యుద్ధం ముగించడం అంత సులభం కాదా?

ఫొటో సోర్స్, Reuters/Getty Images
- రచయిత, అమీర్ అజీమీ
- హోదా, బీబీసీ న్యూస్, పర్షియన్
- చదివే సమయం: 7 నిమిషాలు
గత కొన్ని వారాలుగా అమెరికా, ఇజ్రాయెల్ ఒక అంశాన్ని పదేపదే చెబుతున్నాయి. అదేమిటంటే, ఇరాన్ సైనిక సామర్థ్యం చాలావరకు క్షీణించిపోయిందని. నిరంతర దాడుల వల్ల ఇరాన్ సైనిక కమాండ్ వ్యవస్థ కుప్పకూలిపోయిందని, ఎదురుదాడి చేసే సామర్థ్యం పూర్తిగా బలహీనపడిందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వాదన చెబుతున్నారు. వారి అంచనా ప్రకారం, ఈ యుద్ధం ఇప్పటికే ముగింపు దిశలో ఉండాలి.
అయితే, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. ఉద్రిక్తతలు తగ్గడానికి బదులుగా, అవి మరింత తీవ్రమవుతున్నాయి. ఈ యుద్ధం నుంచి బయటపడేందుకు స్పష్టమైన మార్గాలు కూడా క్రమేపీ మూసుకుపోతున్నాయి.
శనివారం నాటి సమాచారం ప్రకారం.. హిందూ మహాసముద్రంలోని అమెరికా-బ్రిటన్ ఉమ్మడి సైనిక స్థావరమైన డియెగో గార్సియా లక్ష్యంగా ఇరాన్ రెండు క్షిపణులను ప్రయోగించింది. ఇది సుమారు 3,800 కిలోమీటర్ల దూరంలో ఉంది.
అయితే, ఆ క్షిపణులు డియెగో గార్సియా ద్వీపాన్ని చేరుకోవడంలో విఫలమైనప్పటికీ, ఈ ఘటన ఇరాన్ సామర్థ్యాలపై కొత్త ఆందోళనలను రేకెత్తించింది. సాధారణంగా, ఇప్పటివరకు ఇరాన్ వద్దనున్న క్షిపణుల గరిష్ఠ పరిధి సుమారు 2 వేల కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని భావించేవారు.
ఈ సామర్థ్యం ఇరాన్ ముందే పెంచుకుని ఉండొచ్చు లేదంటే యుద్ధ సమయంలోనే అభివృద్ధి చేసినదైనా కావచ్చు. కానీ ఫలితం మాత్రం ఒక్కటే, అమెరికా సైనిక ఒత్తిడి ఈ విషయంలో ఇరాన్‌ను అడ్డుకోలేకపోయింది.

ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ, అలీ లారిజాని వంటి సీనియర్ నేతలు, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) కమాండర్లు, సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్... ఇలా ఇరాన్ రాజకీయ, సైనిక నాయకత్వంలో మెజారిటీ భాగాన్ని కోల్పోయినా, ప్రధాన క్షిపణి తయారీ కేంద్రాలు ధ్వంసమైనా ఈ పోరాటాన్ని ఎవరు నడిపిస్తున్నారు?
ఇంతటి తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఇరాన్ తన సామర్థ్యాలను ఎలా కాపాడుకోగలుగుతోంది?

ఫొటో సోర్స్, Reuters
చర్చలు ఎవరితో జరపాలి?
ఇరాన్ అగ్ర నాయకత్వం విషయంలో అనిశ్చితి నెలకొంది.
ఇరాన్ కొత్త నాయకుడిగా నామినేట్ అయిన మొజ్తబా ఖమేనీ తన తండ్రి, తన కుటుంబానికి చెందిన పలువురు సన్నిహితులు ప్రాణాలు కోల్పోయినా ఆ దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డారని సమాచారం.
అయితే, ఆయన ఇప్పటివరకు బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు.
