ఇరాన్ క్షిపణులు యూరప్, అమెరికాలను కూడా టచ్ చేయగలవా? డియెగో గార్సియా దాడి వెనక అసలు సీక్రెట్ ఏంటి?

ఫొటో సోర్స్, Photo by Eyad Baba / AFP via Getty Images
- రచయిత, నిక్ ఎరిక్సన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 5 నిమిషాలు
ఇరాన్ తన రాజధాని తెహ్రాన్ నుంచి డియెగో గార్సియా దీవిపైకి దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం మధ్య ప్రాచ్యంలో ఘర్షణను మరింత పెంచేలా కనిపిస్తోంది. హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ దీవిలో, బ్రిటన్, అమెరికాలకు చెందిన ఉమ్మడి సైనిక స్థావరం ఉంది.
ఇరాన్ ప్రయోగించిన ఈ క్షిపణులు వారు అనుకున్న లక్ష్యాలను తాకలేదు. కానీ, యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇంత సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులను వాడటం ఇదే మొదటిసారి అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపింది.
ఈ క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ ప్రభుత్వం ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. ఇరాన్ మీడియా కూడా ఈ అంశంలో విదేశీ వార్తా సంస్థలను ఉటంకిస్తూ రిపోర్ట్ చేస్తోంది.
ఈ దాడి విఫలమైనప్పటికీ, దీనివల్ల భవిష్యత్‌లో బెర్లిన్, పారిస్, లండన్ వంటి యూరప్ దేశాల రాజధానులు కూడా ఇరాన్ లక్ష్యాలుగా మారతాయా అనే కోణంలో నిపుణులు చర్చిస్తున్నారు.
లండన్‌ను తాకగల క్షిపణులు ఇరాన్ దగ్గర ఉన్నాయన్న ఐడీఎఫ్ వాదనను ధ్రువీకరించగల ఆధారాలేవీ లేవని బ్రిటన్ కేబినెట్ మంత్రి ఒకరు అన్నారు.


ఫొటో సోర్స్, Reuters
ఇరాన్‌కు డీయెగో గార్సియా ఎంత దూరంలో ఉంది?
ఇరాన్ క్షిపణి కార్యక్రమం ఎప్పుడూ అంతర్జాతీయంగా చర్చనీయాంశమేనని బీబీసీ న్యూస్ పర్షియన్‌కు చెందిన ఘాంచె హబీబీయజాద్ అన్నారు.
''క్షిపణి అభివృద్ధి కార్యక్రమం కేవలం ఆత్మరక్షణ, జాతీయ భద్రత కోసమే అని ఇరాన్ చెబుతోంది. క్షిపణులకు సంబంధించిన సుదూర సామర్థ్యం పెరగడం వల్ల ప్రాంతీయ భద్రత మారుతుందని విమర్శకులు వాదిస్తున్నారు'' అని ఘాంచె వివరించారు.
ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్, అమెరికా దేశాలు ఇరాన్‌పై దాడులు చేశాయి.
ఇరాన్ నుంచి సుమారు 3,800 కి.మీ దూరంలో చాగోస్ దీవులు ఉన్నాయి. డియెగో గార్సియా కూడా ఈ దీవుల్లో భాగమే.
ఇరాన్, బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగించినట్లు అమెరికా అధికారి ఒకరిని ఉటంకిస్తూ సీఎన్ఎన్, వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికలు పేర్కొన్నాయి. అయితే వీటిలో ఏదీ లక్ష్యాన్ని తాకలేదని తెలిపాయి.
రెండు క్షిపణులలో ఒకటి గాలిలోనే విఫలమవ్వగా, మరొకదాన్ని అమెరికా యుద్ధనౌక అడ్డుకుందని పేర్కొన్నాయి. ఈ వార్తలు నిజమేనని బీబీసీ భావిస్తోంది.
యూరప్, ఆసియా, ఆఫ్రికాలోని అనేక నగరాలకు ముప్పు పొంచి ఉందని ఈ ఘటన తర్వాత ఐడీఎఫ్ వ్యాఖ్యానించింది.
చాగోస్ దీవుల వైపు క్షిపణి దాడి జరిగిన తర్వాత ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, లెఫ్టినెంట్ జనరల్ ఇయల్ జమీర్, సోషల్ మీడియాలో ఒక వీడియో సందేశాన్ని పంచుకున్నారు.
''ఇరాన్ 4,000 కి.మీ పరిధి గల రెండు దశల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఇవి ఇజ్రాయెల్‌పై దాడికి ప్రయోగించినవి కావు. వీటి పరిధి యూరప్ రాజధానుల వరకు ఉంది. ఇప్పుడు బెర్లిన్, పారిస్, రోమ్ నగరాలన్నీ నేరుగా ముప్పులో ఉన్నాయి'' అని వీడియోలో ఆయన హెచ్చరించారు.
ఇరాన్ వద్ద ఉన్న క్షిపణి నిల్వలు, వాటి పరిధి పట్ల మళ్లీ ఒక అంచనా వేయాల్సిన పరిస్థితి తలెత్తిందని రక్షణ రంగ నిపుణులు, బ్రిటన్ జాయింట్ ఫోర్సెస్ కమాండ్ మాజీ హెడ్ జనరల్ సర్ రిచర్డ్ బారోన్స్ అన్నారు.
ఇరాన్ వద్ద 2,000 కి.మీ పరిధి వరకు వెళ్లగల క్షిపణులు ఉన్నాయని ఇన్నాళ్లు అనుకున్నామని, కానీ, డియెగో గార్సియా అంతకన్నా ఎక్కువ దూరమే ఉందని ఆయన చెప్పారు.

