ఇరాన్ క్షిపణులను ఎదుర్కొంటున్న సౌదీ, ఖతార్, కువైట్‌ల సైనిక శక్తి ఎంత?

చదివే సమయం: 6 నిమిషాలు

అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా అమెరికా సైనిక స్థావరాలున్న గల్ఫ్ దేశాల్లో ఇరాన్ దాడులు చేయడం ప్రారంభించింది.

ఇరాన్ దాడులు చేస్తోన్న అమెరికా సైనిక స్థావరాలున్న ఈ దేశాలకు కూడా బలమైన సైనిక శక్తి, సామర్థ్యాలు ఉన్నాయి.

అయినప్పటికీ, ఈ దేశాలు ఇప్పటి వరకు ఇరాన్‌పై దాడులకు దిగలేదు.

ఇరాన్ క్షిపణి దాడులను ఎదుర్కొంటోన్న గల్ఫ్ దేశాల్లో, సౌదీ అరేబియా వద్ద భారీ సైన్యం ఉంది.

సౌదీ అరేబియా వార్షిక రక్షణ బడ్జెట్ 2024లో 80.30 బిలియన్ డాలర్లుగా అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.7,53,659 కోట్లు.

బలమైన సైనిక సామర్థ్యాలు, భారీ రక్షణ బడ్జెట్ కారణంగా మిడిల్ ఈస్ట్‌లో ఒక శక్తిమంతమైన సైనిక శక్తిగా సౌదీ అరేబియా అవతరించింది.

సౌదీ అరేబియా సైన్యానికి అతిపెద్ద బలం తన వైమానిక దళమేనని చెబుతుంటారు.

1. సౌదీ అరేబియా

రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్ వద్ద ఎఫ్-15 స్ట్రయిక్ ఈగల్, యూరోఫైటర్ టైఫూన్ వంటి 300కి పైగా ఆధునిక యుద్ధ విమానాలు ఉన్నాయి.

ఇవే దాని పొరుగు దేశాలతో పోలిస్తే సౌదీకి బలమైన స్థానాన్ని కల్పిస్తున్నాయి.

అలాగే, సౌదీ అరేబియా వద్ద అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 'పీస్ షీల్డ్' ఉంది.

క్షిపణులు, అధునాతన డ్రోన్లు కూడా సౌదీ అరేబియా వద్ద ఉన్నాయి.

అమెరికన్ అబ్రామ్స్ ట్యాంకులు, అత్యాధునిక సాయుధ వాహనాలతో కూడిన సౌదీ అరేబియా సైన్యాన్ని బలమైనదిగా పరిగణిస్తుంటారు.

సౌదీ అరేబియా తన సముద్ర మార్గాలు, ఇంధన స్థావరాలను కాపాడుకునేందుకు నౌకాదళాన్ని బలోపేతం చేసుకుంది.

ఇంత భారీ మొత్తంలో రక్షణ బడ్జెట్ ఉన్నప్పటికీ, సౌదీ అరేబియా సైన్యం మాత్రం ఇంకా విదేశీ ఆయుధాలు, సాంకేతికతపైనే ఎక్కువగా ఆధారపడుతుంది.

తన ఆయుధాలు, సైనిక పరికరాల్లో చాలా వరకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ నుంచే పొందుతుంది.

యాన్యువల్ ఫైర్‌పవర్ రివ్యూ ప్రకారం.. సైనిక శక్తి విషయంలో 2026లో 145 దేశాల్లో సౌదీ అరేబియా 25వ స్థానంలో నిలిచింది.

దీని ఫైర్‌పవర్ ఇండెక్స్ స్కోర్ 0.4473.

గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ అనేది వార్షిక డేటా ఆధారంగా విడుదల చేసే ర్యాంకింగ్. ఇది వివిధ దేశాల సంప్రదాయ సైనిక శక్తి, సామర్థ్యాలను అంచనా వేస్తుంది.

దీనిలో సైనిక శక్తి, సైన్యం, వైమానిక దళం, నావిక దళ సామర్థ్యాలు, లాజిస్టిక్స్, ఆర్థిక వనరులు ఉంటాయి. వీటన్నింటినీ ఉపయోగించి, 'పవర్ ఇండెక్స్' స్కోర్‌ను లెక్కిస్తారు.

దీనిలో ఎంత తక్కువ స్కోరు ఉంటే.. అంత బలమైన సంప్రదాయ సైనిక శక్తి ఉందని అర్థం.

గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్‌లో తక్కువ స్కోరును మెరుగైనదిగా పరిగణిస్తారు. సిద్ధాంతం పరంగా మంచి స్కోర్ 0.0000. అయితే, ఇప్పటి వరకు ఈ స్థాయికి ఏ దేశమూ చేరుకోలేదు.

