ఇరాన్ కుటుంబాల్లో చీలికలు తెస్తున్న యుద్ధం

    • రచయిత, ఘోన్చె హబీబియాజిద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 6 నిమిషాలు

'నువ్వు నా సోదరివి కాదు' అని ఆయనంటే, ‘గో టు హెల్’ అని ఆమె ఆయనతో అన్నారు.

ఇది తెహ్రాన్‌కు దగ్గరలోని ఓ నగరంలో ఓ వ్యక్తికి తన సోదరితో జరిగిన సంవాదం. ఈ వాదనకు ప్రత్యక్షసాక్షిగా ఉన్న వారి బంధువుల్లో ఒకరు ఇరాన్ కుటుంబాల్లో తలెత్తుతున్న బాధాకరమైన పరిస్థితులను వివరించారు.

ఆ బంధువు పేరు సినా. అమ్మమ్మ ఇంట్లో వాళ్ల కుటుంబం ఇటీవల కలుసుకుంది. వారి మధ్య భావోద్వేగాలు ఎక్కువై గొడవలు జరిగాయి.

ఆయన మామయ్య బాసిజ్‌లో సభ్యులు. ఇరాన్‌లో అసమ్మతిని అణగదొక్కడానికి మోహరించిన మిలీషియా పేరే బాసిజ్. అందులో ఆయన వలంటీర్. తన సొంత సోదరితో మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. ఆమె ఇరాన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారు.

''ఆ సంభాషణ తర్వాత మామయ్య చాలా మౌనంగా ఉండిపోయారు. అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు'' అని సినా చెప్పారు.

బంధాలపై యుద్ధం ప్రభావం

యుద్ధం వల్ల విభేదాలు పెరిగి భావోద్వేగ పరిస్థితులు ఎలా ఏర్పడుతున్నాయో ఆయన, కొందరు యువకులు బీబీసీకి వివరించారు.

యుద్ధం మేలు చేస్తుందా? లేక మార్పును అడ్డుకుంటుందా? అనే విషయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారిలో కూడా విభేదాలు ఉన్నాయి.

ప్రభుత్వం ఇంటర్నెట్‌ను నిషేధించినప్పటికీ కొందరు ఇరానీయులను బీబీసీ ఆన్‌లైన్‌లో సంప్రదించగలిగింది. కొంతమంది ఇతర మార్గాల ద్వారా ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు.

కొన్నిరకాల అంతర్జాతీయ మీడియాతో మాట్లాడినందుకు ఇరాన్ ప్రజలను జైలుకు పంపొచ్చు. అయినప్పటికీ ఈ నెల రోజుల యుద్ధకాలంలో వారు అప్పుడప్పుడు కొన్ని మెసేజ్‌లు, వాయిస్ కాల్స్ ద్వారా సమాచారం పంచుకున్నారు.

తొలిరోజుల్లో భయం, ఆందోళన ఉన్నప్పటికీ ఇప్పుడు పరిస్థితులకు అలవాటు పడే ప్రయత్నం చేస్తున్నారు ప్రాంతాలు, రోజువారీ అలవాట్లు మార్చుకుంటున్నారు. తమ జీవితాలు ఎలా సాగుతున్నాయో చెబుతున్నారు. పేలుళ్ల మోతలు ఉన్నప్పటికీ యోగా సాధన చేయడం, ఒంటరిగా బర్త్‌డే కేక్ తినడం, ఖాళీగా ఉన్న కాఫీషాపులకు వెళ్లడం వంటివి చేస్తున్నామని వారు చెబుతున్నారు.

ఆశ్చర్యకరంగా కొందరు పర్సనల్ నోట్స్‌లో ఈ సంక్షోభం తమ బంధాలపై ఎలాంటి ప్రభావం చూపిందో వివరించారు. ఈ ఆర్టికల్‌లో అందరి పేర్లు మార్చాం.

