అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత్.. ఫైనల్‌లో వైభవ్ సూర్యవంశీ 15 సిక్సర్లు, 15 ఫోర్లతో 175 పరుగులు

అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌, వైభవ్ సూర్యవంశీ, ఇంగ్లండ్‌

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, తిమోతి అబ్రహం
    • హోదా, బీబీసీ స్పోర్ట్ జర్నలిస్ట్
  • చదివే సమయం: 3 నిమిషాలు

అండర్-19 ప్రపంచ కప్‌ను భారత క్రికెట్ జట్టు గెలుచుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో వంద పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి టైటిల్ చేజిక్కించుకుంది.

ఫైనల్ మ్యాచ్‌లో భారత ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి అద్భుతమైన ఆటతీరును కనబరిచాడు.

జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన మ్యాచ్‌లో 14 ఏళ్ల ఈ బాలుడు 218.75 స్ట్రైక్ రేట్‌తో 15 సిక్సర్లు, 15 ఫోర్లు బాదాడు.

మొదటి 24 బంతుల్లో 24 పరుగులు చేశాడు. అంటే చివరి 151 పరుగులు కేవలం 56 బంతుల్లోనే వచ్చాయి.

సూర్యవంశీ 126 నిమిషాలు క్రీజులో ఉన్నాడు. తర్వాత ఇంగ్లండ్ సీమర్ మానీ లమ్స్‌డెన్ వేసిన 26వ ఓవర్‌లో వైభవ్ అవుటయ్యారు. జట్టు స్కోర్ 251 పరుగుల వద్ద వైభవ్ మూడో వికెట్‌గా వెనుదిరిగాడు.

లమ్స్‌డెన్ వేగంగా వేసిన బంతిని వైభవ్ సూర్యవంశీ.. ఇంగ్లండ్ కెప్టెన్, వికెట్ కీపర్ థామస్ రూ వైపు స్లాగ్ స్వీప్ చేయడానికి ప్రయత్నించి అవుటయ్యాడు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సూర్యవంశీ మైదానం విడిచి వెళ్లేటప్పుడు తన ప్రతిభకు అభినందనగా చాలా మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు కరచాలనం చేశారు.

భారత్ 50 ఓవర్లలో 411/9 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది.

సూర్యవంశీ ఈ టోర్నీలో 7 ఇన్నింగ్స్‌లో 439 పరుగులు చేశాడు. 62.71 సగటును నమోదు చేశాడు. టోర్నీలో రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లండ్ ప్లేయర్ మయెస్ 444 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.

సూర్యవంశీ ఇన్నింగ్స్‌లో మరికొన్ని ముఖ్యాంశాలు:

  • అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో వైభవ్ చేసిన 175 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు. గతంలో ఈ రికార్డు ఉన్ముక్త్ చంద్ పేరిట ఉండేది. 2012లో ఆస్ట్రేలియాతో ఫైనల్లో ఉన్ముక్త్ చంద్ అజేయంగా 111 పరుగులు చేశాడు.
  • అండర్-19 వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 15 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా వైభవ్ రికార్డు నెలకొల్పాడు. గతేడాది అండర్-19 ఆసియా కప్‌లో యూఏఈపై వైభవ్ 14 సిక్సర్లు కొట్టాడు.
  • అండర్-19 వరల్డ్ కప్ ఇన్నింగ్స్‌లో ఒక ప్లేయర్ 15 సిక్సర్లు కొట్టడం ఇదే తొలిసారి.
  • ఫైనల్లో 55 బంతుల్లో సెంచరీ చేసిన వైభవ్, అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో రెండో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. ఇదే టోర్నీలో జపాన్‌పై ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ విల్ మాలాజక్ 51 బంతుల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించాడు.

గతేడాది ఏప్రిల్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తాను ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్స్ కొట్టడం ద్వారా సూర్యవంశీ అందరి దృష్టిని ఆకర్షించారు.

రాజస్థాన్ రాయల్స్ తరపున గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లో 100 పరుగులు చేసి పురుషుల టీ20ల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.

2013లో క్రిస్ గేల్ 30 బంతుల్లో చేసిన సెంచరీ తర్వాత, ఇది ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ.

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ T20 మ్యాచ్‌లో యూఏఈపై ఇండియా ఎ తరఫున ఆడుతూ 32 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఆ మ్యాచ్‌లో 42 బంతుల్లో 144 పరుగులు చేశాడు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)