‘మోమోల కోసం రూ. 85 లక్షల విలువైన నగలు ఇచ్చిన బాలుడు’.. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సయ్యద్ మోజిజ్ ఇమామ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 4 నిమిషాలు
ఏడో తరగతి చదువుతున్న ఓ14 ఏళ్ల బాలుడు మోమోలకోసం దాదాపు 85లక్షల రూపాయల విలువైన నగలు అమ్మాడని ఓ కుటుంబం ఫిర్యాదు చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని దేవరియాలో ఈ ఘటన జరిగింది.
ఆ టీనేజర్ మేనత్త తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చి నగలు తీసుకోవడానికి అల్మారా తెరిచి చూసినప్పుడు ఆభరణాలు మాయమయ్యాయన్న విషయం తెలిసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
బాలుణ్ని ప్రశ్నించగా జరిగిన విషయం మొత్తం వెల్లడించాడు.
మోమోలు తినిపిస్తామంటూ ముగ్గురు యువకులు బాలుణ్ని ప్రలోభపెట్టారని రాంపూర్ ఫ్యాక్టరీ పోలీస్ స్టేషన్ ఎస్‌ఓ దేవేంద్ర కుమార్ సింగ్ చెప్పారు.


కేసు నమోదు చేసిన పోలీసులు
ఆ యువకులు మొదట బాలుడితో స్నేహం చేసి, ఆ తర్వాత నగలు తీసుకురావాలని క్రమంగా బాలుణ్ని బలవంతం చేయడం ప్రారంభించారని ఆరోపణలు ఉన్నాయి.
దొంగతనం కేసులో దోషులకు ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు.
నిందితుల్లో ఒకరైన రాకేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఒక మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు. కొన్ని నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మిగిలిన నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని దేవరియా సదర్ పోలీస్ సర్కిల్ ఆఫీసర్ సునీల్ రెడ్డి చెప్పారు.
మిగిలిన ఆభరణాలను కూడా త్వరలోనే రికవరీ చేస్తామన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
విషయం ఎలా తెలిసింది?
బాలుడి అత్త తన నగలు తీసుకోవడానికి ఇంటికి వచ్చారు. అల్మారా చూసి నగలు కనిపించడంలేదని తన సోదరి చెప్పారని బాలుడి తండ్రి తెలిపారు.
ఆయనకు అనుమానం వచ్చి కొడుకును అడగ్గా, మోమోల కోసం నగలను ఒక షాపులో ఇచ్చానని చెప్పాడు.
మైనర్ తండ్రి వారణాసిలోని ఒక ఆలయంలో పూజారి.
"మా అబ్బాయి గ్రామంలో ఉండి చదువుకుంటున్నాడు. మోమోలు తినే అలవాటు ఉంది. ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని దేవరియా-కస్యా రోడ్డులోని డుమ్రీ కూడలిలో మోమో దుకాణం నడుపుతున్న ముగ్గురు యువకులు వాడితో స్నేహం చేశారు'' అని వెల్లడించారు.
తమ కుటుంబానికి చెందిన బంగారం మొత్తం ఇంట్లోనే ఉందని , దాని విలువ దాదాపు రూ. 85 లక్షలు ఉంటుందని ఆ కుటుంబం చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
నిందితుడి కుటుంబం ఏం చెప్పింది?
నిందితులు మొదట పిల్లవాడికి ఉచితంగా మోమోలు ఇచ్చి స్నేహం చేశారని, ఆ తర్వాత ఇంటి నుంచి నగలు తీసుకురావాలని క్రమంగా బాలుణ్ని ప్రోత్సహించినట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు.
బాలుడు తన ఇంటి నుంచి నగలు తీసుకెళ్లి, మోమోలు అమ్మే ఓ షాపు యజమానికి ఇస్తుండేవాడని, దాదాపు నాలుగు నుంచి ఆరు నెలల పాటు ఇది జరిగిందని రాంపూర్ ఫ్యాక్టరీ పోలీస్ స్టేషన్ ఎస్‌ఓ దేవేంద్ర కుమార్ సింగ్ చెప్పారు.
బాలుడు దాదాపు ప్రతిరోజూ అల్మారాలోని నగలను తీసుకెళ్లి మోమోలు తినేవాడని, వయస్సు, అవగాహన లేకపోవడంతో ఆ పిల్లవాడు మోసానికి గురయ్యాడని పోలీసులు చెబుతున్నారు.
దీపక్ కుమార్, రాకేశ్, పింటు అనే ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఆభరణాల జాబితాను బాలుడి కుటుంబం పోలీసులకిచ్చింది. అయితే నిందితుల కుటుంబ సభ్యులు ఆ ఆభరణాలను తిరిగి ఇచ్చామని చెబుతున్నారు.
నిందితుడు రాకేశ్ తీసుకున్న నగలను పోలీసులకు అప్పగించినట్టు ఆయన కుటుంబం తెలిపింది. బాలుడి కుటుంబం నాలుగు బ్రాస్‌లెట్లు ఉండాలని చెప్తుండగా, రాకేశ్ రెండింటినే తీసుకున్నాడని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














