వెరికోస్ వీన్స్: నిల్చుని చేసే జాబ్ అయినా, కూర్చుని చేసే ఉద్యోగమైనా కాళ్లలో సిరల వాపు రాకూడదంటే ‘ఈ 5 పనులు అస్సలు చేయొద్దు’

సిరల వాపు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఓంకార్ కరంబేల్కర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 6 నిమిషాలు

చాలామంది భారతీయులు ఎదుర్కొనే, అంతగా పట్టించుకోని సమస్య వెరికోస్ వీన్స్.

కాళ్లలో సిరలు పైకి కనిపించేలా ఉబ్బి, వంకర్లు తిరిగి, నీలం రంగులో మారడాన్ని చాలామంది తమ అందానికి సంబంధించిన సమస్యగా భావిస్తుంటారు. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు తమ కాళ్లు చూడడానికి ఏమాత్రం బాగులేవని అంటుంటారు.

అయితే, ఇది కేవలం కాస్మొటిక్ సమస్య మాత్రమే కాదని, కాళ్లలో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడానికి కూడా ఇది ఒక సంకేతం కావచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.

ఎక్కువ సేపు పాటు నిల్చోవడం, కూర్చుని పనులు చేయడం, గర్భధారణ, మారుతున్న జీవనశైలి కారణంగా.. భారత్‌లో వెరికోస్ వీన్స్ సమస్య పెరుగుతోంది.

మరింత ముఖ్యంగా నొప్పి వచ్చేంత వరకు, వాపు కనిపించేంత వరకు, చర్మ రంగు మారే వరకు లేదా కమిలిన గాయాలు కనిపించేంత వరకు చాలామంది దీనికి చికిత్స చేయించుకోరు.

అయితే.. అధునాతన పరిశోధనలు ఈ సమస్య చికిత్సలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాయి.

ఒకప్పుడు వీటికి పెద్ద సర్జరీలు చేయించుకునేందుకు రోగులు భయపడేవారు. అయితే, ఇప్పుడు లేజర్, ఆర్ఎఫ్, గ్లూ, స్క్లెరోథెరపీ వంటి పద్ధతుల ద్వారా కొన్ని గంటల వ్యవధిలోనే చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్తున్నారు రోగులు.

అయితే, దీనికోసం సకాలంలో వైద్యుడిని సంప్రదించి, సరైన రోగనిర్ధరణ చేయించుకోవడం అవసరం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వెరికోస్ వీన్స్ అంటే ఏమిటి?

కాళ్లలోని ఉండే సిరలలో రక్తాన్ని గుండెకు తీసుకెళ్లే చిన్న కవాటాలు ఉంటాయి. ఈ కవాటాలు సరిగ్గా తెరుచుకుని, మూసుకుంటే, రక్త ప్రసరణ సవ్యంగా సాగుతుంది.

కానీ, ఈ కవాటాలు బలహీనపడినా లేదా సరిగ్గా పనిచేయకపోయినా.. రక్తం వ్యతిరేక దిశలో ప్రవహిస్తుంది. అటువంటి సమయాల్లో సిరలు ఉబ్బి బయటకు కనిపిస్తాయి. దీన్నే వెరికోస్ వీన్స్ అంటారు.

ఈ సమస్య తొలుత మనకు సాధారణంగా కంటికి కనిపించేలా ఉండొచ్చు. ఒకవేళ దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తే.. కాళ్లు బరువు ఎక్కడం, తరచూ అలసట, సాక్సులు తీసేసిన తర్వాత కూడా వాపు అలానే ఉండటం, చర్మం నల్లగా మారడం లేదా దురద వంటి సమస్యలకు దారితీయొచ్చు.

కొంతమంది రోగులలో ఏళ్ల తరబడి దీన్ని నిర్లక్ష్యం చేస్తే.. కీళ్లకు సమీపంలో ఎప్పటికీ తగ్గని గాయాలు ఏర్పడతాయి. వీటినే వీనస్ అల్సర్స్ అంటారు.

కాళ్ల నొప్పి లేదా సిరలు కనిపించే ప్రతిదీ వెరికోస్ వీన్స్ అని చెప్పలేం. ఈ లక్షణాలు కండరాల ఒత్తిడి, సిరలపై ఒత్తిడి, కీళ్ల నొప్పి లేదా రక్త సరఫరా తగ్గడం వంటి కారణాల వల్ల కూడా కనిపించవచ్చు.

