హార్ముజ్ జలసంధిని దాటిన భారత నౌకలు, ఎల్పీజీ కనెక్షన్లపై ప్రభుత్వం ఏం చెప్పింది?

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తరువాత మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంరెండు భారతీయ నౌకలు హార్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించాయి.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శనివారం(మార్చి 14) ఈ సమాచారం ఇచ్చారు.
"భారత్‌కు వస్తున్న కొన్ని నౌకలు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించగలిగాయి. శివాలిక్, నందా దేవి అనే రెండు భారత నౌకలు హార్ముజ్ జలసంధిని దాటి ఇప్పుడు భారత్ ఓడరేవుల వైపు వస్తున్నాయి" అని రణధీర్ జైస్వాల్ అన్నారు .
ఈ నౌకల్లో ఒక్కోదాంట్లో 46,000 మెట్రిక్ టన్నులకుపైగా ఎల్‌పీజీ ఉందని, ఈ రెండు నౌకల్లో కలిపి దాదాపు 93,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉంటుందని ఆయన అన్నారు.
మధ్యప్రాచ్యంలో ప్రస్తుత పరిస్థితిపై జరిగిన అంతర్-మంత్రిత్వ శాఖల విలేకరుల సమావేశంలో రణధీర్ జైస్వాల్ ఈ సమాచారం ఇచ్చారు, ఈ సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ, పెట్రోలియం మంత్రిత్వ శాఖ, షిప్పింగ్ మంత్రిత్వ శాఖాధికారులు పాల్గొన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
గల్ఫ్‌లో ఎన్ని భారతీయ నౌకలు చిక్కుకుపోయాయి?
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంక్షోభం వల్ల భారత్‌కు చెందిన ఐదుగురు మరణించారని, ఒకరు గాయపడ్డారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి (గల్ఫ్) అసీమ్ మహాజన్ తెలిపారు.
ఆ ప్రాంతంలోని భారత కార్యాలయం 24 గంటలూ పనిచేస్తూ పరిస్థితిని నిశితంగా గమనిస్తోందన్నారు.
" ఐదుగురు భారతీయులు చనిపోయారు. ఒకరు కనిపించడం లేదు. ఒమన్, ఇరాక్, యూఏఈ బహ్రెయిన్ కార్యాలయాలు తప్పిపోయిన భారతీయుణ్ని వెతకడానికి, చనిపోయిన వారి మృతదేహాలను కుటుంబాలకు అప్పగించేలా చేయడానికి సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదిస్తున్నాయి" అని ఆయన చెప్పారు.
గల్ఫ్ ప్రాంతంలో అనేక భారత నౌకలు సిద్ధంగా ఉన్నాయని, తన ఇంధన భద్రతను కాపాడుకోవడానికి భారత్ ప్రయత్నిస్తోందని రణధీర్ జైస్వాల్ అన్నారు.
ఈ నౌకలు సురక్షితంగా, ఎలాంటి అంతరాయం లేకుండా ప్రయాణించేలా చూడటానికి సంబంధిత దేశాలన్నింటితో భారత్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, సమన్వయంతో ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు.
"సంక్షోభంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో, చాలా మంది ఇరాన్ పౌరులు భారత్‌లో చిక్కుకుపోయారు. వారి కోసం ఇరాన్ అధికారులు చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేశారు. చిక్కుకుపోయిన ఇరానీయుల్లో భారత్‌కు పర్యటకులుగా వచ్చినవారు లేదా ఇక్కడకు దౌత్యవేత్తలుగా వచ్చినవారు ఉన్నారు" అని ఆయన చెప్పారు.
"విమానం నిన్న రాత్రి కొచ్చి నుంచి బయలుదేరింది. ప్రయాణీకులలో ఐఆర్ఐఎస్ లవణ్ నౌకాసిబ్బంది కూడా ఉన్నారు. ఆ నౌక కొచ్చిలో నిలిచిపోయింది" అని తెలిపారు.
ఈ సంక్షోభం వల్ల 22భారత నౌకలు పర్షియన్ గల్ఫ్‌లో నిలిచిపోయాయి.
వీటిలో ఆరు ఎల్‌పిజి ట్యాంకర్లు, ఒక ఎల్‌ఎన్‌జి ట్యాంకర్, నాలుగు ముడి చమురు ట్యాంకర్లు, రసాయన ఉత్పత్తులను మోసుకెళ్లే ట్యాంకర్ ఒకటి, మూడు కంటైనర్ షిప్‌లు, రెండు బల్క్ క్యారియర్లు, ఒక డ్రెడ్జర్ ఉన్నాయని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా చెప్పారు.
"వాటితో పాటు ఒక నౌక ఖాళీ బ్యాలస్ట్‌లో, మూడు డ్రై డాక్‌లో ఉన్నాయి. ఖాళీ బ్యాలస్ట్ అంటే సరుకును మోసుకెళ్లవు. డ్రై డాక్ అంటే సాధారణ మరమ్మతుల్లో ఉన్నట్టు" అని రాజేశ్ కుమార్ సిన్హా తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
కొత్త ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
భారత్‌లో గ్యాస్ కొరతను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది. శనివారం ప్రభుత్వం నిత్యావసర వస్తువుల చట్టం, 1955 లోని నిబంధనలను అమలు చేస్తూ కొత్త ఉత్తర్వును జారీ చేసింది.
ఈ పథకం కింద పైప్‌లైన్, ఎల్పీజీ కనెక్షన్లు రెండూ ఉన్న వినియోగదారులు ఎల్పీజీ కనెక్షన్‌ను ఉపయోగించుకోలేరు. అలాంటివారికి ఏ ప్రభుత్వ కంపెనీ పంపిణీదారుల నుంచి గృహ వినియోగం కోసం ఎల్పీజీ సిలిండర్లు అందవు.
