ముంబయి: డయేరియా, వాంతులతో ఒకే ఇంట్లో నలుగురు మృతి... డిన్నరు, తర్వాత తిన్న పుచ్చకాయ శాంపిళ్లను సేకరించిన పోలీసులు

పైధుని, ముంబయి
ఫొటో క్యాప్షన్, ముంబయిలోని పైధునీలో నివసిస్తున్న నలుగురు కుటుంబ సభ్యులు మృతి
    • రచయిత, దీపాలి జగ్‌తాప్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 3 నిమిషాలు

ముంబయిలోని పైధునీలో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు డయేరియా, వాంతులతో మృతి చెందారు. రాత్రి భోజనం చేసిన తర్వాత వీరందరూ పుచ్చకాయ తిన్నట్లు తెలిసింది.

ఫుడ్ పాయిజనింగ్ కావడంతోనే వీరు చనిపోయి ఉండొచ్చని స్థానిక డాక్టర్లు భావిస్తున్నారు. అయితే, ఇంకా పోస్టుమార్టం రిపోర్టు రావాల్సి ఉంది. ఏ కారణంతో వారు మృత్యువాత పడ్డారో స్పష్టత లేదు.

పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. వారు రాత్రి తిన్న ఆహారానికి, పుచ్చకాయకు చెందిన శాంపుళ్లను సేకరించారు.

ఏప్రిల్ 25న రాత్రి పది, పదిన్నర గంటల సమయంలో కొంతమంది బంధువులతో కలిసి ఈ కుటుంబమంతా డిన్నర్ చేసింది.

బంధువులు వెళ్లిపోయిన తర్వాత అర్ధరాత్రి సుమారు 1.30 గంటల సమయంలో వారు పుచ్చకాయ తిన్నట్లు తమకు తెలిసిందని పోలీసులు చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అసలేం జరిగింది?

పైధునీ ప్రాంతంలోని పాత మొఘల్ భవనం మొదటి అంతస్తులో 40 ఏళ్ల అబ్దుల్లా డోకాడియా, ఆయన భార్య 35 ఏళ్ల నస్రీన్ డోకాడియా, 16, 13 ఏళ్ల వయసున్న ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వీరిలో ముగ్గురు జేజే ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మృతి చెందారు.

వారి చిన్న కూతురు ఇంటి నుంచి సమీప ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోయినట్లు స్థానిక వైద్యుడు డాక్టర్ జైద్ ఖురేషీ చెప్పారు.

కుటుంబం మొత్తం ఉదయాన్నే వాంతులు, డయేరియాతో ఇబ్బంది పడుతుండగా ఆ భవనంలోని ఇతరులు వారికి సాయం చేసేందుకు ప్రయత్నించారు.

డాక్టర్ జైద్ ఖురేషి అదే భవనంలో నాలుగో అంతస్తులో ఉంటున్నారు. సంఘటన స్థలానికి చేరుకునే సరికి, గదిలోని నలుగురు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ ఖురేషీ బీబీసీకి తెలిపారు. ఆయన వెంటనే వారి ఆరోగ్య పరిస్థితిని చెక్ చేశారు.

''నలుగురిలో చిన్న పాప శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటాన్ని నేను గమనించాను. వెంటనే ఆమెకు సీపీఆర్ చేశాను. కానీ, పరిస్థితి ఏం మెరుగుపడలేదు. వెంటనే ఆమెను సమీప ఆస్పత్రికి తీసుకెళ్లాను. అక్కడే ఆమె మృతి చెందింది'' అని డాక్టర్ ఖురేషీ చెప్పారు.

''ఆ తర్వాత మిగిలిన ముగ్గుర్ని స్థానిక ఆస్పత్రి నుంచి జేజే ఆస్పత్రికి తరలించాం. కొన్ని గంటలపాటు వారికి అక్కడ చికిత్స చేశారు. ఆ తర్వాత వారు కూడా చనిపోయారు'' అని డాక్టర్ ఖురేషీ తెలిపారు.

పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉందని, అది వచ్చిన తర్వాతే విష ప్రయోగం జరిగిందా లేదా? వారు చనిపోయినందుకు కచ్చితమైన కారణం ఏంటి అన్నది స్పష్టమవుతుందని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ కమిషనర్ ఈ నేరాన్ని సీరియస్‌గా తీసుకుని, విచారణ జరిపించాలని ఒక సోషల్ మీడియా పోస్టులో స్థానిక ఎంఐఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్ పేర్కొన్నారు.

ముంబయి, పైధోనీ
ఫొటో క్యాప్షన్, ‘సంఘటనా స్థలానికి చేరుకునే సరికే, నలుగురు పరిస్థితి విషమంగా ఉంది’ - డాక్టర్ ఖురేషీ

పోలీసులు ఏం చెప్పారు?

ఇది అసహజ మృతి అని పేర్కొంటూ జేజే పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

దీనిపై సమాచారం అందించిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ప్రవీణ్ ముండే.. '' కుటుంబంలోని నలుగురు సభ్యులూ చనిపోయారు. ఏప్రిల్ 25న రాత్రిపూట ఇతర బంధువులతో కలిసి వారు డిన్నర్ చేశారు'' అని తెలిపారు.

''ఉదయం నుంచి వారు వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ్నుంచి జేజే ఆస్పత్రికి తరలించారు. కానీ, దురదృష్టవశాత్తు, ఈ నలుగురు మృతి చెందారు'' అని ప్రవీణ్ తెలిపారు.

''పోస్టుమార్టం నిర్వహించాం. వారు తిన్న ఆహారానికి చెందిన శాంపుళ్లను పోలీసులు సేకరించారు. పుచ్చకాయ శాంపుళ్లను కూడా తీసుకున్నారు. వారి శరీరాల నుంచి కూడా శాంపుళ్లను సేకరించారు. వారి మృతిపై దర్యాప్తు కొనసాగుతోంది" అని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)