అయితే, సమస్యకు అసలు కారణం ఏమిటో తెలుసుకునేందుకు వైద్య నిపుణుడి దగ్గర ముఖ్యంగా వాస్కులర్ సర్జన్ దగ్గర క్షుణ్నంగా పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.

సరైన రోగ నిర్ధరణకు, చికిత్స విధానాన్ని కచ్చితంగా నిర్ణయించేందుకు సకాలంలో కలర్ డాప్లర్ స్కాన్ చేయించుకోవడం అత్యంత కీలకం.

భారత్‌లో వెరికోస్ వీన్స్ సమస్య ఒక సాధారణంలా కనిపిస్తున్నప్పటికీ, ప్రజలు తరచూ దీని తీవ్రతను అర్థం చేసుకోవడం లేదు.

కాళ్లల్లో మెలిక తిరిగిన లేదా ఉబ్బిన సిరలను కేవలం బాహ్య స్వరూపానికి చెందినవిగా చాలామంది భావిస్తారు. కానీ, ఇది కేవలం సౌందర్య సంబంధిత సమస్య కాదని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ వాస్కులర్ సర్జరీ హెడ్ డాక్టర్ రఘురామ్ శేఖర్ చెప్పారు.

రక్త ప్రవాహం వ్యతిరేక దిశలో ఉన్నందుకు అసలైన కారణం ఈ సిరల్లోనే ఉందని తెలిపారు.

కాళ్లలోని సిరలు

ఫొటో సోర్స్, Getty Images

డాక్టర్ రఘురామ్ శేఖర్ చెబుతున్న వివరాల ప్రకారం.. భారత్‌లో ఎక్కువ సమయం పాటు నిల్చుని పనిచేసే వారు అంటే టీచర్లు, సెక్యూరిటీ గార్డులు, ఫ్యాక్టరీ వర్కర్లు, దుకాణదారులు.. అలాగే గంటల తరబడి కూర్చుని పనిచేసే ఉద్యోగస్తులలో ఈ వ్యాధి విపరీతంగా పెరుగుతోంది.

చాలామంది రోగులు వ్యాధి ముదిరే వరకు ఈ లక్షణాలను పట్టించుకోరు.

"బరువుగా అనిపించడం, వాపు, చర్మం నల్లబడటం వంటివన్నీ శరీరం ఇచ్చే తొలి హెచ్చరికలే. కానీ, ఒకప్పుడు పెద్ద సర్జరీలే ఇప్పుడు కూడా చేస్తున్నారన్న భయంతో చాలామంది ఆలస్యంగా దీనికి చికిత్స తీసుకుంటున్నారు " అని ఆయన అన్నారు.

''భారత్‌లో వెరికోస్ వీన్స్ కేసులు పెరుగుతున్నాయి. అవగాహన లేకపోవడం, సరైన వైద్య నిపుణులను సంప్రదించలేకపోవడం, పాత కాలం నుంచి ఉన్న భయాలు వ్యాధిని ఆలస్యంగా నిర్ధరించేందుకు దారితీస్తున్నాయి'' అని జస్లోక్ హాస్పిటల్‌లోని వాస్కులర్ సైన్సస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ షోయబ్ పడారియా చెప్పారు.

''నేటి కాలంలో చికిత్సా విధానాలు పూర్తిగా మారిపోయాయి. లేజర్, ఆర్‌ఎఫ్, గ్లూ లేదా ఫోమ్ స్క్లెరోథెరపీ వాడుతున్నారు. ఇవన్నీ 24 గంటల్లోగా చికిత్స చేయించుకుని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే విధానాలు. తర్వాత రోజే రోగి తన పనికి వెళ్లవచ్చు'' అని తెలిపారు.

''అలా అని కనిపించే ప్రతి గడ్డ కూడా ప్రమాదకరమైనది కాదు. కాళ్ల నొప్పులన్నిటికీ వెరికోస్ వీన్స్‌ ఒక్కటే కారణం కాదు. సరైన నిర్ణయం తీసుకునేందుకు డాప్లర్ స్కాన్ చాలా అవసరం'' అని డాక్టర్ శేఖర్ సూచించారు.

కాళ్ల వాపు

ఫొటో సోర్స్, Getty Images

లక్షణాలు, ప్రమాదం

వెరికోస్ వీన్స్‌ మొదట చూడటానికి ఎలానో అనిపించవచ్చు. కానీ, శరీరం అప్పటికే కొన్ని ముఖ్యమైన సంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తుందని ఈ ఇద్దరు వైద్య నిపుణులు అంటున్నారు.

