గ్రీన్‌ల్యాండ్ హఠాత్తుగా చల్లబడటం వల్లనే భారత్‌లో కరవు ఏర్పడిందా? 8200 ఏళ్ల కిందట ఏం జరిగింది?

వాతావరణ మార్పులు, గ్రీన్‌ల్యాండ్, భారత్‌లో రుతుపవనాలు, కరవు పరిస్థితులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కె. శుభగుణం
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 6 నిమిషాలు

భూమి మీద ఒక ప్రాంతంలో వాతావరణ మార్పుల ప్రభావం.. ఆ ప్రాంతానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ప్రాంతంలో రుతుపవనాలను మార్చేస్తుందంటే ఆశ్చర్యంగా అనిపించవచ్చు.

ఈ పరిణామం సుమారు 8200 ఏళ్ల కిందట సంభవించి ఉండవచ్చని బీర్బల్ సాహ్ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఇటీవలి అధ్యయనంలో గుర్తించారు.

ఉత్తర అట్లాంటిక్, గ్రీన్‌ల్యాండ్‌ హఠాత్తుగా చల్లబడటం వల్ల భారత్‌లో రుతుపవనాలు బలహీన పడి ఉండవచ్చని భారత శాస్త్రవేత్తలు కనుక్కున్నారు.

భూ వాతావరణ వ్యవస్థ ప్రాంతాలను బట్టి వేర్వేరుగా కాకుండా అంతా ఒకటిగా ఉంటుందని దీని ద్వారా తెలుస్తోందని నిపుణులు అంటున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వాతావరణ మార్పులు, గ్రీన్‌ల్యాండ్, భారత్‌లో రుతుపవనాలు, కరవు పరిస్థితులు

ఫొటో సోర్స్, Getty Images

వాతావరణంలో ఆకస్మిక మార్పు

సుమారు 8200 ఏళ్ల కిందట భూ వాతావరణంలో పెద్ద మార్పు వచ్చింది. శాస్త్రవేత్తలు దీనిని "8.2Ka కూలింగ్ ఈవెంట్" అని పిలుస్తున్నారు. దీనిని హోలోసీన్ యుగంలో ముఖ్యమైన ఆకస్మిక శీతలీకరణ సంఘటనలలో ఒకటిగా పరిగణిస్తున్నారు.

ఆ సమయంలో గ్రీన్‌ల్యాండ్‌లో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీ సెల్సియస్ మేరకు తగ్గాయి. అదే సమయంలో వాతావరణంలో మీథేన్ పరిమాణం కూడా తగ్గింది. ఇవన్నీ ప్రపంచ నీటి చక్రం, వాతావరణ వ్యవస్థలో పెద్ద మార్పును సూచిస్తున్నాయని బీర్బల్ సాహ్ని ఇన్‌స్టిట్‌ట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ డైరెక్టర్ డాక్టర్ మహేశ్ థక్కర్ బీబీసీకి వివరించారు.

వాతావరణంలో హఠాత్తుగా ఈ మార్పు ఎలా జరిగిందనే ప్రశ్నకు సమాధానం కనుక్కునేందుకు పరిశోధకులు ప్రయత్నించారు. అయితే ఇది సాధారణ వాతావరణ మార్పు కాదని వారు గుర్తించారు.

ఉత్తర అమెరికాలోని అతి పెద్ద హిమానీ నద సరస్సు అగాసిజ్‌ హఠాత్తుగా బద్దలవడంతో హడ్సన్ బే ద్వారా నీరు భారీ పరిమాణంలో ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలోకి వచ్చింది.

సముద్రంలోకి భారీగా మంచినీరు వచ్చి చేరడంతో, సముద్రపు నీటి లవణీయత మారింది. ఇది సముద్ర ప్రవాహాల సరళిని మార్చేసింది.

"సముద్ర ప్రవాహాలు మారడంతో, ప్రపంచవ్యాప్తంగా గాలి సరళి కూడా దానికి అనుగుణంగా మారింది. ఈ మార్పులు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వాతావరణాన్ని మార్చేశాయి" అని డాక్టర్ మహేశ్ థక్కర్ వివరించారు.

ఈ అధ్యయనపు ఫలితాలను ‘క్వాటర్నరీ ఇంటర్నేషనల్’ అనే పత్రికలో ప్రచురించారు.

