యుద్ధం ఆపడానికి ఇరాన్‌తో చర్చిస్తున్నామన్న ట్రంప్, అలాంటిదేమీ లేదని ప్రకటించిన ఇరాన్

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఇరాన్ యుద్ధం

ఫొటో సోర్స్, Celal Gunes/Anadolu via Getty Images

చదివే సమయం: 3 నిమిషాలు

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఘర్షణలకు "పూర్తి, సంపూర్ణ పరిష్కారం" కనుగొనే దిశగా "ఫలప్రదమైన చర్చలు" జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.

ఇందులో భాగంగా ఇరాన్ విద్యుత్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై చేయాలనుకున్న "అన్ని రకాల దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు" ఆయన ప్రకటించారు.

దీనికి సంబంధించి ట్రూత్ సోషల్‌లో డోనల్డ్ ట్రంప్ ఒక పోస్టు పెట్టారు.

అయితే, ఈ నిర్ణయం ట్రంప్ వెనక్కు తగ్గారనడానికి నిదర్శనమని ఇరాన్ సైనిక వర్గాలు వ్యాఖ్యానించినట్లు కొన్ని న్యూస్ ఏజెన్సీలు వెల్లడించాయి.

ట్రంప్ ఇరాన్

ఫొటో సోర్స్, @realDonaldTrump

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"అమెరికా, ఇరాన్ మధ్య గత రెండు రోజులుగా అత్యంత సానుకూల, ఫలప్రదమైన చర్చలు జరిగాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మధ్యప్రాచ్యంలో మా మధ్య ఉన్న శత్రుత్వానికి పూర్తి, సంపూర్ణ పరిష్కారం కనుగొనే దిశగా ఈ చర్చలు సాగాయి.

ఈ వారం పొడవునా కొనసాగనున్న ఈ లోతైన, వివరణాత్మక, నిర్మాణాత్మక చర్చల సరళిని దృష్టిలో ఉంచుకుని.. ఇరాన్ విద్యుత్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై చేయాలనుకున్న అన్ని రకాల సైనిక దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేయవలసిందిగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్‌ను ఆదేశించాను. ఈ నిర్ణయం కొనసాగింపు అన్నది ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలు, చర్చల సఫలత మీద ఆధారపడి ఉంటుంది'' అని ఆ పోస్టులో డోనల్డ్ ట్రంప్ తెలిపారు.

చర్చలు లేవు: ఇరాన్

వాషింగ్టన్, తెహ్రాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయని డోనల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ విదేశాంగ శాఖ తిరస్కరించింది.

"యుద్ధ లక్ష్యాలను నెరవేర్చుకోకుండా ఎవరితోనూ చర్చలు జరిపే ప్రసక్తే లేదు, ఈ నిర్ణయానికే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కట్టుబడి ఉంది" అని ఇరాన్ విదేశాంగ శాఖ చెప్పినట్లు బీబీసీ అమెరికా భాగస్వామ్య సంస్థ సీబీఎస్ న్యూస్ రిపోర్ట్ చేసింది.

మరోవైపు ఇరాన్ సైనిక విభాగం 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ 'తో సంబంధం ఉన్న ఫార్స్ న్యూస్ ఏజెన్సీ, పేరు వెల్లడించని ఒక ఇరాన్ అధికారిని ఉటంకిస్తూ కీలక వ్యాఖ్యలు చేసిందని బీబీసీ పర్షియన్ సీనియర్ రిపోర్టర్ ఘాంచె హబీబీయాజాద్ తెలిపారు.

ఫార్స్ న్యూస్ కథనం ప్రకారం, ఆ అధికారిక ప్రతినిధి మాట్లాడుతూ.. "ట్రంప్‌తో మాకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎటువంటి సంబంధాలు లేవు" అని స్పష్టం చేశారు.

అంతేకాకుండా, "పశ్చిమ ఆసియాలోని అన్ని విద్యుత్ కేంద్రాలు మా లక్ష్యాల జాబితాలో ఉంటాయని తెలుసుకున్న తర్వాతే, ట్రంప్ భయపడి వెనక్కి తగ్గారు" అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

స్టాక్ మార్కెట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ట్రంప్ ప్రకటనతో స్టాక్ మార్కెట్ దూకుడు

అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయన్న డోనల్డ్ ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయని బీబీసీ బిజినెస్ రిపోర్టర్ నిక్ ఎడ్సర్ చెప్పారు. మార్కెట్లో అంతకుముందు ఉన్న ప్రతికూల పరిస్థితులు తారుమారయ్యాయని తెలిపారు.

ముడి చమురు: బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 13 శాతం భారీగా పతనమై, బ్యారెల్ సుమారు 96 డాలర్లకు చేరుకుంది.

స్టాక్ మార్కెట్: బ్రిటన్ స్టాక్ మార్కెట్ సూచీ ఎఫ్‌టీఎస్ఈ 100, అంతకుముందు 2 శాతం కంటే ఎక్కువ పడిపోయినప్పటికీ, ఇప్పుడు 0.5 శాతం లాభాల్లోకి వచ్చింది.

గ్యాస్ ధరలు: థర్మ్ గ్యాస్ ధర 159 పెన్స్‌ నుంచి సుమారు 139 పెన్స్‌కు తగ్గింది.

బ్రిటన్ 10 సంవత్సరాల ప్రభుత్వ బాండ్ల యీల్డ్(వడ్డీ రేటు), అంతకుముందు 5.121 శాతానికి పెరిగినప్పటికీ, ప్రస్తుతం 4.89 శాతానికి పడిపోయింది. ఇది రోజు ప్రారంభంలో ఉన్న ధర కంటే కూడా తక్కువ కావడం గమనార్హం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)