చమురు కొనడం ఆపేస్తే రష్యాతో భారత్ సంబంధాలు చెడిపోతాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రజనీశ్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 6 నిమిషాలు
రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపేయడానికి భారత్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు
ట్రంప్ ప్రకటనపై భారత్ నుంచి ఎలాంటి స్పందన లేదు.
2022 ఫిబ్రవరిలో రష్యా యుక్రెయిన్‌పై దాడి చేసింది. ఆ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ యుద్ధం మొదలైన తర్వాత భారత్- రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో పెరిగింది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో రష్యా- భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 68.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ.6.23 లక్షల కోట్లు )కు చేరుకుంది. అందులో రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన ముడి చమురు విలువే 52.73 బిలియన్ డాలర్లు (సుమారు 4.77 లక్షల కోట్లు).
రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడాన్ని భారత్ ఆపేసిందని ప్రస్తుతం ట్రంప్ చెబుతున్నారు. ఇది నిజమైతే భారత్- రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 20 బిలియన్ డాలర్ల (రూ. 1.8 లక్షల కోట్లు) కంటే తక్కువకు పడిపోతుంది.

రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు తగ్గుతాయని భారత పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి జనవరిలో చెప్పారు. భారత్ వివిధ దేశాల నుంచి చమురు కొంటుందని మంత్రి వెల్లడించారు. ప్రపంచంలో ముడి చమురు అత్యధికంగా కొనుగోలు చేసే దేశాల్లో భారత్‌ది మూడో స్థానం.
రష్యా నుంచి చమురు సరఫరా రోజుకు 1.3 మిలియన్ బ్యారెళ్లకు తగ్గాయని, గతేడాది సగటున రోజుకు 1.8 మిలియన్ బ్యారెళ్ల చమురు రష్యా నుంచి సరఫరా అయ్యేదని జనవరి 27న బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. మార్కెట్ పరిస్థితుల వల్ల ఈ తగ్గుదల ఏర్పడిందని అన్నారు.
రష్యా నుంచి చమురు కొనడం తగ్గించాలన్న అమెరికా ఒత్తిడి గురించి హర్దీప్ పురి ప్రస్తావించకపోవచ్చు. అయితే ట్రంప్ ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటిస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
భారత స్వయం ప్రతిపత్తి సంగతేంటి?
2025 ఏప్రిల్ - నవంబర్ మధ్య రష్యా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 13% తగ్గాయి.
డిసెంబర్‌లో భారత్‌కు రష్యన్ చమురు దిగుమతులు గత రెండేళ్లలో కనిష్ఠ స్థాయికి పడిపోయాయని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
దీనికి కారణాలను వివరిస్తూ థింక్ ట్యాంక్ బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్‌లో సీనియర్ ఫెలో తన్వి మదన్ ఎక్స్‌లో మెసేజ్ పోస్ట్ చేశారు.
"అమెరికా విధించిన 25% అదనపు సుంకం భారతదేశానికి భారంగా మారింది. రష్యన్ చమురు కంపెనీలు రోస్‌నెఫ్ట్, లుకోయిల్‌పై అమెరికా ఆంక్షలు విధించింది" అని ఆమె ఆ పోస్టులో తెలిపారు.
భారత్‌కు కావాల్సింది చవకైన రష్యన్ చమురు. అయితే 2024–25లో రష్యాతో 60 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును కూడా ఎదుర్కొంది.
చైనాతో 100 బిలియన్ల వాణిజ్య లోటు తర్వాత ఇది భారతదేశానికి రెండో అతిపెద్ద వాణిజ్య లోటు.
రష్యా నుండి చమురు దిగుమతులను భారత్ పూర్తిగా ఆపేస్తుందా అనే ప్రశ్నకు తన్వి మదన్ వివరణ ఇచ్చారు.
"అది చెప్పడం కష్టం. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ సంస్థ దిగుమతులను మరింత తగ్గించే అవకాశం ఉంది లేదా బహుశా సున్నాకి కూడా తగ్గించవచ్చు. కానీ ఇప్పుడు కూడా దిగుమతి చేసుకున్న చమురులో ఎక్కువ భాగం నయారాకు వెళుతోంది" అని ఆమె అన్నారు.