"బరువుగా అనిపించడం, సాయంత్రానికి నొప్పి తీవ్రం కావడం, కీళ్ల చుట్టూ వాపు అనేవి కేవలం పైపైన కనిపించే మార్పులు మాత్రమే కాదు. అవి రక్త ప్రసరణ సరిగా లేదనడానికి సంకేతాలు" అని డాక్టర్ రఘురామ్ శేఖర్ చెప్పారు.

ఒకవేళ ఎక్కువ కాలం పాటు వాటికి చికిత్స చేయకపోతే, చర్మం వాపు, నల్లగా మారేందుకు, కీళ్ల దగ్గర ఎప్పటికీ మానని గాయాలకు దారితీస్తుందని తెలిపారు.

చర్మం పైభాగంలో ఉండే సిరల్లో రక్తం చేరడం వల్ల కొంతమంది రోగుల్లో ప్రమాదకరం కాని గడ్డలు ఏర్పడతాయి. ''సూపర్‌ఫిషియల్ వీన్ థ్రాంబోసిస్ చాలా బాధకరమైనది. కానీ, ప్రాణాంతకమైనది కాదు. దీనివల్ల ప్రజలు భయపడతారు, కానీ ప్రమాదకరమైన గడ్డలు లోతైన సిరల్లో ఏర్పడతాయి'' అని వివరించారు.

ఒకవేళ లక్షణాలు లేకపోయినా ప్రమాదం కావొచ్చని డాక్టర్ షోయబ్ చెప్పారు.

''పెద్ద సిరల్లో ఎలాంటి నొప్పి ఉండకపోవచ్చు. కాళ్లల్లో క్రమేపీ చర్మం దెబ్బతినవచ్చు. అందువల్ల, ప్రతి పెద్ద సిరలో ఉన్న సమస్యను తెలుసుకోవడం కోసం క్రమం తప్పకుండా వైద్య నిపుణుడిని సంప్రదించడం అవసరం" అని ఆయన సూచించారు.

కాళ్ల వాపు

ఫొటో సోర్స్, Getty Images

చికిత్స ఇలా..

డాక్టర్ పడారియా చెబుతున్న ప్రకారం.. దీనికి చికిత్స నాలుగు ముఖ్యమైన అంశాలు అంటే, సిర పరిమాణం, దాని లోతు, సిర ఎంత నిటారుగా ఉంది, చర్మానికి ఎంత దగ్గరగా ఉందనే దానిబట్టి ఉంటుంది.

సిర పరిమాణం బట్టి...

  • ఒకవేళ సిర పరిమాణం 4-5 మిల్లీమీటర్ కంటే తక్కువగా ఉంటే ఫోమ్ స్క్లెరోథెరపీ
  • 5-12 మిల్లీమీటర్ మధ్య ఉంటే లేజర్ (ఈవీఎల్‌టీ) లేదా ఆర్‌ఎఫ్ అబ్లేషన్
  • 12-15 మిల్లీమీటర్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే లేజర్ (ఈవీఎల్‌టీ) మరింత ప్రభావవంతంగా ఉంటుంది.

సిరల నిర్మాణాన్ని బట్టి

  • సిర నిటారుగా ఉంటే - లేజర్ / ఆర్‌ఎఫ్ చికిత్సను సూచిస్తారు.
  • సిర వంకరగా ఉంటే ఫోమ్ స్క్లెరోథెరపీని సిఫార్సు చేస్తారు.

చర్మానికి దగ్గర్లో ఉన్న లోతును బట్టి..

  • 5 మిల్లీమీటరు లోతుగా ఉంటే లేజర్ లేదా ఆర్‌ఎఫ్ సురక్షితమైనది.
  • చర్మానికి మరీ దగ్గరగా ఉంటే గ్లూ లేదా ఫోమ్ వాడటం మంచిది.
సిరల వాపు

ఫొటో సోర్స్, Getty Images

వెరికోస్ వీన్స్‌ చికిత్సకు ఉపయోగించే లేజర్ (ఈవీఎల్‌టీ), రేడియోఫ్రీక్వెన్సీ (ఆర్ఎఫ్), గ్లూ, ఫోమ్ స్క్లెరోథెరపీ అనే నాలుగు పద్ధతులకు వేర్వేరు ప్రయోజనాలు ఉన్నాయి.

