‘‘రాత్రివేళ మహిళలను రహస్యంగా వీడియోలు తీసి ఆన్‌లైన్‌లో అమ్ముకుంటున్నారు’’-బీబీసీ ఇన్వెస్టిగేషన్‌లో తేలిన నిజాలు

- రచయిత, షోనా ఎల్లిఓట్, అబి స్మిట్టన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- చదివే సమయం: 10 నిమిషాలు
రాత్రివేళ బయటకు వచ్చిన మహిళలను, కొందరు మగవాళ్లు రహస్యంగా వీడియోలు తీసి వాటిని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారని బీబీసీ దర్యాప్తులో బయటపడింది.
ఈ వీడియోలను "వాకింగ్ టూర్స్" లేదా "నైట్‌లైఫ్ కంటెంట్" అని పిలుస్తూ యూట్యూబ్, టిక్‌టాక్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో పోస్టు చేస్తున్నారు.
డ్రెస్సులు, స్కర్టులు వేసుకున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ వీడియోలు తీస్తారు. వీటిలో ఎక్కువ భాగం వెనకవైపు నుంచి లేదా కింద నుంచి చిత్రీకరించి ఉంటాయి. కొన్నిసార్లు శరీరంలోని సున్నితమైన భాగాలు కూడా కనిపిస్తుంటాయి.
వీడియోల్లో ఉన్న దాదాపు 50 మంది మహిళలను బీబీసీ ఇన్వెస్టిగేషన్ టీమ్ గుర్తించింది. వారిలో చాలామందికి తమను అలా వీడియో తీశారని కూడా తెలియదు.
విషయం తెలిసిన తర్వాత వారు భయం, అవమానం వంటి భావాలు వ్యక్తంచేశారు.

తమను కెమెరాల్లో బంధిస్తున్నారని వారికి తెలియదు
కిందివైపు నుంచి స్కర్ట్ లోపల భాగం కనిపించేలా రికార్డు చేసిన ఒక వీడియోలో ఉన్న ఓ 21 ఏళ్ల యువతితో మాట్లాడాం. తన అనుమతి లేకుండా తీసిన వీడియోను ఆన్‌లైన్‌లో చూసిన తర్వాత బయటకు వెళ్లినప్పుడల్లా తీవ్రభయాందోళనల మధ్య గడుపుతున్నానని ఆమె చెప్పారు.
ఇలాంటి కంటెంట్ ఉన్న 65కి పైగా ఆన్‌లైన్ చానళ్లను బీబీసీ గుర్తించింది. మూడేళ్లలో ఈ వీడియోలను 3 బిలియన్లసార్ల కన్నా ఎక్కువగా చూశారు.
ఈ వీడియోలు లండన్, ఓస్లో, మయామీ, బ్యాంకాక్ వంటి ప్రపంచంలోని ప్రధాన నగరాల నైట్ లైఫ్‌లో చిత్రీకరించినవి. వీటిలో బాగా పేరున్న ప్రాంతం మాంచెస్టర్.
స్త్రీలను రహస్యంగా వీడియో తీస్తున్న మగవాళ్లను మా బృందం నగరంలో రహస్యంగా తిరుగుతూ చిత్రీకరించింది. ఇలా 12 అకౌంట్లకు సంబంధించిన ప్రముఖ నిర్వాహకుల సంగతి తెలిసింది.
ఇందులో ఒక స్థానిక ట్యాక్సీ డ్రైవర్, స్వీడన్ నుంచి యూకేకు వచ్చి వీడియోలు తీసిన ఇద్దరు ఉన్నారు.
నార్వే, మొనాకోలో ఉన్నామని చెప్పుకునే మరో ఇద్దరు కూడా వీడియోలు తీస్తూ కనిపించారు. అయితే వారి గుర్తింపును నిర్ధరించలేకపోయాం.
మహిళల అనుమతి లేకుండా లేదా వారికి తెలియకుండా బహిరంగ ప్రదేశాల్లో వీడియోలు తీసి కొందరు మగవారు డబ్బులు సంపాదిస్తున్నారనే విషయం మా పరిశోధనలో మరోసారి బయటపడింది.