అలాంటివారు వెంటనే తమ ఎల్పీజీ కనెక్షన్‌ను వదులుకోవాలని ప్రభుత్వం తన ఉత్తర్వులో పేర్కొంది.
పైప్ గ్యాస్ కనెక్షన్ ఉన్న వినియోగదారులకు ఎల్‌పీజీ కనెక్షన్ ఇవ్వమని ఆ ఉత్తర్వులో పేర్కొంది.
ఈ ఉత్తర్వులకు సంబంధించిన నోటిఫికేషన్ శనివారం జారీ అయిన వెంటనే అది అమల్లోకి వచ్చింది.
పైప్‌లైన్ గ్యాస్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని వినియోగదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
చమురు, గ్యాస్ నిల్వల పరిస్థితి ఏంటి?
మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాను ప్రభావితం చేసింది. వాటి ధరలు పెరిగాయి.
భారత్‌లో దీని ప్రభావం ముఖ్యంగా వంటింటి గ్యాస్ సరఫరాపై కనిపిస్తోంది. అనేక నగరాల్లో ఎల్పీజీ కోసం పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి. వాణిజ్య సిలిండర్ల వినియోగదారులపై ప్రభావం పడుతోంది.
"మనకు తగినంత ముడి చమురు సరఫరా ఉంది. మన శుద్ధి కర్మాగారాలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. రిటైల్ అవుట్‌లెట్లలో నిల్వలు లేనట్టు ఎలాంటి నివేదికలు లేవు" అని ఒక సమావేశంలో పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ చెప్పారు.
"మనకు కావాల్సినస్థాయిలో డీజిల్, పెట్రోల్ అందుబాటులో ఉన్నాయి. మన అవసరాలను తీర్చడానికి తగినంత డీజిల్, పెట్రోల్‌ను ఉత్పత్తి చేస్తాం. కాబట్టి మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు"
"గ్యాస్ విషయానికొస్తే ఎల్పీజీ సరఫరాలో అంతరాయం ఉన్న చోట వాణిజ్య వినియోగదారులను పీఎన్‌జీ కనెక్షన్లకు మార్చాలని ప్రభుత్వం కోరింది. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేక మంది ఆపరేటర్లతో సమావేశాలు నిర్వహించి, వాణిజ్య వినియోగదారులకు వెంటనే వీలయినన్ని పీఎన్‌జీ కనెక్షన్లను అందించాలని సూచించింది"
"ఎల్‌పీజీ విషయానికొస్తే, రాజకీయ పరిస్థితులు గమనిస్తే ఇది ఇప్పటికీ ఆందోళన కలిగించే విషయం. ప్రజలు భయాందోళనతో గ్యాస్ బుక్ చేసుకుంటున్నారు. నిన్న 75 లక్షల బుకింగ్‌లు వచ్చాయి. ఒక్కరోజులో 88 లక్షలకు పెరిగాయి. ఇవి భయాందోళనతో చేసుకుంటున్న బుకింగ్‌లు తప్ప మరొకటి కాదు"
"దేశ ప్రజలు భయాందోళనలకు గురికాకుండా, అవసరమైనప్పుడు మాత్రమే బుకింగ్ చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది అందరికీ మంచిది" అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎరువులపై కూడా ప్రభావం పడుతుందా?
మిడిల్ ఈస్ట్ వివాదం వల్ల భారత్‌లో తలెత్తుతున్న మరో ఆందోళన ఎరువుల సరఫరా. భారత్ దగ్గర ప్రస్తుత నిల్వలు అవసరమైన దానికంటే చాలా ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది.
ముఖ్యంగా ఈ సంవత్సరం ఖరీఫ్ పంటకు ప్రస్తుతం అవసరమైన దానికంటే ఎక్కువ ఎరువుల నిల్వ ఉందని రణధీర్ జైస్వాల్ అన్నారు.
"యూరియా నిల్వలు గత ఏడాది కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. డీఏపీ నిల్వలు గత ఏడాది కంటే రెట్టింపు స్థాయిలోఉన్నాయి. అలాగే ఎన్‌పీకే నిల్వలు కూడా గత ఏడాది కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి" అని ఆయన అన్నారు .
''దేశంలో యూరియా ఉత్పత్తి విషయానికొస్తే మన ప్రస్తుత ఉత్పత్తి సాధారణ వినియోగం కంటే ఎక్కువగా ఉంది. రబీ సీజన్ ముగియబోతోంది. ఇప్పటికే మన ప్లాంట్లలో కొన్నింటిలో వార్షిక షెడ్యూల్ నిర్వహణ పూర్తయ్యాయి. అంటే అందుబాటులో ఉన్న గ్యాస్‌ను ఉపయోగించడం ద్వారా ఉత్పత్తిని పెంచుకోవచ్చు"
"ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తూ ఎరువుల శాఖ ఇప్పటికే గ్లోబల్ టెండర్లను జారీ చేసింది. 'స్పాట్ గ్యాస్'ను పోటీ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మొదటి దశ కొనుగోలు మంగళవారం నాటికి పూర్తవుతుంది" అని ఆయన చెప్పారు.
"మన అంతర్జాతీయ భాగస్వాములంతా ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌లో ఎరువులకు డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకునే మే 15 నాటికి తగినంత ఎరువుల నిల్వలు ఉండాలని మేము ఆశిస్తున్నాము" అని అన్నారు.
వీటిపై వ్యాఖ్యలు చేసేవారు వాస్తవాల ఆధారంగా మాట్లాడాలని, పూర్తి సమాచారం లేకుండా ఊహాగానాలు చేస్తూ ప్రజల్లో భయాందోళనలు కలిగించవద్దని రణధీర్ జైస్వాల్ విజ్ఞప్తి చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