లేజర్, ఆర్ఎఫ్ పద్ధతులు రెండూ వేడిని ఉపయోగిస్తాయి. సిరను లోపలి నుంచి మూసివేయడానికి 'థర్మల్ ఎనర్జీ' అవసరం.

ఈ చికిత్స విధానంలో అనెస్థీషియా అంటే ట్యూమెసెంట్ ఇంజెక్షన్ అవసరం అవుతుంది. ఈ రెండూ చికిత్సలు కాస్త నొప్పిని కలిగించవచ్చు. కానీ, వీటి ఫలితాలు దీర్ఘకాలం ఉంటాయి.

పైవాటికి భిన్నంగా, గ్లూ ట్రీట్‌మెంట్ లేదా ఫోమ్ స్క్లెరోథెరపీలు నాన్-థర్మల్ విధానాలు. ఈ విధానాల్లో వేడిని ఉపయోగించరు.

ట్యూమెసెంట్ ఇంజెక్షన్లు అవసరం పడవు. చికిత్స తర్వాత వచ్చే నొప్పి తక్కువ ఉంటుంది.. ఒక్కోసారి నొప్పి ఉండదు.

అనస్థీషియా వద్దనుకునే లేదా చర్మానికి దగ్గరగా బాగా ఉబ్బిన సిరలు ఉన్నప్పుడు గ్లూ ట్రీట్‌మెంట్ సాధారణంగా వాడుతుంటారు.

మెలికలు తిరిగిన, చిన్నగా ఉన్న, లేదా సన్నగా చీలినట్లు కనిపించే సిరలకు ఫోమ్ స్క్లెరోథెరపీ మరింత ప్రభావవంతంగా ఉంటుంది. అయితే, ఇతర పద్ధతులతో పోలిస్తే ఫోమ్ వల్ల సిరలు తిరిగి పెరిగే ప్రమాదం కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చు.

మొత్తంగా ప్రతి చికిత్స విధానానికి దానికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. లేజర్ లేదా ఆర్ఎఫ్ అతిపెద్దగా, నిటారుగా ఉండే సిరలకు అనువైనది కాగా, గ్లూ లేదా ఫోమ్ చికిత్స విధానం చిన్నగా, మెలికలు తిరిగిన, చర్మానికి దగ్గరగా ఉండే సిరలకు ఉపయోగపడుతుంది.

డాప్లర్ మ్యాపింగ్, వైద్య నిపుణుడి అంచనా ప్రకారమే ఏ చికిత్స విధానం తీసుకోవాలన్నది ఆధారపడి ఉంటుంది.

జీవన విధానాల్లో మార్పులు

డాక్టర్ శేఖర్, డాక్టర్ పడారియా చెబుతున్న ప్రకారం.. ఈ సమస్యను తీవ్రతరం చేసే ప్రధాన కారకాలలో ఆధునిక జీవనశైలి ఒకటి. కొన్ని సాధారణ మార్పులు అతిపెద్ద మార్పును తీసుకు రావొచ్చు.

  • ప్రతిరోజూ నడవడం - దీనివల్ల తొడల కండరాల పంప్ యాక్టివేట్ అయి, రక్తాన్ని గుండె వైపు పంపుతుంది.
  • మీ బరువును అదుపులో ఉంచుకోవడం - దీనివల్ల కాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది.
  • ప్రతి 30 నిమిషాలకు మీ కూర్చునే/నిలబడే భంగిమను మార్చుకోండి.
  • కాళ్లను కొద్దిగా పైకి ఎత్తి విశ్రాంతి తీసుకోవడం వల్ల వాపు, బరువుగా అనిపించడం తగ్గిస్తుంది.
  • కంప్రెషన్ స్టాకింగ్‌ల వాడకం - ముఖ్యంగా తొలి దశలలో ఉపయోగకరంగా ఉంటుంది.

చేయకూడని పనులు

  • ఒకే ప్రదేశంలో గంటల తరబడి నిల్చోవడం
  • ఎక్కువ సేపు ఒక్క దగ్గరే కూర్చోవడం
  • బాగా బిగుతుగా లేదా మరీ వదులుగా ఉండే చెప్పులు వేసుకోవడం, ఎత్తయిన చెప్పులు వేసుకోవడం వల్ల తొడల కండరాల బలం తగ్గుతుంది.
  • పాదాలను వేడి నీటిలో నానబెట్టే అలవాటు వల్ల మీ సిరలు మరింత వాయొచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)