సీఎన్‌జీ, పీఎన్‌జీ: వంటకు పైప్డ్ నేచురల్ గ్యాస్, వాహనాలకు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ వాడేవారికీ ఇబ్బందులు తప్పవా?

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 5 నిమిషాలు

ఇరాన్ యుద్ధం భారత లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) మార్కెట్‌పై ఇప్పటికే ప్రభావం చూపించింది.

ఇక ఇప్పుడు ఇంధన అవసరాల్లో మరో ముఖ్యమైనది కూడా దీని వల్ల ప్రభావితమయ్యే అవకాశం కనిపిస్తోంది.

అదే దేశవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్న సహజ వాయువు (పీఎన్‌జీ) పైప్‌లైన్ నెట్‌వర్క్. ఇళ్లకు, వ్యాపారాలకు పైప్‌లైన్ల ద్వారా గ్యాస్ సరఫరా చేసే నెట్‌వర్క్‌ ఇది.

ఈ సహజ వాయువుకు ఎరువులు తయారు చేసే ప్లాంట్లు, పరిశ్రమలు, గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు... ఇళ్లకు పీఎన్‌జీని, వాహనాలకు సీఎన్‌జీని (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్‌ను) సరఫరా చేసే నగర గ్యాస్ నెట్‌వర్క్‌ల నుంచి డిమాండ్ ఎక్కువగా వస్తోంది.

ఇళ్లకు సిటీ గ్యాస్ సరఫరా అత్యంత వేగంగా పెరుగుతోంది. పట్టణంలో నెట్‌వర్క్‌ల విస్తరణతో ఇది క్రమంగా వృద్ధి చెందుతోంది.

ఈ ప్రయత్నాల ప్రభావం క్షేత్రస్థాయిలోనూ కనిపిస్తోంది.

భారత్‌లో ప్రస్తుతం 1.5 కోట్లకు పైగా పీఎన్‌జీ కనెక్షన్లు ఉన్నాయి.

వంటకు సిలిండర్లు కాకుండా పైప్‌లలోంచి సరఫరా అయ్యే గ్యాస్‌ను వాడాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటంతో.. ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.

భారత్‌లో వంటగ్యాస్ సరఫరాపై ఇరాన్‌ యుద్ధం తీవ్ర ఒత్తిడిని పెంచింది.

ఇదే సమయంలో.. సీఎన్‌జీ వాహనాలకు గ్యాస్ డిమాండ్ కూడా క్రమంగా పెరిగింది. వాహనాలకు పెట్రోల్ తర్వాత భారత్‌లో అత్యంత ఎక్కువ మంది వాడే ఇంధనం సీఎన్‌జీ.

ఎల్‌పీజీని తీసుకొచ్చే ట్యాంకర్లు హార్ముజ్ జలసంధి మీదుగా రావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటే, పైప్‌లైన్‌ల ద్వారా తమ వంటగదులకు సరఫరా అయ్యే గ్యాస్‌ కూడా ప్రభావితం చెందుతుందా అనే ప్రశ్న అనేక పట్టణ కుటుంబాల్లో తలెత్తుతోంది.

పైప్డ్ నేచురల్ గ్యాస్‌పై ప్రభావం పడుతుందా?

భారత్‌లో పైప్‌లైన్ గ్యాస్ సరఫరా అనేది దేశీయ ఉత్పత్తి, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) దిగుమతుల మిశ్రమం.

భారత పీఎన్‌జీ గ్యాస్ సరఫరాలో సగం వరకు రిలయన్స్, ఓఎన్‌జీసీ వంటి కంపెనీలు తీర ప్రాంతాలు, లోతైన సముద్ర గర్భాల నుంచి వెలికితీసే దేశీయ వనరుల నుంచే వస్తోంది.

మిగిలిన సరఫరాలను ఎల్‌ఎన్‌జీ దిగుమతులతో తీరుస్తుంది ప్రభుత్వం.

''పైప్‌లైన్ల ద్వారా సరఫరా చేసే గ్యాస్‌ను వాడే ఇళ్లకు, సీఎన్‌జీ వాడే వాహనాలకు ప్రస్తుతం ఎలాంటి అంతరాయం ఉండకపోవచ్చు. ఈ రెండు రంగాలకు ప్రస్తుతం ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది'' అని హరియాణా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ చోప్రా చెప్పారు.

హరియాణా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ అనేది సుమారు లక్ష మంది దేశీయ వినియోగదారులు, 195 సీఎన్‌జీ ఫ్యూయల్ స్టేషన్లతో దేశవ్యాప్తంగా కార్యకలాపాలు సాగించే గ్యాస్ కంపెనీ.

అయితే, గ్యాస్‌ను ఇళ్లకు, వాహనాలకు మల్లిస్తున్నందున కంపెనీలకు చెందిన సుమారు 2,200 పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు ప్రభుత్వం విధించిన 20 శాతం సరఫరా కోతను ఎదుర్కొంటున్నారు.

భారత్‌కు గ్యాస్ ఎక్కడ నుంచి వస్తోంది?

సరఫరా కొరత వచ్చినప్పుడు ప్రభుత్వం సాధారణంగా ఎరువుల తయారీ ప్లాంట్లకు, పైప్‌లైన్ గ్యాస్ కనెక్షన్లు ఉన్న ఇళ్లకు ప్రాధాన్యం ఇస్తుంది.

అంటే.. మొదట ప్రభావితమయ్యే రంగాలు సాధారణంగా పరిశ్రమలు, విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సంస్థలే.