ఫొటో సోర్స్, Getty Images
‘కొత్త టెక్నాలజీ సాయంతో వేధింపులు’
గత నెల బీబీసీ చేసిన మరో దర్యాప్తులో పికప్ అడ్వైస్ ఇస్తామని చెప్పుకునే మేల్ ఇన్‌ఫ్లుయెన్సర్లు స్మార్ట్ గ్లాసెస్ ఉపయోగించి మహిళలతో సంభాషణలు రికార్డ్ చేసి ఆన్‌లైన్‌లో పెడుతున్నట్టు బయటపడింది.
దీనిపై స్పందించిన యూకే హోం సెక్రటరీ షబానా మహమూద్, మహిళలు, బాలికలపై హింస, వేధింపులు పెంచేందుకు కొత్త టెక్నాలజీని ఉపయోగించడాన్ని ప్రభుత్వం సహించబోదని చెప్పారు.
బహిరంగ ప్రదేశాల్లో వీడియో తీయడం నేరం కాదు. అయితే ఇలాంటి వీడియోలు వేధింపుల వ్యతిరేక చట్టాల ఉల్లంఘన కిందకు వచ్చే అవకాశముందని ఓ న్యాయనిపుణుడు చెప్పారు. ఇవి చట్టపరంగా సంక్లిష్టమైన వ్యవహారమని ఆ నిపుణుడు చెప్పారు.
మేం యూట్యూబ్‌లో చూసిన చాలా వీడియోలు ఇంకా అలాగే ఉన్నాయి.
మా దర్యాప్తు వివరాలను తెలిపిన తర్వాత రెండు అకౌంట్లను యూట్యూబ్ స్తంభింపచేసింది. టిక్‌టాక్ నాలుగు ఛానళ్లను తొలగించింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న వీడియోలు అలాగే ఉన్నాయి.

‘బయటకు వెళ్లాలంటే భయం’
అక్టోబరు చివరి రోజుల్లో గ్రేస్ (అసలు పేరు కాదు) మాంచెస్టర్‌లోని ఒక క్లబ్ బయట తన స్నేహితురాలి 21వ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఫోన్‌తో ఫోటోలు తీస్తున్నారు.
ఆమెతో పాటు ఆమె చెల్లి సోఫీ (ఆమె పేరును కూడా మార్చాం)కూడా ఉన్నారు. ఆమెకు అప్పుడే 18 ఏళ్లు నిండాయి. నగరంలో క్లబ్బింగ్‌కు వెళ్లడం ఆమెకదే మొదటిసారి.
''మమ్మల్ని వీడియో తీస్తున్నారని మాకు అసలు తెలియదు" అన్నారు. మేము(బీబీసీ ఇన్వెస్టిగేషన్ టీమ్) చెప్పిన తర్వాతే ఆ వీడియో యూట్యూబ్‌లో పోస్ట్ అయిందని ఆమెకు తెలిసింది.
ఆమె స్కర్ట్ లోపల భాగం కనిపించే వీడియోను ఆన్‌లైన్‌లో 30లక్షలమందికిపైగా అపరిచితులు చూశారు.
‘‘చాలా జాగ్రత్తగా చూసి ఆ రోజు నా దుస్తులు వేసుకున్నాను" అని గ్రేస్ గుర్తు చేసుకున్నారు.
మామూలుగా చూస్తే ఏమీ కనిపించదు. కానీ వీడియో తీసిన కోణం చాలా కిందివైపు నుంచి ఉంది.
‘‘వీడియో తీసిన వ్యక్తి ఎంత దగ్గరగా వచ్చాడో కదా అనిపించింది" అని ఆమె అన్నారు.
సోఫీ కూడా వీడియోల్లో కనిపించింది కానీ ఆమెపై ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు.
"అక్కలాగే నేనూ ఇప్పుడు పూర్తిగా భయంతో ఉన్నాను. ఆ కారణంగా అసలు నేను బయటకు వెళ్లడం కూడా మానేశాను" అని ఆమె అంటున్నారు.
ఈ దర్యాప్తులో మేం చూసిన వందల వీడియోల్లో కనిపించిన వేలాదిమంది మహిళల్లో గ్రేస్, సోఫీ కూడా ఉన్నారు.
వారిద్దరికీ ఒకే ప్రశ్న మిగిలింది – వీడియో ఎవరు తీశారు? ఎందుకు తీశారు?

