నడి సముద్రంలో ఆయిల్ ట్యాంకర్.. భారీ రంధ్రం ఏర్పడడంతో దారీతెన్నూ లేకుండా సాగుతోంది.. ఏ క్షణంలో పేలుతుందో తెలియదంటూ ఆందోళనలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సారా రెయిన్స్‌ఫర్డ్
- హోదా, సదర్న్ అండ్ ఈస్టర్న్ యూరోపియన్ కరస్పాండెంట్, రోమ్
- చదివే సమయం: 4 నిమిషాలు
ఆంక్షలు ఎదుర్కొంటున్న ఒక రష్యన్ ట్యాంకర్ మధ్యధరా సముద్రంలో అదుపు తప్పి తిరుగుతోందని అధికారులు వెల్లడించారు. ఏ సిబ్బంది లేని ఈ ట్యాంకర్ భారీగా ఎల్ఎన్‌జీ గ్యాస్‌ను తీసుకెళ్తోంది. ఈ ట్యాంకర్‌కు ఒక పక్క పెద్ద రంధ్రం ఏర్పడడంతో ప్రమాదకరమైన పర్యావరణ విపత్తుకు దారి తీసే ముప్పు ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ తొమ్మిది ఈయూ సభ్య దేశాలు కలిసి యూరోపియన్ కమిషన్‌కు లేఖ రాశాయి. అందులో ఇటలీ కూడా ఉంది.
ఆర్కిటిక్ మెటాగాజ్ అని పిలిచే ఈ ట్యాంకర్ ఏ క్షణమైన పేలే ఒక ‘పర్యావరణ బాంబు’ అని ఇటలీకి చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు.

‘షాడో ఫ్లీట్’లో భాగం.. డ్రోన్ దాడితో రంధ్రం
ఆంక్షలను తప్పించుకునేందుకు దొంగతనంగా చమురు రవాణా చేసే నౌకల్లో(షాడో ఫ్లీట్) భాగమైన ఈ ట్యాంకర్ ఈ నెల ప్రారంభంలో మాల్టా సముద్ర జలాల్లో డ్రోన్ దాడికి గురైనట్లు అనుమానిస్తున్నారు.
ఇది ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యన్ చమురు, గ్యాస్‌ను రవాణా చేస్తుండగా ‘దాడికి గురై’ తీవ్రంగా దెబ్బతింది.
ఈ ట్యాంకర్‌పై యుక్రెయిన్ దాడి చేసినట్లు కథనాలు ఉన్నప్పటికీ ఆ దేశం వాటిపై స్పందించేందుకు నిరాకరించింది.
ఈ ట్యాంకర్ ఇటలీ సముద్ర తీరం నుంచి దక్షిణంగా సాగుతూ లిబియా వైపు ఉన్న లాంపెడూసా ద్వీపం వైపు సాగుతోంది.
దాని గమనాన్ని ఇటలీ, మాల్టా అధికారులు నిరంతరం గమనిస్తున్నారు.
ఈ ట్యాంకర్ నుంచి చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయని, ఇది ఏ క్షణమైన పేలే రిస్క్ ఉందని.. ఇటలీలోని ‘రేడియా24’తో మాట్లాడుతూ ఇటలీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సెక్రటరీ ఆల్‌ఫ్రెడో మంటోవనో అన్నారు.
ఈ ట్యాంకర్ భారీ మొత్తంలో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌ను తీసుకెళ్తున్నట్లు చెబుతున్నారు.
దీంతో పాటు 450 టన్నుల ఇంధన చమురు, 250 టన్నుల డీజిల్ కూడా ఇందులో ఉన్నట్లు రోమ్‌కు చెందిన అధికారి ఒకరు చెప్పారు.
మంగళవారం మధ్యాహ్నం నాటికి ఈ ట్యాంకర్ ఇటలీ ప్రాదేశిక జలాల నుంచి 45 నాటికల్ మైళ్ల(సుమారు 83 కిలోమీటర్లు) దూరంలో.. లిబియా సెర్చ్ అండ్ రెస్క్యూ జోన్‌కు 25 మైళ్ల(సుమారు 40 కిలోమీటర్లు) దూరంలో ఉన్నట్లుగా గుర్తించారు.

ఫొటో సోర్స్, Getty Images
మంటల్లో చిక్కుకోవడానికి యుక్రెయిన్ కారణం: పుతిన్
ఫిబ్రవరిలో రష్యాలోని ‘పోర్ట్ ఆఫ్ ముర్మాన్స్క్’ నుంచి బయలుదేరిన ఆర్కిటిక్ మెటాగాజ్ నౌక మార్చ్ నెల మొదట్లో మంటల్లో చిక్కకుంది.
ఆ ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందిస్తూ యుక్రెయిన్ ‘టెర్రరిస్ట్ అటాక్’ వల్ల ఆ నౌక మంటల్లో చిక్కుకుందని ఆరోపించారు.
అయితే యుక్రెయిన్ మాత్రం ఈ రహస్య రష్యన్ ట్యాంకర్లను చట్టపరమైన లక్ష్యాలుగానే చూస్తోంది.
పాశ్చాత్య దేశాల ఆంక్షలను తప్పించుకోవడానికి ఈ నౌకలు తరచుగా తమ ట్రాన్స్‌పాండర్లను ఆఫ్ చేసి ప్రయాణిస్తాయని.. చమురు, గ్యాస్ ద్వారా రష్యా సంపాదించే ఆదాయం యుద్ధానికి నిధులుగా ఉపయోగపడుతోందని యుక్రెయిన్ ఆరోపిస్తోంది.
ఇటీవల కాలంలో రష్యా ట్యాంకర్లపై డ్రోన్ దాడుల సంఖ్య, తీవ్రత రెండూ పెరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
డిసెంబర్‌లో యుక్రెయిన్ గూఢచార సంస్థ ఎస్‌బీయూ.. రెండు వారాల్లో నల్ల సముద్రంలో మూడు నౌకలను దెబ్బతీసినట్లు ప్రకటించింది. వాటిలో డాషాన్ నౌకకు ‘తీవ్రమైన నష్టం’ జరిగినట్లు పేర్కొంది. అక్కడికి వారం రోజుల తరువాత క్వెండిల్ అనే ఆయిల్ ట్యాంకర్‌పై మధ్యధరా సముద్రంలో దాడి జరిగింది.
ఆ సమయంలో ఆ నౌక ఖాళీగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నౌకలోని సిబ్బంది ఏమయ్యారు?
రెండు వారాల కిందట జరిగిన పేలుళ్లు, అగ్నిప్రమాదంతో ఆర్కిటిక్ మెటాగాజ్ తీవ్రంగా దెబ్బతింది. వెంటనే నౌక సిబ్బందిని లిబియా తీర రక్షక దళం గుర్తించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది.
మొదట ఈ నౌక మునిగిపోయిందని లిబియా పోర్ట్ అధికారులు ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం అది ఏ సిబ్బంది లేకుండా సముద్రంలో తేలుతూ ప్రమాదకర పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో తాము అత్యంత అప్రమత్తంగా ఉన్నామని వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ తెలిపింది. పర్యావరణ పరంగా అత్యంత విలువైనది, అనేక రక్షిత జీవ జాతుల ఆవాసమైన ఈ సముద్ర ప్రాంతంలో.. ఆర్కిటిక్ మెటాగాజ్ నుంచి చమురు లీకయ్యే ప్రమాదం ఉన్నందున అగ్నిప్రమాదాలు, దీర్ఘకాలిక కాలుష్యం ఏర్పడే ముప్పు ఉందని హెచ్చరించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