‘‘సొంత పిల్లలనయినా క్షమించరు’’

మార్చి చివరివారంలో ఇరానీయులు నవ్రోజ్ జరుపుకున్నారు. ఇది పర్షియన్ కొత్త సంవత్సరం వేడుక. ఇది వసంత రుతువు ఆగమనాన్ని సూచించే పండుగ. కుటుంబాలు ఒకచోట కలుసుకుంటాయి.

సినా ఇప్పుడు 20ల్లో ఉన్నారు. ఆయన మత పాలనను వ్యతిరేకిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు మద్దతిస్తున్నారు. ప్రభుత్వం కూలిపోవడానికి ఈ దాడులు ఉపయోగపడతాయని ఆయన భావిస్తున్నారు.

బాసిజ్ సభ్యుడైన తన మామయ్య ఇటీవలి సంవత్సరాల్లో నవ్రోజ్ సందర్భంగా అందరూ కలుసుకునేచోటుకు రావడం లేదని, కానీ ఈసారి రావడం అందరికీ ఆశ్చర్యం కలిగించిందని సినా చెప్పారు.

''ఆయనతోగానీ, ఆయన పిల్లలతోగానీ మేం మాట్లాడం'' అని సినా అన్నారు.

హిజాబ్‌ను సరైన విధంగా ధరించలేదని ఆరోపిస్తూ అదుపులోకి తీసుకున్న మహిళ మహ్సా అమినీ కస్టడీలో మరణించిన తర్వాత జరిగిన భారీ ఆందోళనల సమయం నుంచి తన మామయ్యతో తాను చాలా తక్కువ మాట్లాడానని ఆయన చెప్పారు.

డిసెంబరు, జనవరిలో దేశమంతా జరిగిన ఆందోళనలను బాసిజ్, ఇతర భద్రతాబలాగాలు కఠినంగా అణిచివేశాయి. కనీసం 6,508మంది నిరసనకారులను చంపి ఉంటారని, 53 వేలమందిని అరెస్టు చేశారని అమెరికాకు చెందిన మానవ హక్కుల కార్యకర్తల న్యూస్ ఏజెన్సీ(హెచ్ఆర్ఏఎన్ఏ)తెలిపింది.

ఆందోళనలపై తన మామయ్య చాలా కోపంగా ఉన్నారని ఇతర బంధువులు చెప్పినట్టు సినా తెలిపారు. తన సొంత పిల్లలు వీధుల్లోకి వెళ్లినా ఆయన చంపేస్తారని, వారి మృతదేహాలను కూడా తీసుకురారని బంధువులు అన్నట్టు సినా వివరించారు.

యుద్ధంలో ''మరణిస్తానని'' తన మామయ్య భయపడుతున్నట్టు కనిపిస్తోందని. అందుకే ఆయన తల్లితో సహా ఇతర కుటుంబసభ్యులతో అనుబంధం పెంచుకోవాలని భావిస్తున్నారని సినా చెప్పారు. ఆయన తల్లి, సినాకు అమ్మమ్మ.

నవ్రోజ్ దగ్గర ఆయన, ఆయన భార్య నిరాశగా, నిస్సహాయంగా ఉన్నారని సినా చెప్పారు.

''నేను వాళ్లతో గొడవ పడలేదు. వాళ్లు జైల్లో ఉండాలి'' అని ఆయన అన్నారు.

ప్రభుత్వంపై వ్యతిరేకతఉన్నా యుద్ధాన్ని సమర్థించని కొందరు ఇరానీయులు

తెహ్రాన్‌కు చెందిన మరో యువకుడు కావెహ్ ఒంటిరిగా నవ్రోజ్ జరుపుకున్నారు.