రెండు లిఖితపూర్వక సందేశాలు మినహా ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు, కనీసం ఆయన గొంతు కూడా ఎక్కడా వినిపించలేదు.
ఆయన (మొజ్తబా ఖమేనీ) పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది, అలాగే ఆయనకు నాయకత్వం వహించే సామర్థ్యం ఎంతవరకు ఉందనే విషయాలపై ఇప్పటికీ స్పష్టత లేదు.
పూర్తిగా అధికారమంతా కేంద్రీకృతమైన ఇటువంటి వ్యవస్థలో, ఈ నిశ్శబ్దం అధికార కేంద్రం ఉనికిపైనే అనిశ్చితిని కలిగిస్తోంది.
ఇజ్రాయెల్‌లోని నెగెవ్ ఎడారిలో ఉన్న 'దిమోనా' నగరంపై కూడా ఇరాన్ శనివారం దాడి చేసింది. ఈ ప్రాంతం ఇజ్రాయెల్ అప్రకటిత అణు కార్యక్రమాలతో ముడిపడి ఉందని భావిస్తారు.
ఇరాన్‌లోని బుషెహర్ సమీపంలో ఉన్న ఇంధన మౌలిక సదుపాయాలపై ఇజ్రాయెల్ దాడులు చేసిన తర్వాతే దిమోనాపై దాడి జరిగింది.
ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం కూడా బుషెహర్‌లోనే ఉంది.
'దాడుల తీవ్రత పెంచితే, దానికి తగిన ప్రతీకారం తప్పదని, ఇకపై కీలకమైన స్థావరాలేవీ సురక్షితం కావు' అని ఇరాన్ స్పష్టమైన సందేశం ఇచ్చినట్లయింది.
ఈ ఇరాన్ చర్యలు సమన్వయాన్ని సూచిస్తున్నాయి తప్ప, అయోమయాన్ని సృష్టించేవి కావు.
అత్యున్నత నాయకత్వాన్ని తొలగిస్తే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుందనే అంచనాపై అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహాలు ఆధారపడి ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఆ నమ్మకం సడలిపోతున్నట్లు కనిపిస్తోంది.
అంతేకాదు.. మరో ప్రశ్న ఉత్పన్నమవుతుంది, అదేమిటంటే... అసలు చర్చలు ఎవరితో జరపాలి?
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఇప్పటివరకు చాలా లో-ప్రొఫైల్ మెయింటెన్ చేస్తున్నారు. ఈ ఘర్షణల ప్రారంభంలో, ఇరాన్ దాడుల వల్ల ప్రభావితమైన పొరుగు దేశాలకు ఆయన క్షమాపణలు చెప్పారు. అయితే, ఆయన చేసిన ఈ పని పట్ల ఐఆర్‌జీసీలోని కొన్ని వర్గాలకు ఆగ్రహం కలిగించినట్లు సమాచారం.
మొజ్తబా ఖమేనీ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. ఇది దౌత్యపరమైన మార్గాలను మరింత పరిమితం చేస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాను విశ్వసించలేకపోవడానికి కారణాలు...
ఇరాన్ కోణం నుంచి చూస్తే, ఇటీవలి పరిణామాలు చర్చలపై నమ్మకం ఉంచడానికి ఎటువంటి బలమైన కారణాన్నీ ఇవ్వడం లేదు.
డోనల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత గడిచిన 14 నెలల కాలంలో, అణు ఒప్పందం దిశగా జరిగిన రెండు వేర్వేరు దౌత్యపరమైన చర్చల దశల్లో పురోగతి కనిపించిన వెంటనే దాడులు జరిగాయి.
ఫిబ్రవరి 27న జెనీవాలో జరిగిన రెండో విడత చర్చల్లో అమెరికా లేవనెత్తిన మెజారిటీ ఆందోళనలను తాము పరిష్కరించామని ఇరాన్ అధికారులు చెబుతున్నారు.