ఎల్‌ఎన్‌జీ ధరలు పెరిగినప్పుడు లేదా సరఫరాలు తగ్గినప్పుడు ఫ్యాక్టరీలు తరచూ ఫ్యూయల్ ఆయిల్, ఎల్‌పీజీ, బొగ్గు వైపు మరలుతుంటాయి.

గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు తమ విద్యుత్పత్తిని తగ్గిస్తాయి.

దేశీయంగా బలంగా ఉన్నప్పటికీ, ఎల్‌పీజీ మార్కెట్ మాదిరిగానే భారత పైప్‌లైన్ గ్యాస్ వ్యవస్థ కూడా ప్రపంచవ్యాప్తంగా నెలకొనే ఒడుదొడుకులకు ప్రభావితమవుతుంది.

ఇటీవల కాలంలో, దేశ మొత్తం గ్యాస్ లభ్యతలో సుమారు సగం వాటా ఎల్‌ఎన్‌జీదే.

2025లో 2.4 కోట్ల నుంచి 2.5 కోట్ల టన్నుల ఎల్‌ఎన్‌జీ దిగుమతి అయినట్లు అంచనా.

ప్రపంచంలో అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ కొనుగోలుదారుల్లో భారత్‌ ఒకటి.

ఈ దిగుమతుల్లో అధిక భాగం ఒక్క ప్రాంతం నుంచే వస్తున్నాయి. అదే ఖతార్.

భారత్‌కు చెందిన ఎల్‌ఎన్‌జీ దిగుమతుల్లో సగానికి పైగా.. ఖతార్‌లోని సరఫరాదారులతో దీర్ఘకాలిక ఒప్పందాలతో ముడిపడి ఉన్నాయి.

అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల నుంచి కూడా ఎల్‌ఎన్‌జీ దిగుమతి అవుతుంది. కానీ, ఆ దేశాల నుంచి దిగుమతులు కొద్ది మొత్తాల్లోనే ఉన్నాయి.

ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చే ఎల్‌ఎన్‌జీ కార్గోలు తప్పనిసరిగా అత్యంత ఇరుకైన సముద్ర మార్గం హార్ముజ్ జలసంధిని దాటాల్సిందే.

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న సంక్షోభంలో ఈ సముద్ర మార్గం కూడా ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది.

భారత ఎల్‌ఎన్‌జీ దిగుమతుల్లో 50 శాతం నుంచి 55 శాతం దిగుమతులు ఈ మార్గంలోనే రావాలి.

‘సరఫరా ప్రస్తుతం పూర్తిగా దెబ్బతినలేదు. సంక్షోభానికి ముందు ఖతార్‌లో ట్యాంకర్లలో నింపిన సరకు ఇప్పటికీ ఆసియాకు చేరుకుంటున్నాయి’ అని కమోడిటీ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ కెప్లర్ ఇన్‌సైట్‌లోని ఎల్ఎన్‌జీ, నేచురల్ గ్యాస్ లీడ్ అనలిస్ట్ గో కటయామా చెప్పారు.

కెప్లెర్ షిప్పింగ్ డేటా ప్రకారం.. ఫిబ్రవరి 10 నుంచి 26 మధ్య 13 ఎల్‌ఎన్‌జీ కార్గోలను నింపారు. అవి ఇప్పుడు భారత్‌కు వచ్చే దారిలో ఉన్నాయి. డెలివరీలు మార్చ్ నెల వరకు కొనసాగుతాయి.

ఖతార్‌లోని అతిపెద్ద రాస్ లాఫన్ ఎల్‌ఎన్‌జీ కాంప్లెక్స్ నుంచి ఎగుమతులు (సంవత్సరానికి 7.7 కోట్ల టన్నులు) మార్చ్ 2 నుంచి నిలిచిపోయాయి.

క్రూడాయిల్ మాదిరిగా కాకుండా.. ఎల్‌ఎన్‌జీకి చెందిన వ్యూహాత్మక నిల్వలు భారత్ వద్ద లేవు.

గ్యాస్‌ను ప్రధానంగా దహేజ్ (గుజరాత్), హజీరా (గుజరాత్), కొచ్చి (కేరళ), ఎన్నోర్ (తమిళనాడు) వంటి టర్మినల్ ఫెసిలిటీల వద్ద నిల్వ చేస్తారు. ఈ కేంద్రాలు దిగుమతి చేసుకున్న ఎల్‌ఎన్‌జీని గ్యాస్‌గా మారుస్తాయి.

కటయామా చెబుతున్న ప్రకారం.. టర్మినల్ కార్యకలాపాలు, కార్గో షెడ్యూళ్లను బట్టి గరిష్ఠంగా ఒకటి నుంచి రెండు వారాలకు సరిపడ దిగుమతులను మాత్రమే ఇవి నిర్వహించగలవు.

క్రమంగా ఈ నౌకలు వస్తాయి కాబట్టి ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. ఒకవేళ ఏదైనా అంతరాయం ఏర్పడితే వెంటనే మార్కెట్ కూడా దానికి అనుగుణంగా మారాల్సి ఉంటుంది.

ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో ఇండియాలో వంటకు పైప్డ్ నేచురల్ గ్యాస్ వినియోగించేవారికి ఇప్పటికిప్పుడు గ్యాస్ కొరత రాకపోవచ్చు కానీ ధర పెరగడం వంటివి జరగొచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)