0.0857 స్కోరుతో అమెరికా ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉంది. ఆ తర్వాత రష్యా, చైనాలు రెండో స్థానంలో ఉన్నాయి.

ఈ ఇండెక్స్‌లో భారత్ నాలుగో స్థానంలో, పాకిస్తాన్ 14వ స్థానంలో ఉన్నాయి.

2. కువైట్

మరో గల్ఫ్ దేశం కూడా ప్రధాన సైనిక శక్తిగా శరవేగంగా ఎదుగుతోంది.

కీలక గల్ఫ్ దేశమైన కువైట్ తన బలమైన ఆర్థిక వ్యవస్థను, వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఉపయోగించుకుని, శక్తివంతమైన సైన్యాన్ని అభివృద్ధి చేసుకుంది.

2024లో కువైట్ రక్షణ బడ్జెట్ 7.79 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.73,091 కోట్లు).

గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్‌లో 1.716 ఫైర్‌పవర్ ఇండెక్స్ స్కోరుతో కువైట్ 76వ ర్యాంకులో ఉంది.

కువైట్‌లో 18 నుంచి 35 ఏళ్ల మధ్య పురుషులకు మిలటరీ సర్వీస్ తప్పనిసరి.

కువైట్ సైన్యం వద్ద సుమారు 367 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. ఆ దేశ వైమానిక దళం వద్ద 50 ఫైటర్ జెట్స్‌తో పాటు 131 విమానాలు ఉన్నాయి.

ఈ ప్రాంతంలో డ్రోన్, క్షిపణి ప్రమాదాలు పెరుగుతుండటంతో.. కువైట్ తన వాయు రక్షణ వ్యవస్థలను, వైమానిక దళాన్ని నిరంతరం ఆధునికీకరించుకుంటోంది.

వ్యూహాత్మకంగా.. పశ్చిమ దేశాలతో ముఖ్యంగా అమెరికా, బ్రిటన్‌ దేశాలతో బలమైన రక్షణ భాగస్వామ్యాలను కువైట్ కొనసాగిస్తోంది.

ఈ భాగస్వామ్యాలు శిక్షణ, సాంకేతికత, భద్రతా సహకారంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

3. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

మిడిల్ ఈస్ట్‌లో ఉన్న అత్యంత ఆధునిక, శక్తిమంతమైన సైన్యాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఒకటి.

దుబయిపై ఇరాన్ పలు దాడులు చేసి, భారీ నష్టాన్ని కలిగించింది.

అయితే, ఇరాన్ క్షిపణులను యూఏఈ అడ్డుకుంది కానీ, ఆ దాడులకు ప్రతిగా ఎలాంటి ప్రతీకార దాడులకు దిగలేదు.

కచ్చితమైన దాడులు చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, సామర్థ్యం యూఏఈ వద్ద ఉంది.

2024లో యూఏఈ వార్షిక రక్షణ బడ్జెట్ 22.75 బిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.2,13,463 కోట్లు).

గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్‌లో యూఏఈ 54వ ర్యాంకులో ఉంది. దీని పవర్ ఇండెక్స్ 1.0188 వద్ద ఉంది.

రక్షణ విశ్లేషకుల ప్రకారం.. యూఏఈ కేవలం తన భూభాగాన్ని కాపాడుకోవడమే కాకుండా... చురుకైన సైనిక శక్తిగా (ఇతర ప్రాంతాలకు కూడా సైనిక సాయం) మారింది.

యెమెన్, లిబియాల్లోని సైనిక కార్యకలాపాల్లో యూఏఈ పాలు పంచుకుంది. ఇస్లామిక్ స్టేట్‌కు వ్యతిరేకంగా జరిగిన అంతర్జాతీయ కార్యకలాపాలకు మద్దతు కూడా ఇచ్చింది.

యూఏఈ ప్రధాన బలం తన వైమానిక దళమే. ఎఫ్-16, మిరాజ్ 2000 వంటి పలు యుద్ధ విమానాలు యూఏఈ వైమానిక దళానికి ఉన్నాయి.

పాట్రియాట్ , థాడ్ వంటి అధునాతన వాయు రక్షణ వ్యవస్థలు యూఏఈ వద్ద ఉన్నాయి.

అమెరికా, ఫ్రాన్స్, యూకే వంటి పలు దేశాలతో బలమైన రక్షణ భాగస్వామ్యాలను కొనసాగించేందుకు యూఏఈ నిరంతరం పెట్టుబడులు పెడుతోంది.

4. బహ్రెయిన్

గల్ఫ్‌లో తన వ్యూహాత్మక ప్రాముఖ్యం వల్ల బ్రహెయిన్ ఆర్మీ కూడా తనను తాను బలోపేతం చేసుకోవడంలో నిమగ్నమైంది.