వియన్నాలో సాంకేతిక స్థాయి చర్చలకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కానీ, ఆ చర్చల గమనం పట్ల తాను సంతృప్తిగా లేనని ట్రంప్ ప్రకటించారు. ఆ మరుసటి రోజే దాడులు ప్రారంభమయ్యాయి.
ఇరాన్ విధాన నిర్ణేతలకు అందుతున్న సందేశం స్పష్టంగా ఉంది. ''చర్చలు దాడులను ఆపలేవు, బహుశా అవి దాడులను మరింత ప్రేరేపించవచ్చు కూడా.''
అయితే, ఉద్రిక్తతలను పెంచే సామర్థ్యం కేవలం ఇరాన్‌కు మాత్రమే లేదు. శనివారం రాత్రి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కూడా ఈ పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశాయి.
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే చమురు మార్గాలలో ఒకటైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని డిమాండ్ చేస్తూ ట్రంప్ ఇరాన్‌కు 48 గంటల అల్టిమేటం జారీ చేశారు. అలా చేయని పక్షంలో ఇరాన్ విద్యుత్ కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.
ట్రంప్ డిమాండ్‌ను ఇరాన్ తిరస్కరించడమే కాకుండా, అదే స్థాయిలో ప్రతిస్పందించింది. తమ ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగే ఏ దాడికైనా ఆ ప్రాంతం అంతటా దాడులతోనే సమాధానం చెబుతామని పేర్కొంది.
పర్షియన్ గల్ఫ్‌లోని కొన్ని ప్రాంతాల్లో సముద్రపు మందుపాతరలు పెట్టే అవకాశం ఉందని ఇరాన్ సుప్రీం కౌన్సిల్ ఆఫ్ డిఫెన్స్ హెచ్చరించింది.
ఇలా ఉభయ పక్షాల నుంచి వస్తున్న ఈ హెచ్చరికలు ముందున్న ప్రమాదాలను స్పష్టంగా సూచిస్తున్నాయి.
ట్రంప్ వేగంగా అడుగులు వేస్తున్న మార్గంలో ప్రత్యామ్నాయాలు క్రమంగా పరిమితమవుతున్నాయి.
ఇరాన్ భూభాగంపై పదాతిదళాలను దించకుండా అమెరికా, ఇజ్రాయెల్ కేవలం వైమానిక దాడులు మాత్రమే చేయగలవు. ఇవి నష్టాన్ని కలిగించగలవు కానీ, శత్రువు పూర్తిగా లొంగిపోయేలా చేస్తాయనే గ్యారెంటీ లేదు.
ఈ ఘర్షణ ఇరు పక్షాలను అత్యంత ప్రమాదకరమైన స్థాయికి తీసుకెళ్లేలా కనిపిస్తోంది.
కానీ గడువు ముగియడానికి కొన్ని గంటల ముందే ట్రంప్ వెనక్కి తగ్గారు. ఇరాన్‌తో చాలా మంచి, సానుకూల చర్చలు జరిగాయని ఆయన 'ట్రూత్ సోషల్' పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇరాన్ ఇంధన వ్యవస్థలపై చేయాలనుకున్న దాడులను ఐదు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
పరిమితంగానే ప్రత్యామ్నాయ మార్గాలు...
ఈ సమయం చాలా కీలకమైనది. ట్రంప్ తన సొంత అల్టిమేటం గడువు ముగియడానికి సరిగ్గా కొద్ది గంటల ముందే తీసుకున్న దాడుల నిలుపుదల నిర్ణయం, కనీసం ప్రస్తుతానికైనా ఈ ఉద్రిక్త పరిస్థితి నుంచి బయటపడటానికి ఒక సంభావ్య మార్గాన్ని తెరిచింది.
మార్కెట్లు జాగ్రత్తగా స్పందించాయి. చమురు ధరలు తగ్గడంతో కొంత ఊరటను కలిగించినప్పటికీ, ఆ ప్రభావం పరిమితంగానే ఉంది. ఈ ప్రకటన తాలూకా అసలు పరీక్ష క్షేత్రస్థాయిలో జరగాల్సి ఉంది.
