ఖమేనీ అంత్యక్రియలు ఎందుకు వాయిదా వేశారు? కొత్త సుప్రీం లీడర్‌ను ఇంకా ఎందుకు ప్రకటించలేదు?

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు, నెతన్యాహు, ట్రంప్, ఖమేనీ

ఫొటో సోర్స్, Iranian Leader Press Office/Anadolu via Getty Images

ఫొటో క్యాప్షన్, ఖమేనీ మరణం తర్వాత కూడా ప్రభుత్వం స్థిరంగా ఉందని చూపించాలని ఇరాన్ ప్రయత్నిస్తోంది.
చదివే సమయం: 6 నిమిషాలు

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలను వాయిదా వేసినట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.

నిజానికి మూడు రోజుల పాటు నిర్వహించాలనుకున్న అంత్యక్రియల్లో భాగంగా ఊరేగింపు బుధవారమే(మార్చి 4) ప్రారంభం కావాల్సి ఉంది.

కానీ, అంత్యక్రియలు వాయిదా వేసినట్లు ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయనే విషయంలో ఇంకా ఎలాంటి సమాచారం విడుదల కాలేదు.

అంతకుముందు, అంతిమ వీడ్కోలు కార్యక్రమం బుధవారం రాత్రి 10 గంటలకు(స్థానిక కాలమానం) తెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేనీ మసీదులో ప్రారంభమవుతుందని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.

ఈ కార్యక్రమాన్ని ఇస్లామిక్ ప్రచార సంస్థ నిర్వహించనుందని, మూడు రోజుల పాటు కార్యక్రమం జరగనుందని తొలుత వెల్లడించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు, నెతన్యాహు, ట్రంప్, ఖమేనీ

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, ఖమేనీ అంత్యక్రియలను ఇరాన్ వాయిదా వేసింది.

కొత్త సుప్రీం లీడర్ ఎవరు?

ముందుగా అనుకున్న ప్రకారం మార్చి 6న ప్రార్థన కార్యక్రమం జరిగి ఉండేది. మూడు రోజుల కార్యక్రమం తర్వాత ఆయన మృతదేహాన్ని ఖననం చేసి ఉండేవారు.

అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు అనేక మంది ఇరాన్ ముఖ్య నాయకులు, కమాండర్లు మరణించారు.

ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎవరనే దానిపై అధికారిక సమాచారం రాలేదు. కొత్త సుప్రీం లీడర్‌ను బుధవారం ప్రకటించవచ్చని భావించారు. కానీ అది జరగలేదు.

అయతొల్లా అలీ ఖమేనీ కొడుకు మోజ్తాబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా ఎంపిక చేసే అవకాశం ఎక్కువగా ఉందని మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఇరాన్‌లో సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే బాధ్యత కలిగిన నిపుణుల అసెంబ్లీ ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించిందని అయితే అధికారిక ఫలితాలు ఇంకా ప్రకటించలేదని ఇరాన్ మీడియా తెలిపింది.

క్యూమ్ నగరంలో మతానికి సంబంధించిన ప్రధాన కార్యాలయాన్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో కౌన్సిల్ సెక్రటేరియట్ ధ్వంసమైంది.

మోజ్తాబాకు అధికారం బదిలీ అయితే ఇరాన్‌లో కుటుంబ ఆధారిత మతపరమైన పాలనకు సంబంధించి కొత్త శకానికి నాంది పలుకుతుందని, ఇది దేశంలో అధికారపోరాటాన్ని మరింత తీవ్రతరం చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు, నెతన్యాహు, ట్రంప్, ఖమేనీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 56ఏళ్ల మొజ్తాబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా భావిస్తున్నారు.

ఇజ్రాయెల్ హెచ్చరిక

ఇరాన్ తదుపరి నాయకుడిని లక్ష్యంగా చేసుకుంటామని ఇజ్రాయెల్ హెచ్చరించింది.

అయతొల్లా అలీ ఖమేనీ స్థానంలో వచ్చే ఏ నాయకుడైనా "ఇజ్రాయెల్‌ను నాశనం చేయడానికి ప్రణాళిక వేయడం" వంటి విధానాలను కొనసాగిస్తే ఇజ్రాయెల్ "ప్రత్యక్ష చర్య"కు గురి అవుతారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ హెచ్చరించారు.

తెహ్రాన్‌లో అయతొల్లా ఖమేనీకి మూడు రోజుల 'వీడ్కోలు కార్యక్రమం' ప్రారంభమవుతుందని భావించిన సమయంలో ఈ ప్రకటన వచ్చింది.

"ఇజ్రాయెల్‌ను నాశనం చేయడం లేదా అమెరికాను, స్వేచ్ఛా ప్రపంచాన్ని బెదిరించడం అనే వారి ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి ఈ ‘ఉగ్రవాద ప్రభుత్వం’ ఎంచుకున్న ఎవరినైనా, వారి పేరు లేదా స్థానంతో సంబంధం లేకుండా నిర్మూలిస్తాం" అని కాట్జ్ ఒక ప్రకటనలో తెలిపారు.