వాతావరణ మార్పులు, గ్రీన్‌ల్యాండ్, భారత్‌లో రుతుపవనాలు, కరవు పరిస్థితులు

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో రుతుపవనాల్లో మార్పులు

ఉత్తర అట్లాంటిక్‌లో జరిగిన ఈ సంఘటన వల్ల ప్రపంచ వాతావరణంలో ఏర్పడిన మార్పు భారత్‌ను కూడా ప్రభావితం చేసిందని తాజా అధ్యయనం వెల్లడించింది.

ఆ సమయంలో భారత భూభాగంలో రుతుపవనాలు బలహీన పడడంతో వర్షపాతం తగ్గడంతో కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి.

భారత్‌లో వర్షపాతం కేవలం స్థానిక పరిస్థితులపై ఆధారపడదని, ప్రపంచంలోని సుదూర ప్రాంతాల్లో వాతావరణ మార్పులు కూడా భారత వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయని తాజా అధ్యయనం ద్వారా తేలింది.

"గ్రీన్‌ల్యాండ్‌లో వాతావరణ మార్పు వల్ల భారత్‌లో వర్షపాతం తగ్గిందని ఈ అధ్యయనం చెప్పడం లేదు. గ్లోబల్ క్లైమేట్ చేంజ్ వల్లే ఈ రెండు సంఘటనలు సంభవించాయని ఇది స్పష్టం చేస్తోంది" అని మొహాలీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్రొఫెసర్ డాక్టర్ టి.వి. వెంకటేశ్వరన్ వివరించారు.

"ప్రపంచమంతటా ప్రభావం చూపే భారీ కూలింగ్ ఈవెంట్ సంభవిస్తే, అది సముద్ర ప్రవాహాలు, భూ వాతావరణం, గాలిలో తేమ వంటి అన్నింటిపైనా ప్రభావం చూపుతుంది. ఇటువంటి ప్రభావాలను ఉష్ణమండల ప్రాంత వాతావరణంలో ఎక్కువగా చూడవచ్చు" అని మహేశ్ థక్కర్ చెప్పారు.

వాతావరణ మార్పులు, గ్రీన్‌ల్యాండ్, భారత్‌లో రుతుపవనాలు, కరవు పరిస్థితులు

ఫొటో సోర్స్, Getty Images

మట్టిలో దాగి ఉన్న వాతవరణ చరిత్ర

ఛత్తీస్‌గఢ్‌లోని పురాతన తుమాన్ సరస్సు నుండి శిలాజ మట్టి నమూనాలను సేకరించి శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు.

వేల ఏళ్లుగా ఆ నేలలో దాగి ఉన్న పుప్పొడి రేణువులు అప్పటి వాతావరణం గురించి శాస్త్రవేత్తలకు ముఖ్యమైన సమాచారాన్ని అందించాయి.

ప్రతీ మొక్క ప్రత్యేకమైన పుప్పొడి రేణువులను ఉత్పత్తి చేస్తుంది. వాటిని విశ్లేషించడం ద్వారా ఏ రకాల మొక్కలు సమృద్ధిగా ఉన్నాయో నిర్ధరించవచ్చు. వాటితో వర్షపాతం ఎక్కువగా ఉందో తక్కువగా ఉందో కూడా అంచనా వేయచ్చు.

"మొక్కల నుంచి ఎక్కువ పుప్పొడి రేణువులు లభిస్తే ఆ కాలంలో వర్షపాతం సమృద్ధిగా ఉందని అర్థం. తక్కువ లేదా అరుదుగా వర్షాలు పడిన కాలంలో పెరిగే మొక్కల నుంచి తక్కువ పుప్పొడి రేణువులు వస్తాయి" అని డాక్టర్ టి.వి. వెంకటేశ్వరన్ వివరించారు.

8200ఏళ్ల కిందట పొడి వాతావరణం ఉండేదని రుతుపవనాలు బలహీనంగా ఉండేవని సూచించే మొక్కల పుప్పొడి రేణువులు చాలా దొరికినట్లు ఈ అధ్యయనం గుర్తించింది. ఈ ఫలితాలు క్వాటర్నరీ ఇంటర్నేషనల్ అనే జర్నల్‌లో ప్రచురించిన రిపోర్ట్‌లో వివరించారు.