"నయారా రష్యన్ కంపెనీ రోస్నెఫ్ట్ యాజమాన్యంలో ఉంది. దాని వాటాను విక్రయించాలనే ప్రణాళికలు నిలిచిపోయినట్లు కనిపిస్తున్నాయి. భారతదేశం గతంలో ఇరాన్, వెనెజ్వెలా నుంచి చమురు దిగుమతులను సున్నాకి తగ్గించింది. కానీ రష్యా చమురు దిగుమతులకు తలుపులు పూర్తిగా మూసివేయాలని కోరుకోకపోవచ్చు" అని తన్వి మదన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
ఇతర అమెరికా అధ్యక్షులతో పోలిస్తే రష్యా అధ్యక్షుడు పుతిన్ పట్ల ట్రంప్ ఎక్కువ సానుకూలంగా ఉంటారనే అభిప్రాయం ఉంది.
అయితే భారత్, రష్యా సంబంధాల విషయంలో ట్రంప్ చాలా దూకుడుగా ఉన్నారు.
"రష్యాతో భారత్ ఏం చేసినా నాకు అభ్యంతరం లేదు. వారిద్దరూ కలిసి వారి మృత ఆర్థిక వ్యవస్థలను కూల్చివేసుకోవాలనుకుంటే నాకు ఎలాంటి పట్టింపు లేదు. భారత్‌తో మా వాణిజ్యం చాలా తక్కువగా ఉంది. భారత్ ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తోంది" అని ట్రంప్ 2025 జులైలో చెప్పారు.
భారత్, రష్యా సంబంధాలలో చమురుతో పాటు రక్షణ భాగస్వామ్యం చాలా ముఖ్యమైనది. అయితే ఇటీవలి కాలంలో రష్యా నుంచి రక్షణ కొనుగోళ్లు తగ్గుతున్నాయి.
2020-24 మధ్య భారత్ తనకు అవసరమైన సైనిక పరికరాలలో 36శాతం రష్యా నుంచి దిగుమతి చేసుకుందని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసర్చ్ ఇన్‌స్టిట్‌ట్యూట్ చెబుతోంది.
భారత్‌కు రష్యా అతి పెద్ద రక్షణ పరికరాల సరఫరాదారు. 2006-10 మధ్య భారత సైనిక పరికరాల్లో 82 శాతం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నవే.
భారత్-రష్యా సంబంధాలపై ట్రంప్ ఒత్తిడి అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ ఒత్తిడితో భారత్ తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని కొనసాగించలేకపోతోందని నిపుణులు చెబుతున్నారు.
ట్రంప్ ఒత్తిడితో భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపేస్తే, అది భారత విదేశాంగ విధానం గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుందని థింక్ ట్యాంక్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో సీనియర్ ఫెలో మనోజ్ జోషి అన్నారు.
"భారత్ చమురు దిగుమతులను ఆపివేస్తే, రష్యా కూడా దానిని ఎదురుదెబ్బగా చూడవచ్చు. దిల్లీ నాయకత్వం స్వయంగా ఈ నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎవరూ విమర్శించరు. కానీ ట్రంప్ ఒత్తిడితో అలా చేస్తే, అది మోదీ ప్రభుత్వ వ్యూహాత్మక స్వయంప్రత్తి, విదేశాంగ విధానంపై అనుమానాలకు తావిస్తుంది" అనేది మనోజ్ జోషి అభిప్రాయం.
"భారత దేశపు విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతుంది. తన దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయాల్సిన అవసరం రష్యాకు ఉంది. ఎందుకంటే రష్యా అనేక రకాల ఆంక్షలు ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో చమురు కొనుగోళ్లు ఆపేయాలన్న భారత నిర్ణయాన్ని రష్యా సానుకూలంగా స్వీకరించలేదు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏకం కావడం, బ్రిక్స్‌కు భారత్ నాయకత్వం వహించడం గురించి చర్చ జరుగుతున్న సమయంలో భారత్ ఇలా చేస్తోంది. దీని వల్ల రష్యాకు లాభమా, నష్టమా అనేది పక్కన పెడితే భారత్ విశ్వసనీయతకు అతి పెద్ద సవాలు" అని మనోజ్ జోషి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా ఏం చేస్తుంది?
ఇంధన రంగ నిపుణుడు నరేంద్ర తనేజా మనోజ్ జోషి అభిప్రాయంతో ఏకీభవించడం లేదు. భారత్- రష్యా సంబంధాలను కేవలం వాణిజ్య కోణంలోనే చూడకూడదనేది ఆయన అభిప్రాయం.
"రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేస్తున్నట్లు భారత్ ఇంకా ప్రకటించలేదు. మరో విషయం ఏంటంటే చమురు దిగుమతులకు సంబంధించి భారత్ ఎవరి ఆదేశాలకు కట్టుబడాల్సిన అవసరం లేదు. యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత భారత్ రష్యా నుంచి రాయితీ ధరలకు చమురు దిగుమతి చేసుకుంటోంది. ఒక్కో బ్యారెల్‌కు 15 డాలర్ల లాభం పొందుతోంది. ఇప్పుడీ ప్రయోజనం పోయినట్లే" అని నరేంద్ర తనేజా అన్నారు.
"భారత్ అభివృద్ధి చెందాలంటే మూల ధనం, సాంకేతికత, మార్కెట్లు అవసరం. ఈ మూడు మనకు రష్యా నుంచి లభిస్తాయా? లేదా చైనా నుంచి లభిస్తాయా? అంటే సమాధానం లేదు. అయితే ఈ 3 మనకు అమెరికా నుంచి లభిస్తాయి. అమెరికా భారత దేశపు అతి పెద్ద ఎగుమతి మార్కెట్. దీన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే, భారత్ తన ఇంధన దిగుమతి విధానాన్ని మార్చుకోవడం అసంబద్ధంగా కనిపించదు" అని తనేజా చెప్పారు.
"రష్యా ఇంధన రంగంలో భారత కంపెనీలు 17 బిలియన్ డాలర్ల ( సుమారు రూ. 1.5 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టాయి. కాబట్టి రెండు దేశాల మధ్య సంబంధాలను అమెరికా అధ్యక్షుడి దృష్టిలో నుంచి చూడలేము. అంతర్జాతీయ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఏదీ పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ కాదు" అని తనేజా అన్నారు.
ట్రంప్ డిమాండ్లలో ఒకదాన్ని అంగీకరించినంత మాత్రాన ఆయన అక్కడితో ఆగిపోతారని చెప్పలేం. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేయమని చెప్పినట్లే, సైనిక కొనుగోళ్లు ఆపేయమని కూడా ట్రంప్ చెబుతారని రక్షణ రంగ విశ్లేషకుడు రాహుల్ బేదీ చెబుతున్నారు.
"ట్రంప్ తన మొదటి పదవీకాలంలో ఆంక్షల ద్వారా ప్రత్యర్థులను నియంత్రించేందుకు చట్టాన్ని ప్రవేశపెట్టారు. దీని వల్ల రష్యా నుంచి భారత్ ఎస్-400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయలేకపోయింది. అయితే భారత్‌కు బైడెన్ మినహాయింపు ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ట్రంప్ చమురు తర్వాత భారత్ రష్యా రక్షణ భాగస్వామ్యాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చు. ట్రంప్ చట్రంలో భారత్ ఇరుక్కుపోయిందనేది నా అభిప్రాయం. అది రష్యాను విడిచిపెట్టదు లేదా బహిరంగంగా దానితో ఉండదు. భారత్ రష్యాను వదల్లేదు అలాగని బహిరంగా దాంతో ఉండలేదు" అని రాహుల్ బేదీ అభిప్రాయపడ్డారు.
"ట్రంప్ ఒత్తిడితో రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులను నిలిపివేస్తే అది రష్యాకు ఎదురు దెబ్బ. దీనివల్ల భారత్ రక్షణ భాగస్వామ్యాన్ని రష్యా తేలిగ్గా తీసుకోవచ్చు. మోదీ ప్రభుత్వం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను రక్షణ కోణంలోనూ చూడాలి. భారత అణు జలంతర్గామి ప్రాజెక్టు నుంచి రష్యా వైదొలగితే భారత్‌కు మరెక్కడా సాయం లభించదు. పాకిస్తాన్‌తో 5 రోజుల యుద్ధంలో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి, ఎస్-400 కీలక పాత్ర పోషించాయి. భారత రక్షణ వ్యూహంలో రష్యా ఎంత కీలకమో చెప్పడానికి ఇది చాలు" అని రాహుల్ బేదీ అన్నారు.
రష్యా పూర్తిగా చైనా చేతుల్లోకి వెళ్లకుండా నిరోధించడం భారత్‌కు ఎప్పటికీ సవాలుగానే ఉంటుంది.
యుక్రెయిన్‌లో యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యాకు చైనాపై ఆధారపడటం పెరిగింది. పాకిస్తాన్‌తో చైనా సాన్నిహిత్యం తమకు ముప్పని భారత్ భావిస్తోంది. రష్యా కూడా చైనా, పాకిస్తాన్ సరసన చేరితే భారత్‌కు సవాళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














