రాహుల్ గాంధీ ప్రసంగంపై లోక్‌సభలో గందరగోళం: లోక్‌సభలో పుస్తకాలు, పత్రికల ఆధారంగా మాట్లాడడంపై ఉన్న నిబంధనలేంటి?

ఫొటో సోర్స్, ANI
బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రసంగం దుమారం రేపింది.
ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే రాసి, ఇంకా పబ్లిష్‌కాని పుస్తకం ఆధారంగా కారవాన్ మ్యాగజైన్‌లో వచ్చిన కథనంలోని కొన్ని అంశాలను చదవడానికి రాహుల్ గాంధీ ప్రయత్నించారు.
దీనిపై కేంద్రంలోని బీజేపీ మంత్రులనుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.
349(1) నిబంధనను ఉదహరించి ఏదైనా పుస్తకం లేదా ఇమెయిల్ గురించి సభలో చర్చ ఎలా జరుగుతుందో లోకసభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు.
"నేను రూల్ బుక్ చదివాను. వార్తాపత్రిక కటింగ్‌లు, పుస్తకాలు, ప్రామాణికం కాని అంశాలను సభలో చర్చించే సంప్రదాయం లేదని నియమం ఉంది" అని ఆయన అన్నారు.


ఫొటో సోర్స్, ANI
ఏ నియమం ప్రకారం చదవచ్చు?
నియమాలను ఉటంకిస్తూ, రాహుల్ గాంధీ పత్రిక నుంచి సారాంశాలను చదవడంపై అధికార పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఏ నియమం ప్రకారం ఒక పత్రిక, వార్తాపత్రిక లేదా పుస్తకం నుంచి సారాంశాలను సభలో చదవవచ్చు? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాస్తవ.. ఏదైనా పుస్తకం, వార్తాపత్రిక మొదలైన వాటిని చదవడానికి ముందు తప్పనిసరిగా ధ్రువీకరించాలని బీబీసీ ప్రతినిధి సందీప్ రాయ్‌తో అన్నారు.
"సభలో చదివే ఏదైనా పుస్తకం లేదా వార్తాపత్రికకు సంబంధించి ఒక సంప్రదాయం ఉంది. ఆ భాగాన్ని ధ్రువీకరించడానికి సెక్రటరీ జనరల్, టేబుల్ ఆఫ్‌ఫీస్‌కి ఇవ్వాలి ఆ సమయంలో, అది ధ్రువీకరణ కోసం ఇస్తున్నామని చెప్పాలి. ఇది పాత సంప్రదాయం, కానీ ఇప్పటికీ సక్రమంగా పాటించడం లేదు. ఏ పేజీనైనా చదివేముందు, ముందుగానే లోకసభలో ఇవ్వాలి. దానివల్ల ఆ పేపర్ ఆధారిత ప్రక్రియ పూర్తి అవుతుంది. సభ్యులందరికి ఆ పేపర్ చేరుతుంది. ముందుగానే ఇచ్చిన తర్వాత, ఆ సారాంశాన్ని సభలో చదవవచ్చు, చర్చించవచ్చు" అని స్నేహలత శ్రీవాస్తవ చెప్పారు.
"లోక్‌సభలో అధికార పార్టీ, ప్రతిపక్ష సభ్యులకు ఏ అంశంపై చర్చ జరుగుతోందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు, తొందరపాటు ప్రతిచర్యలు తప్పు సమాచారాన్ని వ్యాప్తి చేస్తాయి. దీన్ని నివారించడానికి, ఇది ఒక సంప్రదాయంగా వస్తోంది. దీని గురించి లోక్‌సభ హ్యాండ్‌బుక్‌లో ప్రస్తావించారు. ఇక దీన్ని అనుమతించకపోవడం విషయానికొస్తే, స్పీకర్‌కు 389 నిబంధన ప్రకారం అలా చేసే అధికారం ఉంది, దాన్ని ప్రశ్నించలేం" అని ఆమె చెప్పారు.
"ఈ వివరాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని, ముందుగానే సంప్రదింపుల ప్రక్రియను పూర్తి చేస్తే, పార్లమెంటు సభ్యులు విజయం సాధించినట్టే" అని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
సోమవారం ఏం జరిగింది?
సోమవారం నాడు లోక్‌సభలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రసంగం వివాదానికి దారితీసింది.
మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ (ఎంఎం) నరవణే 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ ' అనే పుస్తకం రాశారు. కానీ అది ఇంకా పబ్లిష్ కాలేదు. అయితే కారవాన్ మ్యాగజైన్‌లో ఈ పుస్తకం పై వచ్చిన ఆర్టికల్‌లోని కొన్ని భాగాలను రాహుల్ చదివే ప్రయత్నం చేశారు. ఇది వివాదానికి దారితీసింది.
దీనిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పార్లమెంటులో ఉన్నారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ , "ఆ పుస్తకం పబ్లిష్ అయిందో,లేదో రాహుల్ గాంధీ ముందు చెప్పాలి. అది పబ్లిష్ అయుంటే ఆయన దాని గురించి ప్రస్తావించాలి, అది ప్రచురించకపోతే దాన్ని ప్రస్తావించడంలో ఎటువంటి ఉపయోగం లేదు" అని అన్నారు.
అదే సమయంలో, హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, రాహుల్ గాంధీ తాను ఒక పత్రిక చదువుతున్నానని చెప్పాలి, ఎందుకంటే ఇది జనరల్ నరవణే రాసిన పుస్తకం కాదు, ఒక పత్రిక ఏదైనా రాయగలదని అన్నారు.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా సభలో ఏం చెప్పినా అది సభ గౌరవాన్ని కాపాడాలంటే ప్రామాణికంగా ఉండాలని అన్నారు. దీనికి రాహుల్ గాంధీ స్పందిస్తూ, "ఇది 100 శాతం ప్రామాణికం" అని అన్నారు.
మధ్యాహ్నం 1:30 గంటలకు మొదలైన గందరగోళం దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగింది. ఆ తర్వాత సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైనప్పుడు, మళ్ళీ సాయంత్రం 4 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభను తరువాత రోజుకు(మంగళవారానికి) వాయిదా వేశారు.