వీడియోల కింద మహిళలను దూషిస్తూ వ్యాఖ్యలు
అనేక అకౌంట్ల ద్వారా పోస్ట్ చేసిన ఈ వీడియోలను మేం చాలా గంటలు పరిశీలించాం.
బాగా ఆదరణ పొందిన కొన్ని చానెళ్లు 200 మిలియన్లకు పైగా వ్యూస్ వ్యూస్ సాధించాయి.
దాదాపు ప్రతి వీడియో థంబ్‌నెయిల్ డ్రెస్సులు, స్కర్టులు, హై హీల్స్ వేసుకున్న యువతులకు సంబంధించినట్టుగా ఉంది. టైటిల్ చూస్తేనే మహిళలు వీడియోలో ఉంటారని స్పష్టంగా తెలుస్తుంది.
మాంచెస్టర్‌లో తీసిన చాలా వీడియోల్లో క్లబ్బుల మధ్య నడుస్తున్న మహిళలు, ఫుట్‌పాత్ అంచున మహిళలు కూర్చున్న దృశ్యాలు ఉంటాయి. వారు దుస్తులు సర్దుకుంటున్నప్పుడు లేదా స్కర్ట్‌లను కిందికి లాగుతున్నప్పుడు కెమెరా ఎక్కువసేపు ఆగుతుంది.
దాదాపు ప్రతి వీడియో కింద మహిళలను ద్వేషించే వ్యాఖ్యలు వందలకొద్దీ కనిపిస్తుంటాయి.
''ఈ మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకున్నారో చూడండి, వీరిపై దాడులు జరగడం ఆశ్చర్యమేమీ కాదు" అని ఒకరు నవ్వు ఎమోజీతో కామెంట్ చేశారు.
వీడియోల్లో ఉన్న చాలామంది మహిళలను సులభంగా గుర్తించాం. కానీ ఆ చానెల్స్ నడిపే వాళ్లను గుర్తించడం కష్టం అయింది.
వాళ్లు ఆన్‌లైన్‌లో తమ నిజమైన పేర్లు వాడరు. కానీ అందరికీ అందుబాటులో ఉన్న డేటా ద్వారా వారిలో కొంతమందిని గుర్తించగలిగాం.
గ్రేస్, సోఫీ వీడియోను పోస్ట్ చేసిన చానెల్‌ను స్వీడన్‌కు చెందిన 35 ఏళ్ల ఫ్లోర్జాన్ రెకా అనే వ్యక్తి నడుపుతున్నారని మేము గుర్తించాం.
ఇలాంటి కంటెంట్‌తో ఆయన పెద్ద యూట్యూబ్ చానెల్‌లలో ఒకదాన్ని నడుపుతున్నారు. దానికి దాదాపు 20 కోట్ల వ్యూస్, దాదాపు 4 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అలాగే 6 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్న ఫేస్‌బుక్ పేజీ కూడా ఉంది.
ఆయన స్వీడన్‌లో ఒక బిజినెస్ చానెల్‌గా దీన్ని రిజిస్టర్ చేయించుకున్నారు. "ఇన్‌ఫ్లూయెన్సర్ ప్రోగ్రామ్స్, మార్కెటింగ్, యాడ్స్ వంటివి చేస్తున్నాన’’ని ఆయన చెబుతున్నారు.

మాంచెస్టర్‌లో రహస్య పరిశోధన
ఆయన ఎలా పని చేస్తున్నాడో తెలుసుకోవడానికి, హాలోవీన్ సందడి ఉన్న వారాంతంలో మాంచెస్టర్ సిటీ సెంటర్‌కు మేం రహస్యంగా వెళ్లాం.
మొదటి రోజు రాత్రివేళ గంటల తరబడి ఎదురు చూసిన తర్వాత, అర్ధరాత్రి రెండు గంటలకు కొద్దిసేపు ముందు రెకా మరో వ్యక్తితో వేగంగా నడుస్తూ కనిపించారు. ఆ వ్యక్తి రెకా సోదరుడు రోలాండ్ అని తర్వాత గుర్తించాం.
నడుము ఎత్తులో ఫోన్ చూస్తున్నట్టు వారు నటించారు. కానీ వాస్తవానికి వేర్వేరు కెమెరాలు పట్టుకుని, పక్కగా వెళ్లే మహిళలను చిత్రీకరిస్తున్నారు. మేము వారిని గమనిస్తున్నామని వారికి తెలిసినట్టు లేదు.
