ఈదుకుంటూ వెళ్లిన 13 ఏళ్ల పెద్ద కొడుకు ఏమయ్యాడో అమ్మకు తెలియదు.. సముద్రంలో కొట్టుకుపోతున్న తల్లి, తమ్ముడు, చెల్లి బతికే ఉన్నారో లేదో ఆ కొడుక్కి తెలియదు.. చివరకు ఏమైందో చెప్పిన ‘సాహస బాలుడు’

Joanne and Austin with Beau, 12, and Grace, eight

ఫొటో సోర్స్, ABC News/Briana Shepherd

    • రచయిత, ఫ్లోరా డ్రూరీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 5 నిమిషాలు

అమ్మ సహా తమ కుటుంబం సముద్రంలో కొట్టుకుపోయినప్పుడు సహాయం కోసం గంటల తరబడి ఈదుకుంటూ వెళ్లిన 13 ఏళ్ల ఆస్ట్రేలియా బాలుడు ’బీబీసీ’తో మాట్లాడాడు.

తనపై కురుస్తున్న ప్రశంసల గురించి మాట్లాడుతూ.. "నేను హీరోని అని అనుకోలేదు, నేను చేయాల్సిన పని చేశాను" అని చెప్పాడు.

సముద్రంలో రెండు పెడల్ బోర్డులను పట్టుకుని ప్రాణాలు నిలపుకొనేందుకు ప్రయత్నిస్తున్న తన తల్లి జోవాన్, తమ్ముడు బ్యూ, సోదరి గ్రేస్ ఇంకా బతికే ఉన్నారా లేదా కూడా తెలియని పరిస్థితిలో, వారిని కాపాడేందుకు తీరానికి చేరుకోవడానికి నాలుగు గంటల పాటు ఈదాడు పదమూడేళ్ల ఆస్టిన్ అపెల్బీ.

ఆస్ట్రేలియా పశ్చిమ తీరానికి చాలా దూరంగా సముద్రంలో అలలు ఉద్ధృతి పెరిగింది.. మరోవైపు చీకటిపడుతోంది. ఆ సమయంలో సముద్రంలో కొట్టుకుపోయిన ఆ కుటుంబంలో కుమారుడు ఆస్టిన్ సహాయం కోసం ఒడ్డుకు ఈదుకుంటూ బయల్దేరాడు.

అలా వెళ్లిన కొడుకు తీరం వరకు చేరుతాడో లేదో, బతికి బయటపడతాడో లేదో అని తల్లి చాలా భయపడ్డారు.

కొన్ని గంటల తర్వాత జోవాన్‌కు రెస్క్యూ బోట్ కనిపించినప్పుడే తన కుమారుడు సురక్షితంగా ఉన్నాడని ఆమెకు తెలిసింది.

అప్పటికే ఆమెతో పాటు ఇద్దరు పిల్లలు సముద్రంలో దాదాపు 14 కిలోమీటర్లు దూరం కొట్టుకుపోయారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కుటుంబంతో కలిసి సరదాగా గడపాలనే ఉద్దేశంతో బీచ్‌కు వెళ్లిన రోజు, చివరికి జోవాన్, ఆమె కుటుంబానికి 10 గంటల భయంకర అనుభవంగా మారింది.

ఒడ్డున ఉన్న అలారం మోగించడానికి అంతదూరం ఈత కొట్టడంతో ఆస్టిన్‌ని సూపర్ హ్యూమన్ అభివర్ణించారు రెస్క్యూ సిబ్బంది.

"ఆస్టిన్ బతికి బయటపడలేదని నేను భావించాను," అని 47 ఏళ్ల జోవాన్ బీబీసీ న్యూస్ చానల్‌కు తెలిపారు.

"కానీ చివరికి అందరూ సురక్షితంగా, సంతోషంగా ఉండటం. కాస్త నొప్పి, అలసట ఉన్నప్పటికీ ఎలాంటి గాయాలు అవకపోవడం నిజంగా ఒక మంచి ముగింపు" అని ఆమె తెలిపారు.

ఆస్టిన్, తల్లి జోవాన్, ఆస్ట్రేలియా, సముద్రం, సాహసం, ఈత, విహారయాత్ర, ప్రమాదం
ఫొటో క్యాప్షన్, ఆస్టిన్, తల్లి జోవాన్

'కఠినమైన పోరాటం'

గత శుక్రవారం ఆ కుటుంబం పెర్త్‌కు ఇంటికి వెళ్లాల్సి ఉంది.

"కానీ బీచ్‌లో తక్కువ లోతున్న నీటిలో రెండు పెడల్‌బోర్డులు, కయాక్‌‌తో సరదాగా గడుపుతుండగా, పిల్లలు ఎక్కువ దూరం వెళ్లిపోయారు" అని జోవాన్ వివరించారు.

"గాలి ఒక్కసారిగా బలంగా వీచింది, అక్కడినుంచి పరిస్థితి మారిపోయింది. మా తెడ్లు పడిపోయాయి. దీంతో ఇంకా దూరంగా కొట్టుకుపోయాం… నిమిషాల్లో పరిస్థితి చేజారిపోయింది" అని ఆమె తెలిపారు.