బాసిజ్ సభ్యురాలైన తన సోదరితో తనకు సంబంధాలు ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్నాయని ఆయన చెప్పారు. 2022 ఆందోళనల్లో తాను పాల్గొన్న తర్వాత ఆమె తన కార్యకలాపాలపై విమర్శలు చేశారని, జనవరి ఆందోళనల్లో తన స్నేహితులు మరణించడంపై ఎలాంటి సానుభూతి చూపించలేదని ఆయన చెప్పారు.

స్పేస్ ఎక్స్ స్టార్‌లింక్ ద్వారా కావెహ్ తన స్నేహితులకు, కుటుంబానికి ఇంటర్నెట్ అందిస్తున్నారు. శాటిలైట్స్ ద్వారా కనెక్టివిటీ ఉంటుంది. ఇరాన్‌లో స్టార్‌లింక్ టెర్మినల్స్ ఉన్నా, ఉపయోగించినా రెండేళ్ల వరకు జైలుశిక్ష పడుతుంది.

సెలవుల సమయంలో ఆయన కుటుంబసభ్యుల దగ్గరకు వెళ్లారు. ఆయన అక్కడినుంచి బయటకు వెళ్లి వచ్చేసరికి స్టార్‌లింక్‌ను, ఇతర పరికరాలను తన సోదరి డిస్ కనెక్ట్ చేసినట్టు గుర్తించారు. దీనిపై ఆమెను ప్రశ్నించినప్పుడు గొడవ తలెత్తిందని ఆయన తెలిపారు.

''ఇంక ఆమెను భరించలేను. ఆమెతో గొడవ పడి భరించలేక అక్కడినుంచి వచ్చేశాను'' అని ఆయన చెప్పారు.

''నవ్రోజ్ కోసం ఎంతో ఎదురుచూశా. కుటుంబంతో గడపాలని నా దుస్తులన్నీ సర్దుకుని వెళ్లా. కానీ ఇప్పుడు ఒంటరిగా ఇంటికెళ్తున్నా. అయినా నాకెలాంటి బాధ లేదు'' అని ఆయన చెప్పారు.

చాలామంది ఇరానియన్లకు ఇంటర్నెట్ యాక్సెస్ లేదు. స్టార్‌లింక్ పరికరాలు చాలా ఖరీదైనవి. అలాగే వాటిని ఉపయోగించడం చట్టవిరుద్ధం. స్టార్‌లింక్ యాక్సెస్ ఉన్నవారు చాలా సంపన్నులు. మిగిలిన కొందరు వీఎన్‌పీల ద్వారా కనెక్ట్ చేసుకుంటున్నారు.

బీబీసీ పర్షియన్‌తో మాట్లాడిన ఇరానియన్లలో ఎక్కవమంది ఇరాన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రభుత్వ విమర్శకులయినప్పటికీ యుద్ధంమీద, దాని ప్రభావం మీద వారిలో చాలా చాలా విభేదాలున్నాయి.

అంతర్జాతీయ రెడ్‌క్రాస్, రెడ్ క్రెసెంట్ సొసైటీల ప్రకారం అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో 1,900మంది ప్రజలు చనిపోయారు. హెచ్‌ఆర్‌ఏఎన్‌ఏ ప్రకారం మృతుల సంఖ్య 3,400. వారిలో 1,500మందికి పైగా సాధారణ ప్రజలు.

‘ఇరాన్, ఇజ్రాయెల్ స్నేహితులుగా మారే అవకాశం ఉందా?’

మరాల్ 20ల వయసులో ఉన్న ఓ విద్యార్థిని. ఉత్తర ఇరాన్‌లోని రష్త్ నగరానికి చెందినవారు. తన తండ్రి యుద్ధానికి మద్దతివ్వడంపై ఆమె చాలా కోపంగా ఉన్నారు.

1979 ఇరాన్ విప్లవానికి ముందున్న రాజకుటుంబానికి చెందిన రెజా పహ్లావికి ఆయన మద్దతుదారు.

