You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్ దాడులతో తుర్కియే ఎందుకు భయపడుతోంది?
- రచయిత, అమీద్ ముంత్‌జరీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- నుంచి, ఇరాన్ - తుర్కియే సరిహద్దుల నుంచి
- చదివే సమయం: 5 నిమిషాలు
తెహ్రాన్‌లో ప్రభుత్వం కూలిపోతే, ఇరాన్ అంతర్యుద్ధంలో చిక్కుకునే ప్రమాదం ఉందని, అదే జరిగితే పశ్చిమాసియాలో సంక్షోభం నెలకొంటుందని తుర్కియే తీవ్రంగా ఆందోళన చెందుతోంది.
సిరియా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తుర్కియే అధికారులు కలత చెందుతున్నారు. ఇరాన్ ప్రభుత్వం కూలిపోతే ఈ ప్రాంతంలో తన ఆధిపత్యం కొనసాగించడానికి తుర్కియేనే ఇజ్రాయెల్‌కు తదుపరి లక్ష్యం అవుతుందని వారు భయపడుతున్నారు.
తుర్కియేలోని పాలక సంకీర్ణ భాగస్వామ్య పార్టీలలో ఒకటైన నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షుడు డెవ్లెట్ బాగ్చిలీ ఇటీవల ఇఫ్తార్ విందు సందర్భంగా చేసిన ప్రకటన ఈ ఆందోళనలకు స్పష్టతనిస్తోంది. ఈ పార్టీ తుర్కియే అధ్యక్షుడు ఎర్దోవాన్‌కు సన్నిహిత పక్షం.
''ఇరాన్‌కు ఎంతో చరిత్ర ఉంది. అక్కడ జరిగే పతనం కేవలం ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదు. అది సరిహద్దులపై భద్రతపరమైన ఒత్తిడి, ప్రజలు నిరాశ్రయులు కావడం, జాతుల మధ్య ఉద్రిక్తతలు, అక్రమ ఆర్థిక వ్యవస్థల విస్తరణ, ప్రాక్సీ సాయుధ గ్రూపులు పెరగడానికి కారణమవుతుంది'' అని ఆయన చెప్పారు.
''తుర్కియే ఎదుర్కొంటున్న సమస్య దూరప్రాంత సరిహద్దు సంక్షోభం కాదు. అది నేరుగా జాతీయ భద్రత, సరిహద్దు భద్రత, ప్రాంతీయ స్థిరత్వంతో ముడిపడిన వ్యవహారం. సిరియా అనుభవం మనకో ఖరీదైన గుణపాఠం చెప్పింది'' అని బాగ్చిలీ అన్నారు.
'' ప్రస్తుతం ఇరాన్‌లో జరుగుతున్నపరిణామాలు జాగ్రత్తగా గమనించాలి. ఏ ప్రాంతంలోనైనా పాలనలో శూన్యత ఏర్పడినప్పుడు అక్కడ తర్కం, వివేకం, పరస్పర అవగాహన, కరుణ వంటి విలువలు పనిచేయవు. చివరకు అక్కడ ఆయుధాలు మాత్రమే పాలిస్తాయి'' అని చెప్పిన బాగ్చిలీ... ''సిరియా వ్యవహారంలోలా కాకుండా, ఇరాన్ విషయంలో తుర్కియే ఎంతమాత్రమూ ''నిర్లక్ష్యం''గా ఉండకూడదని'' అప్రమత్తం చేశారు.
''సరిహద్దు భద్రతను బాగా కట్టుదిట్టం చేయాలి. ఇరాన్ సరిహద్దులో ఏర్పడే ఏ పరిణామాన్నైనా ఎదుర్కోవడానికి అన్నిరకాల సన్నాహాలు అవసరం '' అని బాగ్చిలీ అన్నారు.
''వలసల ఒత్తిడి పెరగడం , స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ల విస్తరణ, సాయుధ ప్రాక్సీ గ్రూప్‌ల కదలికలు, ఉగ్రవాదుల చొరబాట్లు వంటి ప్రమాదాలను సమగ్రమైన భద్రత వ్యూహంతో ఎదుర్కోవాల్సి ఉంటుందని, వాటి ఆర్థిక ప్రభావాన్ని కూడా నియంత్రించాల్సి ఉంటుందని '' అన్నారు.
కుర్దులు ఎలాంటి సన్నాహాలు చేస్తున్నారు?
ఇరాన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న కుర్దుల గ్రూపులు కూడా యుద్ధంలో చేరే అవకాశం ఉంది. వాషింగ్టన్, టెల్‌అవీవ్ కూడా ఇదే కోరుకుంటున్నాయని అమెరికా మీడియా కథనాలు చెబుతున్నాయి. 'అది గొప్ప విషయమవుతుంది'' అని డోనల్డ్ ట్రంప్ కూడా చెప్పారు.
తుర్కియే అధికారగణం దీనిపై ఆందోళన చెందుతోంది.
