ర్యాట్ హోల్ మైనింగ్.. 18 మంది ప్రాణాలు బలిగొన్న బొగ్గు అక్రమ తవ్వకం

ఫొటో సోర్స్, ANI
- రచయిత, అభిషేక్ డే
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 3 నిమిషాలు
మేఘాలయలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బొగ్గు గనిలో జరిగిన పేలుడులో 18 మంది కార్మికులు మరణించారని, ఒకరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా కొంతమంది గనిలో చిక్కుకుని ఉండొచ్చని పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం 11:00 గంటలకు మేఘాలయలోని తూర్పు జైంటియా హిల్స్‌లో పేలుడు జరిగిందని తెలిపారు.
మేఘాలయ పోలీసు సూపరింటెండెంట్ వికాస్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ, ర్యాట్-హోల్' మైనింగ్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.
రాట్-హోల్ మైనింగ్ అనేది అత్యంత ప్రమాదకరమైన పద్ధతి. ఇందులో డైనమైట్ ఉపయోగించి సన్నని సొరంగాలను ఏర్పరిచి బొగ్గు తవ్వుతారు.
ర్యాట్-హోల్ మైనింగ్‌పై నిషేధం ఉన్నప్పటికీ.. ఇంకా కొనసాగుతూనే ఉందని కార్యకర్తలు అంటున్నారు.
కాగా ఈ ప్రమాదంపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ.. మృతులకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు.

గని లోపల జరిగిన ఈ పేలుడు డైనమైట్ వల్ల సంభవించి ఉంటుందని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రాజధాని షిల్లాంగ్ నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఈ గని ఉంది.
ఇప్పటివరకు 18 మృతదేహాలను వెలికితీశామని, తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న ఒకరిని షిల్లాంగ్‌లోని ఆసుపత్రిలో చేర్పించామని వికాస్ కుమార్ చెప్పారు.
ఇంకా ఎంతమంది కార్మికులు భూగర్భంలో చిక్కుకుపోయారో స్పష్టంగా తెలియదని ఆయన అన్నారు.
గని యాజమాన్యం, నిర్వాహకులను పోలీసులు ఇంకా గుర్తించలేదని, గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశామని కుమార్ చెప్పారు.
"బాధ్యులపై చట్టపరమైన చర్యలను తీసుకుంటాం" అని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ఒక ప్రకటనలో తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters
ఇటీవల గని కార్మికులతో మాట్లాడామని చెప్పిన కొంతమంది స్థానికులు, మరణించిన వారిలో ఎక్కువ మంది పొరుగు రాష్ట్రమైన అస్సాంకు చెందినవారని విలేకరులకు చెప్పారు.
"ఇది నిర్ధరణైతే, అస్సాం నుంచి వచ్చిన బాధిత కుటుంబాలకు మేం అన్ని విధాలుగా సహాయం, మద్దతును అందిస్తాం" అని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు.
ఇటీవలి కాలంలో మేఘాలయలో జరిగిన అత్యంత ఘోరమైన మైనింగ్ ప్రమాదాలలో ఈ పేలుడు కూడా ఒకటి.
2018లో, సమీప నదిలోని నీరు రాట్-హోల్ గనిలో చేరడంతో 15 మంది గనికార్మికులు చిక్కుకుపోయారు.
నెలల తరబడి సహాయక చర్యలు కొనసాగాయి. ఐదుగురు గని కార్మికులు బతికిబయటపడ్డారు.
ఇద్దరి మృతదేహాలను తరువాత వెలికితీశారు. మిగిలిన వారు చనిపోయారని నిర్ధరించారు.
"ర్యాట్ హోల్ మైనింగ్‌లో.... ఒక మనిషి కూర్చుని పనిచేటంత పరిమాణంలో మాత్రమే సొరంగాలు తవ్వి అందులోంచి వెళ్తూ బొగ్గు తవ్వడం. ఇది చాలా ప్రమాదకరమైన పద్ధతి" అని మేఘాలయకు చెందిన అక్రమ మైనింగ్ వ్యతిరేక ప్రచారకర్త అయిన ఆగ్నెస్ ఖర్షీంగ్ విలేకరులతో అన్నారు.
2014లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన నిషేధం అమల్లో ఉన్నప్పటికీ మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో అక్రమ బొగ్గు తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయని కార్యకర్తలు చెబుతున్నారు.
ఆ నిషేధాన్ని తరువాత భారత సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు నియమించిన పర్యవేక్షణ కమిటీ ఇటీవలి కాలంలో అమలు వైఫల్యాలను పదే పదే ఎత్తి చూపింది .
గడచిన కొన్నేళ్లలో గుజరాత్, ఝార్ఖండ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ సహా అనేక రాష్ట్రాలలో బొగ్గు అక్రమ తవ్వకాలకు సంబంధించిన ప్రాణాంతక ప్రమాదాలు జరిగాయి.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














