క్రైస్తవ మతంలోకి మారినవారికి ఎస్సీ/ఎస్టీ అత్యాచార (నిరోధక) చట్టం కింద రక్షణ ఉండదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు

 సుప్రీంకోర్టు, ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఉమంగ్ పొద్దార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 4 నిమిషాలు

షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారితే, ఆ వ్యక్తి 'ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం' కింద ఎటువంటి ప్రయోజనాలను పొందలేరని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2025 మేలో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చింతాడ ఆనంద్ అనే పాస్టర్ దాఖలు చేసిన అప్పీలుపై జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం ఈ నిర్ణయాన్ని వెలువరించిందని బార్ అండ్ బెంచ్, లైవ్ లా రిపోర్టు చేశాయి.

"ఒక వ్యక్తి క్రైస్తవ మతాన్ని స్వీకరించి ఆచరిస్తున్నట్లయితే, ఆ వ్యక్తిని షెడ్యూల్డ్ కుల సభ్యుడిగా పరిగణించలేం" అని గతంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

దీన్ని తాజాగా సుప్రీంకోర్టు సమర్థించింది.

హిందూ, బౌద్ధ, సిక్కు మతాలకు చెందిన వారు మాత్రమే షెడ్యూల్డ్ కులాల వర్గంలోకి వస్తారని, వారు ఇతర మతాల్లోకి మారితే రిజర్వేషన్లు లేదా చట్టపరమైన రక్షణలు వర్తించవని సుప్రీంకోర్టు తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఏమిటీ కేసు?

తనపై కుల వివక్ష చూపి వేధింపులకు పాల్పడ్డారంటూ అక్కల రామిరెడ్డి సహా మరికొందరిపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఏపీకి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, ఆ కేసును కొట్టివేయాలని రామిరెడ్డి హైకోర్టుకు వెళ్లారు.

ఈ కేసును విచారించిన ఏపీ హైకోర్టు, ఆనంద్ పదేళ్ల కిందటే క్రైస్తవంలోకి మారినందున ఎస్సీ హోదాను కోల్పోయారని, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఆయన రక్షణ పొందలేరని పేర్కొంటూ ఎఫ్ఐఆర్‌ను కొట్టివేసింది.

ఆయన వద్ద ఎస్సీ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ అది ఈ కేసులో సాయపడదని కోర్టు తేల్చిచెప్పింది. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ఆనంద్ .

'చరిత్రాత్మక తీర్పు'

ఈ కేసులో డిఫెన్స్ న్యాయవాదిగా ఉన్న నచికేత జోషి మీడియాతో మాట్లాడుతూ "ఈరోజు వెలువడిన తీర్పు చరిత్రాత్మకమైనది. ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఎవరు ఫిర్యాదు చేయవచ్చనే విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న దళిత క్రైస్తవుల విస్తృత అంశంతో దీనికి సంబంధం లేదు" అన్నారు.

"ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఫిర్యాదును కేవలం ఆ వర్గానికి చెందిన వ్యక్తి మాత్రమే దాఖలు చేయగలరని ఈ తీర్పు స్పష్టం చేసింది. ఈ కేసులోని వాస్తవాలను పరిశీలిస్తే, సంబంధిత వ్యక్తి 10 ఏళ్ల కిందటే ఎస్సీ/ఎస్టీ వర్గాన్ని వదిలి క్రైస్తవ మతాన్ని స్వీకరించారు" అని తెలిపారు.

"ఈ నేపథ్యంలో, ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా ఎస్సీ/ఎస్టీ హోదాను కలిగి ఉంటారా, ఒకవేళ ఆ హోదా లేకపోతే, వారు ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఫిర్యాదు చేయవచ్చా? అనే ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు, సదరు వ్యక్తి దాఖలు చేసిన ఫిర్యాదు విచారణకు అర్హమైనదికాదని పేర్కొంది" అని న్యాయవాది నచికేత జోషి తెలిపారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఫొటో సోర్స్, X/RSPraveenSwaero

ఫొటో క్యాప్షన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

రాజ్యాంగ విరుద్ధం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

సుప్రీంకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఎక్స్ పోస్టులో స్పందిస్తూ "దళిత క్రైస్తవుల అంశంపై నేటి సుప్రీంకోర్టు తీర్పు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఈ తీర్పు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, ఆర్టికల్ 25లను నేరుగా ఉల్లంఘిస్తోంది. ఈ తీర్పును రద్దు చేయాలని కోరుతూ భారత ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేయాలి" అన్నారు.

"ఏ మతాన్ని అనుసరించాలనేది ప్రతి పౌరుని వ్యక్తిగత ఇష్టం. దీనిని ఒక నిర్దిష్ట కులంలో జన్మించడం వల్ల వచ్చే హక్కులతో ముడిపెట్టకూడదు. క్రైస్తవం, ఇస్లాం లేదా బౌద్ధం వంటి మతాలకు మారినప్పటికీ, షెడ్యూల్డ్ కులాల వారు ఇప్పటికీ అణచివేతకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కారంచేడు, చుండూరు హత్యాకాండలలో బాధితులంతా చాలా వరకు క్రైస్తవ మతాన్ని అనుసరించిన వారే. ఇది భారతదేశంలో ఈనాటికీ కనిపించే కఠోర వాస్తవం" అన్నారాయన.

"ఈ తీర్పు క్రైస్తవం లేదా ఇస్లాంను అనుసరిస్తున్న, అణచివేతకు గురైన పౌరుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ఇకపై వారు ఎస్‌సీ/ఎస్‌టీ అట్రాసిటీస్ చట్టం కింద రక్షణ పొందడం కష్టం" అన్నారు ప్రవీణ్ కుమార్.

రాజ్యాంగ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వుల ప్రకారం, హిందూ మతం వెలుపల ఉన్న ఏ వ్యక్తినీ షెడ్యూల్డ్ కులాల విభాగం కింద పరిగణించరు. అయితే, నేటి తీర్పు పూర్తి ప్రభావం ఏంటనేది లిఖితపూర్వక తీర్పు వెలువడిన తర్వాత స్పష్టమవుతుంది.

ముస్లిం, క్రైస్తవ మతాల్లోకి మారిన వారిని షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చాలా వద్దా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం 2022లో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి కె.జి. బాలకృష్ణన్ అధ్యక్షత వహిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)