అయితే కొన్నిరోజుల తరువాత ట్రంప్ వైఖరి మారింది. ప్రస్తుతం కుర్దులను యుద్ధంలో భాగం చేసేందుకు ఎలాంటి ప్రణాళికలు లేవని చెప్పారు. కానీ ఈ అవకాశం పూర్తిగా తొలగిపోలేదు.
డోనల్డ్ ట్రంప్ మద్దతు ఇస్తే అమెరికా, ఇజ్రాయెల్ గగనతల దాడులకు తోడు తమ దళాలు ఇరాన్ భద్రతాదళాలకు వ్యతిరేకంగా భూతల దాడులకు దిగడానికి సిద్ధంగా ఉన్నాయని ఇరానియన్ కుర్దిస్తాన్ సంస్థ ‘కోమాలా’ ప్రధాన కార్యదర్శి అబ్బుల్లా మొహ్తాదీ ‘న్యూస్‌వీక్’కు చెప్పారు.
''కుర్దిస్ పార్టీలకు అమెరికా భద్రతాపరమైన అండదండలు అందిస్తే మేం కీలకపాత్ర పోషిస్తాం. మేం సంప్రదాయ పద్ధతిలో స్వాతంత్య్ర పక్రియను మొదలుపెడతాం'' అని ఆయన తెలిపారు.
''మేం కుర్దిస్తాన్ ప్రాంతంలో ఇరాన్ దళాలను తరిమికొట్టగలం, మా ప్రజలను రక్షించుకుంటాం, ప్రభుత్వ దళాల మారణకాండ నుంచి వారిని రక్షించి, సంక్షోభాన్ని నివారించి, శాంతి నెలకొల్పుతాం'' అన్నారు.
ఇది ఇరాన్ ప్రజలకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడే శక్తినిస్తుందని అబ్దుల్లా మొహ్తాదీ చెప్పారు.
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే ఇంధన ధరలు పెరుగుదల, ఇరాక్‌లో పెరుగుతున్న అశాంతి తుర్కియే ప్రయోజనాలకు ముప్పుగా మారే అవకాశం, నేటో క్షిపణులు తుర్కియే గగనతలంలో కూల్చాల్సి రావడం తదితర అంశాలపై కూడా తుర్కియే ఆందోళన చెందుతోంది.
తుర్కియే వైపు క్షిపణులను ప్రయోగించలేదని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ ఖండించింది.
యుద్ధంలో తుర్కియే చేరుతుందా?
''ఈ యుద్ధం వీలైనంత త్వరగా ముగియాలి'' అని తుర్కియే విదేశాంగ మంత్రి హాకాన్ ఫిదాన్ అన్నారు. గతవారం అంకారాలో బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రితో కలిసి నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
''ఈ దశలో అన్ని పక్షాలు మళ్లీ చర్చలకు రావాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. చర్చల ద్వారానే సమగ్రమైన పరిష్కారం సాధ్యమవుతుంది. దీనికోసం తుర్కియే తన వంతుగా అన్ని ప్రయత్నాలు చేస్తోంది'' అని చెప్పారు.
''శాంతి, స్థిరత్వం కోసం మేం చూపుతున్న నిజాయితీ ప్రయత్నాలు, సానుకూల వైఖరి వల్ల మా జాతీయ భద్రత విషయంలో రాజీ పడతామని అర్థం కాదు. నిన్న మా వైపు ప్రయోగించిన క్షిపణిని గగన తలంలోనే ధ్వంసం చేశాం. ఈ తీవ్రమైన అంశంపై మేం ఇరాన్‌తో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నాం'' అని ఫిదాన్ పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.
ఈ ‘అక్రమయుద్ధం’లో తుర్కియే ఎలాంటి ప్రేరేపణలకు లోనుకాదని, ఇందులో పాల్గొనే ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేశారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తుర్కియే భాషలో సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌ను తుర్కియే మీడియా ప్రసారం చేసింది.
''సోదర భావన కలిగిన తుర్కియే ప్రజలు, మిత్ర దేశమైన తుర్కియే ప్రభుత్వం ఇరాన్ ప్రజలకు తెలియజేసిన ప్రార్థనలు, సంఘీభావ సందేశాలు మాకు గొప్ప బలం, ధైర్యాన్ని ఇస్తున్నాయి'' అని అరాగ్చీ పేర్కొన్నారు.
బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం భద్రతా హెచ్చరిక జారీ చేసి, అమెరికా పౌరులు వెంటనే ఇరాక్‌ను విడిచిపోవాలని సూచించింది.
అనంతరం తుర్కియే కూడా ఇలాంటి హెచ్చరిక జారీ చేసింది.
అత్యవసర పరిస్థితులలో తప్ప తమ పౌరులు ఇరాక్‌కు ప్రయాణించవద్దని సూచించింది.
బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయ భవనంపై డ్రోన్ దాడి జరిగిన తరువాత ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఈ యుద్ధానికి వ్యతిరేకంగా తుర్కియేలో అనేక నిరసనలు జరుగుతున్నాయి.
తాజా నిరసనలో తుర్కియే యూత్ యూనియన్ సభ్యులు, తుర్కియే, ఇరాన్ జెండాలతో అంకారాలోని అమెరికా రాయబార కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఖండించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)