ఇరాన్: "అమెరికా సైనికులు వస్తే నిప్పుల వర్షం కురిపించేందుకు ఎదురు చూస్తున్నాం’’

    • రచయిత, కాథ్రిన్ ఆర్మ్‌స్ట్రాంగ్
  • చదివే సమయం: 5 నిమిషాలు

మధ్య ప్రాచ్యంలోకి మరో 3,500 అమెరికా బలగాలు చేరుకున్నాయనే వార్తలు వినిపిస్తున్న వేళ "అమెరికా సైనికుల కోసం తమ బలగాలు కాచుకుని ఉన్నాయి" అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ హెచ్చరించారు.

ఇరాన్ భూభాగంలోకి అమెరికా బలగాలు అడుగుపెట్టాలని ప్రయత్నిస్తే… ఇరాన్ "నిప్పుల వర్షం" కురిపిస్తుందని మొహమ్మద్ బగారే గాలిబఫ్ అన్నారు.

కొత్తగా అక్కడకి చేరుకున్న సెయిలర్లు, మెరైన్లు… అమెరికా యుద్ధనౌక యూఎస్ఎస్ ట్రిపోలీ యూనిట‍్‌వని యూఎస్ సెంట్రల్ కమాండ్ 'ఎక్స్'లో తెలిపింది.

ఇందులో దాడి చేయడానికి, రవాణాకు ఉపయోగపడే వనరులు ఉన్నాయని పేర్కొంది.

ఇరాన్‌లో కొన్నివారాల భూతల దాడుల కోసం పెంటగాన్ సిద్ధమవుతోందని వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ చేసిన క్రమంలో ఈ బలగాలు అక్కడికి చేరుకున్నాయి.

అయితే, భూతల దాడుల కోసమే బలగాలను మోహరించారా అనే విషయాన్ని అమెరికా అధికారులు ధ్రువీకరించలేదు.

"శత్రువు బహిరంగంగా చర్చల సంకేతాలు పంపిస్తారు. మరోవైపు రహస్యంగా భూతల దాడుల కోసం ప్రణాళికలు రచిస్తారు" అంటూ గాలిబఫ్ వ్యాఖ్యానించినట్టు ఇరాన్‌ అధికారిక మీడియాలో కథనాలు వచ్చాయి.

యుద్ధంపై ట్రంప్ మిశ్రమ సందేశాలు..

యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ నుంచి మిశ్రమ సందేశాలు వినిపిస్తున్నాయి.

ఆ మధ్య యుద్ధం ముగింపు దరిదాపుల్లోకి వచ్చిందని ట్రంప్ చెప్పారు.

అలాగే ఇంధనం సహా ఇరాన్‌పై ఇంకేమైనా చర్యలు తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు.

ఇలా ఆయన రెండు రకాలుగా మాట్లాడుతున్నారు.

గత వారం ప్రారంభంలో, ఇరాన్‌లో మిలటరీ ఆపరేషన్ కోసం కాంగ్రెస్‌ను 200 బిలియన్ డాలర్లు (సుమారు రూ.19 లక్షల కోట్లు) ఇవ్వాలని కోరేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమవుతోందని యూఎస్ మీడియా రిపోర్ట్ చేసింది.

ట్రంప్ యుద్ధాన్ని కొనసాగించాలనుకుంటారని ఈ వార్తలు సూచిస్తున్నాయి.

అంతకుముందు వారం ఓవల్ ఆఫీసులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తాను ఇరాన్‌లోకి సైనిక బలగాలను పంపడం లేదన్నారు. "ఒకవేళ పంపేట్టయితే కచ్చితంగా మీకు చెప్పను" అని కూడా అన్నారు.

మరోవైపు, భూతల సైనిక బలగాల అవసరం లేకుండానే అమెరికా తమ యుద్ధ లక్ష్యాలను సాధించగలదని విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు.

"మధ్యప్రాచ్యానికి చేరిన అమెరికా సైనిక సంపత్తి"

శ్వేతసౌధం ఆమోదించే ఏ రకమైన భూతలదాడులైనా, అందులో సాధారణ బలగాలతో పాటు స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్ ఉంటాయని అమెరికా అధికారులను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.

అయితే, అది పూర్తి స్థాయి ఇరాన్ ఆక్రమణకు దారి తీసేంత పెద్దది కాదని రాసింది.