పహ్లావీ ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు. భవిష్యత్ నాయకునిగా తననుతాను చూపించుకుంటున్నారు. పెద్దసంఖ్యలో మరణాలు నమోదవుతున్నప్పటికీ ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఆయన మద్దతుఇస్తున్నారు. దాడులను ''మానవత్వపు జోక్యంగా'' అభివర్ణించిన ఆయన వాటిని కొనసాగించాలని ఇటీవల అమెరికాకు విజ్ఞప్తి చేశారు.

ప్రతిపక్షనేతగా ఇటీవల ఆయనకు మద్దతు పెరిగింది. జనవరిలో ఆందోళనలు జరిపినవారిలో కొందరు ఆయన పేరును నినదించారు.

''ఈ యుద్ధం ఎంత త్వరగా వీలయితే, అంత త్వరగా ముగియాలని నేను కోరుకుంటున్నా'' అని మరాల్ చెప్పారు. చాలామంది సాధారణ ప్రజలు చనిపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

బాంబులు పడుతున్నప్పటికీ తన తండ్రి ఆశావహంగా ఉండడం తనకు అసహనం కలిగిస్తోందని ఆమె చెప్పారు.

''మేం ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నించాం. కానీ ఆయన ది ప్రిన్స్, ది ప్రిన్స్ అనే అంటున్నారు'' అని ఆమె చెప్పారు.

''ఇరాన్ తన సరిహద్దులను తెరుస్తుందని, ఐదేళ్లలో మొత్తం పునర్‌నిర్మాణం జరుగుతుందని, అంతా బాగుంటుందని మా నాన్న భ్రమపడుతున్నారు. ఇజ్రాయెల్ ప్రచారం ప్రభావం ఆయనపై ఉంది. రెండు దేశాలు స్నేహితులవుతాయని ఆయన భావిస్తున్నారు'' అని ఆమె చెప్పారు.

ఆమె తల్లి, తండ్రి పహ్లావీ గురించి తరచూ వాదించుకుంటుంటారని ఆమె చెప్పారు.

‘యుద్ధం వీలయినంత తొందరగా ముగియాలని’

తెహ్రాన్‌కు చెందిన టారా 20ల్లో ఉన్నారు. యుద్ధాన్ని వ్యతిరేకించినందుకు తన దగ్గరి కుటుంబ సభ్యులు మొదట్లో తనను విమర్శించారని ఆమె చెప్పారు.

''వాళ్లంతా ఇరాన్‌పై దాడికి మద్దతిచ్చారు. నువ్వెవరినీ పోగొట్టుకోలేదు. అందుకే నువ్వు దాడులను వ్యతిరేకించడం లేదు అని మా అమ్మ, సోదరి నాతో అన్నారు. నీ రోజువారీ జీవితం, వ్యాయామం, కాఫీకి వెళ్లడంవంటివాటికి అంతరాయమేర్పడకూడదని నువ్వనుకుంటున్నావు. ప్రభుత్వం నీ బంధువుల్లో, స్నేహితుల్లో ఎవరినన్నా చంపి ఉంటే నీ అభిప్రాయం మరోలా ఉండేది'' అని వాళ్లు అన్నారు.

''వేలాదిమంది అమాయక ప్రజలు యుద్ధం వల్ల చనిపోతారు. వాళ్లనెవరూ కనీసం గుర్తు కూడా పెట్టుకోరు'' అని టారా వాళ్లకు బదులు చెప్పారు.

దాడులు కొనసాగడంతో ఆమె సోదరి అభిప్రాయం కొంత మారిందని టారా చెప్పారు. ఇటీవల దగ్గరలో బాంబు పడిన తర్వాత యుద్ధం త్వరలో ముగుస్తుందని తాను అనుకుంటున్నానని ఆమె చెప్పారు.

విభేదాలున్నాకూడా కుటుంబం కలిసి ఉండడానికి ప్రయత్నిస్తుందని టారా చెబుతున్నారు.

‘‘బాంబు పడితే అందరం ఒకేసారి చనిపోతాం’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)