'డీజిల్ దౌత్యం' బంగ్లాదేశ్‌తో భారత్ సంబంధాలను మెరుగుపరుస్తుందా?

ఫొటో సోర్స్, Getty Images
మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా బంగ్లాదేశ్‌లోనూ ఇంధన సంక్షోభం ఏర్పడింది.
పెట్రోల్ బంకుల వద్ద వాహనాల క్యూలు కనిపిస్తున్నాయి.
తమ అవసరాలకు తగినంత చమురు లభించడం లేదని బంగ్లాదేశీయులు ఫిర్యాదు చేస్తున్నారు.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు 5 వేల మెట్రిక్ టన్నుల డీజిల్ సరఫరా అయ్యింది.
ఇంధన సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు మరో 50 వేల మెట్రిక్ టన్నుల డీజిల్‌ను అందించాలని బంగ్లాదేశ్ కోరినప్పటికీ, దీనిపై భారత్ నుంచి ఇంకా స్పందన లేదు.
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ)తో భారత్‌కు పెద్దగా సన్నిహత సంబంధాలు లేవు. అయితే, ఫిబ్రవరిలో తారిక్ రెహమాన్ నాయకత్వంలో ఏర్పడిన బీఎన్‌పీ ప్రభుత్వాన్ని మోదీ ప్రభుత్వం స్వాగతించింది.
ఈ సంక్షోభ సమయంలో బంగ్లాదేశ్‌కు భారత్ చమురు, ముఖ్యంగా డీజిల్ సరఫరా చేసి ఆదుకోవాలని కొందరు పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే, బంగ్లాదేశ్ ఇప్పటికే చైనా సహాయాన్ని కూడా కోరింది.
భారత్ పొరుగు దేశాల్లో తన పట్టును బలపరుచుకునే ఏ అవకాశాన్నీ చైనా వదులుకోదని వారు భావిస్తున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
భారత్‌కు బంగ్లాదేశ్ లేఖ
తమ దేశంలో నెలకొన్న ఇంధన సంక్షోభాన్ని అధిగమించేందుకు అదనంగా 50 వేల మెట్రిక్ టన్నుల డీజిల్‌ను సరఫరా చేయాలని కోరుతూ బంగ్లాదేశ్ భారత్‌కు లేఖ రాసింది.
మార్చి 11న, బంగ్లాదేశ్ విద్యుత్, ఇంధన శాఖ మంత్రి ఇక్బాల్ హసన్ మహమూద్ టుకుతో ఢాకాలో భారత హైకమిషనర్ ప్రణయ్ కుమార్ వర్మ భేటీ అయ్యారు.
ఈ భేటీ అనంతరం మంత్రి ఇక్బాల్ హసన్ మహమూద్ మాట్లాడుతూ, "మా ప్రతిపాదనను సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని వారు తెలిపారు. ప్రస్తుతం వారు కూడా సంక్షోభంలోనే ఉన్నారు" అని తెలిపారు.
గతంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు, భారత్‌కు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ నుమాలీగఢ్ రిఫైనరీ లిమిటెడ్ నుంచి గత బుధవారం 5,000 టన్నుల డీజిల్ బంగ్లాదేశ్‌కు చేరుకున్నట్టు బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ తెలిపింది.
ఇదే సమయంలో, దీర్ఘకాలిక ఒప్పందాల కింద ఇంధన భద్రత కోసం చైనా సాయం కూడా కోరింది బంగ్లాదేశ్.
ఢాకాలోని చైనా రాయబారి యావో వెన్‌తో ఇటీవల బంగ్లాదేశ్ ఇంధన మంత్రిత్వ శాఖ చర్చలు జరిపింది.
ఇంధన దిగుమతుల కోసం ప్రత్యామ్నాయ దేశాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని మంత్రి టుకు తెలిపారు.

