ఏపీ, తెలంగాణ: పార్లమెంటులో తెలుగు రాష్ట్రాల నుంచి మహిళా ఎంపీల సంఖ్య ఎందుకు పెరగడం లేదు?

    • రచయిత, జక్కుల బాలయ్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 6 నిమిషాలు

విద్యలో, ఉద్యోగాల్లో, అవకాశాలను అందిపుచ్చుకోవడంలో మగవారితో దీటుగా పోటీపడుతున్న నేటి ఆధునిక మహిళ.. చట్టసభల్లో ప్రాతినిధ్యం విషయంలో మాత్రం సమాన అవకాశాలను చేజిక్కించుకోలేకపోతోంది.

గతంతో పోలిస్తే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం, ప్రత్యేకించి లోక్‌సభలో పెరుగుతోందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిణామం ఆశాజనకంగానే కనిపిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మహిళలకు తగిన ప్రాతినిధ్యం లభిస్తోందా?

ఈ కథనంలో చూద్దాం.

ఏపీ, తెలంగాణలో మహిళల ప్రాతినిధ్యం ఎంత?

రెండు తెలుగు రాష్ట్రాల్లో 42 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణలో 17.

ప్రస్తుత 18వ లోక్ సభలో ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ఇద్దరు మహిళా సభ్యులు లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఏపీలోని రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి డాక్టర్ దగ్గుబాటి పురందేశ్వరి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె మూడోసారి లోక్ సభ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. ఇంతకుముందు 2004, 2009లోనూ ఆమె ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర క్యాబినెట్‌లో మంత్రిగానూ పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నారు.

అరకు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గుమ్మా తనూజా రాణి (వైసీపీ), నంద్యాల స్థానం నుంచి డాక్టర్ బైరెడ్డి శబరి(టీడీపీ) ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

తెలంగాణలో మహబూబ్‌నగర్ నుంచి సీనియర్ నేత డీకే అరుణ(బీజేపీ) లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరంగల్ నుంచి డాక్టర్ కడియం కావ్య ఎంపీగా ఉన్నారు. ఈమె సీనియర్ నేత కడియం శ్రీహరి కుమార్తె.

17వ లోక్ సభలో..

గత 17వ లోక్ సభకు, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ నుంచి ఐదుగురు మహిళలు లోక్ సభలో అడుగుపెట్టగలిగారు.

వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఒకరు లోక్ సభకు ఎన్నికయ్యారు.

ఏపీలోని అనకాపల్లి నుంచి డాక్టర్ బి.వెంకట సత్యవతి, అమలాపురం (ఎస్సీ) నుంచి చింతా అనురాధ, అరకు (ఎస్టీ) నుంచి గొడ్డేటి మాధవి, కాకినాడ నుంచి వంగా గీత ఎంపీలుగా పనిచేశారు.

తెలంగాణలో మహబూబాబాద్ (ఎస్టీ) నుంచి మాలోత్ కవిత 2019లో లోక్ సభకు ఎన్నికయ్యారు.

అంతకుముందు, 2014 ఎన్నికల్లో కూడా తెలంగాణ నుంచి కేవలం ఒకే ఒక్క మహిళ లోక్‌సభ సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) కుమార్తె కల్వకుంట్ల కవిత ఆ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు.

అదే సమయంలో, ఏపీ నుంచి ఇద్దరు మాత్రమే మహిళా ఎంపీలు ఉన్నారు. కర్నూలు నుంచి బుట్టా రేణుక, అరకు నుంచి కొత్తపల్లి గీత ఎంపీలుగా గెలుపొందారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎలా ఉండేది?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత 1957లో రెండో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో కేవలం ఇద్దరు మహిళలు తొలిసారి దిగువ సభకు ఎన్నికయ్యారు. ఏలూరు నుంచి మోతే వేద కుమారి, విజయవాడ నుంచి కొమర్రాజు అచ్చమాంబ గెలిచారు.

ఏపీ, తెలంగాణ కలిపి మహిళా లోక్‌సభ సభ్యుల సంఖ్య ఎప్పుడూ ఐదుకి మించింది లేదు.

1989 ఎన్నికల్లో తొలిసారి ఐదుగురు మహిళలు ఎంపీలుగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.

తొమ్మిదో లోక్‌సభకు జరిగిన ఆ ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఉమా గజపతి రాజు, రాజమండ్రి నుంచి సినీ నటి జమున, విజయవాడ నుంచి చెన్నుపాటి విద్య, సికింద్రాబాద్ నుంచి మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్య భార్య టి.మణెమ్మ, భద్రాచలం నుంచి కరియెద్దుల కమలకుమారి విజయం సాధించారు.

13వ లోక్ సభలోనూ ఐదుగురు మహిళా ఎంపీలు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 1999లో జరిగిన ఈ ఎన్నికల్లో ఖమ్మం నుంచి రేణుకా చౌదరి, నెల్లూరు నుంచి వుక్కాల రాజేశ్వరమ్మ, పెద్దపల్లి నుంచి సీహెచ్ సుగుణ కుమారి, భద్రాచలం నుంచి దుంపా మేరీ విజయకుమారి గెలుపొందారు.

