అంకె గౌడ: ఈ రిటైర్డ్ ఫ్యాక్టరీ వర్కర్ 20 లక్షల పుస్తకాలున్న లైబ్రరీని ఎలా నిర్మించగలిగారు... ‘‘ఇక మీ వంతు’’ అని ఎందుకంటున్నారు?

పుస్తకాలు, పద్మశ్రీ, లైబ్రరీ, కర్ణాటక, విజ్ఞానం

ఫొటో సోర్స్, Alphonse Vimulraj

ఫొటో క్యాప్షన్, అంకె గౌడ లైబ్రరీలో 20లక్షల పుస్తకాలున్నాయి.
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఓ భారీ భవనం అంతటా పేర్చిన 20లక్షల పుస్తకాలు. అందరికీ ఉచితమే. ఎవరైనా తీసుకెళ్లి చదవొచ్చు.

కర్ణాటకకు చెందిన రిటైర్డ్ షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగి అంకె గౌడ సంపద ఇది. 50ఏళ్లగా ఆయన ఈ పుస్తకాలను సేకరించారు.

అక్షరాస్యత, విజ్ఞానాన్ని అసాధారణ స్థాయిలో పెంపొందించినందుకు 79ఏళ్ల అంకె గౌడను గత నెలలో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించించింది.

బైబిల్ అరుదైన ఎడిషన్లు సహా అన్ని రకాల పుస్తకాలను ఆయన అద్భుతమైన రీతిలో సేకరించారు.

ఆయన ఓ సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు.

చిన్నతనంలో పుస్తకాలను విలాసవంతమైనవిగా భావించేవారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పుస్తకాలు, పద్మశ్రీ, లైబ్రరీ, కర్ణాటక, విజ్ఞానం

ఫొటో సోర్స్, Alphonse Vimulraj

‘ఏ పుస్తకం ఎక్కడ ఉందో ఠక్కున చెప్పేయగలరు’

''నేనో గ్రామంలో పుట్టిపెరిగాను. మాకు చదువుకోడానికి పుస్తకాలుండేవి కాదు. కానీ పుస్తకాలంటే నాకెప్పుడూ ఆసక్తిగా ఉండేది. నేను బాగా చదవాలి, పుస్తకాలు సేకరించాలి, విజ్ఞానాన్ని సంపాదించుకోవాలని ఎప్పుడూ ఆలోచిస్తుండేవాణ్ని'' అని అంకె గౌడ బీబీసీతో చెప్పారు.

కర్ణాటక రాష్ట్రం, మాండ్య జిల్లాలోని చిన్న మున్సిపాలిటీ పాండవపురలో అంకె గౌడ గ్రంథాలయం ఉంది.

అన్ని లైబ్రరీల్లా ఈ గ్రంథాలయం నిర్వహణకు సరైన వ్యవస్థ లేదు. లైబ్రేరియన్ కూడా లేరు. అరల్లో, నేలమీద పుస్తకాలు ఎక్కడపడితే అక్కడ కుప్పలు కుప్పలుగా ఉంటాయి.

లైబ్రరీ బయట షెడ్లలో ఇంకా తెరవని పుస్తకాల సంచులు చాలా ఉన్నాయి. వాటిల్లో 8లక్షల పుస్తకాలు ఉంటాయని అంచనా.

అంకె గౌడ పుస్తకాల సేకరణ ఇంకా కొనసాగుతోంది. కొన్ని పుస్తకాలను ఆయన కొంటున్నారు. కొందరు ఆయనకు పుస్తకాలను డొనేషన్ల రూపంలో ఇస్తున్నారు.

ఈ లైబ్రరీకి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లు, పుస్తకాల ప్రేమికులు తరచుగా వస్తుంటారు. నిత్యం వచ్చే వారికి గ్రంథాలయం అంతా తెలుసు. తమకు కావాల్సిన పుస్తకాలను తేలిగ్గా గుర్తించి తీసుకుంటారు.

ఒకవేళ తాము గుర్తించలేకపోయినా, గౌడకు పుస్తకాల గురించి, ఏ పుస్తకం ఎక్కడ ఉంటుందో మొత్తం తెలుసని వారు చెప్పారు.