వారు క్లబ్బుల బయట చిత్రీకరించేందుకు అక్కడినుంచి వేర్వేరుగా వెళ్లిపోయి, మధ్యమధ్యలో కలుసుకుంటూ ఉన్నట్టు గమనించాం.
ఆ వారాంతంలోని రెండో రాత్రి, వారు నల్ల మాస్కులు ధరించి, పార్టీ వేషధారణలో అక్కడకు వచ్చినవారితో కలిసిపోయారు.
తరువాతి కొన్ని రోజుల్లో, మాంచెస్టర్ వీధుల నుంచి తీసిన కొత్త వీడియోలు ఫ్లోర్జాన్ రెకాతో సంబంధం ఉన్న అనేక సోషల్ మీడియా అకౌంట్లలో కనిపించసాగాయి.
ఆ వీడియోలు, మేము ఆ అన్నాదమ్ముళ్లను చిత్రీకరించిన యాంగిల్స్‌తో సరిపోలాయి.
రోలాండ్ రెకాతో సంబంధం ఉన్న ఒక చానెల్‌లో పోస్ట్ చేసిన వీడియో ప్రారంభంలో, ఒక మహిళ తన స్కర్ట్ జారిపోతే పైకి లాక్కుంటున్న దృశ్యం కనిపిస్తుంది.
ఇతర వీడియోల్లో, మహిళలు ముందుకు నడుస్తుండగా, కెమెరా కింద నుంచి వారి శరీర భాగాలను స్పష్టంగా చూపించింది.
ఫ్లోర్జాన్ రెకా ఫేస్‌బుక్ పేజీలో ఉన్న ఒక వీడియోలో ఒక మహిళ తన టాప్ సర్దుకుంటుండగా కెమెరా ఆమె ఛాతీపై ఎక్కువసేపు నిలిచింది.
తమను ఇలా చిత్రీకరిస్తున్నారని ఈ వీడియోల్లోని మహిళలెవరికీ తెలిసినట్టు లేదు.
హాలోవీన్ తర్వాతి నెలల్లో దీనిపై స్పందించాలని ఫ్లోర్జాన్ రెకాను కోరేందుకు మేం ప్రయత్నించాం. ఆయన స్పందించకపోవడంతో స్వీడన్‌కు వెళ్లి ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించాం.
రెండు సందర్భాల్లోనూ ఆయన మా ప్రశ్నలను పట్టించుకోలేదు. మెయిల్‌బాక్స్‌లో లేఖకు కూడా స్పందన లేదు.

ఫొటో సోర్స్, Getty Images
‘ఏ తప్పుపనీ నేను చేయడం లేదు’
మాంచెస్టర్‌లో హాలోవీన్ సమయంలో మహిళలను వీడియోలు తీస్తున్న మరో ముగ్గురు మగవాళ్లను కూడా మేం గుర్తించాం. వారు ఒకరికొకరు తెలుసు. అలాగే రేకా సోదరులు కూడా తెలిసినట్టు కనిపించింది.
ఆ రాత్రంతా వాళ్లు చాలాసార్లు అనేక చోట్ల ఆగి మాట్లాడుకుంటూ కనిపించారు.
వారిలో ఒకరు డీన్ హిల్. ఆయన స్థానికంగా పనిచేస్తున్న 36 ఏళ్ల ట్యాక్సీ డ్రైవర్.
చిన్న కెమెరాను తన ఛాతీకి దగ్గరగా పెట్టుకొని, అమ్మాయిల గుంపుల పక్కగా నడుస్తూ వీడియోలు తీస్తున్నట్టు మేం గమనించాం.
తర్వాత తిరిగి వెనక్కి వెళ్లి, వారిని వెనుక నుంచి మళ్లీ వీడియో తీశారు.
బీబీసీ ఆయన వీడియోలను వందల గంటల పాటు పరిశీలించింది.
కొన్ని వీడియోల్లో-రేకా సోదరుల వీడియోల మాదిరిగానే-మహిళలు తమ స్కర్ట్‌లను కిందికి లాక్కుంటూ లేదా దుస్తులను సర్దుకుంటూ ఉన్నప్పుడు, హిల్ వారిని తీసిన్నట్టు కనిపించింది.