ఇరాన్ లాంగ్ రేంజ్ మిసైల్స్ పరిధి ఎంత?
ఇప్పటివరకు ఇరాన్, తమ బాలిస్టిక్ మిస్సైల్స్ పరిధిని 2,000 కి.మీలకు స్వచ్ఛందంగా పరిమితం చేసుకున్నామని చెబుతూ వస్తోంది. ఈ రకంగా చూసుకుంటే ఇజ్రాయెల్ మాత్రమే ఇరాన్ దాడుల పరిధిలో ఉండేది. యూరప్ దేశాలకు ఇరాన్ నుంచి ముప్పు ఉన్నట్లు కనిపించలేదు.
బాలిస్టిక్ క్షిపణుల పరిధిని ఈ మేరకు పరిమితం చేయడమనేది ఒక రాజకీయ నిర్ణయమని, సైనిక నాయకులు, ఐఆర్‌జీసీ నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ యూరప్‌ను భయపెట్టకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని 2021లో అప్పటి సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చెప్పారు.
ఐఆర్‌జీసీ ఒక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు ప్రభుత్వ మీడియాకు గతేడాది సెప్టెంబర్‌లో ఇరాన్ ఎంపీ ఒకరు చెప్పారు. ఆ క్షిపణి ఎంత దూరం ప్రయాణించగలదనే వివరాలను ఆయన వెల్లడించలేదు.

ఫొటో సోర్స్, Shomos Uddin via Getty Images
ఇరాన్ క్షిపణులు అమెరికా భూభాగాన్ని చేరగలవా?
ఇరాన్ తన అంతరిక్ష కార్యక్రమం ద్వారా ఖండాంతర క్షిపణులను తయారు చేయగల సాంకేతికతను అభివృద్ధి చేసిందని అమెరికా అధికారులు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. అవసరమైనప్పుడు ఇరాన్ ఈ టెక్నాలజీని వాడుకునే అవకాశం ఉందని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొంది.
'డియెగో గార్సియాను ఇరాన్ క్షిపణులు చేరాయంటే, 10,000 కి.మీ వరకు వెళ్లగలిగే ఖండాంతర క్షిపణులను కూడా ఇరాన్ అభివృద్ధి చేస్తోందని అర్థం. అయితే, వాటిని మనం ఇంకా చూడలేదు. ఈ రకంగా చూస్తే, ఇరాన్ క్షిపణులు అమెరికా ప్రధాన భూభాగాన్ని కూడా చేరుకోగలవు' అని లండన్‌లోని రాయల్ యునైటెడ్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కర్విన్ వోన్ హిప్పెల్ అభిప్రాయపడ్డారు.
అయితే, ఇంత సుదూర లక్ష్యాలను ఛేదించే ఆపరేషనల్ టెక్నాలజీ, మార్గదర్శకత్వం ఇరాన్ దగ్గర ఉందా అనే దానిపై కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
'బ్రిటన్‌ను ఇరాన్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందనడానికి, ఒకవేళ అనుకున్నా ఇరాన్ అంతదూరం దాడి చేయగలదనడానికి మా దగ్గర ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవు' అని యూకే మంత్రి స్టీవ్ రీడ్ అన్నారు.

ఫొటో సోర్స్, Atta Kenare / AFP via Getty Images
బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించడం వెనుక ఇరాన్ ఉద్దేశం ఏంటి?
ఇరాన్ నిజంగా ఆ ప్రాంతాలను తాకాలని అనుకోలేదని, కేవలం తన శక్తిని చూపిస్తూ హెచ్చరిక పంపడమే వారి ఉద్దేశమని కొందరు భావిస్తున్నారు.
'దీనర్థం వారు రేపే లండన్ లేదా పారిస్‌పై దాడి చేస్తారని కాదు. కానీ, తమను తాము కాపాడుకోవడానికి ముందస్తుగా హెచ్చరిస్తూ చేసిన పనిగా వారు భావిస్తున్నారు' అని లండన్‌లోని ది ఇండిపెండెంట్ న్యూస్‌పేపర్‌తో ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ మాజీ ఆఫీసర్ డానీ సిట్రినోవిజ్ అన్నారు.
ఇప్పుడు ఆయన టెల్ అవీవ్‌లోని నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ ఇన్‌స్టిట్యూట్‌లో పని చేస్తున్నారు.
యుద్ధాన్ని మరింత పెంచి, అమెరికాతో పాటు మరిన్ని దేశాలను ఇందులోకి లాగడమే ఇజ్రాయెల్ ఉద్దేశమని యూరప్ మాజీ నాటో డిప్యూటీ కమాండర్ సర్ రిచర్డ్ షిర్రెఫ్ బీబీసీతో చెప్పారు.
వ్యూహం లేని ఈ యుద్ధం ఒక ఊబిలా మారుతోందని ఆయన హెచ్చరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