బహ్రెయిన్ సైన్యాన్ని ఆధునికమైనదిగా, సాంకేతికంగా చాలా బలమైనదిగా పరిగణిస్తారు. బహ్రెయిన్ వైమానిక దళాన్ని కూడా దాని బలమైన విభాగంగా భావిస్తారు.

2026 గ్లోబల్ ఫైర్‌పవర్ ర్యాంకింగ్‌లో బహ్రెయిన్ 75వ స్థానంలో నిలిచింది.

ఎఫ్-16 ఫైటింగ్ ఫాల్కన్‌ను, ముఖ్యంగా తన సైనిక శక్తిని మరింత బలోపేతం చేసే ఆధునిక బ్లాక్ 70 వేరియంట్‌ను ప్రవేశపెట్టిన తొలి గల్ఫ్ దేశాల్లో బహ్రెయిన్ ఒకటి.

తన సముద్ర భద్రత కోసం, రాయల్ బహ్రెయినీ నావల్ ఫోర్స్ వద్ద అమెరికాకు చెందిన ఆలీవర్ హజార్డ్ పెర్రీ క్లాస్ వార్‌షిప్‌లు ఉన్నాయి.

ఆర్మీ వద్ద ఎం60ఏ3 ట్యాంకులు ఉన్నాయి.

బహ్రెయిన్ రక్షణ బడ్జెట్ సుమారు 1.75 బిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.16,415 కోట్లు).

ప్రాంతీయ ఉద్రిక్తతలతో తన బడ్జెట్‌ను తరచూ పెంచుతోంది.

అయితే, తన ఆర్మీలో ఎక్కువ భాగం విదేశీ ఒప్పంద సైనికులపైనే ఆధారపడుతోంది. ఇదే తన ప్రధాన బలహీనత.

వ్యూహాత్మకంగా, బహ్రెయిన్ బలం తన అంతర్జాతీయ సహకారాల్లోనే ఉంది.

5. ఖతార్

గల్ఫ్ ప్రాంతంలో అత్యంత చిన్న, సంపన్నమైన దేశం ఖతార్. జనాభా తక్కువగా ఉన్నప్పటికీ, తన ఆధునిక సైనిక శక్తి ద్వారా ప్రపంచ దృష్టిని ఇది ఆకర్షిస్తోంది.

ప్రపంచంలో అతిపెద్ద గ్యాస్ ఉత్పత్తిదారుల్లో ఒకటి ఖతార్. ఖతార్‌లోని కీలక గ్యాస్ స్థావరంపై ఇరాన్ ఇటీవల దాడి చేసింది.

ఖతార్ సైన్యం సైజులో చిన్నదే కావొచ్చు. కానీ, సాంకేతికతను, అధునాతన ఆయుధాలను కలిగి ఉంది.

గ్లోబల్ ఫైర్‌వపర్ ఇండెక్స్‌లో ఇది 71వ స్థానంలో ఉంది. ఖతార్ పవర్ ఇండెక్స్ స్కోర్ 1.409.

2024లో రక్షణ బడ్జెట్ 15.41 బిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.1,44,577 కోట్లు).

ఖతార్ వైమానిక దళం ఆ దేశ ప్రధాన బలం. ఖతార్ వద్ద యూరోఫైటర్ టైఫూన్, రఫేల్ వంటి అధునాతన ఫైటర్ ఫ్లీట్స్ ఉన్నాయి.

ఖతార్ నౌకాదళం చిన్నదైనా.. తన సముద్ర భద్రతను పర్యవేక్షించుకునేందుకు అత్యాధునికమైన గస్తీ నౌకలు ఉన్నాయి.

ఖతార్ అతిపెద్ద సవాలు ఏంటంటే.. స్థానిక జనాభా చాలా తక్కువగా ఉండటమే. దేశ జనాభాలో 80 శాతం మంది విదేశీయులే. సుమారు 3 లక్షల మంది పౌరులు ఉంటారు.

ఇది సైన్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే, ఖతార్ ఎక్కువగా తన సైనిక అవసరాల కోసం విదేశీ నిపుణులపై, ఒప్పంద సైనికులపై ఆధారపడుతోంది.

వ్యూహాత్మకంగా ఖతార్ సైన్యం తనను తాను కాపాడుకునే పాత్రనే పోషిస్తోంది. తన సరిహద్దులను, ఇంధన వనరులను కాపాడుకోవడమే ప్రధాన ఉద్దేశ్యంగా ఖతార్ సైన్యం పనిచేస్తోంది.

అదనంగా, ఖతార్ భద్రతా వ్యూహంలో అంతర్జాతీయ సహకారం కీలక పాత్ర పోషిస్తోంది.

అల్-ఉదైద్ ఎయిర్‌బేస్ దేశంలోనే అతిపెద్ద సైనిక స్థావరం. ఇది ఖతార్‌కు భద్రతను అందిస్తుంది.

అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతిగా అల్-ఉదైద్‌పై ఇరాన్ దాడి చేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)