వారణాసి: గంగానదిలో పడవపై ఇఫ్తార్ విందు.. చికెన్ బిర్యానీ తిని నదిలో ఎముకలు పడేశారన్న ఆరోపణలతో 14 మంది అరెస్ట్

వారణాసి పోలీసులు, 14 మంది యువకుల అరెస్టు, ఇఫ్తార్ పార్టీ

ఫొటో సోర్స్, Sushant Mukherjee

ఫొటో క్యాప్షన్, గంగానదిపై ఇఫ్తార్ విందు కేసులో వారణాసి పోలీసులు 14 మందిని అరెస్టు చేశారు
చదివే సమయం: 3 నిమిషాలు

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో గంగానదిలో ఒక పడవపై ఇఫ్తార్ పార్టీ జరుపుకొంటూ మాంసం తిని, ఎముకలను నదిలోకి విసిరారనే ఆరోపణలపై 14 మంది యువకులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.

ఇఫ్తార్ పార్టీపై సోమవారం కొత్వాలీ పోలీస్ స్టేషన్‌లో వారణాసి భారతీయ జనతా యువ మోర్చా నగర అధ్యక్షుడు రజత్ జైస్వాల్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు మొదట ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

మతపరమైన భావాలను దెబ్బతీయడం, మతపరమైన ప్రదేశాలకు ఆటంకం కలిగించడం, విభజనను ప్రోత్సహించడం, ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించడం వంటి అంశాలకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 2023లోని సెక్షన్లు 298, 299, 196 (1) (బి), 270, 279, 223 (బి) కింద ఈ కేసు నమోదైంది. ఈ కేసులో నీటి (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం, 1974లోని సెక్షన్ 24ను కూడా చేర్చారు.

వారణాసి పోలీస్ కమిషనరేట్‌లోని ఏసీపీ కొత్వాలీ విజయ్ ప్రతాప్ సింగ్ 14 మంది యువకుల అరెస్టును ధ్రువీకరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వారణాసి, ఇఫ్తార్- పార్టీ, గంగానది

ఫొటో సోర్స్, Sushant Mukherjee

ఫొటో క్యాప్షన్, ఏసీపీ విజయ్ ప్రతాప్ సింగ్

పోలీసులు ఏం చెప్పారు?

"మార్చి 16, సోమవారం ఒక వీడియో వైరల్ అయింది. అందులో కొందరు గంగా నదిలో పడవపై ఇఫ్తార్ పార్టీ చేసుకుంటున్నట్లు కనిపించింది. ఆ వీడియోలో వారు చికెన్ బిర్యానీ తింటున్నట్లుగా కనిపించింది" అని ఏసీపీ కొత్వాలీ విజయ్ ప్రతాప్ సింగ్ మీడియాతో చెప్పారు.

"దీనిపై ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేశాం. ఇప్పటివరకు 14 మందిని గుర్తించి అరెస్టు చేశాం. మిగిలిన వారికోసం గాలింపు కొనసాగుతోంది" అని ఆయన చెప్పారు.

వారణాసి, ఇఫ్తార్- పార్టీ, గంగానది

ఫొటో సోర్స్, Sushant Mukherjee

ఫొటో క్యాప్షన్, రజత్ జైస్వాల్

ఫిర్యాదుదారు ఏమన్నారంటే?

"కొంతమంది ముస్లిం యువకులు బిందూ మాధవ ధరహర ఆలయం పరిసర ప్రాంతంలో గంగానదిలో ఇఫ్తార్ పార్టీ పేరుతో మాంసాహారం తిన్నారు" అని ఫిర్యాదుదారైన రజత్ జైస్వాల్ అన్నారు.

"బిందూ మాధవ ధరహరను ఆలంగీర్ మసీదుగా చెబుతారు కానీ, అది ఆలంగీర్ మసీదు కాదు. ముస్లిం యువకులు ఈ విధంగా మాంసాహారం తినడాన్ని సనాతన ధర్మం పాటించేవారెవరూ సహించరు. మేం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం" అన్నారు.

"దీనికి సంబంధించి మేం ఫిర్యాదు చేశాం, చర్యలు తీసుకుంటున్నారు. వారు మాంసాహారం తింటున్నట్లు, గంగానది అవతలి ఒడ్డుకు వెళ్లి ఎముకలు విసిరినట్లు స్పష్టంగా కనిపిస్తున్న వీడియో ఆధారాలను మేం అధికారులకు అందించాం. ఇందులో దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని జైస్వాల్ డిమాండ్ చేశారు.

ముస్లిం సంఘాల ప్రతిస్పందన

పడవపై ఇఫ్తార్ చేయడాన్ని వారణాసి అంజుమన్ ఇంతేజామియా మసాజిద్ సంయుక్త కార్యదర్శి ఎస్.ఎం.యాసిన్ తప్పుపట్టారు.

కొందరు యువకులు పడవపై రోజా ఇఫ్తార్ చేస్తున్నట్లు ఇవాళే తెలిసిందని, ఇలాంటి వాటికి ఇస్లాంలో చోటు లేదన్నారాయన. ఇఫ్తార్ అనేది ఒక పవిత్రమైన మతపరమైన కార్యమని, అది పిక్నిక్ కాదని యాసిన్ అన్నారు. ఇఫ్తార్ ముగిసిన వెంటనే మగ్రిబ్ నమాజ్ చదవడం తప్పనిసరి అని చెప్పారు.

"అయితే.. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వేధించడమే, ఇందులో మరో మాటకు తావు లేదు" అన్నారు యాసిన్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)