అని ఉత్తర్వులిచ్చి న్యాయమూర్తులు కేసు విచారణను వాయిదా వేశారు.

 మైక్రోప్లాస్టిక్, తల్లి గర్భం, వ్యాధులు, ప్లాస్టిక్‌తో ప్రమాదాలు

ఫొటో సోర్స్, Facebook/Sudha Ramalingam

ఫొటో క్యాప్షన్, డాక్టర్ సుధారామలింగం

'బొడ్డు తాడులో ప్లాస్టిక్ కణాలు'

తల్లి బొడ్డుతాడుపై మైక్రోప్లాస్టిక్స్ ప్రభావంపై కోయంబత్తూరు పీఎస్‌జీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ ఒక అధ్యయనాన్ని ప్రచురించింది.

"మేం నిర్వహించిన ప్రాథమిక అధ్యయనం ఫలితాలను మీడియా ప్రచురించింది. హైకోర్టు న్యాయమూర్తులు దీనిని నివేదికగా సమర్పించాలని ఆదేశించారు" అని డాక్టర్ సుధా రామలింగం చెప్పారు.

ఆమె ప్రస్తుతం పీఎస్‌జీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్‌లో కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతిగా పనిచేస్తున్నారు.

"ఆరు నెలలపైనుంచి దీనిపై పరిశోధనలు నిర్వహిస్తున్నాం. చిన్న వయసులోనే ఊబకాయం ఉన్న పిల్లలు డయాబెటిస్, క్యాన్సర్ వంటి అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు" అని ఆమె చెప్పారు.

 మైక్రోప్లాస్టిక్, తల్లి గర్భం, వ్యాధులు, ప్లాస్టిక్‌తో ప్రమాదాలు

ఫొటో సోర్స్, Facebook/Perumal pillai

ఫొటో క్యాప్షన్, డాక్టర్ పెరుమాళ్ పిళ్లై

'పిండం దశలోనే వ్యాధులు'

బిడ్డ గర్భంలో ఉన్నప్పుడే కొన్ని రకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉండటం తర్వాత రోగాలు పెరగడానికి కారణమని చైనా, అమెరికాలో నిర్వహించిన పరిశోధనలో తేలిందని డాక్టర్ సుధా రామలింగం చెప్పారు.

దీనిని వైద్యపరంగా 'డోహాడ్' (డెవలప్‌మెంటల్ ఆరిజిన్ ఆఫ్ హెల్త్ అండ్ డిసీజ్) అని పిలుస్తారు. గర్భాశయంలో ఉన్నప్పుడు కణాల ప్రవర్తన భవిష్యత్తులో 'ఏ వ్యాధి సంభవిస్తుందో' నిర్ణయిస్తుందని కూడా ఆమె చెప్పారు.

"ఆహారపు అలవాట్ల కారణంగా తల్లి శరీరంలో ప్లాస్టిక్ కణాలు చేరే అవకాశాలున్నాయి. అవి గర్భస్థ శిశువుకు చేరితే ఊబకాయం, మధుమేహానికి కారణమవుతాయా అన్నది తెలుసుకోవాలన్న ఆసక్తితో మేం ఈ పరిశోధన ప్రారంభించాం" అని డాక్టర్ సుధా రామలింగం చెప్పారు.

బిస్‌ఫెనాల్-ఏ మనిషి శరీరంలోని ఎండోక్రైన్(హార్మోన్ల) వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుందని ఆమె తెలిపారు.

 మైక్రోప్లాస్టిక్, తల్లి గర్భం, వ్యాధులు, ప్లాస్టిక్‌తో ప్రమాదాలు

ఫొటో సోర్స్, Getty Images

400 మంది గర్భిణులపై అధ్యయనం

డాక్టర్ సుధా రామలింగం నేతృత్వంలోని బృందం ఆరు నెలలుగా నాలుగు వందలకు పైగా గర్భిణుల నుంచి బొడ్డుతాళ్లను సేకరించింది. వీటిని ప్రసవం తర్వాత పారవేస్తారు.

"తల్లిదండ్రుల సమ్మతితో రక్త నమూనాలను సేకరించాం. ఈ విషయంలో, ఎథిక్స్ కమిటీ ఆమోదం, మేం పనిచేస్తున్న సంస్థ అనుమతులు పొందాం" అని డాక్టర్ సుధా రామలింగం చెప్పారు.

అనుమతించిన స్థాయి కంటే కొంచెం ఎక్కువగా మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నాయని ప్రాథమిక అధ్యయనంలో కనుగొన్నట్లు ఆమె చెప్పారు.

"మైక్రోప్లాస్టిక్స్ అనేది అనేక లక్షణాలను కలిగిన రసాయనాల సమాహారం. మేం బిస్‌ఫెనాల్ ఏ అనే కెమికల్‌పై మాత్రమే దృష్టిపెట్టాం. ఇతర కణాల రూపాలను గుర్తించడానికి అధునాతన ప్రయోగశాల సౌకర్యాలు అవసరం. దాని కోసం పని జరుగుతోంది" అని డాక్టర్ సుధా రామలింగం చెప్పారు.

 మైక్రోప్లాస్టిక్, తల్లి గర్భం, వ్యాధులు, ప్లాస్టిక్‌తో ప్రమాదాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పేపర్ కప్పులు, టీ బ్యాగుల్లో కూడా మైక్రోప్లాస్టిక్స్ ఉంటాయని వైద్యులు చెప్పారు.