ఫొటో సోర్స్, ANI
రాహుల్ గాంధీ ఏం చెప్పాలనుకున్నారు?
లోక్‌సభలో సోమవారం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. "దీన్ని ప్రచురించడానికి ప్రభుత్వం అనుమతించడం లేదు అని ఈ పత్రికలో నరవణే పేర్కొన్నారు. నేను దాని నుంచి ఐదు లైన్లు మాత్రమే చదవాలనుకుంటున్నాను" అని అన్నారు.
రాహుల్ గాంధీ తిరిగి ప్రసంగం ప్రారంభించినప్పుడు, "రాష్ట్రపతి ప్రసంగం దేశ పరిస్థితి, దేశ విధానాలు, విదేశాంగ విధానం, ప్రపంచ పరిస్థితికి సంబంధించినది. మేం దేశభక్తులం కాదని ఒక సభ్యుడు అన్నారు. నరవణే ఇక్కడ ఏదో చెప్పారు కాబట్టి నేను దానికి స్పందించాలనుకుంటున్నాను" అని అన్నారు.
అయితే ఇంకా ముద్రించని పుస్తకంలోని అంశాలను ఎలా చదవుతారంటూ బీజేపీ నాయకులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
అప్పుడు రాహుల్ గాంధీ అధికార పార్టీ వైపు చూపిస్తూ.. 'వారు ఉగ్రవాదంపై పోరాడుతున్నామని చెబుతారు, కానీ ఒక కోట్‌కు భయపడుతున్నారు. అందులో ఏం రాశారో అది వారిని భయపెడుతోంది. నేను చదవలేకపోతున్నా. వారు భయపడకపోతే నన్ను చదవనివ్వండి' అని అన్నారు.