ఇరాన్‌తో "తాడో పేడో" తేల్చుకోవడానికి పెంటగాన్.. సైనిక ప్రత్యామ్నాయ ఎంపికలను అభివృద్ధి చేస్తోందని యాక్సియోస్ కూడా రిపోర్ట్ చేసింది.

ఈ ప్రత్యామ్నాయ ఎంపికలలో భూతలదాడులతో పాటు బాంబింగ్ క్యాంపెయిన్ కూడా ఉండొచ్చని పేర్కొంది.

ఇరాన్‌పై ఆపరేషన్‌లో భాగంగా అమెరికా ఇదివరకే తమ సైనిక సంపత్తిని మధ్యప్రాచ్యానికి చేర్చింది. ఇందులో బాంబర్లు, ఫైటర్ జెట్స్ (యుద్ధ విమానాలు), అలాగే విమాన వాహక నౌకలు, మిసైల్ ఇంటర్‌సెప్టార్స్ (క్షిపణులను అడ్డుకునే వ్యవస్థలు) ఉన్నాయి.

అమెరికా నౌకాదళ విమాన వాహక నౌక, యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ శనివారం క్రొయేషియాకు చేరుకుంది.

బోర్డులో మంటలు చెలరేగి నౌకాదళ సిబ్బందికి గాయాలవ్వడంతో పాటు, నౌకకు తీవ్ర నష్టం వాటిల్లడంతో మరమ్మతుల కోసం క్రొయేషియాకు చేరింది.

చర్చలు జరుగుతున్నాయా?

అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయో లేదో స్పష్టత లేదు.

ఇలాంటి చర్చలేవీ జరగడం లేదని ఇరాన్ చెబుతోంది. కానీ మధ్యవర్తుల ద్వారా అమెరికాకు, తమ దేశానికి మధ్య సందేశాలు ఇచ్చిపుచ్చుకున్నట్టు చెప్పారు. అయితే అవి చర్చలువంటివి కావన్నారు.

మరోవైపు ట్రంప్ మాత్రం… చర్చలు జరుగుతున్నాయని, అవి చాలా "చక్కగా సాగుతున్నాయి" అన్నారు.

ఈ విషయాన్ని ఒప్పుకునేందుకు ఇరాన్ భయపడుతోందని, ఈ విషయం తెలిస్తే తమ సొంత ప్రజలే తమను చంపుతారనే భయం వారిలో ఉందని ట్రంప్ అన్నారు.

ఘర్షణ ముగించేందుకు ఉద్దేశించిన 15 పాయింట్ల ప్రణాళికను ట్రంప్, పాకిస్తాన్ ద్వారా ఇరాన్‌కు చేర్చారని మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి.

కానీ దీనికి సంబంధించిన అధికారిక పత్రం ఏదీ కూడా ప్రచురితం కాలేదు. అణు కార్యక్రమాన్ని నిలిపివేయడం సహా ఎన్నో ఏళ్లుగా అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న డిమాండ్లతో కూడిన సమాహారమే ఈ ప్రణాళిక అనే కథనాలు వినిపించాయి.

దీనికి తెహ్రాన్ కూడా తమ సొంత డిమాండ్లతో స్పందించింది. హార్ముజ్ జలసంధిపై తమ నియంత్రణకు గుర్తింపు ఇవ్వడం, యుద్ధంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు పరిహారం చెల్లించడం, అలాగే మధ్య ప్రాచ్యం నుంచి అమెరికా స్థావరాలను తొలగించడం వంటివి ఇందులో ఉన్నాయి.

"15- పాయింట్ల జాబితాతో అమెరికా తన కోరికలను బయటపెట్టడంతో పాటు, యుద్ధంలో సాధించలేకపోయిన వాటి గురించి ప్రస్తావిస్తోంది" అని గాలిబఫ్ శనివారం అన్నారు.

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న మొదలు పెట్టిన దాడులలో… ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సహా ఇరాన్‌కు చెందిన పలువురు ఉన్నతాధికారులు చనిపోయారు.

ఇరాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనను పర్యవేక్షించే అమెరికాకు చెందిన సంస్థ హెచ్ఆర్ఏఎన్ఏ ప్రకారం…. బాంబు దాడుల్లో 1,551 మందికి పైగా ఇరాన్ పౌరులు చనిపోయారు.

దీనికి ప్రతీకారంగా.. మధ్య ప్రాచ్యంలోని ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు జరిపింది.

దీంతో, అంతర్జాతీయ విమాన రాకపోకలకు అంతరాయం కలగడంతో పాటు చమురు ధరలు పెరిగాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)