ఒక వీడియోలో, హాలోవీన్ వేషధారణలో ఉన్న ఒక మహిళను దాదాపు రెండు నిమిషాల పాటు వెనుక నుంచి కెమెరా అనుసరిస్తోంది. ఒక దశలో ఆమెను చేరుకోవడానికి వేగం పెంచినట్టుగా కూడా కనిపిస్తుంది.
హిల్ తాను ఏ తప్పూ చేయలేదని తీవ్రంగా ఖండించాడు. తాను వ్యక్తులను లేదా వారి సున్నితమైన శరీర భాగాలను చిత్రీకరించనని బీబీసీకి చెప్పాడు.
తన కెమెరా ఎప్పుడూ స్పష్టంగా కనిపిస్తుంటుందని తెలిపారు.
"నేను స్కర్ట్‌ల లోపల నుంచి, సున్నితమైన శరీర భాగాలను వీడియో తీయను. రహస్యంగా చూడడం వంటి పనులు చేయలేదు. నా వీడియోల్లో లైంగిక కంటెంట్ ఏదీ లేదు" అని ఆయన అన్నారు.
"ఈ వీడియోలు ప్రత్యేకంగా ఎంచుకుని తీసినవి కావు. ఏ ప్రత్యేక వర్గాన్నీ లక్ష్యంగా చేసుకోవడం లేదు. పబ్లిక్ ప్రదేశాల్లో ఆ సమయంలో ఎవరు ఉన్నారో వారినే చూపిస్తాయి"
‘‘ కొంతమంది ఆన్‌లైన్ కంటెంట్ క్రియేటర్లు అనుచితమైన పనులు చేస్తారని నాకు తెలుసు. కానీ నా చానెల్ అలా చేయదు. దానికి విరుద్ధంగా చెప్పడం నా కంటెంట్ ఉద్దేశాన్ని తప్పుగా చూపించడమే’’ అని ఆయన అన్నారు.
మరొక వ్యక్తిని మేం సోషల్ మీడియా చానెల్స్ ద్వారా సంప్రదించాం. కానీ ఆయన పూర్తి వివరాలను గుర్తించలేకపోయాం.
ఆయన కూడా తాను ఏ తప్పూ చేయలేదని, నిబంధనలు ఉల్లంఘించలేదని చెప్పారు.
తాను కేవలం నైట్‌లైఫ్, నడక వీడియోలే తీస్తానని అన్నారు. తన పోస్టులను కొన్నింటిని ఇప్పటికే తొలగించానని కూడా తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
చట్టాల పరిధిలోకి రాకపోవడంతో అంతకంతకూ పెరుగుతున్న వీడియోల మార్కెట్
మేం దర్యాప్తు చేసినవారిపై ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి నేరారోపణలు చేయలేదు.
అయితే, గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు 2024లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు.
మహిళలను రాత్రివేళ వీడియోలు తీసిన ఘటనలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, వెంటపడడం, వేధింపుల అనుమానంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
ఇది యూకేలో ఈ తరహా మొదటి అరెస్టు అని పోలీసులు తెలిపారు.
కానీ ‘‘ప్రస్తుత చట్టాల్లో ఉన్న పరిమితుల కారణంగా’’ ఆ వ్యక్తిపై ఇకముందు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు.
ఈ సమస్యను ఎదుర్కొనేందుకు "పౌర, చట్ట మార్గాలను పరిశీలిస్తున్నామని కూడా తెలిపారు.
రాత్రివేళ మహిళలను రహస్యంగా వీడియో తీసే ఈ పరిశ్రమ "కోట్ల పౌండ్ల ఆదాయం" సంపాదిస్తోందని యూనివర్సిటీ ఆఫ్ సర్రేలోని డిజిటల్ ఎకానమీ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ అన్నాబెల్ గావర్ చెప్పారు.
‘‘ఈ మొత్తం వ్యవస్థలో కలిపి చూస్తే వందల కోట్ల వ్యూస్ ఉన్నాయి’’ అని ఆమె అన్నారు.
ఒక మిలియన్ వ్యూస్ ఉన్న వీడియో ద్వారా సుమారు 5,000 పౌండ్ల వరకు ఆదాయం రావచ్చని ఆమె తెలిపారు. యూకే చట్టాల ప్రకారం పబ్లిక్ ప్రదేశాల్లో వీడియో తీయడం చాలా సందర్భాల్లో చట్టవిరుద్ధం కాదు.