అమలాపురం నుంచి గెలిచి, స్పీకర్‌గా ఎన్నికైన గంటి మోహనచంద్ర బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2002లో జరిగిన ఉప ఎన్నికలో బాలయోగి భార్య గంటి విజయకుమారి ఎంపీ అయ్యారు. దీంతో 13వ లోక్‌సభ‌లో ఏపీ నుంచి మహిళా సభ్యుల ప్రాతినిధ్యం ఐదుకు చేరింది.

ఆ తర్వాత 2009 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి కిల్లి కృపారాణి, విజయనగరం నుంచి బొత్స ఝాన్సీ లక్ష్మి, విశాఖపట్నం నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, బాపట్ల నుంచి పనబాక లక్ష్మి, మెదక్ నుంచి విజయశాంతి విజయం సాధించారు.

మెదక్ నుంచి ఇందిరా గాంధీ

ఎమర్జెన్సీ తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో చరణ్ సింగ్ నేతృత్వంలోని భారతీయ లోక్ దళ్(బీఎల్డీ) అభ్యర్థి రాజ్ నారాయణ్ చేతిలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఓడిపోయారు.

అప్పుడు బీఎల్డీ సహా ప్రతిపక్షాలు ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ్ సారథ్యంలో ఏకమయ్యాయి. ఇందిరపై గెలిచిన రాజ్ నారాయణ్ ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి.

1978లో జరిగిన ఉప ఎన్నికలో కర్ణాటకలోని చిక్‌మగ్‌ళూరు నుంచి ఆమె ఎంపీగా గెలిచారు.

1977 ఎన్నికల్లో చిక్‌మగ్‌ళూరు స్థానం నుంచి గెలిచిన కాంగ్రెస్ నేత డీబీ చంద్రెగౌడ రాజీనామాతో జరిగిన ఎన్నికల్లో ఇందిర దిగువ సభకు ఎన్నికయ్యారు. ఇందిర కోసం ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు చెబుతారు.

1980లో ఏడో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఇందిర రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్ స్థానం నుంచి ఆమె బరిలో నిలిచారు. రెండు చోట్ల విజయం సాధించారు. మూడోసారి ప్రధాన మంత్రి అయ్యారు.

అనంతరం రాయ్‌బరేలీ స్థానానికి రాజీనామా చేసిన ఇందిర మెదక్ ఎంపీగా కొనసాగారు.

1984 అక్టోబర్ 31న ఆమె హత్యకు గురయ్యారు.

దేశాన్ని పాలించిన ఏకైన మహిళా ప్రధాని అయిన ఇందిర, మెదక్ సీటు నుంచి ప్రాతినిధ్యం వహించారు.

రాజ్యసభలో..

రాజ్యసభ వెబ్‌సైట్‌‌ ప్రకారం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 10 మంది మహిళలు రాజ్యసభ ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించారు.వారిలో సినీ నటి జయప్రద, రేణుకా చౌదరి, వంగా గీత, ఎన్‌పీ దుర్గా, టి రత్నాబాయి, సి.అమ్మన్న రాజా, ఎంఎల్ మేరీ నాయుడు, యశోదా రెడ్డి, రత్నాబాయి శ్రీనివాసరావు, సీతా యుధ్వీర్ ఉన్నారు.

రేణుకా చౌదరి నాలుగుసార్లు రాజ్యసభ ఎంపీ అయ్యారు. 1986 నుంచి 1992 వరకు, 1992 నుంచి 1998 వరకు రెండుసార్లు తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత 2012 నుంచి 2018 వరకు కాంగ్రెస్ ఎంపీగా కొనసాగారు. ప్రస్తుతం 2024 నుంచి ఆమె నాలుగోసారి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు.

యశోదా రెడ్డి, సీతా యుధ్వీర్ రెండేసి సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనానంతరం తెలంగాణ నుంచి మహిళా ఎంపీ ఒకరు రాజ్యసభకు వెళ్లారు. 2014 నుంచి 2016 వరకు వరంగల్ జిల్లాకు చెందిన గుండు సుధారాణి టీడీపీ రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి తోట సీతారామ లక్ష్మి 2014 నుంచి 2020 వరకూ టీడీపీ రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగారు.

ప్రస్తుతం ఏపీ నుంచి 11 మంది, తెలంగాణ నుంచి ఏడుగురు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, వారిలో ఒక్కరు మాత్రమే మహిళ ఉన్నారు.

దేశవ్యాప్తంగా మహిళా ఎంపీలు

దేశవ్యాప్తంగా 75 మంది మహిళా ఎంపీలు ప్రస్తుత 18వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.

మొత్తం లోక్‌సభ సభ్యులు 543 మందిలో వీరి సంఖ్య 15 శాతం కంటే తక్కువ.

రాజ్యసభ వెబ్‌సైట్‌ ప్రకారం, ప్రస్తుతం రాజ్యసభలో 41 మంది మహిళా సభ్యులు ఉన్నారు.

ప్రస్తుత రాజ్యసభకు మొత్తం 243 మంది ప్రాతినిధ్యం వహిస్తుండగా, అందులో మహిళలు 20 శాతం కూడా లేరు.

ఆధారం: లోక్‌సభ, రాజ్యసభ వెబ్‌సైట్లు

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)