హెజ్బుల్లా టాప్ కమాండర్ హసన్ నస్రల్లాను చంపినప్పుడు, తర్వాత ఆయన స్థానంలో వచ్చిన కమాండర్‌ను కూడా ఇజ్రాయెల్ హతమార్చింది.

ఖమేనీతో పాటు ఇరాన్ పాలనతో సంబంధం ఉన్న 49 మంది ఇతర కీలక నేతలు కూడా మరణించారని ఖమేనీ మరణం తర్వాత ఒక ప్రకటనలో అమెరికా పేర్కొంది.

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు, నెతన్యాహు, ట్రంప్, ఖమేనీ

ఫొటో సోర్స్, BERNO/SIPA/Shutterstock

ఫొటో క్యాప్షన్, తెహ్రాన్‌తో పాటు పలు నగరాలపై దాడులు కొనసాగుతున్నాయి.

మూడు దశాబ్దాలకు పైగా ఇరాన్‌ను నడిపించిన అలీ ఖమేనీ మరణం, ఆ తర్వాత ఇజ్రాయెల్ ఇచ్చిన కఠినమైన హెచ్చరిక పశ్చిమాసియాను అశాంతిలోకి నెట్టాయి.

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్, అణు కార్యక్రమానికి సంబంధించిన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ దాడులు జరిగాయి.

ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ఐదోరోజు కూడా రాజధాని తెహ్రాన్‌తో సహా ఇరాన్‌లోని అనేక ప్రాంతాలపై దాడులు కొనసాగాయి.

ఇరాన్ భద్రతా ప్రధాన కార్యాలయం, క్షిపణి కేంద్రాలు, ఇతర భద్రతా స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్టు ఇజ్రాయెల్ పేర్కొంది.

ఖమేనీ పూర్వీకుల నివాసం, ఇరాన్ మత కేంద్రమైన మషాద్ నగరంలో అంత్యక్రియలు, ఖననం జరుగుతాయని తెలుస్తోంది.

ఖమేనీ, నెతన్యాహు

ఫొటో సోర్స్, Reuters

వారసుడిని ప్రకటించని ఖమేనీ

దాదాపు నలభైఏళ్లు ఇరాన్‌ను పాలించిన సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ తన వారసుడిని ప్రకటించలేదు.

1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ రెలిజియస్ కౌన్సిల్ అత్యున్నత నాయకుడిని ఎన్నుకోవడం ఇదే మొదటిసారి.

అయతొల్లా రుహోల్లా ఖొమేనీ మరణం తర్వాత అలీ ఖమేనీ అకస్మాత్తుగా కౌన్సిల్ ద్వారా సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యారు.

ఇరాన్ రాజ్యాంగం ప్రకారం సుప్రీం లీడర్ మరణించిన సందర్భంలో, న్యాయవ్యవస్థ అధిపతి, మతపరమైన వ్యవహారాల అధిపతితో కూడిన తాత్కాలిక పరిపాలనా మండలి తక్షణమే తాత్కాలిక ప్రభుత్వానికి బాధ్యత వహించాలి.

ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ హత్యతో 1979 తర్వాత ఇరాన్ అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నట్టు భావించొచ్చు. కానీ సుప్రీంలీడర్ అధికారం చెక్కుచెదరలేదు.

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు, నెతన్యాహు, ట్రంప్, ఖమేనీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీంలీడర్ చనిపోయారు.

ఇరాన్ ప్రభుత్వం యథావిధిగా కొనసాగుతుందా?

అలీ ఖమేనీ మరణం తర్వాత, అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఇరాన్ ప్రజలకు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు.

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ఇలాంటి సందేశాన్నే ఇచ్చి ఇరాన్‌లో ప్రభుత్వాన్ని మార్చడం సాధ్యమేనని అన్నారు.

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్‌ సహా అనేక మంది అగ్ర నాయకులు హత్యకుగురయినప్పటికీ ఇరాన్ అధికార వ్యవస్థ చెక్కుచెదరకుండా ఉంది.

అమెరికా-ఇజ్రాయెల్ దాడి మొదలైన తర్వాత శనివారం(ఫిబ్రవరి 28) నుంచి ఖమేనీ మరణించినట్టు వార్తలు రావడం మొదలయింది. మరుసటి రోజు ఆదివారం ఉదయం ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆయన మరణాన్ని ధ్రువీకరించింది.

ఆ తర్వాత వెంటనే ముగ్గురు సభ్యుల తాత్కాలిక మండలిని ఏర్పాటు చేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది.

ఇరాన్ సుప్రీం లీడర్‌ను 88 మంది సభ్యుల కౌన్సిల్ ఎన్నుకుంటుంది. ఎనిమిది సంవత్సరాల కాలానికి ప్రత్యక్ష ఓటు ద్వారా ఎన్నుకుంటారు.

అలీ ఖమేనీ మరణం తరువాత ఇరాన్ ప్రభుత్వం స్థిరంగా కనిపించడానికి చర్యలు తీసుకుంది.

రాజ్యాంగ ప్రక్రియను ప్రారంభించడం ద్వారా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సుప్రీం లీడర్ మరణం తర్వాత కూడా ఇరాన్ పాలనా వ్యవస్థ చెక్కుచెదరకుండా ఉందని చూపించడానికి ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)