ఫొటో సోర్స్, ANI
రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా వాదనలు
"రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్న పుస్తకం ఇప్పిటిదాకా పబ్లిష్ కాలేదు. సభను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించవద్దు. రాహుల్ జీ, అనవసరమైన విషయాలను ఇక్కడ ప్రస్తావించకూడదు" అని రాజ్‌నాథ్ సింగ్ సభలో అన్నారు.
" వివాదాన్ని ప్రతిపక్ష నాయకుడే ముగించారు. పుస్తకం పబ్లిష్ కాలేదని ఆయనే చెప్పారు. ఇక దాన్ని సభలో ఎలా ప్రస్తావించగలరు?" అని ఆయన అన్నారు.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, ఆ పుస్తకం పబ్లిష్ అయినప్పటికీ, దాని గురించి ప్రస్తావించలేమని అన్నారు. ఏదైనా పుస్తకం లేదా ఇమెయిల్ గురించి సభలో ఎలా చర్చిస్తారు? నేను రూల్ బుక్ చదివాను. వార్తాపత్రిక కటింగ్‌లు, పుస్తకాలు, ప్రామాణికం కాని అంశాలను సభలో చర్చించే సంప్రదాయం లేదని నియమం ఉంది" అని అన్నారు.
ఆ తర్వాత పార్లమెంటు సభ్యుడు నిషికాంత్ దూబే పాయింట్ ఆఫ్ ఆర్డర్ గురించి ప్రస్తావిస్తున్నారని అమిత్ షా అన్నారు.

ఫొటో సోర్స్, ANI
"సెక్షన్ 349 (1) కింద, సభ కార్యకలాపాలతో సంబంధం లేని ఏ పుస్తకం లేదా వార్తాపత్రికను చదవకూడదు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం సాటానిక్ వెర్సెస్‌ను నిషేధించింది. అడ్వాణీ దాని గురించి చర్చించాలనుకున్నారు కానీ ఆయనకు అనుమతివ్వలేదు" అని నిషికాంత్ దుబే అన్నారు.
దీని తరువాత, పార్లమెంటు బయట నిషికాంత్ దుబే మాట్లాడుతూ , "రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 లోని పాయింట్ నంబర్ 2, 3, 4 పొరుగు దేశాలు, జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలను చర్చించకూడదని చెబుతున్నాయి. ఇది భారతదేశంలోని 140 కోట్ల మందికి, పార్లమెంటులో కూర్చున్న వారందరికీ వర్తిస్తుంది" అని అన్నారు.
"రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని, స్పీకర్‌ను నమ్మరు. దేనిపైనా నమ్మకం లేనప్పుడు కాంగ్రెస్ తెలివితేటల గురించి ఏం చెప్పగలం" అని ఆయన అన్నారు.
సభలో గందరగోళం నెలకొనడంతో, రాహుల్ గాంధీ ఈ అంశంపై మాట్లాడటానికి చాలాసార్లు ప్రయత్నించగా, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు దానిపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
" ప్రధానమంత్రి మీ మాట వినడానికి కూర్చున్నారు. మీరు లేవనెత్తిన అంశంపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అయినా కూడా, మీరు దాన్ని పదే పదే చదువుతుంటే, సభ సాఫీగా ఎలా జరుగుతుంది? నియమాలను పాటించకపోతే, చర్చ ఎలా జరుగుతుంది? ప్రతిపక్షం ఇంత చర్చను తేవడంవల్ల వారు మాట్లాడలేరు, ఇతరులను కూడా మాట్లాడనివ్వరు" అని ఆయన అన్నారు.
"అన్ని నియమాలను ఉల్లంఘించి గందరగోళం సృష్టిస్తున్నారు. ఆ పుస్తకం ప్రామాణికత ప్రశ్నార్థకంగా ఉన్నందున దాన్ని ప్రచురించలేదు. వారు పార్లమెంటును, ఎంపీలను గౌరవించరు" అని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సభ వెలుపల అన్నారు .
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














