You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ: ‘పవన్ కల్యాణ్ వన్ మేన్ షో’.. పోలీస్ పాత్రలో పవన్ మళ్లీ గబ్బర్ సింగ్‌ను గుర్తుకు తెచ్చారా?
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
- చదివే సమయం: 4 నిమిషాలు
గబ్బర్‌సింగ్ తరువాత హరీశ్‌శంకర్, పవన్‌కల్యాణ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఉస్తాద్ భగత్‌సింగ్. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి గబ్బర్‌సింగ్ మ్యాజిక్ మళ్లీ రిపీటైందా? పవన్ కల్యాణ్‌కు హిట్ పడిందా?
కథలోకి వెళితే.. గిరిజన ప్రాంతంలో చంద్రశేఖరమూర్తి అనే ఒక ఆదర్శ టీచర్ (కెఎస్ రవికుమార్) ఉంటాడు. ఆయన్ను సేవా భావం, నిబద్ధత చూసి రాజకీయాల్లోకి ఆహ్వానిస్తారు. ఆ టీచర్ భగత్‌సింగ్ (పవన్‌కళ్యాణ్)ని చిన్నప్పుడే దత్తత తీసుకుంటారు.
అనంతరం ఆ టీచర్ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు. ఓపెనింగ్ సీన్‌లోనే ఆయన పెళ్లికి వస్తే హత్య ప్రయత్నం జరుగుతుంది. ప్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తే నల్లనాగప్ప (పార్తిబన్) ఒక అవినీతి రాజకీయ నాయకుడు, తరువాత అపద్దర్మ ముఖ్య మంత్రి అవుతాడు.
అతని చిన్న కొడుకు ఒకరోజు జల్సా చేసుకోడానికి అడవికి వెళతాడు. స్నేహితులతో కలిసి పోలీస్‌స్టేషన్‌పై దాడి చేస్తే, హీరో భగత్ వచ్చి పోలీసుల్ని రక్షించి నాగప్ప కొడుకుని బందీగా తీసుకెళతాడు. దీంతో, కొడుకుని విడిపించడానికి నాగప్ప టెర్రరిస్ట్‌లని పంపిస్తాడు.
ఆ తర్వాత ఏం జరిగింది? అసలు భగత్ అడవిలో ఎందుకున్నాడు? అదే సమయంలో శ్లోక (రాశిఖన్నా) అడవిలో ఎందుకు ఉన్నారు, భగత్ నేపథ్యం ఏమిటి. ఇదంతా మిగతా కథ.
కామెడీ, యాక్షన్ కలిపి పవన్ 'వన్ మేన్ షో'
ఉస్తాద్ భగత్ సింగ్ పవన్‌కల్యాణ్ వన్ మేన్ షో అనుకోవచ్చు.
చాలాకాలం తర్వాత ఆయన కామెడీ, యాక్షన్ కలిపి చేశారు. సెకెండాఫ్‌లో పోలీస్ యూనిఫాంలో గబ్బర్‌సింగ్‌ని గుర్తుకుతెస్తారు పవన్. అన్ని కథల్లాగే ఇది కూడా ధర్మానికి అధర్మానికి మధ్య జరిగేది.
పదవి కోసం టెర్రరిస్ట్‌లతోనైనా చేతులు కలిపే విలన్, తాను దైవంగా భావించే పెంపుడు తండ్రి కోసం ఎంతకైనా తెగించే హీరో. ఏ కమర్షియల్ సినిమా అయినా మంచికి చెడుకి జరిగే సంఘర్షణే.
అయితే దర్శకుడు హరీష్ శంకర్ కథనాన్ని కొత్తగా, ఫ్రెష్‌గా రాయడం, తీయకపోవడం వల్ల అన్ని సీన్స్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తూ వుంటాయి.
ఈ కథకి మూలస్తంభం హీరోనే, పవన్ కల్యాణ్ భుజాల మీదే సినిమా నడుస్తుంది.
కొన్ని డైలాగ్‌లు, సీన్స్ అభిమానులకి గూస్‌బంప్స్ తెప్పిస్తాయి.
ఎవరెలా నటించారు?
సినిమా ఫస్టాఫ్, సెకెండాఫ్ రెండూ వేర్వేరు ట్రాక్‌లు.
ఫస్టాఫ్ అడవిలో పవన్, రాశీఖన్నా మధ్య సాగితే, సెకెండాఫ్ పవన్, శ్రీలీల మధ్య ఉంటుంది. జిహాది టెర్రరిస్టులు, రథయాత్ర ఫైట్ కథతో సంబంధం లేకుండా ఇరికించినట్టు ఉంటాయి.
రాశీఖన్నాకి, శ్రీలీలకి నటించడానికి స్కోప్ లేదు.
ముఖ్యమంత్రిగా కేఎస్ రవికుమార్, హీరో తల్లిగా గౌతమి నటించారు. వాళ్లిద్దరు మంచి నటులే కానీ, దర్శకుడు సరిగ్గా ఉపయోగించుకోలేదు.
రావు రమేశ్ కూడా ఒక పాత్రలో నటించారు.
పవన్ నటనే ప్రత్యేకం
కథలో, బీజీఎంలో ఫ్రెష్‌నెస్ లేదు. ఫొటోగ్రఫీ బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ రెండు పాటలు ఓకే.
ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పవన్ నటన గురించి. గబ్బర్‌సింగ్ నాటి ఈజ్‌నెస్ , కామెడీ టైమింగ్ మళ్లీ కనిపిస్తాయి. ఎనర్జటిక్‌గా కనిపిస్తాడు. ఆయనకి శ్రీలీలకి కెమెస్ట్రీ కుదిరింది.
'యుద్ధం మధ్యలో భగవద్గీత చెప్పారు, యుద్ధం ఆపేయమని కాదు', 'గాజు గ్లాస్ (జనసేన గుర్తు) పగిలిన కొద్దీ పదునెక్కుతుంది', 'జీవితాన్ని జీతాన్ని కూడా పేద పిల్లలకి ధారపోస్తున్నాడు' ... ఇలా చాలా డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి.
ఈ సినిమా ప్రారంభించి ఆరేళ్లయ్యింది. దీని వల్ల కూడా కథ ఔట్‌డేటెడ్ అనిపించొచ్చు.
మైత్రీ మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా వున్నాయి.
రీమేక్ కాదు
అందరూ అనుకున్నట్టు ఇది తమిళ సినిమా తెరీకి రీమేక్ కాదు. ఆ కథకి, ఈ కథకి సంబంధమే లేదు. హీరో పోలీస్ అధికారి కావడం ఒకటే పోలిక.
చాలాకాలం తర్వాత ఎల్‌బీ శ్రీరామ్ ఒక ఎమోషనల్ సీన్‌లో కనిపించారు.
మొదటి 45 నిమిషాలు కథ నెమ్మదిగా సాగుతూ కామెడీ ట్రాక్‌తో నడుస్తుంది.
సినిమాలో పవన్ కల్యాణ్ డ్యాన్స్ స్టెప్స్ అభిమానులకి నచ్చుతాయి.
ప్లస్ పాయింట్స్
1. పవన్ కల్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్
2. డైలాగులు
3. పవన్ కల్యాణ్ డ్యాన్స్
మైనస్ పాయింట్
1. రొటీన్ కథ, కథనం
2. ఫస్టాఫ్
3. విలన్ బలంగా లేకపోవడం
ఫైనల్‌గా భగత్‌సింగ్ పవన్ అభిమానులకి నచ్చుతాడు.
(అభిప్రాయాలు సమీక్షకుడి వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)