‘ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో నగ్న చిత్రాలు ఆన్‌లైన్‌లో ఇంకా అలాగే ఉన్నాయి’

ఎప్‌స్టీన్ ఫైల్స్, అమెరికా, ఇంటర్‌నెట్, ఆన్‌లైన్, నగ్నచిత్రాలు, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బెక్కి డేల్, మాట్ మర్ఫీ
    • హోదా, బీబీసీ వెరిఫై
  • చదివే సమయం: 4 నిమిషాలు

‘ఎప్‌స్టీన్ ఫైళ్లలో విడుదలైన నగ్న ఫోటోలు, వీడియోలు బ్లర్ చేయకుండా చాలా రోజులుగా ఆన్‌లైన్‌లో ఉన్నాయి. ఈ తప్పు గురించి అమెరికా అధికారులను ముందే హెచ్చరించినా, ఆ కంటెంట్ కొన్ని రోజుల పాటు ఆన్‌లైన్‌లోనే ఉండిపోయింది. దీంతో బాధితులకు భర్తీ చేయలేని నష్టం కలిగింది’ అని న్యాయవాదులు అంటున్నారు.

ఎప్‌స్టీన్ బాధితులైన అనేక మందిని గుర్తించగలిగే సమాచారం కలిగిన వేలాది పత్రాలలో భాగమని న్యాయవాదులు చెబుతున్న ఫైల్స్‌ను బీబీసీ వెరిఫై పరిశీలించింది.

ఎప్‌స్టీన్ ఫైళ్లలో భాగంగా దాదాపు 40 వేర్వేరు చిత్రాలు ప్రచురించారని న్యూయార్క్ టైమ్స్ శుక్రవారం రిపోర్ట్ చేసినటప్పుడు బాధితుల సంఘాలు మొదట ఈ విషయం గురించి మాట్లాడాయి.

బాధితులు పేర్లు, చిత్రాలను సరిగ్గా సవరించే వరకు వెబ్‌సైట్‌ను మూసివేయాలని కోరిన తర్వాత, సమస్యను త్వరగా పరిష్కరించేందుకు న్యాయశాఖ అంగీకరించిందని మంగళవారం న్యూయార్క్ జడ్జ్ ఒకరు తెలిపారు.

"సాంకేతిక లేదా మానవ తప్పిదం" కారణంగా ఫైల్స్ అప్‌లోడ్ అయ్యాయని పేర్కొంటూ, న్యాయశాఖ తన వెబ్‌సైట్ నుంచి వేలాది పత్రాలను తొలగించింది . కొత్త అభ్యర్థనలను పరిశీలిస్తూనే ఉందని, అలాగే తదుపరి సవరణ అవసరమయ్యే ఇతర పత్రాలు ఏవైనా ఉన్నాయా అని తనిఖీ చేస్తున్నట్టు ఆ విభాగం తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అంతకుముందు రోజే రిడక్షన్ లోపాలను సరిచేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ, బుధవారం కూడా చాలా చిత్రాలు ఆన్‌లైన్‌లో ఉన్నాయని బీబీసీ వెరిఫై గుర్తించింది. ఈ విషయంపై స్పందన కోసం న్యాయశాఖను సంప్రదించింది బీబీసీ వెరిఫై. రిడక్షన్ చేయని ఫైళ్ల పేర్లను కూడా ఇచ్చింది.

"జరిగిన నష్టం పూడ్చలేనిది" అని బాధితుల తరపు న్యాయవాది బ్రాడ్ ఎడ్వర్డ్స్ ఒక ప్రకటనలో తెలిపారు.

బీబీసీ వెరిఫై గుర్తించిన నాలుగు చిత్రాలలో పాక్షికంగా దుస్తులు ధరించిన యువతుల ముఖాలు, శరీరాలు బ్లర్ చేయకుండా కనిపించాయి.

ప్రముఖులతో ఎప్‌స్టీన్ సంభాషణలకు సంబంధించిన ఆధారాల కోసం విడుదల చేసిన లక్షల కొద్దీ ఫైళ్లను సాధారణంగా శోధించినప్పుడు అవి కనిపించాయి.

కొన్ని పత్రాలలో కొంతమంది ఫోటోలను తొలగించినట్లు కనిపిస్తోంది. కానీ మరోచోట తొలగించలేదు. ఒక పత్రంలో ఒకే చిత్రానికి రెండు వెర్షన్లు ఉన్నాయి. ఒక ఫోటోలో ముఖాన్ని నల్లరంగు చతురస్రంతో కప్పేశారు. మరొక చిత్రంలో ముఖం కనిపిస్తుంది.

మరో వీడియోలో ఒకరు షర్ట్‌ను పైకెత్తి కెమెరా వైపు తన రొమ్ములను చూపిస్తున్నట్లు గుర్తించారు.

ఎప్‌స్టీన్ ఫైల్స్, అమెరికా, ఇంటర్‌నెట్, ఆన్‌లైన్, నగ్నచిత్రాలు, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఎప్‌స్టీన్ ఫైల్స్ తాజా భాగం ప్రచురించటానికి ముందు క్రిస్మస్ సమయంలో.. లైంగికంగా అసభ్యకరమైన అన్ని ఫోటోలను లేదా బాధితులను గుర్తించగల ఏదైనా సమాచారాన్ని సవరించే బాధ్యత న్యాయ శాఖ అధికారులకు అప్పగించారు.

కాంగ్రెస్ నిర్ణయించిన గడువుకు ముందే, డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచే మాట్లాడుతూ, బాధితుల గుర్తింపులను కాపాడటానికి అదనపు పని అవసరం కాబట్టి, ఫైళ్లను సకాలంలో ప్రచురించలేమని అన్నారు.

"మేం ప్రతి పత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. ప్రతి బాధితుడి పేరు, గుర్తింపు, కథ అవసరమైతే సురక్షితంగా ఉండేలా చూసుకుంటున్నాం" అని ఆయన అన్నారు.

ఫైళ్లలో ప్రచురించిన వైద్య సమాచారం, చట్టపరమైన ప్రకటనలలో అనేక మంది గుర్తింపులు వెల్లడైనట్లు బీబీసీ వెరిఫై గుర్తించింది.

ఫీటల్ అల్ట్రాసౌండ్ స్కాన్‌లను చూపించే రెండు వీడియోలలో ఒక పేరును పూర్తిగా చూపించారు. సమయం, తేదీ, స్కాన్ జరిగిన స్థలంగా అనిపించే సమాచారం, అలాగే గర్భస్థ శిశువు వయసు కూడా ఇందులో స్పష్టంగా కనిపించాయి.

మరొక పత్రంలో ఎప్‌స్టీన్‌ను విచారణ చేస్తున్న రికార్డింగ్ ఉంది. అందులో ఒక న్యాయవాది ఒక బాధితుడి పేరును ప్రస్తావించారు.

ఫైళ్లలోని వందలాది మహిళల గుర్తింపును దాచడంలో న్యాయశాఖ విఫలమైందని ఎప్‌స్టీన్ బాధితుల తరపు న్యాయవాదులు తీవ్రంగా విమర్శించారు.

"బాధితుల పేర్లు ఎవరికీ తెలియదు, వారు ఎప్పుడూ బయటకు రాలేదు. కానీ ఇప్పుడు తమ సమాచారమంతా ప్రజలకు తెలిసిపోవడంతో మాకు బాధితుల నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి" అని వారు చెప్పారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)