గౌడ, ఆయన భార్య, కొడుకు లైబ్రరీ ఉన్న ప్రాంగణంలోనే నివసిస్తారు. వారమంతా లైబ్రరీ తెరిచే ఉంటుంది. రోజులో చాలా గంటలు గ్రంథాలయం అందుబాటులో ఉంటుంది.

పుస్తకాలు, పద్మశ్రీ, లైబ్రరీ, కర్ణాటక, విజ్ఞానం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

‘జీతంలో ఎక్కువ భాగం పుస్తకాలకే’

స్కూల్‌లో చదువుకునే రోజుల్లో గౌడ తన తండ్రికి వ్యవసాయ పనుల్లో సాయం చేసేవారు. తన తల్లిదండ్రులను, అక్కను పుస్తకాల కొనుగోలుకు తరచూ డబ్బులు అడుగుతుండేవారు. భారత స్వాతంత్య్ర సమరయోధుల గురించి, ఆధ్యాత్మికవేత్తల గురించి పుస్తకాలు చదవడం ప్రారంభించాక ఆయనకు పఠనాసక్తి మరింతపెరిగింది.

''అవి నాకు మిఠాయిలా అనిపించేవి''అని ఆయన చెప్పారు.

ఓ టీచర్‌ను స్ఫూర్తిగా తీసుకుని చిన్న స్థాయిలో పుస్తకాల సేకరణ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఇతర విద్యార్థులు చదువుకోడానికి ఇది వీలుగా ఉండేది. తిండి కోసం తల్లిదండ్రులు ఇచ్చే డబ్బును ఆయన పుస్తకాలు కొనేందుకు ఖర్చుపెట్టేవారు.

స్కూల్ విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే ఆయన బస్సు కండక్టర్‌గా పనిచేయడం ప్రారంభించారు.

పదినెలల తర్వాత ఆయన ఓ సారి తన పాత టీచర్ దగ్గరకు వెళ్లారు. అంకె గౌడ చదువుకోవడం లేదని తెలిసి ఆ టీచర్ షాక్ తిన్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసి, కాలేజీకి వెళ్లాల్సిందిగా అంకె గౌడను ఆయన ఒత్తిడి చేశారు.

టీచర్ సలహాలను పాటించిన గౌడ తిరిగి చదువు కొనసాగించారు. కన్నడలో పీజీ పూర్తిచేశారు. తర్వాత పాండవపుర షుగర్ ఫ్యాక్టరీలో టైమ్‌కీపర్‌గా చేరారు.

తన జీతంలో రెండింట మూడోవంతు ఆయన పుస్తకాలకే ఖర్చుచేసేవారు. మిగిలిన మొత్తంతో కుటుంబ అవసరాలు తీర్చేవారు.

''అప్పుడు జీతాలు తక్కువ. రేట్లూ తక్కువే'' అని ఆయన చెప్పారు.

ఆ ఫ్యాక్టరీలో అంకె గౌడ 33ఏళ్లు పనిచేశారు. ఆ కాలంలో ఆయన అనేక కన్నడ సాహిత్య పరిషత్ సమావేశాలకు హాజరయ్యారు. ఇది లాభాపేక్ష లేని సంస్థ. కన్నడ భాష, సాహిత్యం అభివృద్ధి కోసం పనిచేసేది. ఈ సంస్థ దగ్గరనుంచి ఆయన తరచుగా డిస్కౌంట్‌లో పుస్తకాలు కొనేవారు.అదనపు ఆదాయం కోసం ఆవులు పెంచి, పాలు అమ్మేవారు. ఇన్సూరెన్స్ ఏజెంట్‌గానూ పనిచేశారు.

పుస్తకాలు, పద్మశ్రీ, లైబ్రరీ, కర్ణాటక, విజ్ఞానం

ఫొటో సోర్స్, Alphonse Vimulraj

ఫొటో క్యాప్షన్, పుస్తకాల కోసం తాను చేయాల్సిదంతా చేశానని అంకె గౌడ అన్నారు.

‘ఈ పుస్తకాలన్నీ ఎక్కడ పెట్టాలి?’

పుస్తకాల ప్రేమికుల అందరిలానే తన దగ్గరున్న పుస్తకాలను ఉంచడానికి సరైన స్థలంలేక ఆయన ఇబ్బందులు పడ్డారు.