వాతావరణ మార్పులు, గ్రీన్‌ల్యాండ్, భారత్‌లో రుతుపవనాలు, కరవు పరిస్థితులు

ఫొటో సోర్స్, Getty Images

గ్రీన్‌ల్యాండ్- భారత్ మధ్య సుదూర సంబంధం

ఈ అధ్యయనం 'టెలీకనెక్షన్'పై దృష్టి సారిస్తుంది. వాతావరణం, క్లైమేట్ సైన్స్‌లో ప్రపంచంలోని రెండు సుదూర ప్రాంతాల మధ్య ఉన్న సంబంధాన్ని వివరించడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తారు. ప్రపంచంలోన ఒక మూలలో జరిగే మార్పు మరొక ప్రాంతంపై ప్రభావం చెప్పడమే దీని ఉద్దేశం.

ప్రపంచ వాతావరణ వ్యవస్థ ఒకే అనుసంధానిత నెట్‌వర్క్‌గా పనిచేస్తుందని ఇది చూపిస్తుందని మహేశ్ థక్కర్ చెబుతున్నారు.

గతంలో కొన్ని అధ్యయనాలు తాజా ఆవిష్కరణకు చెందిన ఫలితాలనే సూచించాయి.

8.2Ka కూలింగ్ ఈవెంట్ సమయంలో వర్షపాతం తక్కువగా ఉందని వాయువ్య భారత్‌లోని పురాతన సరస్సు రివాస అవక్షేపాల నుండి సేకరించిన ఆక్సిజన్ ఐసోటోప్ డేటా చెబుతోందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ జియో సైంటిస్ట్ యమ దీక్షిత్ నేతృత్వంలోని బృందం 2014లో జరిపిన ఒక అధ్యయనంలో తెలిపింది.

2018లో జియో సైంటిస్ట్ శ్రద్ధా బాండ్‌ బృందం ఛత్తీస్‌గఢ్‌లోని గోడుమ్సర్ గుహ నుండి సేకరించిన స్పెలియోథెమ్‌లను పరిశీలించారు. ఆ అధ్యయనం ఫలితాలు కూడా 8200 ఏళ్ల కిందట వర్షపాతం తగ్గిందని నిర్ధరించాయి.

ఈ అధ్యయనాలన్నీ ఆ నిర్దిష్ట కాలంలో రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయనడానికి గట్టి ఆధారంగా నిలుస్తున్నాయి. 8200 ఏళ్ల కిందట ఎక్కడో వేల మైళ్ల అవతల వాతావరణంలో మార్పు భారత్‌లో వర్షపాతాన్ని ప్రభావితం చేసినట్లు స్పష్టమవుతోంది.

వాతావరణ మార్పులు, గ్రీన్‌ల్యాండ్, భారత్‌లో రుతుపవనాలు, కరవు పరిస్థితులు

ఫొటో సోర్స్, Getty Images

భవిష్యత్‌ హెచ్చరికగా భావించాలా?

ఈ అధ్యయనం గతానికి సంబంధించినదైనా, ఇది ఇప్పటికీ కీలకమైనదేనని దీని ప్రాముఖ్యత నేటికీ చాలా సందర్భోచితమేనని డాక్టర్ మహేశ్ థక్కర్ అంటున్నారు.

ప్రపంచ ఉష్ణోగ్రత తీవ్రమవుతున్న ప్రస్తుత కాలంలో, సముద్ర ప్రవాహ వ్యవస్థలు కూడా ఇలాంటి మార్పులకే లోనయ్యే ప్రమాదం ఉంది.

ఇలాంటి మార్పులు మళ్లీ సంభవిస్తే, ఉష్ణమండల దేశాల్లోని వాతావరణ పరిస్థితులు మరోసారి ప్రభావితమయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

వ్యవసాయం, తాగునీరు, ఆర్థిక వ్యవస్థకు రుతుపవన వర్షాలు అత్యంత అవసరమైన భారత్ వంటి దేశాలలో ఇటువంటి అధ్యయనాలను భవిష్యత్తు గురించి హెచ్చరికగా చూడాలని నిపుణులు అంటున్నారు.

గ్రీన్‌ల్యాండ్‌లో చల్లబడటం, భారతదేశంలో వర్షపాతం తగ్గడం అనే ఈ రెండు సంఘటనలు చూస్తే ప్రపంచ వాతావరణ వ్యవస్థ ఎంత సంక్లిష్టంగా పరస్పరం అనుసంధానమై ఉందో తెలుస్తోంది.

ఈ సంఘటన 8200 ఏళ్ల కిందట జరిగినప్పటికీ, మనం నేడు ఎదుర్కొంటున్న వాతావరణ మార్పును అర్థం చేసుకోవడానికి సహాయపడే ఒక ముఖ్యమైన సాక్ష్యంగా దీనిని పరిగణిస్తున్నారని మహేశ్ థక్కర్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)