కానీ, మేం మాట్లాడిన అనేకమంది మహిళలకు, ఈ వీడియోల ద్వారా క్రియేటర్లు డబ్బు సంపాదిస్తున్నారని తెలిసి తీవ్రమైన కోపం, నిరాశ కలిగాయి.
ఈ తరహా కంటెంట్‌పై చట్టాల్లో స్పష్టత లేదని న్యాయ నిపుణులు హోన్జా చెర్వెంకా చెప్పారు.
"ఇది గోప్యతను ఉల్లంఘించడం, వేధింపులు వంటి నేరాల మధ్య ఉంటుంది. ఇలాంటి నేరాలు పెరగడానికి ఇదే అవకాశంగా మారింది'' అని ఆయన అన్నారు.
వేధింపుల నేరంగా పరిగణించాలంటే, కనీసం రెండు లేదా అంతకంటే ఎక్కువ వేధింపుల చర్యలు ఉండాలని ఆయన చెప్పారు.
"వీధిలో వేధించడం, ఆ తర్వాత ఆన్‌లైన్‌లో వీడియో పోస్ట్ చేయడం లేదా షేర్ చేయడం కూడా ఇందులోకి వస్తాయి" అని వివరించారు.
ఒక వీడియోను పోస్ట్ చేసి, ఆ మహిళ చిత్రాన్ని, ఇతర వీడియోల థంబ్‌నెయిల్‌గా ఉపయోగించడం కూడా వేధింపుగా పరిగణించవచ్చని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘పూర్తిగా ఆపడం సాధ్యం కాదా?’
మా దర్యాప్తు వివరాలను తెలియజేసిన తర్వాత, ఫ్లోర్జాన్ రేకాతో సంబంధం ఉన్న రెండు యూట్యూబ్ అకౌంట్లను యూట్యూబ్ నిలిపివేసింది.
ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఫ్లోర్జాన్ రేకా 'ఎక్స్'లో చేసిన పోస్టులో,
యూట్యూబ్‌ను కోరారు. తాను కేవలం "పబ్లిక్ వాకింగ్ టూర్ వీడియోలే" ప్రచురిస్తానని అన్నాడు.
మేము యూట్యూబ్‌కు పంపిన అనేక వీడియోలు ఇప్పటికీ ఆన్‌లైన్‌లో ఉన్నాయి.
యూట్యూబ్ తమ కమ్యూనిటీ మార్గదర్శకాలను "కఠినంగా అమలు చేస్తున్నామని" తెలిపింది.
వేధింపులకు సంబంధించిన నిబంధనల దృష్ట్యా కారణంగా 2025 చివర్లో 18 లక్షల వీడియోలను తొలగించినట్టు తెలిపింది.
మేము గుర్తించిన ఇతర వ్యక్తుల అకౌంట్లు ఇప్పటికీ ఆన్‌లైన్‌లో ఉన్నాయి.
ఒక వ్యక్తి తన చానల్ పేరును మార్చారు. మరొకరు తన మొత్తం కంటెంట్‌ను తొలగించారు.
మేము పంపిన నాలుగు చానెల్‌లను టిక్‌టాక్ తొలగించింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ను నిర్వహించే మెటాకు పంపిన చానెల్స్ మాత్రం ఇంకా యాక్టివ్‌గా ఉన్నాయి.
తమ విధానాలను ఉల్లంఘించిన కంటెంట్‌ను తొలగించినట్టు ఆ సంస్థ తెలిపింది.
గ్రేస్, సోఫీకి సంబంధించిన వీడియో కూడా తొలగించిన వాటిలో ఒకటి. ఇది తమకు చిన్న విజయం అని ఆ సోదరీమణులు అంటున్నారు.
కానీ దీని వల్ల నిజంగా ఉపయోగముందో లేదో అని గ్రేస్‌కు అనుమానం ఉంది.
"ఆ వ్యక్తి ఫోన్ లేదా కంప్యూటర్‌లో నా వీడియో ఇంకా ఉంది. ఆయన మళ్లీ దాన్ని షేర్ చేయకుండా ఎవరు ఆపగలరు?" అని ఆమె అన్నారు.
"దాన్ని పూర్తిగా ఆపడం బహుశా సాధ్యం కాదు" అని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