అయితే, ఈ దాడుల నిలిపివేత ఎంతకాలం ఉంటుందనేదీ లేదా ఇది నిజంగా చర్చల దిశగా పడిన బలమైన అడుగు అవుతుందా అనేదీ కూడా ఇంకా స్పష్టంగా తెలియలేదు.
అయితే, ఒక మౌలికమైన ప్రశ్న అలాగే మిగిలి ఉంది. అదేమిటంటే, అసలు ఇరాన్ తరఫున ఎవరు మాట్లాడుతున్నారు? స్వతంత్రగా దాడులు జరిపే పూర్తి స్వేచ్ఛ ఉన్నట్లు కనిపిస్తున్న ఐఆర్‌జీసీ, భద్రతా దళాలపై ప్రస్తుతం ఎవరికి అధికారం ఉంది?
ఒకవేళ పరిస్థితులు ఇలాగే కొనసాగి, హార్ముజ్ జలసంధిలో అడ్డంకులు అలాగే ఉంటే ఇరుపక్షాలు మళ్లీ తమ హెచ్చరికలకు దిగే దిగవచ్చు. దీని ఫలితాలు చాలా భయంకరంగా ఉండవచ్చు.
ఇరాన్‌లోని దాదాపు 9 కోట్ల మంది జనాభా సహా, మొత్తం గల్ఫ్ ప్రాంతంలోని సుమారు 17 కోట్ల మంది ప్రజలు విద్యుత్, ఇతర అత్యవసర సేవలలో తీవ్ర అంతరాయాలను ఎదుర్కోవాల్సి రావచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంకా పెంచితే..
ఇరుపక్షాల చర్చలకు దారులు మూసుకుపోతున్న తరుణంలో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వద్ద ఉన్న ప్రత్యామ్నాయాలు కూడా క్రమంగా తగ్గిపోతున్నాయి.
ఉద్రిక్తతలను మరింత పెంచడం అంటే, వ్యూహాత్మక ప్రయోజనం ఏమీలేకుండా కేవలం ఒక విధ్వంసపు సుడిగుండంలో చిక్కుకుపోవడమే. ఇది చివరికి అత్యంత తీవ్రమైన నిర్ణయాలకు మాత్రమే దారితీస్తుంది.
ఇరాన్‌కు కూడా పరిస్థితులు ఏమీ అనుకూలంగా లేవు. ఈ యుద్ధంలోకి ప్రవేశించే సమయానికే ఆ దేశం తీవ్రమైన ఆర్థిక ఒత్తిళ్లను, ప్రజలలో అసంతృప్తిని ఎదుర్కొంటోంది. అయితే, ప్రస్తుత యుద్ధ వాతావరణం ఆ ఒత్తిళ్లను కొంతవరకు తగ్గించి, పాలకవర్గం దేశంలో అంతర్గత నియంత్రణపై పట్టు సాధించడానికి అవకాశం కల్పించింది.
ఇదొక క్లిష్టమైన సమతుల్యతకు దారితీస్తుంది. ఇరాన్‌కు ఉద్రిక్తతలను పెంచడం అనేది ఒకవైపు బయటి ముప్పులకు సమాధానం ఇచ్చే మార్గమే గాకుండా, మరోవైపు దేశీయ అసంతృప్తిని అణచివేయడానికి ఒక సాధనంగా మారింది. అయితే, దీనివల్ల ఏదైనా ఒక పెద్ద పొరపాటు జరిగే ప్రమాదం కూడా పెరుగుతుంది.
ప్రస్తుతం ఇరుపక్షాల వద్ద ఉన్న ఆప్షన్లు పరిమితమైపోయాయి.
ఇరాన్ బలహీనంగా కనిపించకుండా సులభంగా వెనక్కి తగ్గలేదు. అదే సమయంలో అమెరికా, ఇజ్రాయెల్ కేవలం వైమానిక శక్తితోనే నిర్ణయాత్మక ఫలితాన్ని సాధించలేవు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