టీ, సాంబార్ ప్యాకెట్లతో ప్రమాదం

హోటళ్ల నుంచి ప్లాస్టిక్ కవర్లలో తెచ్చుకునే టీ, సాంబారు ద్వారా మైక్రోప్లాస్టిక్‌లు మనిషి శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందని డాక్టర్ సుధా రామలింగం అంటున్నారు.

"ఇవి ఎండోక్రైన్ గ్రంధులతో పోటీపడి వివిధ ప్రభావాలను కలిగిస్తాయి" అని తెలిపారు.

" గర్భస్థ శిశువుకు మానసిక ఆరోగ్య సమస్యలు, గుండె జబ్బులు, మధుమేహం కలిగించే అవకాశమున్న ప్రమాదకర రసాయనాలివి'' అని తెలిపారు.

పేపర్ కప్పులు, ఒకసారి ఉపయోగించే టీ బ్యాగుల్లో కూడా మైక్రోప్లాస్టిక్‌లు ఉంటాయని, "వేడి టీ తాగినప్పుడు, మైక్రోప్లాస్టిక్‌లు కరిగి కడుపులోకి ప్రవేశిస్తాయి, అలాంటి వాటికి దూరంగా ఉండాలి" అని సూచించారు.

బయటిగాలిలోని కాలుష్యం వంటి అనేక కారణాల వల్ల మనిషి శరీరంలో సహజంగానే రసాయనాలు ఉంటాయని, కానీ "షాకింగ్ విషయం ఏంటంటే అవి తల్లి బొడ్డుతాడును చేరుకోవడం''అని ఆమె తెలిపారు.

"ఫ్లాలేట్లు అనేవి బిస్‌ఫెనాల్ ఏ లాంటి రసాయనాలు. అవి మన చుట్టూ ఉన్నాయి. అవి రెస్టారెంట్లలో వడ్డించే సాంబార్‌లో, ప్లాస్టిక్ బాటిళ్లలో అనేక ఇతర వస్తువులలో కనిపిస్తాయి" అని ఆమె చెప్పారు.

 మైక్రోప్లాస్టిక్, తల్లి గర్భం, వ్యాధులు, ప్లాస్టిక్‌తో ప్రమాదాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మైక్రోప్లాస్టిక్స్ గర్భస్థ శిశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని పరిశోధనల్లో తేలింది.

'నెలలు నిండకముందే ప్రసవం'

ప్లాస్టిక్ కణాలు బొడ్డుతాడును దాటి గర్భస్థ శిశువును చేరతున్నాయని తిరువళ్లూరు మెడికల్ కాలేజీలో శిశు సంక్షేమ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్, వైద్యుడు పెరుమాళ్ పిళ్లై చెప్పారు.

ఇవి గర్భధారణ సమయంలో మధుమేహం వంటి దీర్ఘకాలిక జీవక్రియ మార్పులకు దారితీస్తాయని, "కొన్ని అధ్యయనాలు తల్లి నాభితాడులో పీవీసీ, పాలిమర్లు వంటి మైక్రోప్లాస్టిక్ కణాలను గుర్తించాయి" అని తెలిపారు.

ఈ అంశంపై చాలా పరిశోధనలు జరుగుతున్నాయని, మైక్రోప్లాస్టిక్ కణాల వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

దక్షిణ కొరియాలో తాగునీటి సీసాలు, పాల సీసాలలో బిస్‌ఫెనాల్ ఏ అనే రసాయనం గుర్తించారని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సీనియర్ శాస్త్రవేత్త పార్థిబన్ చెప్పారు.

 మైక్రోప్లాస్టిక్, తల్లి గర్భం, వ్యాధులు, ప్లాస్టిక్‌తో ప్రమాదాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మైక్రోప్లాస్టిక్స్ కలిగించే నష్టాలపై ప్రజల్లో అవగాహన పెరగాలని వైద్యులంటున్నారు.

నివారణామార్గాలు

ప్లాస్టిక్ బాటిళ్లను నిరంతరం ఉపయోగించడం వల్ల మైక్రోప్లాస్టిక్‌ల ప్రభావం పెరుగుతుందని డాక్టర్ సుధా రామలింగం చెప్పారు. మైక్రోప్లాస్టిక్‌లు మానవ శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధించే మార్గాలు సూచించారు.

  • ప్లాస్టిక్ బాటిళ్లు వాడకూడదు.
  • ఇనుప పాత్రలు సురక్షితం
  • ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ సీసాలను తిరిగి ఉపయోగించకూడదు.
  • టీ కప్పులకు దూరంగా ఉండాలి.
  • వేడి సాంబారు, టీ మొదలైన వాటిని పాలిథిన్ సంచులలో కొనకూడదు.

"మేంఇప్పుడు మధ్యంతర అధ్యయన ఫలితాలను మాత్రమే విడుదల చేశాం. త్వరలో వివరణాత్మక నివేదిక విడుదల చేస్తాం. మైక్రోప్లాస్టిక్‌లపై అధ్యయనం నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వం ఐఐటీ మద్రాస్‌ను కోరింది. ఆ నివేదికలు వెల్లడైన తర్వాత ప్రజల్లో మరింత అవగాహన పెరుగుతుంది" అని డాక్టర్ సుధా రామలింగం అంటున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)