'యుద్ధం ఎంతకాలమో తెలియదు'
ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌తో పాటు పొరుగుదేశాలైన శ్రీలంక, మాల్దీవులు కూడా అదనపు చమురు సరఫరా చేయాలని భారత్‌ను కోరాయి.
తమ సొంత అవసరాలు, లభ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ అభ్యర్థనలను పరిశీలిస్తున్నట్లు భారత్ తెలిపింది.
భారత్‌పై సానుకూలత లేని పార్టీ బంగ్లాదేశ్‌లో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని 'డీజిల్ డిప్లొమసీ' ద్వారా సహాయం అందించి సంబంధాలను మెరుగుపరుచుకోవాలని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
భారత మాజీ విదేశాంగ కార్యదర్శి శశాంక్ ఈ అంశంపై బీబీసీ ప్రతినిధి చందన్ కుమార్‌తో స్పందిస్తూ.. "భారత్‌కు ఎప్పుడూ 'నైబర్‌హుడ్ ఫస్ట్' విధానం ఉంది. వ్యాక్సిన్ మైత్రి దానికొక ఉదాహరణ. సాధ్యమైనంత వరకు సహాయం చేస్తూనే ఉన్నాం. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు" అని చెప్పారు.
"ఈ యుద్ధం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో, ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు. మన దేశంలో కూడా గ్యాస్ కొరత ఉంది, నగరాల్లో క్యూలు కనిపిస్తున్నాయి, పార్లమెంటులో ప్రశ్నలు వస్తున్నాయి. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది" అని ఆయన పేర్కొన్నారు.
శశాంక్ ఇంకా మాట్లాడుతూ.. "ఈ నిర్ణయాలు పరస్పర విశ్వాసం ఆధారంగా ఉండాలి. ఎవరో ఏదో ఇచ్చారని మనం కూడా ఇచ్చేయలేం. రేపు ఏ కారణంతోనైనా ఇవ్వలేకపోతే మళ్లీ మనకు వ్యతిరేకంగా మారుతారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితులను బట్టి మాత్రమే ఏ నిర్ణయమైనా ఉంటుంది" అని చెప్పారు.
'కేవలం డీజిల్ డిప్లొమసీనే సరిపోదు'
"షేక్ హసీనా ప్రభుత్వం పతనం కావడం, ఆమెకు భారత్ ఆశ్రయం కల్పించినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో భారత్ పట్ల వ్యతిరేక భావనలు పెరిగాయి. వారిని శాంతింపజేయడానికి 'డీజిల్ డిప్లొమసీ' ఒక మార్గం కావొచ్చు.’’ అన్నారు కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో అంతర్జాతీయ సంబంధాలు, ప్రపంచ వ్యవహారాల అసిస్టెంట్ ప్రొఫెసర్ కనికా రాఖరా.
‘‘భారత్ అనుసరిస్తున్న 'నైబర్‌హుడ్ ఫస్ట్' విధానంలో ఇప్పటికే 5 వేల టన్నుల డీజిల్‌ను అందించాం, ముందుముందు కూడా ఇవ్వవచ్చు. కానీ, ఇదే ఏకైక వ్యూహం కాకూడదు" అని కనికా రాఖరా పేర్కొన్నారు.
"మార్చిలోనే బంగ్లాదేశ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ బృందం భారత్‌లో పర్యటించింది. అలాగే ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారులు కూడా సమావేశమయ్యారు. దీనిని బట్టి బ్యాక్ ఛానల్ ద్వారా చర్చలు జరుగుతున్నాయని అర్థమవుతోంది’’ అన్నారు కనికా రాఖరా.
‘‘కేవలం చమురు సంక్షోభంలో సహాయం చేయడం వల్లే భారత్ - బంగ్లాదేశ్ సంబంధాలు మెరుగుపడతాయని అనుకోలేం. 'మేం మీకు సహాయం చేస్తున్నాం, కానీ మా అవసరాలను కూడా చూసుకోవాలి' అనే రీతిలో వ్యవహరించడమే ఉత్తమం, ప్రస్తుతం జరుగుతోంది కూడా అదే" అని వివరించారు.

బంగ్లాదేశ్, చైనా వైపు మొగ్గు చూపుతుందా?
చైనా సహాయం అందిస్తే బంగ్లాదేశ్ ఆ దేశం వైపు మొగ్గు చూపే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు కనికా రాఖరా సమాధానమిస్తూ.. "బంగ్లాదేశ్ ఒక సార్వభౌమ దేశం. అది తన అవసరాలను, ప్రయోజనాలను చూసుకుంటుంది. వారు చైనా సహాయాన్ని కూడా కోరారు, చైనా కూడా సుముఖత వ్యక్తం చేసింది. కాబట్టి ఈ పరిస్థితి ఎలా మారుతుందో గమనించాలి. చైనా ఎంత డీజిల్‌ను పంపిస్తుందో చూడాలి" అన్నారు.
"డీజిల్ డిప్లొమసీ వంటి భావనలు వార్తల్లో వినడానికి బాగుంటాయి కానీ, దౌత్యనీతిలో మరెన్నో అంశాలు ఇమిడి ఉంటాయి. కేవలం డీజిల్ పంపడం వల్లే సంబంధాలు బలపడతాయని అనుకోను’’ అంటారు కనికా రాఖరా
‘‘సహాయం చేయడంతో పాటు ఇతర రంగాల్లో కూడా కలిసి పనిచేయాలి. కేవలం సహాయం చేయడం వల్లే సంబంధాలు మెరుగుపడవు."
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