''పుస్తకాలను ట్రంకుపెట్టల్లో పెట్టేవాణ్ని. తర్వాత మా ఇంట్లో పుస్తకాల అరలు పెట్టుకున్నా. అయినప్పటికీ కొన్నాళ్లకు స్థలం లేకుండా పోయింది'' అని ఆయన చెప్పారు.

ఆ సమయానికి ఆయన దగ్గర దాదాపు 50వేల పుస్తకాలుండేవి.

ఆయన స్నేహితులు మద్యం వ్యాపారి హరి ఖొడేను కలిశారు. ఆయన అప్పుడు పాండవపురలో ఆలయం నిర్మిస్తున్నారు.

ఒక్క వ్యక్తి దగ్గర అన్ని పుస్తకాలుంటాయంటే ఖోడే నమ్మలేకపోయారని గౌడ గుర్తుచేసుకున్నారు.

''ఆయన స్వయంగా వచ్చి పుస్తకాలు చూశారు. నాకేం కావాలని అడిగారు. నాకు డబ్బులు అవసరం లేదు. ఒక లైబ్రరీ కట్టమని అడిగాను'' అని గౌడ చెప్పారు.

ఖోడే దానికి అంగీకరించి భారీ భవనం నిర్మించేందుకు డబ్బులిచ్చారు. అదిప్పుడు 15,800 చదరపు అడుగులున్న గౌడ భారీ లైబ్రరీలో భాగంగా ఉంది.

కొన్నేళ్లు గడిచిన తర్వాత స్థానిక శాసనసభ్యుడు అప్పటి ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామిని తీసుకొచ్చి ఆ లైబ్రరీని చూపించారు. మొదటి భవనానికి అదనంగా మరో రెండు నిర్మాణాల కోసం ఆయన నిధులు మంజూరుచేశారు.

పుస్తకాలు, పద్మశ్రీ, లైబ్రరీ, కర్ణాటక, విజ్ఞానం

ఫొటో సోర్స్, Alphonse Vimulraj

ఫొటో క్యాప్షన్, బైబిల్ అరుదైన ఎడిషన్

‘నేను చేయాల్సిందంతా చేశా’

ఇప్పుడు రాష్ట్రం నలుమూలల నుంచీ టీచర్లు, విద్యార్థులు ఆ గ్రంథాలయానికి వస్తుంటారు. ఈ లైబ్రరీ చూసి స్ఫూర్తి పొంది తాను కూడా వేలపుస్తకాలు సేకరించానని ఓ ప్రయివేట్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ అయిన రవి బెట్టస్వామి చెప్పారు.

''నేను గౌడ లైబ్రరీలో చదువుకునేవాణ్ని. నా విద్యార్థులను కూడా తీసుకెళ్లేవాణ్ని. వారు అక్కడ చదువుకునేవారు. పుస్తకాలను సర్దేవారు'' అని ఆయన చెప్పారు.

''ఓ నిష్ణాతుడైన లైబ్రేరియన్ లేరు కాబట్టి అక్కడ పుస్తకాలన్నీ కాస్త గందరగోళంగా ఉంటాయి. కానీ ఏ పుస్తకం ఎక్కడ ఉందో ఆయనకు(గౌడ)కు తెలుసు. కావాల్సిన పుస్తకం గురించి అడగ్గానే ఆయన చూపిస్తారు'' అని ప్రభుత్వ కళాశాల లెక్చరర్ శిల్పశ్రీ హరను చెప్పారు.

లైబ్రేరియన్‌ను ఎందుకు పెట్టుకోలేదని అడిగితే, అలా పెట్టుకోవాలని తనకెవరూ చెప్పలేదని గౌడ అన్నారు.

లైబ్రరీ భవిష్యత్తు ఏంటని అడిగితే, తాను చేయాల్సింది చేశానని, తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇప్పుడు ఇతరులదని ఆయన వేదాంత ధోరణిలో చెప్పారు.

''నా బాధ్యత పూర్తిచేశాను. ఇక నాకు శక్తి లేదు. ప్రభుత్వం, ప్రజలు ఇప్పుడు దాని బాధ్యత తీసుకోవాలేమో. నేను చేయగలిగిందంతా చేశాను. ఇక ఇప్పుడు ఇతరుల వంతు'' అని అంకె గౌడ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)