పశ్చిమ ఆస్ట్రేలియాలోని క్విండాలప్ బీచ్ నుంచి తాము మరింత దూరంగా కొట్టుకుపోతున్నామని గ్రహించిన జోవాన్, ఏదో ఒకటి చేయాలనుకున్నారు. కానీ పిల్లలు 12 ఏళ్ల బ్యూ, ఎనిమిదేళ్ల గ్రేస్‌లను ఒంటరిగా వదిలి వెళ్ళలేకపోయారు.

"మేం తీరప్రాంతం నుంచి అంత దూరంలో ఉన్నట్లు కనిపించకపోవడంతో, చివరకు సహాయం కోసం ప్రయత్నించడానికి 13ఏళ్ల ఆస్టిన్‌ను పంపించాను" అని ఆమె చెప్పారు.

ఆస్టిన్ కయాక్ తీసుకున్నాడు. కానీ అది అప్పటికే బాగా దెబ్బతిని నీళ్లు లోపలికి వచ్చేస్తున్నాయని ఎవరూ గ్రహించలేదు.

"అది తిరగబడుతోంది. తర్వాత తెడ్డు పడిపోయింది. అప్పుడు నేను ప్రమాదంలో ఉన్నానని అర్థమైంది, దాంతో చేతితోనే నీటిని తోసుకుంటూ ముందుకు వెళ్లాను" అని ఆస్టిన్ చెప్పాడు.

ఒక సమయంలో ఆస్టిన్ కయాక్‌ను కొంతవరకు నియంత్రించగలిగాడు. కానీ చివరికి అది మరోసారి తిరగబడింది.

తలకిందులైన కయాక్‌ను పట్టుకుని ఉన్న ఆస్టిన్‌కు నీటిలో ఏదో కనిపించింది. దాంతో ఏదో ఒకటి చేయాల్సిందేనని అనుకున్నాడు.

"రెండు గంటల పాటు సముద్రంలో ఉన్నాను, అప్పటికే పరిస్థితి ప్రమాదకంగా మారుతోంది" అని ఆస్టిన్ చెప్పాడు.

పశ్చిమ ఆస్ట్రేలియా, బీచ్, ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పశ్చిమ ఆస్ట్రేలియాలోని ‘జియోగ్రాఫ్ బే’కి ఆ కుటుంబం విహారయాత్రకు వెళ్లింది.

ఆస్టిన్ తన కుటుంబ సభ్యులను కూడా చూడలేకపోయాడు, వారికి కూడా అతను కనిపించలేదు.

జోవాన్, పిల్లలు దూరంగా సముద్రంలో కొట్టుకుపోతుండగా, అలలు ఉద్ధృతంగా మారాయి. దాంతో బోర్డులపై నిలబడటం కష్టమైంది. అప్పటికే చీకటి పడుతోంది.

అందరికీ లైఫ్ జాకెట్లు ఉన్నాయి . కానీ ఆహారం, నీరు లేవు.

"ఆస్టిన్ చాలా వేగంగా తీరానికి చేరుకున్నాడని నేను అనుకున్నా, కానీ రోజు గడిచేకొద్దీ మమ్మల్ని రక్షించడానికి ఏ రెస్క్యూ బోటూ రాలేదు. ఒకవేళ ఆస్టిన్ తీరానికి చేరుకుని ఉండకపోతే... నేను ఆస్టిన్‌ను పంపించి పొరపాటు చేశానా, ఎవరైనా వచ్చి నా మిగతా ఇద్దరు పిల్లలను కాపాడతారా? అన్న ఆలోచనలు కూడా వెంటాడాయి" అని జోవాన్ అన్నారు.

ఆస్టిన్ చివరి 4 కిలోమీటర్లు ఈదడం మొదలుపెట్టాక.. కొంతసేపటి లైఫ్‌జాకెట్‌తో ఈదలేననిపించి దాన్ని తీసేశాడు.

"నేను ఒడ్డుకి వచ్చినప్పుడు నేలపైకి ఎలా వచ్చాను అనుకున్నా, ఇది కలా అనిపించింది" అని ఆస్టిన్ చెప్పాడు.

స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6:00 గంటలకు తన తల్లి బ్యాగ్ దగ్గరకు వెళ్లి ఫోన్ తీసుకుని సాయం కోసం ఫోన్ చేశాడు.

ఆ కాల్ రావడంతో పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కాల్ చేసిన తర్వాత స్పృహ తప్పి పడిపోయిన ఆస్టిన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. తర్వాత తన తండ్రికి ఫోన్ చేసి తల్లి, తోబుట్టువులు బతికే ఉన్నారో లేదో తెలియదు అని కన్నీళ్లుపెట్టుకున్నాడు.

కొన్ని నిమిషాల తర్వాత, వారు దొరికారని కాల్ వచ్చింది. దీంతో వైద్యులు, పోలీసు అధికారులు చాలా సంతోషించారు.

"అది నేను ఎప్పటికీ మర్చిపోలేని క్షణం" అని ఆస్టిన్ చెప్పాడు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)